'జార్జిరెడ్డి' కి పెద్ద పంపిణీదారు అండ

Thu Oct 10 2019 12:27:43 GMT+0530 (IST)

Abhishek Nama Acquires George Reddy

చిన్న సినిమాలకు పెద్దన్నల సాయం అన్నది నేటి ట్రెండ్. కేరాఫ్ కంచరపాలెం చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్-దగ్గుబాటి రానా సాయం మర్చిపోలేనిది. టాలీవుడ్ లో ఎన్నో చిన్న సినిమాల్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ రిలీజ్ చేసింది. అలాగే నవతరం స్టార్లను ప్రమోట్ చేస్తూ మీడియం బడ్జెట్ చిత్రాల్ని తీస్తున్నారు పలువురు పెద్ద నిర్మాతలు. టాలీవుడ్  పంపిణీవర్గాల్లో సుదీర్ఘ అనుభవం ఘడించి సినీనిర్మాణంలో అడుగు పెట్టిన అభిషేక్ పిక్చర్స్ సైతం ఇదే బాటలో వెళుతోంది. చిన్న హీరోల సినిమాల్ని.. కొత్త తరాన్ని.. నవ్యపంథా కథాంశాల్ని ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తోంది.ఇటీవల పలు చిన్న చిత్రాల థియేట్రికల్ రైట్స్ ని చేజిక్కించుకుని సాఫీగా రిలీజ్ కి సాయపడింది ఈ సంస్థ. ఈ ఏడాది ఇస్మార్ట్ శంకర్ - రాక్షసుడు లాంటి హిట్ చిత్రాల్ని పంపిణీ చేసింది.  అదే కోవలో వస్తున్న `జార్జిరెడ్డి` చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు.  `జార్జ్ రెడ్డి` వరల్డ్ వైడ్ థియేట్రికల్  రైట్స్ ని అభిషేక్ సొంతం చేసుకున్నారు. ఈ సాయం ప్రచారం పరంగా కలిసొచ్చేదే అనడంలో సందేహం లేదు.

ఉస్మానియా రెబల్ స్టూడెంట్ జార్జిరెడ్డి బయోపిక్ గా చెబుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజై ఆకట్టుకుంది. దళం ఫేం జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  `వంగవీటి` ఫేం సందీప్ మాధవ్  (సాండి) ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించారు. మనోజ్ నందన్- చైతన్య కృష్ణ- శత్రు- వినయ్ వర్మ- తిరువీర్- అభయ్ తదితరులు నటించారు. హీరో సత్య దేవ్ కూడా ఓ కీలక పాత్రలో నటించారు. మరాఠి సినిమా `సైరాఠ్` కు ఫొటోగ్రఫీ అందించిన సుధాకర్ యెక్కంటి ఈ సినిమాకు సినిమాటోగ్రఫీని అందించారు. మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి.. సిల్లీ మంక్స్- త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయనున్నారు. పెద్ద పంపిణీదారు రిలీజ్ చేసినా సినిమా కథ-కథనం.. ఎమోషన్ జనాలకు కనెక్టయితేనే హిట్టయ్యే ఆస్కారం ఉంది. ఆ విషయంలో దర్శకుడు జీవన్ రెడ్డి ఏమేరకు సఫలమయ్యారు అన్నది చూడాలి.