Begin typing your search above and press return to search.

'అఖండ' కోసం 120 మంది సింగర్స్!

By:  Tupaki Desk   |   24 Nov 2021 3:55 AM GMT
అఖండ కోసం 120 మంది సింగర్స్!
X
నిజ జీవితంలో ఫైట్లు .. డాన్సులు ఉంటాయిగానీ పాటలు ఉండవు. జీవితంలో సంతోషం వచ్చినా .. దుఃఖం వచ్చినా అందుకు తగిన సాహిత్యాన్ని అల్లుకుని పాటలు పాడుకోవడం జరగదు. ఇలా మనం పాడుకోము గదా .. ఇది వాస్తవానికి చాలా దూరంగా ఉందని చెప్పేసి పాట నుంచి ప్రేక్షకులు దూరంగా వెళ్లరు. పాటకి ఉన్న ప్రత్యేకత అదే. పాట అనేది మనసుకు ఉల్లాసాన్ని .. ఉత్సాహాన్ని ఇస్తుంది. అరగంట పాటు డైలాగ్స్ పరంగా చెప్పవలసిన భావాన్ని 5 నిమిషాల్లో పాట చెప్పేస్తుంది .. అదే దాని గొప్పతనం.

ఒక సినిమా చూసిన తరువాత కథాకథనాలు ఎక్కువ రోజులు జనంతో ట్రావెల్ చేయవు. కానీ పాట మాత్రం వాళ్ల కూడానే తిరుగుతూ ఉంటుంది. అందువలన పాటలు లేని సినిమా చేయడం ఒక ప్రయోగం క్రిందనే చెప్పుకోవాలి .. ఒక సాహసంగానే ఒప్పుకోవాలి.

ఇళయరాజా పాటల్లో కోరస్ ఎక్కువగా కనిపిస్తూ ఉండేది. అందువలన ఆయన ఎక్కువమందితో పాడించేవారు .. అది పాటకి కొత్త అందాన్ని తీసుకొచ్చేది. ఇప్పుడు ఆ తరహా పాటలు పెద్దగా రావడం లేదు. ఒక డ్యూయెట్ ఉంటే మేల్ .. ఫీమేల్ సింగర్లు పాడేసి వెళ్లిపోతున్నారు.

ఇక ఈ మధ్య ఒక్కో పాటను ఒక్కొక్కరితో పాడిస్తున్నారు గనుక, 5 పాటలుంటే 10 మంది పాడేసి వెళ్లిపోతున్నారు. అలాంటిది 'అఖండ' సినిమా కోసం 120 మంది సింగర్స్ పాడారని చెప్పి తమన్ షాక్ ఇచ్చాడు. అలా అని చెప్పేసి ఈ సినిమాలో ఓ పది పాటలు ఉన్నాయనుకుంటే పొరపాటే.

ఈ సినిమాలో ఉన్నది కేవలం నాలుగు పాటలే. పాప్యులర్ సింగర్స్ ముగ్గురు నలుగురే పాడినా .. మిగతా సింగర్స్ అంతా కూడా కోరస్ పాడారనే అనుకోవాలి. ఎందుకంటే 'అఘోర' పాత్ర నేపథ్యంలో సాగే పాట కోసం అంతమంది అవసరమయ్యారని తమన్ చెప్పాడు.

అఘోర పాత్ర నేపథ్యంలో సాగే పాట ఎలా ఉండాలి? ఎలాంటి వాయిద్యాలు వాడాలి? ఎంతమందితో పాడించాలి? ఈ విషయాలపై బాగా కసరత్తు చేసిన తరువాతనే పాటలను రికార్డ్ చేశామని తమన్ చెప్పాడు. ఈ సినిమా కోసం దాదాపు ఐదారు వందలమంది మ్యుజిషీయన్స్ పనిచేశారని అన్నాడు.

120 మంది సింగర్స్ తో పాడించామని చెప్పాడు. పాటల విషయంలో ఎక్కడా రాజీ పడలేదనీ .. శివుడి మీద పాట కోసం శంకర్ మహదేవన్ ను తీసుకొచ్చామని అన్నాడు. ఈ ఒక్క పాట కోసమే నెల రోజులను కేటాయించవలసి వచ్చిందని చెప్పుకొచ్చాడు.ఇలాంటి సినిమా ఇంతవరకూ రాలేదంటూ, అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచాడు.