సర్కారు వారి పాట' విడుదల వేళ ఒక 'మీమ్' వైరల్..!

Thu May 12 2022 21:00:01 GMT+0530 (IST)

AP CM Meem goes viral when Sarkaru Vaari Paata is released

ఆంధ్రప్రదేశ్ లో సినీ ఇండస్ట్రీ సమస్యపై చర్చించడానికి ఆ మధ్య టాలీవుడ్ ప్రముఖుల బృందం సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమైన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సూపర్ స్టార్. మహేశ్ బాబు - యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - దర్శకధీరుడు రాజమౌళి - స్టార్ డైరెక్టర్ కొరటాల శివ - నిర్మాత నిరంజన్ రెడ్డి సహా పలువురు ఈ భేటీకి హాజరయ్యారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఇండస్ట్రీ సమస్యలను వివరించిన చిరంజీవి బృందం.. సినిమా టికెట్ రేట్లు పెంచుకోడానికి.. అదనపు షోలను ప్రదర్శించుకునేందుకు అనుమతులను కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు. సినీ ప్రముఖుల కోరిక మేరకు అనుమతులు జారీ చేస్తూ కొత్త జీవోను వదిలారు.

ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది కానీ.. జగన్ ను కలిసిన స్టార్ హీరోల సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయనే ప్రచారం నెట్టింట మొదలైంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎంతో చిరంజీవి - ప్రభాస్ - మహేశ్ కలిసి ఉన్న ఫోటోతో మీమ్ క్రియేట్ చేసి నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

జగన్ ను కలిసొచ్చిన తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన చిత్రం ''రాధేశ్యామ్''. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. అలానే ఆ తర్వాత వచ్చిన చిరంజీవి - రామ్ చరణ్ కలిసి నటించిన ''ఆచార్య'' సినిమా కూడా భారీ పరాజయాన్ని అందుకుంది. ఇందులో కొరటాల - నిరంజన్ రెడ్డి కూడా భాగస్వాములనే సంగతి తెలిసిందే.

'రాదేశ్యామ్' మరియు 'ఆచార్య' సినిమాలు రెండూ టాలీవుడ్ డిజాస్టర్స్ లిస్టులో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే జగన్ ను కలిసిన బృందంలో ఉన్న మహేశ్ బాబు నటించిన ''సర్కారు వారి పాట'' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా.. డివైడ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఏపీ సీఎంని మీట్ అయిన హీరోలకు ప్లాప్ తప్పలేదని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

నిజానికి 'రాధేశ్యామ్' - 'ఆచార్య' సినిమాలు ప్లాప్ అయినప్పుడే సోషల్ మీడియాలో దీని మీద చర్చ జరిగింది. నెక్స్ట్ నువ్వే అంటూ మహేశ్ 'సర్కారు వారి పాట' మీద ఓ రేంజ్ లో మీమ్స్ వచ్చాయి. అయితే ఈరోజు తొలి ఆట నుంచే మిశ్రమ స్పందన రావడంతో సోషల్ మీడియాలో మీమ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.

జగన్ కు చిరు - మహేష్ - ప్రభాస్ కలిసి పూల బొకే అందిస్తున్న పిక్ తో మీమ్ చేసి నెట్టింట వైరల్ చేసేస్తున్నారు. అందులో రాజమౌళి ఒక్కడే బయట పడ్డాడని.. అందుకే RRR సినిమాతో సక్సెస్ అందుకున్నాడంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.