'777 చార్లీ' ట్రైలర్: కుక్క - మనిషి మధ్య సాగిన ఎమోషనల్ జర్నీ..!

Mon May 16 2022 14:11:49 GMT+0530 (IST)

777 Charlie Trailer

‘అతడే శ్రీమన్నారాయణ’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కన్నడ హీరో రక్షిత్ శెట్టి.. ఇప్పుడు ''777 చార్లీ'' చిత్రంతో అలరించడానికి వస్తున్నాడు. కిరణ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని 2022 జూన్ 10న తెలుగు కన్నడ తమిళ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇప్పటికే ''777 చార్లీ'' నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను లాంచ్ చేశారు. తెలుగు ట్రైలర్ ను విక్టరీ వెంకటేష్ - సాయి పల్లవి - లక్ష్మి మంచుతో సహా పలువురు సినీ ప్రముఖులు విడుదల చేసి.. చిత్ర బృందానికి విషెస్ తెలియజేశారు.

'నా పేరు ధర్మ. నా వరకు నేను కరెక్ట్.. కానీ చూసే వాళ్ళ దృష్టిలో నేను రాంగ్. ఇల్లు - ఫ్యాక్టరీ - గొడవ - ఇడ్లీ - సిగరెట్ - బీర్.. ఇంతే నా లైఫ్. ఇంట్రెస్టింగ్ గా వేరే ఏం లేదు' అని రక్షిత్ శెట్టి చెప్పే డైలాగ్ తో ఇందులో అతని పాత్ర ఎలా ఉంటుందో అర్థం అవుతుంది.

అలాంటి వాడిని కుక్క కూడా పట్టించుకోదని తిట్టిపోస్తున్న సమయంలో ధర్మ లైఫ్ లోకి ఛార్లీ అనే ఓ కుక్క వచ్చినట్లు చూపించారు. చార్లీ రాకతో అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనేది ఈ '777 చార్లీ' సినిమా కథాంశమని తెలుస్తోంది.

అయితే హీరోని చార్లీ ఇబ్బందులకు గురి చేయడం.. దీంతో కుక్కను వదిలించుకోడానికి రక్షిత్ పడే పాట్లు.. ఈ క్రమంలో చార్లీకి ధర్మ కి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఏర్పడటం వంటివి ఈ ట్రైలర్ లో ఆకట్టుకున్నాయి. కాశ్మీర్ లో ధర్మ - చార్లీ విడిపోవడం.. చార్లీని వెతికే క్రమంలో ధర్మ పడిన కష్టాలు భావోద్వేగానికి గురి చేస్తున్నాయి.

‘చార్లీ నువ్వు నన్నెంత ప్రేమిస్తున్నావ్’ అని రక్షిత్ అంటుండగా.. కుక్క ప్రేమగా అతని దగ్గరకు వచ్చే సన్నివేశం హృదయానికి హత్తుకునేలా ఉంది. మసుషులకు నోరు లేని మూగ జీవాలకు మధ్య అనుబంధం గురించి ఈ సినిమాలో చూపించారని అర్థం అవుతోంది.

'777 చార్లీ' సినిమాలో సంగీత శృంగేరీ - దర్శక నటుడు రాజ్ బీ శెట్టి - డానిష్ సేత్ - బాబీ సింహా తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. నోబిన్ పాల్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (సురేష్ ప్రొడక్షన్స్) సమర్పణలో పరమ్ వహ్ బ్యానర్ పై జి.ఎస్.గుప్తా మరియు రక్షిత్ శెట్టి కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ‘777 ఛార్లి’ సినిమా.. నిర్మాతగా హీరోగా రక్షిత్ శెట్టికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.