Begin typing your search above and press return to search.

రాసి పెట్టుకోండి.. ఆర్ఆర్ఆర్ కు 99% అస్కారం ఖాయం.. అదెలానంటే?

By:  Tupaki Desk   |   25 Jan 2023 10:00 AM GMT
రాసి పెట్టుకోండి.. ఆర్ఆర్ఆర్ కు 99% అస్కారం ఖాయం.. అదెలానంటే?
X
మరో అడుగు మాత్రమే మిగిలి ఉంది. అదే కానీ జరిగితే.. మరో అద్భుతానికి తెర లేచినట్లే. తెలుగు సినిమాను ఒక్క సినిమాను జాతీయ.. అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సత్తా రాజమౌళి సొంతం. బాహుబలితో మొదలైన ఆయన కొత్త ప్రయాణం.. కొత్త తీరాలకు తీసుకెళుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి అద్భుత విజయంతో ఆయన పక్కాగా ప్లాన్ చేసుకున్న "ఆర్ఆర్ఆర్" అనుకున్న రీతిలోనే విజయం సాధించటం ఒక ఎత్తు అయితే.. తాజాగా అస్కార్ రేసులో తుది దశకు చేరుకోవటం ఆసక్తికరంగా మారింది.

మరే కమర్షియల్ దర్శకుడికి సాధ్యం కాని రీతిలో సినిమాను సంచలన వసూళ్లు సాధించటమే కాదు.. తాను తీసిన సినిమాను వివిధ దేశాల్లోనూ అంతే ఆదరణ లభించేలా చూసుకోవటం మామూలు విషయం కాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. చలన చిత్రరంగంలో పని చేస్తూ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న ప్రతి ఒక్కరికి కలగా ఉండే అస్కార్ సైతం ఆర్ఆర్ఆర్ విషయంలో సానుకూలత వ్యక్తం కావటం రాజమౌళి అసలుసిసలు విజయంగా చెప్పాలి.

ఆర్ఆర్ఆర్ ఘన విజయం తర్వాత పలుదేశాల్లో ఈ మూవీని విడుదల చేయటం ద్వారా భారీ వసూళ్లు సాధించటం మీదనే ఉన్న రాజమౌళి.. ఆర్నెల్ల క్రితం తన చిత్రానికి అస్కార్ వచ్చే అవకాశాల మీద ఆలోచన చేయటం మొదలు పెట్టినట్లుగా చెబుతున్నారు. జక్కన్నకు అత్యంత సన్నిహితంగా ఉండే వారి మాటల్ని చూస్తే.. ఆర్నెల్లుగా జక్కన్న తన ఆర్ఆర్ఆర్ మూవీని అస్కార్ సాధించేందుకు ఉన్న అవకాశాల్నిచూడటంతో పాటు..ఆ దిశగా ప్రయత్నాల్ని షురూ చేసినట్లుగా చెబుతున్నారు.

ఇప్పటివరకు అస్కార్ రేసులోకి వచ్చిన భారతీయ చిత్రాలు.. వాటి దర్శకనిర్మాతలతో పాటు.. వాటి ప్రొడక్షన్ హౌస్ లు ఏమేం తప్పులు చేశాయన్న దానిపై భారీ అధ్యయనం చేయటం మొదలు.. అస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్ ను నిలిపేందుకు ఉన్న అవకాశాల మీద లోతుగా ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. అస్కార్ సాధనకు అవసరమైన పది వేల ఓట్లలో అత్యధిక ఓటర్లకు రీచ్ అయ్యే మార్గాల్ని వెతికేందుకు ఆయన ఒక ప్రఖ్యాత పీఆర్ ఏజెన్సీకి బాధ్యత అప్పజెప్పటం మొదలు.. గడిచిన కొన్నినెలలుగా అస్కార్ మీదనే ఆయన ఫోకస్ ఉందని చెబుతున్నారు.

తాను ఏదైనా అనుకుంటే.. దాని అంతు చూసే వరకు విడిచి పెట్టని రాజమౌళి కష్టానికి ఫలితంగానే అస్కార్ లో ఆర్ఆర్ఆర్ మూవీ హవా నడుస్తుందని చెబుతున్నారు. అస్కార్ సాధనకు అవసరమైన ఏర్పాట్లతో పాటు.. అందుకు అవసరమైన బ్యాక్ గ్రౌండ్ వర్కును భారీగా పూర్తి చేయటమే కాదు.. అందుకు తగ్గట్లుగా ఫండ్ ను కూడా సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే.. అస్కార్ సాధించే సత్తా ఉండగానే సరికాదు.. అందుకు తగ్గ లాబీయింగ్ సరిగా చేయలేకపోతే.. విజేతగా నిలిచే అవకాశాల్ని కోల్పోవటం ఖాయం.

గతంలో పలు భారతీయ చిత్ర నిర్మాత దర్శకులు చేసిన తప్పును ఎట్టి పరిస్థితుల్లో తన వరకు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నజక్కన్న తీరు చూసినప్పుడు.. ఆర్ఆర్ఆర్ కు అస్కార్ అడుగు దూరమే కాదు.. 99 శాతం రావటం ఖాయమని చెప్పక తప్పదు. ఇదేదో సరదా కోసం చెబుతున్న మాటలు అసలే కాదు. రాజమౌళి కమిట్ మెంట్ కు అస్కార్ సైతం తలొగ్గక తప్పదంటున్నారు. తుది ఫలితం ఏమిటన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుందని చెప్పక తప్పదు. అంతవరకు వెయిట్ చేయటం మాత్రమే చేయగలిగింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.