పాన్ ఇండియా స్టార్ ప్రస్థానానికి 20 ఏళ్లు

Tue Jun 28 2022 17:30:49 GMT+0530 (IST)

20 Years For Prabhas Movie Career

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నట ప్రస్థానానికి 20 ఏళ్లు. 2002 జూలై 28న రామానాయుడు స్టూడియోస్ సాక్షిగా రెబల్ స్టార్ కృష్ణంరాజు ..ప్రభాస్ పై క్లాప్ కొట్టి ఆయన నట ప్రస్థానానికి నాంది పలికారు. ప్రభాస్ హీరోగా పరిచయమైన చిత్రం `ఈశ్వర్`. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో నటుడు అశోక్ కుమార్ ఈ మూవీని నిర్మించారు. శ్రీదేవి విజయ్ కుమార్ ఇదే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. కృష్ణంరాజు నటవారసుడి సినిమాగా భారీ అంచనాల మధ్య ఈ మూవీ 2002 నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మాస్ స్టార్ గా ప్రభాస్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది.అయితే ఈ మూవీ కోసం ప్రభాస్ తొలిసారి మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చింది 2002 జూలై 28. అంటే మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నట ప్రస్తానాన్ని ప్రారంభించి సరిగ్గా ఈ మంగళవారంతో ఇరవై ఏళ్లు పూర్తవుతున్నాయన్నమాట. ఈ సినిమాతో హీరోగా పరిచయమైన ప్రభాస్ అంచెలంచెలుగా ఎదిగి `బాహుబలి` సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా భారీ క్రేజ్ ని ఫేమ్ ని సొంతం చేసుకున్నారు. కోట్లాది మంది హృదయాల్లో డార్లింగ్ గా మారిపోయారు.  

ఈ సందర్భంగా ఆయన పెదనాన్న కృష్ణం రాజు కేక్ కట్ చేసి ఈ సందర్భాన్ని `ఈశ్వర్` మూవీ నిర్మాత అశోక్ కుమార్ డైరెక్టర్ జయంత్ సి. పరాన్జీలతో కలిసి ఆయన నివాసంలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ` ప్రభాస్ హీరోగా పరిచయమై అప్పుడే 20 ఏళ్లు గడిచిపోయాయా అన్న సందేహం కలుగుతోంది. నిజంగా ఆ రోజు ప్రభాస్ ని హీరోగా పరిచయం చేయాలని ముందు మేమే అనుకున్నాం. మా గోపీకృష్ణా బ్యానర్ లో ప్రభాస్ ని పరిచయం చేయాలని అనుకుంటుండగా ఒక రోజు నిర్మాత అశోక్ కుమార్ దర్శకుడు జయంత్ వచ్చి ప్రభాస్ ని పరిచయం చేసే అవకాశం ఇవ్వమని అడిగారు.

`ఈశ్వర్` కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. మంచి మాస్ ఎలిమెంట్స్ వున్న కథ తప్పకుండా అందరికి నచ్చుతుందన్న నమ్మకంతో అశోక్ కుమార్ కు ఓకే చెప్పాము. జయంత్ అశోక్ ఇద్దరు కలిసి ఎంతో బాధ్యతగా తీసిన ఆ సినిమా మంచి విజయాన్ని సాధించి ప్రభాస్ ని హీరోగా నిలబెట్టింది. పైగా ఆ సినిమాలో అశోక్ కుమార్ చెడ్డ తండ్రి పాత్రలో నటించడం గొప్ప విషయం. ఒక నిర్మాత అయి వుండి ఆ సినిమాలో విలన్ గా నటించడం అంటే ఆయన గట్స్ కు హ్యాట్సాఫ్.

సినిమా చూశాక ప్రభాస్ పెద్ద హీరో అవుతాడని అనుకున్నాం కానీ ఎవరు ఊహించని విధంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడంటే అతని శ్రమ పట్టుదలే.. ముఖ్యంగా మా అభిమానుల అండదండలు ఉన్నాయి. ప్రభాస్ ని చూస్తే చాలా ఆనందంగా వుంది. ఒక నటుడిగానే కాకుండా సాటి వారి పట్ల సహయం చేసె గొప్ప గుణం ఉంది. ప్రభాస్ ఇంకా ఇలాగే మరింత ఎత్తుకు ఎదగాలని మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను` అన్నారు.