Begin typing your search above and press return to search.

'ఆయనొక రాక్ స్టార్.. జేమ్స్ బాండ్ కే బాబు'

By:  Tupaki Desk   |   29 Jun 2022 4:30 AM GMT
ఆయనొక రాక్ స్టార్.. జేమ్స్ బాండ్ కే బాబు
X
టాలెంటెడ్ హీరో ఆర్. మాధవన్ స్వీయ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ''రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్''. 1994లో గూఢచర్యానికి పాల్పడినట్లు తప్పుడు ఆరోపణలు ఎదుర్కొని.. అన్యాయంగా జైలుపాలైన ఇస్రో శాస్త్రవేత్త, ఏరోస్పేస్ ఇంజనీర్ నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

పాండమిక్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ బయోపిక్ ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అయింది. జులై 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా మాధవన్ హైదరాబాద్ లో తెలుగు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

మాధవన్ మాట్లాడుతూ.. 'విక్రమ్ వేద' సినిమా సమయంలో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ గురించి వార్తలు చదివాను. ఆయనకు మాల్దీవులకు చెందిన అమ్మాయితో సంబంధం ఉందని.. మన దేశ రాకెట్ టెక్నాలజీని రహస్యంగా పాకిస్థాన్ కి చేరవేస్తున్నారని.. ఆ నేరారోపణలతో అరెస్టు చేసారని.. సీబీఐ ఎంక్వైరీలో ఆయన నిరపరాధిగా రుజువైందని తెలుసుకున్నాను. వీటి ఆధారంగా సినిమా తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మొదలైంది. ఆ ఇంట్రెస్ట్ తోనే 2016-2017 టైంలో త్రివేండ్రంలో నంబి నారాయణన్ సర్‌ ని కలిశాను అని చెప్పారు.

''నన్ను చాలా మర్యాదగా ఆయన ఇంట్లోకి ఆహ్వానించారు. అప్పుడు ఆయన బోనులో ఉన్న సింహంలా అనిపించారు. ఆయన పవర్ఫుల్ కళ్లు నన్ను ఆకర్షించాయి. 'హాయ్ మాధవన్.. నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. మీ సినిమాలు చూస్తుంటాను' అని నారాయణన్ అనగానే నాకు ఏదో తెలియని ఆనందం కలిగింది. అయితే నేను ఆయన స్టోరీ గురించి అడిగినప్పుడు.. అతని కళ్ళు కోపంతో మండాయి. సరదాగా ఉందనుకున్న వాతావరణం కాస్తా తన గతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయగానే వేడెక్కింది''

'నన్ను దేశ ద్రోహి అని ఎలా అంటారు?' అంటూ ఆయన చాలా కోపంగా మాట్లాడారు. మీరు నిర్దోషి అని నిరూపితమైంది కదా అని నేనంటే.. 'అది నాకూ నీకూ కోర్టుకు మాత్రమే తెలుసు. అంతెందుకు గూగుల్ లో వెతికినా నా గురించి గూఢచారి అనే సమాధానమే దొరుకుతుంది' అని ఆయన ఆవేదన చెందారు. ఆయన ఎంత బాధ పడుతున్నారో ఆ క్షణం నాకు అర్థమైంది. నంబి సార్ కథ విన్న తర్వాత, నేను భావోద్వేగానికి లోనయ్యాను. ఈ ప్రపంచంతో ఆయన కథను పంచుకోవాలని అనుకున్నాను.

ఇస్రో - నాసాలకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఆయన చేసిన సాహసాల గురించి వినగానే జేమ్స్ బాండ్ కు బాబులా అనిపించారు. నంబి నారాయణన్ ఓ రాక్ స్టార్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది. ప్రపంచంలో ఏ సైంటిస్ట్ ఎదుర్కోని పరిస్థితులను నంబి నారాయణన్ ఎదుర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన స్టోరీ తెలుసుకోవాలి.

స్వాతంత్ర్య పోరాట యోధులు - ఇతిహాసాలపై రెగ్యులర్ గా సినిమాలు వస్తూనే ఉంటాయి. సైన్స్, టెక్నాలజీ రంగాల మేధావుల గురించి ఈ ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే 'రాకెట్రీ' సినిమాని తెరకెక్కించా. ప్రస్తుతం ఎన్నో ప్రముఖ విదేశీ సంస్థలకు సీఈవోలుగా భారత ఇంజినీర్స్ బాధ్యతలు వహిస్తున్నారు. అలాంటి వారంతా ఇండియాకు తిరిగి రావాలి.

'రాకెట్రీ' సినిమా తీయడానికి ఆరేళ్ళు పట్టింది. రాకెట్స్ - అంతరిక్షం గురించి చాలా సినిమాల్లో చూసుంటారు. ఇందులో రాకెట్ ఇంజిన్ వ్యవస్థ గురించి చూపించబోతున్నాం. నంబి నారాయణన్ లుక్ కోసం బరువు పెరిగాను.. కొన్ని సీన్స్ కోసం బరువు తగ్గా. ఆయనలా కనిపించేందుకు నా దంతాల అమరికను మార్చాను. 'బాహుబలి' సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డారో.. మా టీమ్ కూడా ఈ మూవీ కోసం అంతే కష్టపడింది అని మాధవన్ వివరించారు.

ఇకపోతే ''రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్'' చిత్రాన్ని తమిళం, హిందీ మరియు ఇంగ్లీష్ లో ఏకకాలంలో చిత్రీకరించారు. తెలుగు, మలయాళం కన్నడ భాషలలో డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు. ఇందులో షారుఖ్ ఖాన్ మరియు సూర్య విభిన్న వెర్షన్లలో అతిధి పాత్రలలో కనిపిస్తారు. నంబి నారాయణన్ భార్య పాత్రలో సిమ్రాన్ నటించింది.

'రాకెట్రీ' సినిమాను ఇటీవలే 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో వరల్డ్ ప్రీమియర్‌ గా ప్రదర్శించారు. అక్కడ అందరి ప్రశంసలు అందుకుంది. మాధవన్ నిర్మించిన ఈ మూవీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కాబోతోంది.