Begin typing your search above and press return to search.

సోనూసూద్‌ విషయంలో అనుకున్నదే జరిగింది.. ఆచార్య టీమ్ టెన్షన్‌

By:  Tupaki Desk   |   31 July 2021 4:30 AM GMT
సోనూసూద్‌ విషయంలో అనుకున్నదే జరిగింది.. ఆచార్య టీమ్ టెన్షన్‌
X
సోనూసూద్‌ అంటే 2020 సంవత్సరం ముందు వరకు ఒక పశుపతి. ఆయన విలనిజంకు సామాన్య ప్రేక్షకులు భయపడేంతగా క్రూరత్వంతో నటించే వారు. కొందరు సోనూసూద్‌ ను ఆ సినిమాలో హీరోను లేదా హీరోయిన్ ను ఇబ్బంది పెట్టావు అంటూ దగ్గరకు వచ్చి మరీ దూషించే వారట. అంతటి క్రూరమైన పాత్రలో కనిపించి చూడగానే ఒక రకమైన భయం కలిగించేలా సోనూసూద్‌ ఇండస్ట్రీలో గుర్తింపు దక్కించుకున్నాడు. టాలీవుడ్‌ లో మంచి గుర్తింపు దక్కించుకున్న సోనూసూద్‌ ఇప్పుడు రియల్‌ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.

ఒకప్పుడు సోనూసూద్‌ అంటే భయపడ్డ జనాలు ఇప్పుడు మాత్రం చేతులు ఎత్తి నమస్కరించడంతో పాటు ఆయన్ను ఒక దేవుడిగా రియల్‌ హీరోగా కీర్తిస్తున్నారు. జనాల్లో ఎలాంటి ఇమేజ్ ఉంటే ఆ పాత్రలను చేస్తేనే సినిమాలను చూస్తారు అనడంలో సందేహం లేదు. హీరోలు హీరోలుగా కనిపిస్తేనే అభిమానులు ఇష్టపడతారు. కమెడియన్స్ కొందరు కామెడీ చేయకుండా సీరియస్ గా ఉంటే పెద్దగా ఆసక్తి చూపించరు. కొన్ని సందర్బాల్లో పర్వాలేదు కాని ఎక్కువగా హీరోలు విలన్‌ లుగా లేదా విలన్ లు హీరోలుగా నటిస్తే మాత్రం జనాలు ఆధరించిన దాఖలాలు లేవు.

ఇప్పుడు రియల్‌ హీరో ఇమేజ్ ఉన్న సోనూసూద్‌ విలన్ పాత్ర చేస్తే ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సోనూసూద్ విలన్‌ అంటే జనాలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆమద్య బుడ్డోడు సోనూసూద్‌ ను హీరో కొడుతున్నాడు అని చెప్పి ఏకంగా టీవీనే బద్దలు కొట్టాడు. ఇక రాబోతున్న సినిమాల్లో హీరోలు సోనూసూద్‌ ను కొడితే వెండి తెరపై చెప్పులు పడే అవకాశం కూడా ఉందంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆచార్య టీమ్‌ ను ఒక విషయం టెన్షన్‌ పెడుతోంది. అదేంటి అంటే ఈ సినిమాలో సోనూసూద్‌ విలన్ పాత్రలో కనిపించారు. ఆయన ఇప్పటి వరకు చాలా విలన్ పాత్రలు చేశారు. కాని ఈ సినిమాలో విలన్ పాత్ర అయినా కూడా చాలా గౌరవపథంగానే చిరంజీవి.. కొరటాల టీమ్‌ చూపించే ప్రయత్నం చేశారట.

ఆమద్య చిరంజీవి తనను తన్నే సీన్‌ ఉంటే దాన్ని మార్చారు అంటూ సోనూసూద్‌ చెప్పుకొచ్చాడు. అలా చాలా వరకు సోనూసూద్‌ ను కించపర్చే విధంగా ఉన్న సన్నివేశాలను షాట్స్‌ కు దూరంగా ఉన్నారు. ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఆచార్య లో సోనూసూద్‌ పాత్ర విషయంలో విమర్శలు తప్పక పోవచ్చు అంటూ అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఆచార్య టీమ్ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా సోనూసూద్‌ బర్త్‌ డే సందర్బంగా ఆచార్య టీమ్‌ విడుదల చేసిన పోస్టర్ విమర్శల పాలయ్యింది. అందులో సోనూసూద్‌ లుక్‌ పై అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

సోనూసూద్‌ ను ఇలా చూపిస్తున్నారు ఏంటో అంటూ ఆయన్ను అభిమానించే వారు అంటున్నారు. ముఖ్యంగా సోనూ సూద్‌ హెయిర్ స్టైల్‌ ఏంటీ అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ మరియు ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులను కొందరు సోషల్‌ మీడియా మీద టార్గెట్‌ చేసి విమర్శలు చేస్తున్నారు. ఆచార్య సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే ఖచ్చితంగా సోనూసూద్‌ ను తక్కువ చేసి చూపిస్తే విమర్శలు తప్పవు అంటూ అంతా భావించారు. ఇప్పుడు అదే జరుగుతోంది.

సినిమా విడుదల అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఆచార్య టీమ్‌ ముందస్తు జాగ్రత్తగా ఆయన పాత్ర విషయంలో ప్రతి చిన్న విషయంలో కూడా జాగ్రత్తలు పడ్డట్లుగా తెలుస్తోంది. అందుకే ఈ సినిమా లో ఆయన పాత్ర విషయంలో తప్పు ఉండక పోవచ్చు. కాని లుక్ విషయంలోనే ఆచార్య యూనిట్‌ కు విమర్శలు తప్పవేమో అంటున్నారు.