Begin typing your search above and press return to search.

త్రివిక్రముడి సినీ ప్రయాణానికి 22 ఏళ్ళు..!

By:  Tupaki Desk   |   22 April 2021 5:30 AM GMT
త్రివిక్రముడి సినీ ప్రయాణానికి 22 ఏళ్ళు..!
X
త్రివిక్రమ్ శ్రీనివాస్.. టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న అగ్ర దర్శకులలో ఒకరు. రచయితగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన త్రివిక్రమ్.. తన మార్క్ పంచ్‌ డైలాగులతో ప్రాసలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో దర్శకుడి అవతారమెత్తి తనదైన శైలిలో సినిమాలు చేస్తూ వరుస విజయాలు అందుకుంటున్నాడు. ఇకపోతే త్రివిక్రమ్ మొట్ట మొదటగా కథ-మాటలు అందించిన 'స్వయంవరం' సినిమా 1999 ఏప్రిల్ 22 న విడుదలైంది. ఈరోజుతో ఇండస్ట్రీలో 22 ఏళ్ళు పుర్తి చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం!

'స్వయంవరం' సినిమా విజయం సాధించడంతో రచయితగా త్రివిక్రమ్ వరుస అవకాశాలు అందుకున్నాడు. 'సముద్రం' 'నిన్నే ప్రేమిస్తా' 'నువ్వే కావాలి' 'వాసు' వంటి సినిమాలకు మాటలు రాసిన త్రివిక్రమ్.. 'చిరునవ్వుతో' 'నువ్వునాకు నచ్చావ్' 'మన్మథుడు' 'మల్లీశ్వరి' 'జై చిరంజీవ' వంటి సినిమాలకు కథ-మాటలు అందించాడు. అలానే 'తీన్‌మార్' సినిమాకి స్క్రీన్‌ ప్లే-డైలాగ్స్.. 'ఛల్ మోహన రంగ' సినిమాకి స్టోరీ అందించాడు. 'ఒక రాజు ఒక రాణి' చిత్రానికి లిరిసిస్ట్ గా పని చేసారు. ఇక 'నువ్వే నువ్వే' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన త్రివిక్రమ్.. 'అతడు' 'జల్సా' 'ఖలేజా' 'జులాయి' 'అత్తారింటికి దారేది' 'సన్నాఫ్ సత్యమూర్తి' 'అ ఆ' 'అజ్ఞాతవాసి' 'అరవింద సమేత వీర రాఘవ' 'అల వైకుంఠపురములో' వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్ని సినిమాలకు దర్శకుడిగా నిరాశపరిచినా.. రచయితగా మాత్రం మెప్పించాడు. సినిమా అంతంతమాత్రంగానే ఉన్నా కేవలం తన డైలాగ్స్ తోనే సినిమాను నిలబెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక సినిమాల్లో ఆయన రాసే మాటలకి ఎంత క్రేజ్ ఉంటుందో.. బయట సినిమా వేడుకల్లో మాట్లాడే మాటలకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' తెలుగు రీమేక్ కు స్క్రీన్ ప్లే - డైలాగ్స్ రాస్తున్నాడు త్రివిక్రమ్. అలానే ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అవడంతో, మహేష్ బాబుతో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది. రచయితగా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్.. మరిన్ని సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించాలని 'తుపాకీ డాట్ కామ్' కోరుకుంటోంది.