'ఆర్య' మూవీకి 17ఏళ్లు.. స్టైలిష్ స్టార్ ఎమోషనల్ పోస్ట్!

Fri May 07 2021 15:04:12 GMT+0530 (IST)

17 years to 'Arya' movie .. Stylish star emotional post!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. కెరీర్లో మొదటి మైలురాయిగా నిలిచిన సినిమా ఆర్య. అల్లు అర్జున్ హీరోగా గంగోత్రి సినిమాతో అరంగేట్రం చేసినప్పటికి నేమ్ అండ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది మాత్రం ఆర్య సినిమానే. 2004 మే 7న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయం సాధించింది. అలాగే ఈ సినిమాతోనే అల్లు అర్జున్ స్టార్డం అందుకొని తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి సినిమా ఇది. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అను మెహతా హీరోయిన్ గా పరిచయమైంది. అలాగే యాక్టర్స్ శివబాలాజీ సుబ్బరాజు లాంటి వారికీ కూడా మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఇదే.అయితే డైరెక్టర్ సుకుమార్ డెబ్యూ మూవీగా 'ఫీల్ మై లవ్' అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీగా యువతకు బాగా కనెక్ట్ అయింది. అలాగే ఆ సమయంలో విడుదలైన లవ్ స్టోరీలలో ఆర్య అనేది ఓ ట్రెండ్ సెట్టర్ లా మారింది. దీనికి కారణం డైరెక్టర్ హీరో హీరోయిన్ మాత్రమే కాదు. సంగీతం కూడా. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా మొదటగా మ్యూజికల్ హిట్. ఆ తర్వాతే సినిమా బ్లాక్ బస్టర్. అయితే ఇదే కాంబినేషన్ లో మళ్లీ ఆర్య-2 సినిమా వచ్చింది. మ్యూజికల్ గా హిట్ అయింది కానీ సినిమా ఫ్యాన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సుకుమార్ - అల్లు అర్జున్ - దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో పుష్ప సినిమా రూపొందుతుంది. పాన్ ఇండియా మూవీగా పుష్ప ఐదు భాషల్లో రిలీజ్ కాబోతుంది.

అయితే నేటికీ ఆర్య సినిమా విడుదలై 17ఏళ్లు పూర్తవడంతో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఆర్య సినిమా విడుదలై నేటికి పదిహేడేళ్లయింది. ఈ సినిమా నా జీవితంలో ఓ మిరాకిల్. అలాగే నా జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా కూడా ఇదే. ప్రేక్షకులు నన్ను అభిమానించడం ఈ సినిమాతోనే మొదలైంది." అంటూ బన్నీ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అలాగే ఈ సినిమా నిర్మాతగా దిల్ రాజు - డిఓపి రత్నవేలు కెరీర్లో కూడా ముఖ్యపాత్ర పోషించింది. అయితే అల్లు అర్జున్ పోస్టుకు అటు డిఎస్పీ - రత్నవేలు కూడా స్పందించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.