అర్జున్ నన్ను ఎన్నో సార్లు కాపాడాడు : ఖుష్బూ

Tue Oct 23 2018 18:38:11 GMT+0530 (IST)

బాలీవుడ్ లో మొదలైన మీటూ ఉద్యమం ప్రస్తుతం సౌత్ ను కూడా కుదిపేస్తున్న విషయం తెల్సిందే. సౌత్ లో స్టార్ హీరో అయిన అర్జున్ పై హీరోయిన్ శృతి హరిహరన్ లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ‘విష్మయ’ చిత్రం షూటింగ్ సందర్బంగా దర్శకుడు చెప్పకుండానే తన వీపున చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కన్నడ సినీ రంగంలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. అర్జున్ కు మద్దతుగా కొందరు నిలిస్తే మరి కొందరు మాత్రం అర్జున్ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనతో పలు చిత్రాల్లో నటించిన సీనియర్ హీరోయిన్ ఖుష్బూ స్పందించారు.తాజాగా ఆమె మాట్లాడుతూ.. అర్జున్ నాకు 35 ఏళ్లుగా తెలుసు. ఆయన ఎప్పుడు కూడా తప్పుగా ప్రవర్తించలేదు ఇతరులతో కూడా తప్పుగా ప్రవర్తించే వ్యక్తి కాదు. ఆయన నన్ను జనాల్లో ఉన్నప్పుడు ఎన్నో సార్లు కాపాడాడు. వందలాది మంది మద్యలో షూటింగ్ చేస్తున్న సమయంలో కొన్ని సార్లు జనాలు మీదకు రావడం జరుగుతుంది. ఆసమయంలో నన్ను అర్జున్ కాపాడారు. 20 ఏళ్లలో ఆయనతో ఎంతో మంది హీరోయిన్స్ వర్క్ చేశారు. కాని ఏ ఒక్కరు కూడా ఆయన గురించి తప్పుగా మాట్లాడలేదు. ఇప్పుడు ఆయనపై వస్తున్న ఆరోపణలపై తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దని ఆమె కోరారు.

అర్జున్ గురించి ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుందని తాను ఎప్పుడు అనుకోలేదని ఆయన ఒక మంచి వ్యక్తి అంటూ ఆయనపై వస్తున్న ఆరోపణలను ఆమె కొట్టి పారేసింది. మరో వైపు అర్జున్ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ ప్రకాష్ రాజ్ శ్రద్దా ఇంకా పలువురు డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నడుపుతున్నారు. మీటూ ఉద్యమంలో ఇప్పటి వరకు వచ్చిన అతి పెద్ద స్టార్ గా అర్జున్ నిలిచాడు. ఇప్పటి వరకు ఎంతో మంది పేర్లు బయటకు వచ్చినా కూడా అంతా సాదారణ సెలబ్రెటీలే. అర్జున్ మాత్రమే మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ హీరో అవ్వడంతో ఈ విషయమై సౌత్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.