Begin typing your search above and press return to search.

ప్రోమాక్స్ ఇండియా అవార్డ్స్-2021 లో గోల్డ్ సాధించిన 'ఆకాశం నీ హ‌ద్దురా'

By:  Tupaki Desk   |   16 Jun 2021 3:52 PM GMT
ప్రోమాక్స్ ఇండియా అవార్డ్స్-2021 లో గోల్డ్ సాధించిన ఆకాశం నీ హ‌ద్దురా
X
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య - లేడి డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ''సూరరై పొట్రు''. ఎయిర్‌ డెక్కన్‌ అధినేత జీఆర్‌ గోపీనాథ్‌ జీవిత కథ ఆధారంగా.. సాధారణ పైలట్ ఒక విమానయాన సంస్థ ఎలా నెలకొల్పారనే అంశం మీద ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రాన్ని ''ఆకాశం నీ హ‌ద్దురా'' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. క‌రోనా పరిస్థితుల వల్ల ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీ విధానంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల చేశారు. గతేడాది డిజిటల్ రిలీజ్ కాబడిన ఈ చిత్రం అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుంది. ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న 'సూరరై పొట్రు' సినిమా తాజాగా మరో ఘనత సాధించింది.

ప్రైమ్ వీడియో ప్రోమాక్స్ ఇండియా రీజియన్ అవార్డ్స్-2021 లో ''ఆకాశం నీ హ‌ద్దురా'' సినిమా గోల్డ్ కేటగిరీలో అవార్డ్ సాధించింది. సినిమా గురించి విస్తృతంగా జరిగిన చర్చలు - బజ్ - వ్యూస్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుని ప్రకటిస్తారు. ఇకపోతే ఈ చిత్రం షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పనారోమా సెక్షన్ 2021 కి గాను ఎంపికయింది. అలానే అంతర్జాతీయ సినిమా రివ్యూ సంస్థ ‘ఐఎండీబీ’లో ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్ సాధించిన 3వ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు కూడా సూర్య సినిమా ఎంపికైంది. అలానే 93వ ఆస్కార్‌ అవార్డ్స్‌ నామినేషన్స్‌ కు పరిశీన‌కు వెళ్లి వెనక్కు వచ్చింది.

కాగా, 'ఆకాశం నీ హ‌ద్దురా' సినిమాలో సూర్య సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించింది. ఇందులో మోహన్ బాబు - జాకీష్రాఫ్ - పరేష్ రావల్ - ఊర్వశి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చగా.. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. సిఖ్య ఎంట‌ర్‌టైన్మెంట్స్ - 2డీ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యానర్స్ పై సూర్య ఈ చిత్రాన్ని నిర్మించారు.