Begin typing your search above and press return to search.

'హరి హర వీరమల్లు' ప్లేస్ లో 'ఏకే' రీమేక్..?

By:  Tupaki Desk   |   18 May 2021 4:30 PM GMT
హరి హర వీరమల్లు ప్లేస్ లో ఏకే రీమేక్..?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన క్రేజీ ప్రాజెక్ట్స్ లో రెండు సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ హీరోగా నటిస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్ ఇప్పటికే 45 శాతానికి పైగా పూర్తయ్యింది. ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే 'వీరమల్లు' చెప్పిన సమయానికి రావడం కష్టమే అని అర్థం అవుతోంది.

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. పవన్ కు మహమ్మారి వైరస్ సోకడంతో ముందుగానే 'వీరమల్లు' చిత్రీకరణ నిలిపివేశారు. కోవిడ్ నుంచి కోలుకున్నా పవన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనాలంటే ఆగస్ట్ వరకు టైం తీసుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ చాలా పెండింగ్ ఉంది. ఇప్పటికే ఉన్న సెట్స్ తో పాటుగా మరో భారీ సెట్ లో షూట్ చేయాల్సిన సీన్స్ ఉన్నాయట. అందులోనూ ఈ సినిమాకి ఎక్కువ వీఎఫ్ఎక్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటే 'వీరమల్లు' సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటాడని అనిపిస్తోంది. కాకపోతే అదే సమయానికి '#PSPKRana' చిత్రాన్ని రిలీజ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.

మలయాళ హిట్ సినిమా 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' తెలుగు రిమేక్ లో రానా దగ్గుబాటి తో కలిసి పవన్ నటిస్తున్న విషయం తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు - స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. సితార ఎంటర్టైమెంట్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే కరోనా పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'హరి హర వీరమల్లు' సంక్రాంతికి రాకపోతే.. ఆ స్థానంలో 'ఏకే' రీమేక్ ని విడుదల చేసే ఆలోచన చేస్తారేమో చూడాలి.