వైజాగ్ లో AVM సంస్థ ఫిలింస్టూడియో?

Sun Aug 02 2020 14:40:16 GMT+0530 (IST)

AVM film studio in Vizag?

భారతదేశంలోనే అత్యంత పురాతన సినిమా స్టూడియో ఏది? అంటే ఏవీఎం ఫిలిం స్టూడియోస్ గురించి కథలు కథలుగా చెబుతారు. మద్రాస్ (చెన్నై) వడపళని ఏరియాలో కొన్ని ఎకరాల స్థలంలో ఉందీ స్టూడియో. 1940 లో స్థాపించిన AVM ప్రొడక్షన్స్ దక్షిణ భారత సినీరంగంలో సంచలనాలు సృష్టించింది.  సౌత్ లో అత్యంత ప్రాచుర్యం పొందిన నిర్మాణ సంస్థలలో ఒకటిగా రికార్డుల కెక్కింది. 300 పైగా సినిమాలు నిర్మించిన ఈ సంస్థ టెలివిజన్ సీరియల్స్ లోనూ పాపులరైంది. అయితే ఇటీవల ఏవీఎం సంస్థ కార్యకలాపాలు మందగించాయి. సంస్థ వ్యవహారాలకు సంబంధించి కొన్నేళ్లుగా చడీ చప్పుడు లేనే లేదు.ఏవీఎం సంస్థ టాలీవుడ్ లోనూ పలు క్లాసిక్ చిత్రాల్ని నిర్మించింది. తెలుగులో ఏవీఎం సంస్థ చివరి సినిమా లీడర్ (2010). రానా దగ్గుబాటి- శేఖర్ కమ్ముల కలయికలో వచ్చిన హిట్ చిత్రమిది. ఆ తర్వాత సదరు సంస్థ ఇక్కడ సినిమాలు తీయడం లేదు. తాజా సమాచారం ప్రకారం... ఏవీఎం సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. వరుస సినిమాలతో ఇకపై రీబూట్ అవుతుందని సమాచారం.

ఏవీఎం సంస్థ భారీ ప్రణాళికల్ని రచిస్తోంది. అన్ని భాషల్లోనూ సినిమాలు తీయాలని నిర్ణయించింది. తెలుగు- తమిళం- కన్నడ-మలయాళ భాషలలో భారీ స్థాయిలో సినిమాలు నిర్మించేందుకు సన్నద్ధమవుతోంది. అందుకోసం వందల కోట్ల పెట్టుబడుల్ని వెదజల్లేందుకు రంగం సిద్ధం చేస్తోందట. తదుపరి ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే రెండు వారాల్లో బయటకు రానున్నాయని తెలుస్తోంది. అయితే ఏవీఎం సంస్థ నుంచి దీనికి సంబంధించిన అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

అన్నట్టు తేదేపా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎఫ్.డీ.సీకి ఏవీఎం సంస్థ ఫిలిం స్టూడియో నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుంది. బీచ్ సొగసుల విశాఖ నగరంలో రామానాయుడు స్టూడియో తరహాలోనే భారీ స్టూడియో నిర్మాణం కోసం ప్రయత్నించింది. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారింది. వైకాపా సారధి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టారు. ప్రభుత్వం మారినా.. ఇప్పటికీ ఆ సంస్థ ప్రయత్నిస్తోందా లేదా? అన్నది తెలియాల్సి ఉంది. విశాఖ రాజధాని ప్రకటనకు ముందే విశాఖలో సినిమా స్టూడియోలు నిర్మించి సినిమాలు తీస్తామనే వారందరికీ సీఎం జగన్ వెల్ కం చెప్పారు. ఇప్పుడు పాలనా రాజధాని అయ్యింది. ఇకపై ఏవీఎం దరఖాస్తును పరిశీలిస్తారేమో చూడాలి.