`ముఠామేస్త్రి`ని చూస్తామా? మరో `గ్యాంగ్ లీడర్`నా?

Fri Sep 24 2021 09:00:01 GMT+0530 (IST)

A film in the Bobby-Megastar combination

మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం సెప్టెంబర్ 22 తో 43 ఏళ్లు పూర్తయిన సంగతి తెలిసిందే. తొలి చిత్రం ప్రాణం ఖరీదు విడుదలై నాలుగు దశాబ్ధాలు దాటింది. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖు లు..మెగా అభిమానులు చిరుకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుప్రీంహీరోగా మొదలై మెగాస్టార్ గా తనని తాను ఆవిష్కరించుకనే ప్రయాణంలో చిరు ఎన్నో మైలురాళ్లను తాకారు.ఆయన ఎదుగుదలతో పాటే అభిమానులు పెరిగారు. అందులో బాబి ఒకడు. అందుకే దర్శకుడు బాబి కూడా తనదైన శైలిలో విషెస్ తెలియజేసారు. ఇప్పటికే బాబి-మెగాస్టార్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఓ మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసి పక్కా ఫ్యాన్ బేస్డ్ మూవీ అని హింట్ ఇచ్చారు. అంతకు ముందే ఈ చిత్రాన్ని ఓ అభిమానిగా తెరకెక్కిస్తున్నట్లు బాబి రివీల్ చేసారు.

దానికి తగ్గట్టే అటుపై పోస్టర్ ని డిజైన్ చేసి అభిమానుల్లోకి వదిలారు. నాటి నుంచి ఈ కాంబినేషన్ పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆన్ స్క్రీన్ పై మళ్లీ `ముఠామేస్త్రి`ని చూస్తామా? మరో `గ్యాంగ్ లీడర్` చూస్తామా? అన్న..లేక ఆ రెండింటిని మిక్స్ చేసిన హీరోని మరిపిస్తారా? అన్న అంచనాలు తెరపైకి వస్తున్నాయి. బాబి లో మాస్ యాంగిల్ ...మెగాస్టార్ మాస్ ఇమేజ్ నేపథ్యంలో అంచనాలు అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి. బాబి మెగా అభిమాన సంఘం నాయకుడిగా మొదలై అటుపై అనుకోకుం డా సినిమాల్లోకి వచ్చి దర్శకుడిగా మారారు. నాటి నుంచి మెగాస్టార్ ని ఏ రోజైనా డైరెక్ట్ చేయకపోతానా? అని చివరికి తాను అనుకున్న కలని నెరవేర్చుకున్నారు.

మెగాస్టార్ ని అభిమానిగా ఫీలై డైరెక్ట్ చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ ఈ రేంజ్ లో ఫీలై.. లెక్చర్ ఇస్తోంది మాత్రం బాబి కావడం విశేషం. మెగాస్టార్ ని ఎలాంటి కథలో చూపించనున్నారు? ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది? మెగాస్టార్ లో సిసలైన మాస్ ఇమేజ్ ని ఎలా తట్టి లేపుతారు? వంటి ఆసక్తికర ప్రశ్నలకు తెర పడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం చిరంజీవి `గాడ్ ఫాదర్` షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత బాబి ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. మెహర్ రమేష్ తో భోళా శంకర్ లోనూ మెగాస్టార్ నటించాల్సి ఉంది.