భారీ సెట్స్ తో బడ్జెట్ పెంచేస్తున్న నాని..?

Wed Jan 26 2022 09:00:01 GMT+0530 (IST)

Actor Nani Upcoming Films

న్యాచురల్ స్టార్ నాని సినిమా సినిమాకి తన మార్కెట్ ని విస్తరించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో హయ్యెస్ట్ బడ్జెట్ సినిమాలు చేయడమే కాదు.. నాలుగు దక్షిణాది భాషల్లో విడుదల చేస్తున్నారు. 'వి' 'టక్ జగదీశ్' వంటి రెండు సినిమాలను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసిన నాని.. ఇటీవల 'శ్యామ్ సింగరాయ్' చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేసి భారీ విజయాన్ని అందుకున్నారు.'శ్యామ్ సింగరాయ్' మూవీ నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందించిన సినిమా. కలకత్తా నేపథ్యాన్ని తెర మీద ఆవిష్కరించడానికి ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ఆధ్వర్యంలో భారీ సెట్స్ ని నిర్మించారు. ఇది సినిమాకు గ్రాండియర్ ను అదనపు ఆకర్షణను తీసుకొచ్చిందని చెప్పొచ్చు. మేకర్స్ దీని కోసమే కొన్ని కోట్ల రూపాయలను వెచ్చించారు. అయితే ఇప్పుడు నాని నటిస్తున్న ''దసరా'' సినిమా కోసం కూడా ప్రత్యేకమైన సెట్ల నిర్మాణం చేపడుతున్నారని టాక్ వినిపిస్తోంది.

'దసరా' చిత్రాన్ని సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. నాని ఇందులో ఒక గజదొంగగా.. ఇప్పటి వరకు కనిపించని సరికొత్త గెటప్ లో కనిపిస్తారని సమాచారం. అంతేకాదు ఇందులో తెలంగాణ యాసతో మాట్లాడనున్నారు. అయితే ఈ సినిమా కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా కొన్ని సెట్స్ ని నిర్మించబోతున్నారట.

ఇందులో భాగంగా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ఆధ్వర్యంలో పది ఎకరాల్లో ఓ భారీ విలేజ్ సెట్ ను వేస్తున్నారట. దీని కోసం తూర్పుగోదావరి జిల్లా కడియం నుండి కొన్ని రకాల చెట్లను కూడా తెప్పిస్తున్నారట. ఈ ఒక్క సెట్ కోసమే దాదాపు పన్నెండు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు టాక్. కథపై ఉన్న నమ్మకంతో.. ఎక్కువ భాగం షూటింగ్ ఈ విలేజ్ సెట్ లోనే చేయాల్సి ఉండటంతో మేకర్స్ ఖర్చుకు వెనకాడటం లేదని అనుకుంటున్నారు. ఈ సినిమా బడ్జెట్ కూడా 'శ్యామ్ సింగరాయ్' స్థాయిలో ఉండే అవకాశం ఉంది.

 కాగా 'దసరా' చిత్రంతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. నాని సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇందులో హీరోహీరోయిన్లు ఇద్దరూ డీ గ్లామర్ రోల్స్ లో సందడి చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన అనౌన్స్ మెంట్ వీడియోలో 'ఈ దసరా నిరుడు లెక్కుండది.. బాంచత్' అంటూ నాని తెలంగాణ యాసలో మాట్లాడి ఆకట్టుకున్నారు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఇటీవలే 'అంటే సుందరానికీ!' సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసిన నాని.. ఇప్పుడు తన 29వ సినిమా ''దసరా'' పైనే కంప్లీట్ ఫోకస్ పెడుతున్నారని తెలుస్తోంది.