2020 సంక్రాంతి పుంజులివే

Fri Mar 29 2019 07:00:01 GMT+0530 (IST)

2020 Sankranti Releases in telugu Film Industry

2020 సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు పోటీపడ్డాయి. రజనీకాంత్ - పేట - ఎన్ బీకే- కథానాయకుడు - చరణ్ - వినయ విధేయ రామ - వెంకీ-వరుణ్ - ఎఫ్ 2 చిత్రాలు రిలీజయ్యాయి. వీటిలో `ఎఫ్ 2` సంచలన విజయం సాధిస్తే ఇతర సినిమాలన్నీ డిజాస్టర్లుగా నిలిచాయి. గతం గతః అనుకుంటే... 2020 సంక్రాంతికి ఎలాంటి పోటీ ఉండబోతోంది?  ఏఏ స్టార్ల సినిమాలు రిలీజ్ లకు ప్లాన్ చేస్తున్నారు? అన్నది పరిశీలిస్తే ఆసక్తికర సంగతులే తెలిసాయి.వచ్చే ఏడాది సంక్రాంతి ట్రీట్ హై లెవల్లో ఉంటుందన్నది తాజా సమాచారం.  2020 సంక్రాంతిని యథావిధిగా మరోసారి సూపర్ స్టార్ రజనీకాంత్ లాక్ చేశారని తెలుస్తోంది. రజనీ కెరీర్ 166వ సినిమా జాతీయ అవార్డ్ గ్రహీత .. ట్యాలెంటెడ్ ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఏప్రిల్ 10 నుంచి సెట్స్ కెళుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా తమిళ్ - తెలుగులో ఈ చిత్రం రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇక రజనీకాంత్ కి ఎవరి నుంచి పోటీ ఎదురు కానుంది? అంటే ఇప్పటికే కింగ్ నాగార్జున సంక్రాంతి 2020 పై కన్నేశారన్న ప్రచారం సాగింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నటిస్తున్న `మన్మధుడు 2` దసరా బరిలో రిలీజైతే - కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలోని `బంగార్రాజు` చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని నాగార్జున భావించారని వార్తలొచ్చాయి. అంటే కింగ్ గురి సంక్రాంతి సెలవులపై పక్కాగా ఉందని అర్థమవుతోంది.

అలాగే `సాహో` చిత్రాన్ని ఈ ఆగస్టు 15 కానుకగా అందిస్తున్న ప్రభాస్ తదుపరి `జాన్` చిత్రాన్ని సంక్రాంతి రేసులో దించాలనే ప్లాన్ లో ఉన్నాడట. జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గోపికృష్ణ -యువి బ్యానర్ల  లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ 19 - 20 చిత్రాల్లో నటించనున్న సంగతి తెలిసిందే. ఏఏ 19 చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో... ఏఏ 20 చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో సెట్స్ కెళతాయని అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి మాత్రం ఖాయంగా సంక్రాంతి రేస్ లో నిలుస్తుందని ఊహాగానాలు సాగుతున్నాయి.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న `సైరా- నరసింహారెడ్డి` స్పెషల్ కేస్. ఈ సినిమా భారీ విజువల్ గ్రాఫిక్స్ తో ఇండియన్ సినిమా హిస్టరీలో తలమానికంగా తీర్చిదిద్దాలన్న పంతం కొణిదెల ప్రొడక్షన్స్ కాంపౌండ్ లో కనిపిస్తోంది. అందుకోసం సుమారు 200 కోట్లు ఖర్చు చేస్తున్నారని ప్రచారమవుతోంది. ఇతర సినిమాలతో పోలిస్తే విజువల్ గ్రాఫిక్స్ పరంగా ఏమాత్రం రాజీకి రాకుండా తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సమ్మర్ లేదా ఆగస్టులో రిలీజవుతుందంటూ ప్రచారం సాగింది. మరోవైపు 2020 సంక్రాంతి బరిలోనే రిలీజవుతుందన్న ప్రచారం అభిమానుల్లో సాగుతోంది. ఒకవేళ సంక్రాంతినే ఖాయం చేసుకుంటే మెగా ఫైట్ తప్పనిసరి అయినట్టేనని భావిస్తున్నారు. సంక్రాంతి అంటే ఇతరత్రా చిన్నా చితకా హీరోల సినిమాలు రిలీజ్ లకు ప్లాన్ చేసే ఆస్కారం ఉంది. అనూహ్యంగా అప్పటికప్పుడే పెద్ద స్టార్ల సినిమాలు సంక్రాంతి సెలవుల్ని టార్గెట్ చేసేందుకు ఛాన్సుందని విశ్లేషించవచ్చు.