6.5 కోట్లతో వేసిన 'శ్యామ్ సింగ రాయ్' సెట్ ప్రత్యేకతలివే..!

Fri Apr 23 2021 05:00:01 GMT+0530 (IST)

6.5 Cr massive set for Shyam Singha Roy

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''శ్యామ్ సింగ రాయ్''. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి - గార్జియస్ కృతి శెట్టి - మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన నాని ఫస్ట్ లుక్ మంచి స్పందన తెచ్చుకుంది. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. దీని కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కలకత్తా ని తలపించేలా భారీ సెట్ ని ఏర్పాటు చేసినట్లు చిత్ర బృందం ఇటీవలే ప్రకటించింది.సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో వేసిన ఈ సెట్ కోసం రూ.6.5 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆర్ట్ డైరెక్టర్ అవినాశ్ కొల్లా పర్యవేక్షణలో 100 సంవత్సరాల నాటి పురాతన కాళి ఆలయ నిర్మాణ సెట్ ని రూపొందించారు. నిజమైన ఆలయ అనుభూతిని తీసుకురావడానికి ఇటుకలు మరియు బంకమట్టిని ఉపయోగించి దీనిని నిర్మించారు. అంతేకాదు ఈ ప్రత్యేక సెట్ నిర్మాణానికి 1200 మంది కార్మికులు పని చేయగా..రెండు నెలల సమయం పట్టిందని తెలుస్తోంది. కలకత్తా స్టైల్ నిర్మాణం కాబట్టి పశ్చిమ బెంగాల్ నుండి చాలా మంది వర్కర్స్ ని తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సెట్ లోనే ప్రధాన తారాగణం పాల్గొనే ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది.

పవర్ ఫుల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న 'శ్యామ్ సింగరాయ్' నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ చిత్రంలో జిషు సేన్ గుప్తా విలన్ గా నటిస్తుండగా.. రాహుల్ రవీంద్రన్ - మురళీ శర్మ - అభినవ్ గోమటం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జంగా సత్యదేవ్ ఈ చిత్రానికి స్టోరీ అందించారు. మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జె.మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. 'జెర్సీ' ఫేమ్ సాను జాన్ వర్గేష్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.