చిత్రం : ‘పెళ్ళి సంద-డి’
నటీనటులు: రోషన్-శ్రీ లీల-ప్రకాష్
రాజ్-రావు రమేష్-వితిక-వెన్నెల కిషోర్-తనికెళ్ల భరణి-పోసాని
కృష్ణమురళి-షకలక శంకర్-ఝాన్సీ-రఘుబాబు తదితరులు
సంగీతం: కీరవాణి
ఛాయాగ్రహణం: సునీల్ కుమార్ నామా
మాటలు: శ్రీధర్ సీపాన
నిర్మాతలు: మాధవి కోవెలమూడి-శోభు యార్లగడ్డ-ప్రసాద్ దేవినేని
దర్శకత్వం: గౌరి రోణంకి
25
ఏళ్ల కిందట తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన దర్శకేంద్రుడి చిత్రం
‘పెళ్ళిసందడి’. ఇప్పుడు అదే పేరుతో ఓ సినిమా తెరకెక్కింది. పాత
‘పెళ్ళిసందడి’లో శ్రీకాంత్ హీరోగా నటిస్తే.. అతడి కొడుకు రోషన్ కొత్త
‘పెళ్ళిసంద-డి’లో కథానాయకుడి పాత్ర పోషించాడు. రాఘవేంద్రరావు దర్శకత్వ
పర్యవేక్షణలో గౌరి రోణంకి అనే కొత్త దర్శకురాలు రూపొందించిన ఈ చిత్రం దసరా
కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం
పదండి.
కథ:
బాస్కెట్ బాల్ ప్లేయరైన వశిష్ట (రోషన్) తనకు
నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉంటాడు. అతను తన
సోదరుడి పెళ్లి కోసం వెళ్లి అక్కడ సహస్ర (శ్రీ లీల)ను చూసి తొలి చూపులోనే
ప్రేమిస్తాడు. ఇద్దరి మధ్య గిల్లి కజ్జాల తర్వాత ప్రేమలో పడతారు. కానీ
అంతలోనే వారి మధ్య ఎడబాటు వస్తుంది. సహస్ర.. వశిష్టకు కనిపించకుండా
వెళ్లిపోతుంది. ఆమెను అతి కష్టం మీద వెతికి పట్టుకున్నప్పటికీ.. తండ్రికి
ఇచ్చిన మాట కోసం తనతో పెళ్లికి ససేమిరా అంటుంది. మరి సహస్ర తండ్రికి ఇచ్చిన
మాటేంటి.. ఆమెను తన దాన్ని చేసుకోవడానికి వశిష్ట ఏం చేశాడు అన్నది మిగతా
కథ.
కథనం-విశ్లేషణ:
శ్రీకాంత్ హీరోగా రాఘవేంద్రరావు
రూపొందించిన ‘పెళ్ళి సందడి’ విడుదలై పాతికేళ్లయిపోయింది. ఇప్పుడా సినిమా
చూస్తే కామెడీ వరకు కొంచెం అటు ఇటుగా అనిపించొచ్చు కానీ.. ఆ కథలోని
ఎమోషన్.. అందులోని రొమాన్స్.. పాటలు.. ఇప్పటి ప్రేక్షకులకు కూడా
ఎబ్బెట్టుగా అనిపించవు. ఇప్పుడు చూసినా కూడా ఔట్ డేట్ అనేమీ అనిపించని
సినిమా అది. కానీ ఇప్పుడు అదే పేరుతో వచ్చిన సినిమాను టైం మెషీన్లో
పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లి అప్పుడు రిలీజ్ చేస్తే.. ఇంత ఔట్ డేటెడ్
సినిమా తీశారంటి అంటూ అప్పటి ప్రేక్షకులు కూడా మూవీ మధ్యలోంచే థియేటర్ల
నుంచి బయటికి వెళ్లిపోతారేమో. సొంతంగా కోట్లు ఖర్చు పెట్టి.. స్వయంగా
దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ తాను తీసిన క్లాసిక్ ‘పెళ్ళిసందడి’ పేరును
చెడగొట్టడానికి దర్శకేంద్రుడకు ఎందుకు పూనుకున్నారో? రాఘవేంద్రరావు మాత్రమే
కాదు.. ‘బాహుబలి’ నిర్మాతలైన శోభు యార్లగడ్డ.. ప్రసాద్ దేవినేని.. ఇంకా ఈ
సినిమాలో భాగమైన అందరి అభిరుచిని ప్రశ్నార్థకం చేసే సినిమా ఇది.
మామూలుగా
సినిమాల్లో నాటకీయ ఎక్కువైతే డ్రామాలా ఉందని.. మరీ సాగతీతగా ఉంటే సీరియల్
మాదిరి ఉందని అంటుంటారు. ‘పెళ్ళి సందడి’ విషయంలో డ్రామా అనో.. సీరియల్ అనో
అంటే.. డ్రామాలను సీరియళ్లను అవమానించినట్లే అవుతుంది. ఎందుకంటే నాటకాల్లో
కూడా ఇంత అసహజమైన నాటకీయత ఉండదు. సీరియళ్లలో కూడా ఇంత సాగతీత.. సిల్లీ
సీన్లు ఉండవు. ఎంత పేలవమైన సినిమా అయినా సరే.. ఎంతో కొంత ‘మంచి’ అని
చెప్పుకోవడానికి ఉంటుంది. కానీ పాటల్ని పక్కన పెట్టేస్తే.. తొలి షాట్ నుంచి
చివరి షాట్ వరకు అర్థరహితంగా.. కృతకంగా.. కృత్రిమంగా.. అనిపించే అరుదైన
కళాఖండాల జాబితాలోకి ‘పెళ్ళిసంద-డి’ చేరుతుంది. రొమాన్స్.. కామెడీ..
సెంటిమెంట్.. ఇలా అన్ని రసాలూ కలుపుతున్నట్లు ‘పెళ్ళి సంద-డి’ టీం భావించి
ఉండొచ్చు కానీ.. రొమాన్స్ కాస్తా వెగటు పుట్టిస్తే.. కామెడీ ఏమో కన్నీళ్లు
పెట్టిస్తుంది.. సెంటిమెంట్ వెటకారంగా నవ్వుకునేలా చేస్తుంది. ఇలా మొత్తంగా
అన్ని రసాలూ ప్రేక్షకులకు ‘సినిమా’ చూపించడంలో తమ వంతు పాత్ర పోషించాయి.
పెళ్ళి
సంద-డి సినిమా ఎలా ఉండబోతోందో ఆరంభ సన్నివేశాలు చూస్తేనే అర్థమైపోతుంది.
పెళ్లి ఇంట్లో పెళ్లి కూతురుని మించి హడావుడి చేస్తూ కనిపించే అమ్మాయి..
హీరో ఫ్రెండుగా అక్కడ అడుగు పెట్టి కథానాయికతో గిల్లి కజ్జాలు ఆడే హీరో.. ఈ
సెటప్ చూడగానే ‘పెళ్ళి సంద-డి’ మనల్ని దశాబ్దాల వెనక్కి తీసుకువెళ్తోందని
తెలిసిపోతుంది. ఇక రాఘవేంద్రరావు ఎప్పుడో అరగదీసి వదిలేసిన టెంప్లేట్
రొమాన్స్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. హీరో ఎందుకు హీరోయిన్ని
ప్రేమిస్తాడో అర్థం కాదు. హీరోయిన్ ఎందుకు అతడి ప్రేమలో పడిపోతుందో
తెలియదు. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి సరైన కారణమే కనిపించదు. కానీ
తర్వాతేమో ఒకరంటే ఒకరికి ప్రాణం అనేసుకుంటారు. అప్పటిదాకా వీళ్ల రొమాన్సుని
భరించిన ప్రేక్షకులకేమో.. వెంటనే చక్కగా ఇద్దరికీ ఆ పెళ్లేదో జరిగిపోతే..
ఇంటర్వెల్ టైంకే శుభం కార్డు పడిపోయి విడుదల దొరుకుతుందనే ఆశ కలుగుతుంది.
కానీ హీరోయిన్ని హీరోకు దూరం చేసి పెద్ద ట్విస్ట్ ఇస్తారు.
‘ప్రథమార్ధం
బాగా లేదు’ అన్న మాట తప్పు అనిపించడమే లక్ష్యంగా ‘పెళ్లి సంద-డి’
ద్వితీయార్ధం సాగుతుంది. సెకండాఫ్ లో ఒక అరగంట నస తర్వాత హీరోకు హీరోయిన్
ఎందుకు దూరమైందనే సీక్రెట్ వెల్లడిస్తారు. హీరోయిన్ అక్క ఇంట్లోంచి
లేచిపోయి.. అక్కడ ప్రియుడి చేతిలో మోసపోయి తిరిగొస్తే తండ్రి ఇంట్లోకి
రానివ్వలేదని.. నేను తనలా ఎవరితోనూ వెళ్లిపోనని హీరోయిన్ మాట ఇచ్చి అక్కను
ఇంట్లోకి రప్పిస్తుందట. ఇక్కడ సెంటిమెంటు ధారలై ప్రవహించాక.. హీరో మీ అక్క
సమస్య నేను తీరుస్తా అంటూ.. ఆమె ప్రియుడి దగ్గరికెళ్లిపోయి రెండు
దెబ్బలేస్తాడు. అంతే.. అతడికి జ్ఞానోదయం అయిపోతుంది. అతడితో పాటు అందరూ
హీరో అంత గొప్పోడు ఇంత గొప్పోడు అంటూ పొగడ్తలే పొగడ్తలు. ఈ సన్నివేశాల వరుస
చూస్తే దీంతో పోలిస్తే ప్రథమార్ధం ఎంత బాగుంది కదా అనిపిస్తుంది.
ఇక
హీరో.. హీరోయిన్ తండ్రి మధ్య సవాళ్లు.. హీరోయిన్ని పెళ్లి చేసుకోవడానికి
ముందు అతడికి ఎదురయ్యే అడ్డంకులు.. ఈ ప్రహసనం అంతా చూస్తే 50 ఏళ్ల ముందు
అయినా ఇలాంటి సన్నివేశాలను ప్రేక్షకులు అంగీకరించేవారా అన్న సందేహం
కలుగుతుంది. పతాక సన్నివేశాల గురించి చర్చించడానికి ఏమీ లేదు. ప్రకాష్
రాజ్.. రావు రమేష్ లాంటి ఉద్ధండులు సెట్లో నటిస్తున్నపుడు ఇంత పేలవమైన
సీన్లు.. డైలాగులను ఓకే చేసి ఎలా నటించేశారు ఆ డైలాగులు పలికారు
అనిపిస్తుంది. ఓవైపు ‘బాహుబలి’ ‘ఆర్ఆర్ఆర్’ లాంటి చిత్రాలకు పని చేస్తున్న
కీరవాణి... నేపథ్య సంగీతం సమకూర్చేటపుడు సినిమా మొత్తం చూసి దీన్ని ఇలా
ఎలా వదిలిపెట్టేశారో అర్థం కాదు. ఊరూ పేరూ లేని వాళ్లు ఇలాంటి సినిమా
తీస్తే ఇంత బాధ పడాల్సిన పని లేదు కానీ.. ఎంతోమంది ప్రముఖులు.. ఉద్ధండులు
కలిసి చేసిన సినిమా ఇలా తయారుకావడం మాత్రం విచారించాల్సిన విషయమే.
నటీనటులు:
రోషన్
చూడ్డానికి బాగున్నాడు. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఈ సినిమాలో
పాత్ర.. నటన గురించి మాత్రం చెప్పడానికి ఏమీ లేదు. పాత్ర.. సన్నివేశాలు అంత
పేలవంగా ఉన్నపుడు.. రోషన్ ఇలా చేశాడేంటి అని అతణ్ని తప్పుబట్టలేం.
హీరోయిన్ శ్రీలీల అందంతో ఆకట్టుకుంది. తను కూడా నటించగలదని అర్థమవుతుంది.
కానీ ఆమె ప్రతిభను చాటే సన్నివేశాలేమీ లేవిందులో. ప్రకాష్ రాజ్.. రావు
రమేష్ లాంటి ఆర్టిస్టులతో ఇంత సిల్లీ పాత్రలు చేయించి.. వాళ్లతో ఆయా సీన్లు
ఎలా తీయగలిగారో అర్థం కాదు. వెన్నెల కిషోర్.. షకలక శంకర్.. రఘుబాబు
తదితరులు కామెడీ కోసం చాలా కష్టపడ్డారు. నవ్వులు పండలేదంటే వాళ్ల తప్పేమీ
లేదు. ఆర్టిస్టుల్లో ఎవరి పెర్ఫామెన్స్ గురించీ ప్రత్యేకంగా చెప్పే అవకాశమే
లేదు.
సాంకేతిక వర్గం:
మొత్తంగా సినిమాకు సంబంధించి కొంచెం
సానుకూలంగా మాట్లాడుకోగలిగేది సంగీత దర్శకుడు కీరవాణి గురించే. ఆయన
ఉన్నంతలో మంచి పాటలే అందించారు. మధురా నగరిలో.. ప్రేమంటే ఏంటి వినసొంపుగానే
అనిపిస్తాయి. మిగతా పాటలు కూడా ఓకే. కొంచెం ఓల్డ్ స్టయిల్లో ఉన్నా కూడా
పాటలు బాగున్నాయి. చిత్రీకరణ విషయంలో రాఘవేంద్రరావు స్టయిల్ ఫాలో అయ్యారు.
నేపథ్య సంగీతంలో మాత్రం కీరవాణి సినిమాకు తగ్గ ఔట్ పుటే ఇచ్చారు. సునీల్
కుమార్ నామా ఛాయాగ్రహణంలో కొత్తదనం ఏమీ లేదు. నిర్మాణ విలువ విషయంలో ఏమీ
ఢోకా లేదు. ఖర్చు బాగానే పెట్టారు.. ముఖ్యంగా పాటల కోసం. ‘‘నా పేరు
ఏడుకొండలండీ’’ అంటే.. ‘‘మిగతా ఆరు కొండలు ఎక్కడ’’ అని సమాధానం. ‘‘ఇది
పెళ్లి తంతురా’’ అంటే.. ‘‘అంటే అందరూ నన్ను కూర్చోబెట్టి తంతారా’’ అని
ప్రశ్న.. ఇలా సాగాయి శ్రీధర్ సీపాన సంభాషణలు. డైరెక్టర్ గౌరి రోణంకి
గురించి చెప్పడానికేమీ లేదు. సీరియళ్ల వాళ్లు కూడా మరీ ఇంత సాగతీతేంటి..
ఇంత పాత స్టయిలేంటి అని అభ్యంతరాలు వ్యక్తం చేసేలా ఉన్నాయి ఆమె ఆలోచనలు..
నరేషన్.
చివరగా: పెళ్ళి సంద-డి.. 140 నిమిషాల హింస!
రేటింగ్-1.5/5
Disclaimer
: This Review is An Opinion of One Person. Please Do Not Judge The
Movie Based On This Review And Watch Movie in Theater