పిక్చర్ పర్ఫెక్ట్: మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ తో చరణ్ - ఉపాసన దంపతులు..!

Tue Jun 28 2022 17:45:24 GMT+0530 (IST)

Aamir Khan With Ramcharan Couple

బాలీవుడ్ సెలబ్రిటీలతో టాలీవుడ్ స్టార్స్ మంచి సాన్నిహిత్యాన్ని కలిగి ఉంటారనే సంగతి తెలిసిందే. రెగ్యులర్ గా కలుసుకోకపోయినా.. సందర్భం వచ్చినప్పుడుల్లా ఒకరిపై ఒకరికున్న అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల సందడి మొదలై భాష ప్రాంతీయ బేధాలు తొలగిపోవడంతో.. వీరంతా తరచుగా కలుసుకునేందుకు అవకాశం కలిగింది.ఇటీవల కాలంలో సినిమాల ప్రమోషన్స్ కోసం షూటింగ్ ల కోసం బీటౌన్ సెలబ్రిటీలు హైదరాబాద్ కు వస్తుంటే.. మనవాళ్ళు బాంబే వెళ్లి తమ పాన్ ఇండియా చిత్రాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తమ సన్నిహితులను కలుస్తూ కాసేపు సమయం గడుపుతున్నారు. ఇప్పుడు లేటెస్టుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో బాలీవుడ్ స్టార్ల సందడి కనిపిస్తోంది.

ఇటీవల సల్మాన్ ఖాన్ - విక్టరీ వెంకటేశ్ - పూజా హెగ్డేలకు చరణ్ - ఉపాసన దంపతులు ఆతిధ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరందరూ భాగమైన 'కభీ ఈద్ కభీ దివాలీ' సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్న నేపథ్యంలో.. చరణ్ వారిని తమ ఇంటికి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి.

అయితే తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ను రామ్ చరణ్ దంపతులు తమ నివాసానికి ఆహ్వానించారు. అమీర్ - సల్మాన్ లతో అద్భుతమైన ఈవింగ్స్ గురించి తెలుపుతూ.. ఉపాసన సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. తమ పెట్ డాగ్ రైమ్ కు ఈ మధ్య ఎక్కువ ప్రేమ లభిస్తోందని ఆమె పేర్కొంది.

సల్మాన్ - ఆమీర్ లను చరణ్ ఫ్యామిలీ వేర్వేరుగా ఆహ్వానించినట్లు ఈ ఫోటోలు చూస్తే తెలుస్తుంది. రెండు ఫోటోలలోనూ గెస్టులతో పాటుగా రైమ్ ను చూడొచ్చు. ఉపాసన పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సల్మాన్ నటించే 'కభీ ఈద్ కభీ దివాలీ' మూవీలో చరణ్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని టాక్.

మరోవైపు అమీర్ ఖాన్ లేటెస్ట్ మూవీ 'లాల్ సింగ్ చద్దా' రిలీజ్ కు రెడీ అయింది. టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్య కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగులోనూ ఈ చిత్రాన్ని భారీగా ప్రమోట్ చేయడానికి సన్నద్ధమయ్యారు అమీర్.

ఇక RRR చిత్రంతో బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్.. పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకునే ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ తో RC15 మూవీని తెరకెక్కించే పనిలో ఉన్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చెర్రీ ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నాయి.