సెట్స్ లో ప్రమాదం.. దర్శకుడు శంకర్ కి తీవ్ర గాయాలు?

Thu Feb 20 2020 09:45:27 GMT+0530 (IST)

Accident on Indian 2 sets! 3 dead, 10 injured

విశ్వనటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `ఇండియన్-2` సెట్స్ లో ఘోర ప్రమాదం జరిగింది. చెన్నై ఈవీవీ స్టూడియోస్ లో లైటింగ్ కోసం సెట్స్ వేస్తుండగా 150 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా క్రేన్ తెగిపడింది. ఈఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుల్ని హుటా హుటాన చెన్నైలోని పునమలై ప్రధాన రహదారిలో గల సవిత ఆసుపత్రికి తరలించారు.మృతుల్లో శంకర్ వ్యక్తిగత సహాయకుడు మధు(29).. అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ(34) .. మరో సహాయకుడు చంద్రన్ ఉన్నారు. అయితే బుధవారం ఉదయమే కమల్ హాసన్.. శంకర్ సెట్స్ పనులను పర్యవేక్షించి వెళ్లారు. వాళ్లు వచ్చి వెళ్లిన వెంటనే ఈ ఘోరం చోటు చేసుకుంది. లేదంటే పెద్ద విషాదమే చోటు చేసుకునేది. ఈ ఘటనపై కమల్ హాసన్ ట్విటర్లో స్పందించారు. ``ఈ ఘటన నా మనసు కలచి వేసింది. ముగ్గురు సహాయకులను కోల్పోయాం. నా బాధ కన్నా వారి కుటుంబాల్లో చోటు చేసుకున్న బాధ ఎన్నో రెట్లు ఎక్కువ`` అంటూ వాపోయారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

అయితే ఘటన ఏ సమయంలో చోటు చేసుకుంది? గాయ పడిన వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో దర్శకుడు శంకర్ కి తీవ్ర గాయాలు అయ్యాయంటూ ప్రచారం సాగిపోతోంది. అయితే కొన్ని మీడియాలు శంకర్ ఆ సమయం లో సెట్స్ లో లేరన్న విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఏంటో తెలియాల్సి ఉంది.