నితిన్ సినీ ప్రయాణానికి 19 ఏళ్ళు..!

Mon Jun 14 2021 12:46:53 GMT+0530 (IST)

19 years for Nitin Cine journey ..!

'జయం' సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన యూత్ స్టార్ నితిన్.. నేటితో 19 ఏళ్ళ సినీ కెరీర్ పూర్తి చేసుకున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ తేజ చేతులు మీదుగా లాంచ్ చేయబడిన నితిన్.. ఫస్ట్ సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. ఫిలిం ఫేర్ అవార్డ్ సాధించాడు. ఆ తర్వాత 'దిల్' సినిమాతో యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరైన యువ హీరో.. 'సై' సినిమాతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు.అయితే ఆ తర్వాత నితిన్ సినీ కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదు. అప్పటి వరకు ఉన్న హిట్స్ తో జోష్ లో ఉన్న హీరోకి.. వరుసగా అరడజను ప్లాపులు పలకరించాయి. అయినా నిరాశ చెందకుండా పడిలేచిన కెరటం మాదిరిగా మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చాడు. 'ఇష్క్' సినిమాతో ట్రాక్ లోకి వచ్చిన నితిన్.. 'గుండెజారి గల్లంతయ్యిందే' 'హార్ట్ అటాక్' 'అ ఆ' వంటి సూపర్ హిట్స్ అందుకున్నాడు.

హిట్టు ప్లాపులను పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తున్న నితిన్.. 'భీష్మ' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవల 'రంగ్ దే' అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను మెప్పించాడు. 19 ఏళ్ళ సినీ కెరీర్లో 29 సినిమాల్లో హీరోగా నటించిన నితిన్.. కె.రాఘవేంద్రరావు - రాజమౌళి - పూరీ జగన్నాథ్ - కృష్ణవంశీ - రామ్ గోపాల్ వర్మ - వీవీ వినాయక్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ - విక్రమ్ కె. కుమార్ వంటి అగ్ర దర్శకులతో కలిసి వర్క్ చేశాడు.

ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తన మైలురాయి 30వ సినిమా 'మాస్ట్రో' లో నటిస్తున్నాడు. సినిమా సినిమాకి మార్కెట్ విస్తరించుకుంటూ వెళ్తున్న యంగ్ హీరో.. డబ్బింగ్ సినిమాలతో ఉత్తరాది ప్రేక్షకులను కూడా పలకరించాడు. నితిన్ 19 ఏళ్ళ సినీ కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా యూత్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెలబ్రేషన్స్ చేస్తున్నారు. నితిన్ కామన్ డీపీతో పాటుగా #19YearsForNITHIINinTFI అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా నితిన్ కూడా తన ఫస్ట్ చిత్రాన్ని గుర్తు చేసుకున్నాడు. ''జయం సినిమా ఈ రోజుతో 19 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం నా సినీ ప్రయాణంలో ఎప్పుడూ మరపురాని జ్ఞాపకంగా ఉంటుంది. నా అభిమానులు చూపిస్తున్న ప్రేమ మద్దతు ఎనలేనిది. నన్ను నమ్మినందుకు వారందరికీ పెద్ద కృతజ్ఞతలు. నా దర్శకుడు తేజ సార్ కు ఎప్పటికీ రుణపడి ఉంటాను'' అని నితిన్ ట్వీట్ చేశారు. యూత్ స్టార్ మునుముందు మరిన్ని మంచి చిత్రాలను సినీ ప్రేక్షకులకు అందించి సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగించాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.