ఇండస్ట్రీ హిట్ .. సరిలేరు టీమ్ ఏం చేస్తుందో?

Mon Jan 27 2020 11:55:21 GMT+0530 (IST)

AVPL Releases All Time Industry Hit Posters

మా సినిమా బంపర్ హిట్టు అని ఒకరంటే మా సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్టు అంటూ ఇంకొకరు ఊదరగొట్టేస్తున్నారు. ఈ సంక్రాంతి విన్నర్ మేమంటే మేం అంటూ ఎవరికి వారు ప్రకటించేసుకోవడం చూస్తుంటే ఇదేం చోద్యం! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. సంక్రాంతి పందెంలో అల వైకుంఠపురములో .. సరిలేరు నీకెవ్వరు లాంటి భారీ చిత్రాలు రిలీజై ట్రెండీ టాపిక్ అయ్యాయి.ఈ సినిమాల ప్రమోషన్ సహా థియేట్రికల్ రిలీజ్ వ్యవహారం.. కలెక్షన్స్ వ్యవహారంలో తీవ్రమైన పోటీ తెలిసిందే. రెండు టీమ్ ల నడుమ పోస్టర్ వార్ అంతకంతకు రక్తి కట్టించింది. రిలీజ్ తర్వాత కలెక్షన్స్ కి సంబంధించి వార్ కొనసాగింది. ఒకరిపై ఒకరు పోటీకి పోస్టర్లను రిలీజ్ చేశారు. బ్లాక్ బస్టర్ కా బాప్ అంటూ ఓ పోస్టర్.. 200 ప్లస్ కోట్ల కలెక్షన్స్ అంటూ మరో పోస్టర్ ని సరిలేరు టీమ్ ఇప్పటికే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే సరిలేరు టీమ్ కి ధీటుగా నాలుగు ఆకులు ఎక్కువే తిన్నాం! అన్నట్టుగా అల టీమ్ కూడా పోస్టర్ వార్ కొనసాగించింది. తాజాగా బన్ని నాన్ బాహుబలి కేటగిరీలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ సాధించాడు అంటూ పోస్టర్ ని రిలీజ్ చేసింది అల టీమ్. ఇంటా బయటా ఈ సినిమా రికార్డుల మోత మోగిస్తోంది. తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లోనూ రంగస్థలం రికార్డు ను కొట్టేసి నాన్ బాహుబలి రికార్డును అందుకోబోతోంది అంటూ అధికారిక పోస్టర్ వేయడం తో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే బన్ని ఓవర్సీస్ లో 3 మిలియన్ డాలర్ క్లబ్ ని అధిగమించాడు. తెలుగు రాష్ట్రాల్లోనూ అల అద్భుత వసూళ్లను సాధించిందన్న రిపోర్ట్ అందింది. ఇక అల వైకుంఠపురములో టీమ్ ఇండస్ట్రీ హిట్ పోస్టర్ వేసింది కాబట్టి ఇకపై సరిలేరు నీకెవ్వరు టీమ్ నుంచి పోస్టర్ రిలీజవుతుందేమో చూడాలి. ఇప్పటి వరకూ ఇండస్ట్రీ హిట్ .... ఇండస్ట్రీ సెన్సేషనల్ హిట్ అంటూ పోస్టర్ల ను అయితే రిలీజ్ చేయలేదు వీళ్లు. ఇప్పటి వరకూ కొనసాగిన వార్ ని ఇక ఆపేస్తున్నారా? లేక ఇకపైనా కొనసాగించే ఆలోచన ఏదైనా ఉందా? అన్నది సరిలేరు టీమ్ చెప్పాల్సి ఉంటుంది.