కరుణానిధితో సూర్య- కార్తీ నాటి అనుబంధం?

Thu Aug 13 2020 17:00:20 GMT+0530 (IST)

Surya-Karti affiliation with Karunanidhi?

స్కూళ్లలో భాషా మాధ్యమాల విషయంలో రకరకాల వివాదాలు వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తమిళ తంబీల మాతృభాషకు ఇచ్చే ప్రాధాన్యత దృష్ట్యా పలు వివాదాలు చర్చకు తావిచ్చాయి. ఇటీవల విమానాశ్రయంలో హిందీ మాట్లాడమని అడిగారని డీఎంకే ఎంపీ కనిమోళి (కరుణానిధి కుమార్తె) ఆరోపించడం వివాదాస్పదమైంది. కనిమోళికి హిందీ తెలుసు కానీ మాట్లాడరు అంటూ భాజపా నాయకుడు హెచ్ రాజా ఆరోపించారు. అదంతా అలా ఉండగానే.. ప్రస్తుతం కనిమోళి- కళైంగర్ కరుణానిధి కలిసి ఉన్న క్లాసిక్ ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.కరుణానిధి కోసం హిందీ ప్రసంగాన్ని కనిమోళి తమిళంలోనికి అనువదిస్తున్నప్పుడు తీసిన ఫోటో ఇది అని తెలుస్తోంది. తాజాగా ఆ ఫోటో విడుదలై వైరల్ అవుతోంది. కరుణానిధితో కనిమోళి ఫోటో ఎక్కడ తీశారు? అన్నదానికి సమాధానం వెతికితే అది కూడా ఆసక్తికరమే. నిజానికి ప్రముఖ నటుడు శివకుమార్ ఇంట్లో ఈ ఫోటోని తీశారట అప్పట్లో.

శివకుమార్ అద్భుతమైన చిత్రకారుడు కావడంతో 1989 లో కళైంగర్ కరుణానిధి.. ఆయన కుమార్తె కనిమోళి శివకుమార్ ఇంటిని సందర్శించారు. తండ్రి కుమార్తె ద్వయం శివకుమార్ ఇంటికి వెళ్లి కొద్దిసేపు అతని పెయింటింగ్స్ చూసి ఆశ్చర్యపోయారు. ఈ సందర్శన సమయంలో వేరొక ప్రత్యేకమైన ఫోటోని తీశారు. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఫోటోలలో శివకుమార్ కుటుంబం మొత్తం ఉంది. ఇందులో యువకులైన సూర్య - కార్తీ కూడా కనిపిస్తున్నారు. వారి బాల్యంలోని ఫోటో ఇది. అయితే ఇప్పుడు ఆ ఇద్దరూ స్టార్ హీరోలుగా తమిళ చిత్రసీమలో రాణిస్తున్నారు. తెలుగులోనూ ఫాలోయింగ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.