Begin typing your search above and press return to search.

సంక్రాంతి వార్: వెనక్కి తగ్గకపోతే ఇబ్బందే..!

By:  Tupaki Desk   |   8 Dec 2021 5:30 AM GMT
సంక్రాంతి వార్: వెనక్కి తగ్గకపోతే ఇబ్బందే..!
X
సినిమాలకు పెద్ద పండుగగా భావించే సంక్రాంతి సీజన్ కోసం స్టార్ హీరోలే ఎక్కువగా పోటీ పడుతుంటారు. గతేడాది కరోనా కారణంగా మిస్ చేసుకున్న ఫెస్టివల్ ని ఈసారి వదులుకోకూడదని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమా రాకతో పండక్కి రావాలనుకున్న ఒకట్రెండు పెద్ద సినిమాలు వెనక్కి వెళ్లాయి.

ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటించిన RRR చిత్రాన్ని అనేక వాయిదాల అనంతరం 2022 జనవరి 7న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఒకే సమయంలో పెద్ద సినిమాలన్నీ థియేటర్ లలోకి రావడం వల్ల ఆరోగ్యకరమైన పోటీ ఉండదని.. నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని భావించి 'సర్కారు వారి పాట' 'ఎఫ్ 3' 'గంగూబాయి' వంటి పలు చిత్రాలు బరిలో నుంచి తప్పుకున్నాయి.

అయితే అప్పటికే రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న పాన్ ఇండియా మూవీ 'రాధే శ్యామ్' జనవరి 14వ తేదీనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ప్రభాస్ నటించిన ఈ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సంక్రాంతికే రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. దీంతో ఈసారి బాక్సాఫీస్ వద్ద RRR వెర్సెస్ రాధేశ్యామ్ మధ్యే పోటీ ఉంటుందని అందరూ అనుకున్నారు.

కాకపోతే వీటి మధ్యలో పవన్ కళ్యాణ్ 'భీమ్లానాయక్' చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ గట్టిగా కూర్చున్నారని తెలుస్తోంది. ముందుగా ప్రకటించినట్లే జనవరి 12న పవన్ సినిమాని థియేటర్లలోకి రాబోతుంది. నిజానికి ఏ సీజన్ లో అయినా రెండు పెద్ద చిత్రాలు ఒకేసారి రిలీజ్ అవ్వడం వల్ల పెద్దగా ఇబ్బందేమీ ఉందడు. కానీ అంతకంటే ఎక్కువ సినిమాలు వస్తేనే సమస్య.

ఈ నేపథ్యంలో పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకురావడానికి రాజమౌళి స్వయంగా రంగంలోకి దిగనున్నారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో త్వరలోనే మీటింగ్ జరగనుందని ప్రచారం జరిగింది. మహేష్ బాబు మాదిరిగానే.. సినిమాని వాయిదా వేసుకోమని పవన్ ని కోరుతారని కోరుతారని అనుకున్నారు. అయితే ఇంతవరకు పవన్ ని జక్కన్న కలవలేదు.

ప్రస్తుతానికి 'భీమ్లా నాయక్' సినిమా విడుదల తేదీలో మార్పు లేదు. కచ్చితంగా సంక్రాంతికి బ్లాస్ట్ అవుతుందని మేకర్స్ ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు రాజమౌళి - పవన్ మధ్య మీటింగ్ ఏదీ జరగలేదు. దీనిని బట్టి ఫెస్టివల్ సీజన్ లో మూడు సినిమాలు ఫిక్స్ అని అనుకోవచ్చు.

రెండు పాన్ ఇండియా సినిమాలు - ఒక ప్రాంతీయ సినిమా సంక్రాంతికి విడుదల అయితే థియేటర్లు షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కలెక్షన్స్ మీద దెబ్బ పడేలా చేస్తుంది. ఇప్పటికే కరోనా కారణంగా ఇండస్ట్రీ కుదేలయింది. ఇలాంటి టైంలో బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం అంటే నిర్మాతలు నష్టాన్ని కొని తెచ్చుకున్నట్లే.

ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' 'రాధేశ్యామ్' 'భీమ్లానాయక్' సినిమాలు పెద్ద పండక్కి రావాలని డిసైడ్ అయ్యారు. పాన్ ఇండియా చిత్రాలకు ఇతర ఇండస్ట్రీలలో పరిస్థితులన్నీ చూసుకొని రిలీజ్ డేట్ ఖరారు చేస్తారు కాబట్టి.. వాటిని పోస్ట్ పోన్ చేసే అవకాశం లేదు. మరోవైపు పవన్ కూడా వెనక్కి తగ్గలేదు. అప్పటికి సినిమా పనులన్నీ పూర్తి రానాతో కలిసి బరిలో దిగాలని ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది.

కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లకు జనాలు వస్తారని 'అఖండ' సినిమా నిరూపించింది. కానీ ఒకేసారి మూడు పెద్ద సినిమాలు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. దీనికి తోడు ఇప్పుడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రచారం ఎక్కువైంది. వైరస్ ప్రభావం ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద పోటీ అనేది నిర్మాతలకు ఇండస్ట్రీకి మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.