ఏక్ మిని కథ

Thu May 27 2021 GMT+0530 (IST)

ఏక్ మిని కథ

చిత్రం  : ఏక్ మిని కథ

నటీనటులు: సంతోష్ శోభన్-కావ్య థాపర్-సుదర్శన్-బ్రహ్మాజీ-హర్షవర్ధన్-శ్రద్ధా దాస్-సప్తగిరి-పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
ఛాయాగ్రహణం: గోకుల్ భారతి
నిర్మాణం: యువి కాన్సెప్ట్స్
రచన: మేర్లపాక గాంధీ
దర్శకత్వం: కార్తీక్ రాపోలు

లాక్ డౌన్ వేళ నేరుగా ఓటీటీ రిలీజ్ బాట పట్టిన మరో కొత్త సినిమా ‘ఏక్ మిని కథ’. సంతోష్ శోభన్.. కావ్య థాపర్ జంటగా యువి కాన్సెప్ట్స్ నిర్మాణంలో ఒక బోల్డ్ కాన్సెప్ట్ తో కొత్త దర్శకుడు కార్తీక్ రాపోలు రూపొందించిన చిత్రమిది. అమేజాన్ ప్రైమ్ ద్వారా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: సంతోష్ (సంతోష్ శోభన్)కు చిన్నతనం నుంచి తన అంగం చిన్నది అనే బెంగ ఉంటుంది. పెరిగి పెద్దయ్యే కొద్దీ అతడికది పెద్ద సమస్యగా మారుతుంది. తన ఆలోచనలన్నీ ఎప్పుడూ దాని చుట్టూనే తిరుగుతుంటాయి. దాని వల్ల అనేక సమస్యలు కొని తెచ్చుకుంటుంటాడు. ఇలాంటి స్థితిలో అతడి పెళ్లి నిశ్చయం అవుతుంది. తాను సంసారానికి పనికి రానేమో అన్న సందేహాల నేపథ్యంలో పెళ్లి తప్పించుకోవడానికి సంతోష్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై.. అమృత (కావ్య థాపర్) అనే అమ్మాయి మెడలో తాళి కడతాడు. ఈ స్థితిలో అతడి సంసార జీవితం ఎలా సాగింది.. అతడి సమస్య పరిష్కారం అయిందా లేదా అన్నది సినిమా చూసే తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ: గత కొన్నేళ్లలో తెలుగు ప్రేక్షకుల అభిరుచి ఎంతో మారింది. మన సినిమాల తీరూ మారింది. ఎన్నో బోల్డ్ కాన్సెప్ట్స్ వచ్చాయి. ఇంతకుముందు సినిమాల్లో చర్చించడానికి భయపడ్డ అంశాల్ని ఓపెన్ గా డిస్కస్ చేయడం కొన్ని సినిమాల్లో చూశాం. అయినప్పటికీ కూడా ‘ఏక్ మిని కథ’లో చర్చించిన అంశం ఇంతకుముందు చూసిన బోల్డ్ కాన్సెప్ట్స్ తో పోలిస్తే ఎంతో సాహసోపేతమైంది. ఈ సినిమా టీజర్.. ట్రైలర్ల గురించి మీడియాలో రాసిన వాళ్లు కూడా అసలు కాన్సెప్ట్ గురించి రాయడానికి కొంచెం మొహమాటపడే పరిస్థితి తలెత్తిందంటే ఇదెంత బోల్డ్ కాన్సెప్టో అర్థం చేసుకోవచ్చు. కుర్రాళ్లే లక్ష్యంగా ఇలాంటి కాన్సెప్ట్ తీసుకుని మొత్తం బూతుతో నింపేసే సినిమా చేయడం వేరు. కానీ కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దీన్ని తీర్చిదిద్దాలనుకోవడం వేరు. రెండోది ఎంతో రిస్క్ తో కూడుకున్నది. ఆ మార్గాన్నే ‘ఏక్ మిని కథ’ ఎంచుకుంది. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా అభాసుపాలయ్యే ఈ కథాంశాన్ని ఉన్నంతలో పద్ధతిగా చెప్పే ప్రయత్నం చేయడం.. ఇదో బూతు సినిమా అనిపించకుండా ఆలోచింపజేసేలా తీర్చిదిద్దడం ‘ఏక్ మిని కథ’లో అభినందించదగ్గ విషయాలు. కాకపోతే బాలీవుడ్లో ‘విక్కీ డోనర్’ లాగా తెలుగులో ఒక ట్రెండ్ సెట్టర్ కాగల లక్షణాలున్నట్లుగా ఆశలు రేకెత్తించే ఈ సినిమా.. మధ్యలో గాడి తప్పి ఒక సగటు సినిమా స్థాయిలో మిగిలిపోవడమే కొంచెం నిరాశ కలిగించే విషయం.

‘విక్కీ డోనర్’తో పాటు హిందీలో ‘శుభ్ మంగళ్ సావధాన్’ పేరుతో రీమేక్ అయిన తమిళ చిత్రం ‘కళ్యాణ సమయల్ సాధమ్’ చిత్రాల్లాగే పూర్తిగా శృంగారం చుట్టూ తిరిగే కాన్సెప్ట్ ను ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా తీర్చిదిద్దే ప్రయత్నం ‘ఏక్ మిని కథ’లో జరిగింది. స్కూల్లో చదివే రోజుల నుంచే తన అంగం చిన్నదనే భావనతో ఆత్మన్యూనతకు లోనయ్యే కుర్రాడి కథను వల్గారిటీ లేకుండా చాలా సరదాగానే చర్చించారీ చిత్రంలో. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్.. ఎక్స్ ప్రెస్ రాజా సినిమాల్లో తన ‘ఫన్’ పవర్ చూపించిన దర్శకుడు మేర్లపాక గాంధీ రచయితగా మరోసారి తన బలాన్ని చూపించాడు. ఎక్కడా హద్దులు దాటకుండా ఈ బోల్డ్ కాన్సెప్ట్ నుంచి సునిశితమైన హాస్యాన్ని పండించడానికి చూశాడు. దర్శకుడు కార్తీక్ రాపోలు కూడా ఈ కాన్సెప్ట్ ను చక్కగా డీల్ చేశాడు. ‘ఏక్ మిని కథ’కు హైలైట్ హీరో సమస్య చుట్టూ ప్రథమార్ధంలో నడిపిన వినోదాత్మక సన్నివేశాలే. హీరో తన సమస్య గురించి లోలోన మథనపడిపోతూ.. దాని గురించి మిగతా వాళ్లకు చెప్పడానికి మొహమాట పడిపోయే సన్నివేశాలు.. చివరికి ఆసుపత్రుల్లో.. డాక్టర్ల దగ్గర కూడా కిందా మీదా అయిపోయే సీన్స్ మంచి వినోదాన్ని పంచుతాయి. హీరో పక్కకు కమెడియన్ సుదర్శన్ రాకతో ‘ఏక్ మిని కథ’ వినోదం మరో స్థాయికి చేరుతుంది. తన ‘సామర్థ్యం’ తెలుసుకోవడానికి వేశ్య దగ్గరికి వెళ్లడం.. ఆ తర్వాత ‘సైజ్’ పెంచుకోవడానికి సర్జరీని ఆశ్రయించడం.. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భలేగా పేలాయి.

ఇంటర్వెల్ వరకు ‘ఏక్ మిని కథ’లో కథనం పరుగులు పెడుతుంది. విచిత్రమైన పరిస్థితుల్లో హీరో పెళ్లి అయ్యే సన్నివేశం వరకు ఎక్కడా బోర్ కొట్టదు. ఆ మలుపు కూడా ఆకట్టుకుంటుంది. ఐతే తర్వాత మాత్రం చాలా సినిమాల్లో మాదిరే ‘ఏక్ మిని కథ’కు కూడా సెకండాఫ్ సిండ్రోమ్ ఇబ్బంది పెడుతుంది. పెళ్లి తర్వాత హీరో శోభనాన్ని తప్పించుకోవడం అనే ఏకైక లక్ష్యం చుట్టూ నడిపిన సన్నివేశాలు ఒక దశ దాటాక విసిగిస్తాయి. అప్పటిదాకా సహజంగా సాగిపోతున్న కథాకథనాలు.. ఇక్కడి నుంచి కొంత కృత్రిమత్వాన్ని సంతరించుకుంటాయి. రిసెప్షన్ ఎపిసోడ్ తో మొదలుపెడితే చాలా వరకు సన్నివేశాలు అనవసరంగా సాగదీసిన భావన కలుగుతుంది. కామెడీ కోసమని పెట్టిన సప్తగిరి పాత్రను సైతం ఇరికించినట్లే ఉంటుంది. ఇక శ్రద్ధా దాస్ పాత్ర.. ఆమె చుట్టూ నడిపిన సన్నివేశాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ద్వితీయార్ధంలో కథ ముందుకు కదలక ఒక దశ దాటాక ప్రేక్షకుల్లో అసహనం కలుగుతుంది. చివర్లో హీరో తప్పులు బయటపడి అతణ్ని అపార్థం చేసుకుని హీరోయిన్ వెళ్లిపోవడం.. హీరో తన సంశయాలన్నీ విడిచిపెట్టి సమస్యను పరిష్కరించుకోవడం.. ఇలా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లే ఈ సినిమా ముగుస్తుంది. చాలా సింపుల్ గా పరిష్కారం అయ్యే సమస్య గురించి హీరో అంతగా మథనపడిపోవడం కొంత ఇల్లాజికల్ గా అనిపించినప్పటికీ.. తనకు ఎదురైన వ్యక్తులు.. పరిస్థితుల దృష్ట్యా అతనలా ఉండటాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అది సినిమాలో పెద్ద సమస్య కాదు. ఐతే ద్వితీయార్ధంలో కొంచెం కొత్త సన్నివేశాలు రాసుకుని మొనాటనీ రాకుండా.. విసుగు తెప్పించకుండా ఉంటే ‘ఏక్ మిని కథ’ ఒక ప్రత్యేకమైన సినిమా అయ్యేది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగే తీర్చిదిద్దే ప్రయత్నం జరిగినప్పటికీ.. కాన్సెప్ట్ దృష్ట్యా కుటుంబమంతా కలిసి ఈ సినిమా చూడ్డం కొంచెం కష్టమే. కాకపోతే ఇది ఓటీటీ సినిమా కాబట్టి ఎవరికి వాళ్లు ఒకసారి సరదాగా చూసుకోవడానికి ఢోకా లేదు.

నటీనటులు: సంతోష్ శోభన్ లో మంచి నటుడున్నాడని అతను టీనేజీలో ఉండగా చేసిన తొలి చిత్రం ‘గోల్కొండ హైస్కూల్’ నుంచే చూస్తున్నాం. హీరోగా నటించిన సినిమాలు ఆడకున్నా వాటిలోనూ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ‘ఏక్ మిని కథ’తో తన సత్తా ఏంటో పూర్తిగా చూపించాడు సంతోష్. ఇలాంటి బోల్డ్ కాన్సెప్ట్ చేస్తే తనకెలాంటి ఇమేజ్ వస్తుందో అని భయపడకుండా ముందుకు వచ్చినందుకు ముందుగా అభినందించాలి. సంతోష్ పాత్రను ఒప్పుకోవడం.. కన్విన్సింగ్ గా ఆ పాత్రను పండించడం అంత తేలిక కాదు. సంతోష్ ఆద్యంతం ఈ విషయంలో ఆకట్టుకున్నాడు. అతడి హావభావాలు చాలా చోట్ల నవ్విస్తాయి. కొన్ని చోట్ల ఆశ్చర్యపరుస్తాయి. సినిమాకు సంతోష్ పెద్ద బలం అనడంలో సందేహం లేదు. హీరోయిన్ కావ్య థాపర్ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆమెకు నటన పరంగా పెద్దగా స్కోప్ లేదు. కమెడియన్ సుదర్శన్ కు కెరీర్లోనే బెస్ల్ రోల్ పడింది. హీరో తర్వాత అత్యధిక స్క్రీన్ టైం అతడికే ఉంది. ఈ అవకాశాన్ని అతను పూర్తిగా ఉపయోగించుకున్నాడు. ప్రతి సన్నివేశంలోనూ నవ్వించాడు. వ్యభిచారం చేస్తూ దొరికిపోయి ప్లంబర్ గా మారే సన్నివేశంలో అతడి నటన కడుపు చెక్కలు చేస్తుంది. బ్రహ్మాజీకి సైతం మంచి పాత్ర పడింది. ఆయన కూడా గిలిగింతలు పెడతాడు. పోసాని కాసేపే కనిపించినా తనదైన ముద్ర వేశాడు. సైకియాట్రిస్టుగా హర్షవర్ధన్ నటన కూడా ఆకట్టుకుంటుంది. సప్తగిరి హడావుడి చేశాడు కానీ.. పెద్దగా ఫలితం లేకపోయింది.

సాంకేతిక వర్గం: ప్రవీణ్ లక్కరాజు పాటలు.. నేపథ్య సంగీతం రెండూ ఆకట్టుకుంటాయి. హీరో సమస్య గురించి ఇంట్రో ఇవ్వాల్సి వచ్చినపుడల్లా వచ్చే సిగ్నేచర్ సౌండ్ హైలైట్ గా నిలుస్తుంది. సినిమాలో ఉన్న మూడు పాటలూ మరీ వినసొంపుగా లేవు కానీ కానీ.. కాన్సెప్ట్ బేస్డ్ గా సరదాగా సాగుతాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చక్కగా కుదిరింది. గోకుల్ భారతి ఛాయాగ్రహణం కూడా సినిమాకు ప్లస్ అయింది. యువి వాళ్ల స్థాయికి తగ్గట్లే నిర్మాణ విలువలున్నాయి. ప్రొడక్షన్ డిజైన్ పరంగా ఇది చిన్న సినిమాలా అనిపించదు. ఆద్యంతం క్వాలిటీ కనిపిస్తుంది. రచయిత మేర్లపాక గాంధీ మెరిశాడు. అలాంటి పేరున్న దర్శకుడు ఇలాంటి కాన్సెప్ట్ తో స్క్రిప్టు రాయడమే విశేషం. ఎక్కడా హద్దులు దాటకుండా కాన్సెప్ట్ చుట్టూ వినోదాన్ని పండించిన తీరు ఆకట్టుకుంటుంది. దర్శకుడు కార్తీక్ రాపోలు కొత్తవాడైనా తడబడలేదు. మంచి పనితనమే చూపించాడు. రచయిత.. దర్శకుడు ద్వితీయార్ధం మీద మరింత కసరత్తు చేసి ఉంటే.. ఇద్దరికీ ఇదొక ‘స్పెషల్’ మూవీ అయ్యేది. వారి గురించి పెద్ద చర్చ నడిచేది.

చివరగా: ఏక్ మిని కథ.. ‘మీడియం’ సైజ్ ఎంటర్టైనర్

రేటింగ్-2.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS