Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: '90 ఎంఎల్'

By:  Tupaki Desk   |   6 Dec 2019 9:09 AM GMT
మూవీ రివ్యూ: 90 ఎంఎల్
X
చిత్రం : ‘90 ఎంఎల్’

నటీనటులు: కార్తికేయ - నేహా సోలంకి - రవికిషన్ - రావు రమేష్ - ప్రభాకర్ - రఘు కారుమంచి - పోసాని కృష్ణమురళి - సత్యప్రకాష్ - ప్రగతి తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: యువరాజ్
నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ
రచన - దర్శకత్వం: శేఖర్ రెడ్డి యెర్రా

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టి.. ఆ గుర్తింపుతో వరుసగా అవకాశాలు అందుకున్నాడు యువ కథానాయకుడు కార్తికేయ. కానీ చకచకా సినిమాలైతే చేశాడు కానీ.. విజయాలు మాత్రం అందుకోలేకపోయాడు. ‘హిప్పి’ - ‘గుణ 369’ సినిమాలతో చేదు అనుభవాలు ఎదుర్కొన్న అతను ఇప్పుడు ‘90 ఎంఎల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి ఈ సినిమా అయినా అతను ఆశించిన విజయాన్నందించేలా ఉందో లేదో చూద్దాం పదండి.

కథ:

దేవదాసు (కార్తికేయ)కు చిన్నతనంలోనే ఓ విచిత్రమైన జబ్బు వస్తుంది. అతను ప్రతి పూటా 90 ఎంఎల్ మద్యం తాగకపోతే ప్రాణాలే పోయే పరిస్థితి తలెత్తుతుంది. దీంతో ఆథరైజ్డ్ డ్రగర్‌ గా డాక్టర్ సర్టిఫికెట్ తీసుకుని మరీ ప్రతి పూటా మందు డోస్ పట్టిస్తుంటాడు. అలాంటివాడికి అసలు మద్యం అంటే పడని కుటుంబం నుంచి వచ్చిన సువాసన (నేహా సోలంకి) పరిచయం అవుతుంది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి ప్రేమలో పడతారు. తనకున్న బలహీనత గురించి సువాసనకు చెప్పకుండా కొన్నాళ్లు దేవదాసు బండి నడిపిస్తాడు కానీ.. ఒక సందర్భంలో అతడి మద్యం అలవాటు గురించి తెలిసిపోతుంది. దీంతో అతడికి సువాసన దూరం అవుతుంది. మరి సువాసను దక్కించుకోవడానికి దేవదాసు ఏం చేశాడు.. ఆమె అసహ్యించుకునే తన మద్యం అలవాటును అతను విడిచిపెట్టాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

మూడు ముక్కల్లో చెప్పేయగలిగే ఒక మెరుపు ఐడియాకు ఎగ్జైట్ అయిపోయి ముందు వెనుక చూడకుండా రెడీ అయిపోతే ఎలా ఉంటుందో చెప్పడానికి ‘90 ఎంఎల్’ ఉదాహరణగా నిలుస్తుంది. ఏదైనా జబ్బొస్తే ప్రతి పూటా నిర్ణీత డోస్ లో మందులేసుకున్నట్లుగా 90 ఎంఎల్ మద్యం తాగితే తప్ప బతకలేేని విచిత్రమైన జబ్బున్న హీరో.. అసలు మద్యం వాసన దూరం నుంచి వచ్చినా.. ముఖాలకు మాస్కులేసుకుని కానీ బయటికి రాని కుటుంబం నుంచి వచ్చిన హీరోయిన్.. వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తే ఎలా ఉంటుందనే ఐడియా వినడాానికి ఎవ్వరికైనా ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. ఐతే ఇలాంటి ఐడియాలు ట్రైలర్ కట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. దీని మీద రెండున్నర గంటల సినిమాను నడిపించడం అంటే మామూలు విషయం కాదు. ‘గజిని’లో మురుగదాస్ లాగా విభిన్నమైన ఐడియా చుట్టూ ప్రేక్షకులు రిలేట్ చేసుకునే పాత్రలు.. ఎమోషన్లతో పకడ్బందీ కథనం అల్లడం ముఖ్యం. కానీ ‘90 ఎంఎల్’ దర్శకుడు ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యాడు. ట్రైలర్లో చూసిన దానికి మించి సినిమాలో కొత్తగా ఏమీ చూపించలేక రెండున్నర గంటటల పాటు ఏవేవోో విన్యాసాలు చేసి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు.

హీరో మద్యం తాగుతాడని తెలిసిన హీరోయిన్ అతడిని అసహ్యించుకుని దూరం అవుతుంది. కానీ హీరో ఆమెను విడిచిపెట్టకుండా వెంటాడుతాడు. వీళ్ల మధ్య సంభాషణ జరిగిన ప్రతిసారీ.. హీరో తనకున్న జబ్బు గురించి చెప్పబోతాడు. ‘‘నేను చెప్పేది ఒకసారి విను..’ అంటాడు. కానీ హీరోయిన్ వినిపించుకోకుండా మాట దాట వేస్తుంది. ఇలా ఒకసారి కాదు.. చాలాసార్లు జరుగుతుంది. హీరోయిన్ అతణ్ని అసహ్యించుకోవడం.. అతను వెంటపడటం.. అతణ్ని మార్చాలని ప్రయత్నించి ఫెయిలవడం.. ఇలాగే దాదాపు గంటన్నర కథనం నడుస్తుంది. మద్యం విడిచి పెట్టలేని తన బలహీనత వల్ల విపరీత పరిణామాలు జరుగుతున్నపుడు.. హీరోయిన్ని ఆమె కుటుంబ సభ్యుల్ని ఒక్క నిమిషం ఆపి ఇదీ నా సమస్య అని రెండు ముక్కల్లో అసలు విషయం హీరో ఎందుకు చెప్పడబ్బా అని మనకు ఫ్రస్టేషన్ వచ్చేస్తుంటుంది. ఐతే క్లైమాక్సులో కానీ ఈ విషయం బయటపెట్టకూడదనే బలమైన సంకల్పంతో దర్శకుడు కథనాన్ని సాగదీస్తూనే ఉంటాడు.

అసలు ‘90 ఎంఎల్’ సినిమాను సీరియస్ గా నడిపించాలా.. కామెడీగా తీయాలా అనే క్లారిటీ లేకుండా దర్శకుడు ఈ స్క్రిప్టు రాసుకున్నట్లున్నాడు. సినిమా తీసేటపుడు కూడా అదే కన్ఫ్యూజన్ కొనసాగినట్లుంది. ఒక సందర్భంలో ఏమో హీరో బలహీనత మీద కామెడీ చేస్తారు. ఇంకో సందర్భంలో ఏమో దాన్ని సెంటిమెంటు కోసం వాడుకోవాలని చూస్తారు. హీరోయిన్ కుటుంబంలో కొన్నిసార్లు సీరియస్ కాన్వర్జేషన్లు జరుగుతాయి. కొన్నిసార్లు వాళ్లతోనూ పిచ్చ కామెడీ చేయించారు. పదేళ్ల వయసుండే తన చిన్న కూతురిని హీరోయిన్ తండ్రి ఆవేశిత గారూ అని పిలుస్తాడు. ఇంట్లో అందరూ ఒకరినొకరు ‘గారూ’ అనే అంటారు. ఇదేం చిత్రమో అర్థం కాదు. ఇక విలన్ పాత్రలోని చిత్రాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రతి రోజూ మందు కొట్టాక ఒక అబ్బాయిని ఇంటికి తెచ్చుకుని తన బెడ్ రూంలో పడుకోబెట్టుకుంటాడట. పొద్దున లేచి నా బెడ్ మీదికి ఎలా వచ్చావురా అని కొడతాడట. ఇలాగే ఒకసారి హీరోను ఇంటికి తీసుకొస్తే అతను ఉతికారేసి వెళ్తాడు. కానీ మందు కొడితే అన్నీ మరిచిపోయే విలన్ తనను ఎవరు కొట్టారో.. ఎందుకు కొట్టారో తెలియక అతను సతమతం అయిపోతూ చర్చి ఫాదర్ ను ఆశ్రయిస్తాడు. ధ్యానం చేస్తే అంతా తెలుస్తుందని అంటే.. అతను ఆ పనిలో పడతాడు. ధ్యానంలో అతడికి హీరో బదులు ‘లెజెండ్’ బాలయ్య కనిపిస్తాడు.. ‘రేసుగుర్రం’ బ్రహ్మానందం కనిపిస్తాడు. అబ్బబ్బా ఏం కామెడీ అనుకుని మనం కడుపు చెక్కలయ్యేలా నవ్వుకోవాలన్నమాట.

పైన చెప్పుకున్న ఐడియాను మినహాయిస్తే ‘90 ఎంఎల్’ ఉన్నదంతా నాన్ సెన్సే. కేవలం ఆ ఐడియాకు దర్శకుడే కాదు.. హీరో.. అతడి కుటుంబ సభ్యుడే అయిన నిర్మాత.. ఇలా అందరూ ఎగ్జైట్ అయిపోయారు. దాచితే దాగని ఇలాంటి నిజాన్ని హీరో అసలెందుకు హీరోయిన్ దగ్గర దాచాలనుకోవడంలోనే లాజిక్ లేదు. ఇక ఆ తర్వాత కూడాా ఆ నిజాన్ని చెప్పలేకపోవడం అర్థరహితంగా అనిపిస్తుంది. ఈ ఫీలింగ్ తోనే ఫ్రస్టేట్ అవుతూ ముగింపు వరకు ఎదురు చూడటం అంటే ప్రేక్షకుడికి అంతకంటే పరీక్ష ఉండదు. అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్లు నవ్వు తెప్పిస్తే తెప్పించొచ్చు కానీ.. ‘90 ఎంఎల్’ మిగతా వ్యవహారాన్ని భరించడం మాత్రం చాలా చాలా కష్టమే.

నటీనటులు:

కార్తికేయ చాలా త్వరగా బోర్ కొట్టించేస్తున్నాడు. అతడి నటన ఒకేలా ఉంటోంది. ఫిజిక్ బాగా మెయింటైన్ చేస్తున్నాడు. యూత్ కనెక్టయ్యే స్టైలింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. అంతకుమించి అతను మెప్పిస్తున్నది ఏమీ లేదు. ‘90 ఎంఎల్’లో కొన్ని చోట్ల అతడి హావభావాలు, నటన చిరాకు పెడతాయి. హీరోయిన్ నేహా సోలంకి చూడ్డానికి బాగానే అనిపిస్తుంది. కానీ నటన పరంగా ఆమె కూడా అంతంతమాత్రమే. రవికిషన్ కొంచెం భిన్నమైన పాత్రతో కామెడీ చేయాలని ట్రై చేశాడు. అతను బాగానే చేసినా.. పాత్ర మాత్రం మరీ పేలవంగా అనిపిస్తుంది. రావు రమేష్ స్థాయికి తగ్గ పాత్ర దక్కలేదు. ప్రభాకర్ - రఘు కారుమంచి ఓ మోస్తరుగా నవ్వించే ప్రయత్నం చేశారు. సత్యప్రకాష్.. ప్రగతి మామూలే.

సాంకేతికవర్గం:

కొంత కాలం కనిపించకుండా పోయిన సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్.. మళ్లీ ఈ సినిమాతో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశాడు. పాటలు పర్వాలేదనిపిస్తాయి. 90 ఎంఎల్ టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. అనూప్ తన స్టయిల్లో ఒక విషాద గీతం చేశాడు కానీ.. అది సినిమాలో అస్సలు సింక్ కాలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే. యువరాజ్ ఛాయాగ్రహణం కొత్తగా ఏమీ లేకపోయినా.. బాగానే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ శేఖర్ రెడ్డి గురించి పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు. బేసిక్ ఐడియా మినహాయిస్తే కథాకథనాలన్నీ పేలవమే. బోరింగ్ స్క్రీన్ ప్లేతో.. లాజిక్ లేని సన్నివేశాలతో సినిమాను పూర్తిగా నీరుగార్చేశాడు.

చివరగా: 90 ఎంఎల్.. ప్రేక్షకుల ఆరోగ్యానికి హానికరం

రేటింగ్-1.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre