Begin typing your search above and press return to search.

'9 అవర్స్' ట్రైలర్: పోలీసులు - దొంగలకు మధ్య జరిగిన యుద్ధంలో గెలుపెవరిది?

By:  Tupaki Desk   |   23 May 2022 6:49 AM GMT
9 అవర్స్ ట్రైలర్: పోలీసులు - దొంగలకు మధ్య జరిగిన యుద్ధంలో గెలుపెవరిది?
X
ప్రముఖ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫార్మ్స్ లో ఒకటైన డిస్నీ+హాట్‌ స్టార్‌.. ఎప్పటికప్పుడు అమితమైన వినోదాన్ని అందించి వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో థియేటర్‌లలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు మరియు డైరెక్ట్ డిజిటల్ రిలీజులతో పాటుగా ఒరిజినల్‌ కంటెంట్‌ ని అందిస్తోంది. సరికొత్త కథలతో ఆసక్తికరమైన వెబ్‌ సిరీస్‌ లను రూపొందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిస్నీ హాట్‌ స్టార్‌ ఇప్పుడు ''9 అవర్స్‌'' అనే సిరీస్ ను స్ట్రీమింగ్ చేయడానికి రెడీ అయ్యారు.

టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ''9 అవర్స్‌'' వెబ్ సిరీస్ కు కథ అందించడమే కాదు.. షో రన్నర్ గా వ్యవహరించారు. ఇందులో నందమూరి తారకరత్న - అజయ్ - వినోద్ కుమార్ - మధు షాలినీ - రవి వర్మ - ప్రీతి అస్రానీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్ ఈ సిరీస్ పై ఇంట్రెస్ట్ కలిగించాయి. ఈ క్రమంలో స్ట్రీమింగ్ కు రెడీ అయిన ఈ సిరీస్ అఫిషియల్ ట్రైలర్ ను హీరో వరుణ్ తేజ్ ఈ శనివారం ఉదయం లాంచ్ చేశారు.

'మూడు బ్యాంకులు.. మూడు దొంగతనాలు.. ఎలాగైనా తప్పించుకోగలమనే నమ్మకం.. దొరికితే తప్పించుకోడానికి ఓ పధకం.. ఎవరున్నారు దీని వెనకాల' అని తారకరత్న చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. జైలులో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ఖైదీలు తప్పించుకుని దొంగతనం చేయడానికి వేసిన భారీ ప్లానే '9 అవర్స్‌' కథాంశమని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

జైలు నుంచి తప్పించుకున్న ముగ్గురు ఖైదీలు ఓ భారీ దొంగతనానికి ప్లాన్ చేశారు. అయితే రెండు బ్యాంకుల్లో దోపిడీ చేసి పరారైన దొంగలు.. మూడో బ్యాంక్ లో మాత్రం అమాయకులను బంధీలుగా పట్టుకుంటారు. దొంగలను ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పించుకోనీయకుండా.. ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఖైదీలు - పోలీసుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు బ్యాంకులో ఉన్న ఉద్యోగులు - కస్టమర్లు భయభ్రాంతులకు గురవుతున్నారు. తమ డిమాండ్స్ నెరవేర్చకుంటే దొంగలు వారిలో ఒక్కొక్కరిని చంపేస్తుంటారు. ఈ దోపిడీ కేసును పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ తారకరత్న డీల్ చేస్తుంటాడు. 'న్యాయానికి నిజానికి మధ్య చిన్న గీత ఉంటుంది.. అది దాటితే కానీ నిజాలు బయటకు రావు' అని చెప్పడంతో ''9 అవర్స్'' ట్రైలర్ ముగుస్తుంది.

ఖైదీలు జైలు నుంచి తప్పించుకొని బ్యాంక్ లోకి ఎలా చొరబడ్డారు? బయట నుంచి వారికి సహాయం చేస్తున్నదెవరు? అసలు దొంగతనం వెనకున్న ప్రధాన ఉద్దేశ్యమేంటి? వాళ్లు అనుకున్న ప్లాన్ వర్కవుట్ అవుతుందా? పోలీసులు ఖైదీలను పట్టుకున్నారా లేదా? పోలీసులకు దొంగలకు జరిగిన ఈ యుద్ధంలో గెలుపెవరిది? అనే ఆసక్తికరమైన అంశాలతో 9 గంటల్లో జరిగిన కథను ఈ వెబ్ సిరీస్ లో చూపించబోతున్నారని తెలుస్తోంది.

ఇందులో తారకరత్న - వినోద్ కుమార్ - బెనర్జీ పోలీసులుగా నటించగా.. అజయ్ - రవివర్మ ఖైదీలుగా కనిపించారు. అంకిత - జ్వాల - మోనిక తదితరులు ఇతర పాత్రలు పోషించారు. బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు విజువల్స్ బాగున్నాయి. వెబ్ సిరీస్ అయినప్పటికీ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయి. ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఆసక్తికరంగా ఉండటంతో '9 అవర్స్' సిరీస్ పై అంచనాలు పెరుగుతున్నాయి.

''9 అవర్స్'' సిరీస్ కు నిరంజన్ కౌశిక్ మరియు జాకబ్ వర్గీస్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి వై - సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం సమకూర్చగా.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. రాజ్ కుమార్ గిబ్సన్ ప్రొడక్షన్ డిజైనింగ్.. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ విభాగాలు చూసుకున్నారు.

క్రిష్ జాగర్లమూడి క్రియట్ చేసిన '9 అవర్స్' సిరీస్ జూన్ 2న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ పీరియాడికల్ డ్రామాకు సంబంధించిన అన్ని ఎపిసోడ్లు అదే రోజున అందుబాటులోకి రానున్నాయి. తెలుగుతో పాటుగా తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది.