అనుకోని అతిథి

Fri May 28 2021 GMT+0530 (IST)

అనుకోని అతిథి

చిత్రం  : అనుకోని అతిథి

నటీనటులు: సాయిపల్లవి-ఫాహద్ ఫాజిల్-అతుల్ కులకర్ణి-రెంజి పనికర్-ప్రకాష్ రాజ్ తదితరులు
నేపథ్య సంగీతం: జిబ్రాన్
సంగీతం: జయహరి
ఛాయాగ్రహణం: అను మూతెడత్
స్క్రీన్ ప్లే: పి.ఎఫ్.మాథ్యూస్
నిర్మాతలు: అన్నంరెడ్డి కృష్ణకుమార్-గోవింద రవికుమార్
కథ-దర్శకత్వం: వివేక్

ఓటీటీల పుణ్యమా అని గత కొన్నేళ్లలో మలయాళ సినిమాల సత్తా ఏంటో ఇతర భాషల వాళ్లకూ బాగానే తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ మధ్య అక్కడి చిత్రాలను బాగా చూస్తున్నారు. తెలుగువారి ‘ఆహా’ మలయాళంలో మంచి మంచి చిత్రాలను అనువాదం చేసి తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలోనే మలయాళంలో విజయవంతమైన ‘అతిరన్’ చిత్రాన్ని ‘అనుకోని అతిథి’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ రోజే విడుదలైన ఈ చిత్ర విశేషాల్లోకి వెళ్దాం పదండి.

కథ:

జనజీవనానికి దూరంగా.. అడవి మధ్యలో ఒక భారీ భవంతి. దాని పరిధిలో 500 ఎకరాల వ్యవసాయ క్షేత్రం. డాక్టర్ బెంజమిన్ (అతుల్ కులకర్ణి).. ఈ భవంతిలో మానసిక సమస్యలతో బాధ పడుతున్న రోగులకు చికిత్స అందిస్తూ ఇక్కడ వ్యవస్థ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని ఉంటాడు. ఐతే ఈ ఆసుపత్రిలో ఏదో తప్పు జరుగుతోందన్న ఉద్దేశంతో ప్రభుత్వం నియమించిన వైద్యుడైన కిషోర్ నందా (ఫాహద్ ఫాజిల్) తనిఖీకి వస్తాడు. అతను రాగానే బెంజమిన్.. అతడి సహాయకుల్లో గుబులు మొదలవుతుంది. నందా నెమ్మదిగా ఆసుపత్రి రహస్యాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే తీవ్రమైన మానసిక సమస్యతో బాధ పడుతూ ఒంటరిగా ఒక గదిలో బందీ అయిన నిత్య (సాయిపల్లవి) మీద దృష్టిసారిస్తాడు. ఆమెను అలా బంధించడం వెనుక చాలా కథ ఉందని తెలుస్తుంది. ఆ కథ కథేంటి.. దాన్ని తెలుసుకున్నాక నందా ఏం చేశాడు.. అతను నిత్యను బయటికి తీసుకురాగలిగాడా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఒకవైపు సాయిపల్లవి.. మరోవైపు ఫాహద్ ఫాజిల్.. ఇంకోవైపు అతుల్ కులకర్ణి.. ఇలాంటి గ్రేట్ పెర్ఫామర్ల నుంచి కొత్తగా చెప్పేదేముంది? వీళ్ల ప్రతిభను చాటడానికి తగ్గట్లు వైవిధ్యం ఉన్న పాత్రలు.. మలుపులు-సస్పెన్స్ ఉన్న వైవిధ్యమైన కథ.. సాంకేతిక నిపుణుల అద్భుత పనితనం.. ఒక సైకలాజికల్ థ్రిల్లర్ పండటానికి ఇంతకంటే మంచి సెటప్ ఇంకేం కావాలి? కథ.. నటన.. సాంకేతిక హంగులు.. ఇలాంటి ముఖ్య విషయాల్లో ‘అనుకోని అతిథి’ టాప్ క్లాస్ అనిపిస్తుంది. ఐతే 2 గంటల 13 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో కథనం మాత్రం అనుకున్నంత ఆసక్తికరంగా సాగదు.  నటీనటులు మనల్ని ఎంగేజ్ చేసినా.. అక్కడక్కడా కొన్ని ఆసక్తికర సన్నివేశాలు ఉన్నా.. చివర్లో వచ్చే మలుపులు ఆకట్టుకున్నా.. ఇంకా ఏదో ఉండాల్సిందని.. ఈ టైపు సైకలాజికల్ థ్రిల్లర్లలో ఉండాల్సిన ‘షాక్’ ఫ్యాక్టర్ మిస్ అయిందని అనిపిస్తుంది. ట్రైలర్ చూసినపుడు కలిగిన అంచనాలతో పోలిస్తే సినిమా అంత ఉత్కంఠ రేకెత్తించదు. అలా అని ఇది తీసిపడేయదగ్గ సినిమా కాదు. ఈ జానర్ ను ఇష్టపడేవాళ్లకు ఓ మోస్తరు వినోదాన్ని పంచడంలో ‘అనుకోని అతిథి’ విజయవంతం అయింది.

‘అనుకోని అతిథి’ కొంచెం హార్రర్ టచ్ ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్. ఈ కథలో కొన్ని ఆసక్తికర మలుపులున్నాయి. స్క్రీన్ ప్లే కూడా కొత్తగానే చేసుకున్నారు. కాకపోతే కథ ఆరంభమైనపుడు ఇచ్చే బిల్డప్ చూసి ఎంతో ఉత్కంఠను.. సంచలన అంశాలను ఊహించుకుంటాం. ముఖ్యంగా సాయిపల్లవి పాత్రకు సంబంధించి ట్రైలర్లో చూపించిన విజువల్స్ చూస్తే ఎంతో ఆశిస్తాం. ఐతే ఆటిజంతో బాధ పడే పాత్రలో సాయిపల్లవి అద్భుతంగా నటించినప్పటికీ.. ఆ పాత్రను సరిగా తీర్చిదిద్దకపోవడం నిరాశ కలిగిస్తుంది. ఆమెకు కథలో దక్కిన ప్రాధాన్యం కూడా తక్కువే. ముఖ్యంగా కథ టైటిల్స్ కంటే ముందు నాలుగు హత్యలు చూపించి..ఆ తర్వాత ఆ నాలుగు హత్యలు చేసిన సైకోగా సాయిపల్లవిని పరిచయం చేసేసరికి.. ఉత్కంఠ రేగుతుంది. ఆ పాత్ర తాలూకు రహస్యం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తాం. ఐతే తన పాత్ర తాలూకు ఫ్లాష్ బ్యాక్ చూశాక ఉస్సూరుమంటాం. ఇంత బిల్డప్ ఇచ్చింది దీనికా అన్నట్లుగా సాగి మామూలుగా సాగుతుంది ఫ్లాష్ బ్యాక్. ఐతే హత్యలకు సంబంధించి అసలు రహస్యాన్ని ముందే చెప్పేయకుండా స్క్రీన్ ప్లే టెక్నిక్ ను దర్శకుడు బాగానే ప్లే చేశాడు. దీని వల్ల ద్వితీయార్ధంలోనూ ఉత్కంఠ కొనసాగుతుంది.

సాయిపల్లవి అనే కాదు.. సినిమాలో చాలా పాత్రలకు ఆరంభంలో ఇచ్చే బిల్డప్ కు తగ్గట్లు తర్వాత ఎలివేషన్ లేదు. వాటి ముగింపు కూడా ఆకట్టుకోదు. ఆరంభంలో ప్రతి పాత్రా అనుమానాస్పదంగా కనిపిస్తూ ఆసుపత్రిలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే కుతూహలాన్ని రేకెత్తిస్తాయి. కానీ ఒక్క ఫాహద్ పాత్ర మినహాయిస్తే అన్నీ కూడా తర్వాత తేలిపోతాయి. లాజిక్కుల్లేని పాత్రలు.. సన్నివేశాలు.. నిరాశకు గురి చేస్తాయి. ఐతే కొన్ని మలుపులు.. సస్పెన్స్.. ప్రధాన పాత్రధారుల పెర్ఫామెన్స్ వల్ల ప్రేక్షకులు ఎంగేజ్ అవుతారు. ‘అనుకోని అతిథి’కి సంబంధించి హైలైట్ అంటే చివరి 15 నిమిషాలే. ఇలాంటి థ్రిల్లర్స్ కు బాగా అలవాటు పడ్డవాళ్లు ఆ పాత్ర తాలూకు రహస్యాన్ని పసిగట్టేయొచ్చు. అయినా కూడా థ్రిల్ అయ్యేలా పతాక సన్నివేశాలను నడిపించాడు దర్శకుడు. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సైకలాజికల్ థ్రిల్లర్లో కొన్ని లోపాలున్నప్పటికీ.. వైవిధ్యమైన కథ.. సాంకేతిక హంగులు.. నటీనటుల అభినయం.. కొన్ని థ్రిల్లింగ్ సన్నివేశాలతో ఒ మోస్తరుగా ఎంగేజ్ చేస్తుంది. థ్రిల్లర్ ప్రియులు మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి చూడటానికి ఓకే అనిపించే చిత్రం ‘అనుకోని అతిథి’.

నటీనటులు:

సాయిపల్లవి నటన గురించి కొత్తగా చెప్పేదేముంది? ఏ పాత్ర ఇచ్చినా అద్భుతంగా చేసేస్తుంది. అందులోనూ ఆటిజం లక్షణాలకు తోడు కొంచెం సైకో లాగా కనిపించే నిత్య పాత్రలో  సాయిపల్లవి హావభావాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఆటిజం పేషెంట్లను బాగా పరిశీలించే ఆమె ఈ పాత్ర చేసిందని అర్థమవుతుంది. సన్నివేశాల్లో బలం తగ్గినా కూడా కేవలం సాయిపల్లవిని చూస్తూ ఎంగేజ్ అయిపోతాం చాలా చోట్ల. ఇక ఫాహద్ ఫాజిల్ కూడా బాగానే చేశాడు. కానీ ట్రాన్స్ కుంబలంగి నైట్స్ లాంటి సినిమాలు చూసిన వాళ్లకు ఇందులోని పాత్ర ఫాహద్ స్థాయికి తగ్గది అనిపించదు. డాక్టర్ బెంజమిన్ పాత్రలో అతుల్ కులకర్ణి మెప్పించాడు. కానీ క్యారెక్టర్ పరంగా దాన్నుంచి ఇంకా ఆశిస్తాం. ప్రకాష్ రాజ్ చివర్లో వచ్చి మెరిశాడు. సాయిపల్లవి తండ్రి పాత్రలో రెంజి పనికర్ ఓకే. మిగతా నటీనటులు వాళ్ల పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం:

 ‘అనుకోని అతిథి’కి సాంకేతికంగా అతి పెద్ద ఆకర్షణ జిబ్రాన్ నేపథ్య సంగీతం. ట్రైలర్ చూస్తేనే జిబ్రాన్ చెలరేగిపోయాడు అనిపిస్తుంది. ఇక సినిమాలో ఆద్యంతం జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల దృష్టిలో పడుతూనే ఉంటుంది. కొన్ని కీలక సన్నివేశాల్లో నేపథ్య సంగీతం వావ్ అనిపిస్తుంది. జయహరి పాటలు పర్వాలేదనిపిస్తాయి. సినిమాకు మరో పెద్ద ఆకర్షణ  అను మూతెడత్ విజువల్స్. హీరో పరిచయ సన్నివేశంలోనే కెమెరా పనితనం అబ్బురపరుస్తుంది. సినిమాలో విజువల్స్ ఎక్కువగా ఒక భవనంలోనే నడిచినప్పటికీ మొనాటనస్ అనిపించకుండా చూడటంలో కెమెరామన్ పనితనం కనిపిస్తుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఇక దర్శకుడు వివేక్ ఎంచుకున్న కథ వైవిధ్యమైందే అయినా.. స్క్రీన్ ప్లే అనుకున్నంత ఆసక్తికరంగా లేదు. దర్శకుడిగా అతడికి యావరేజ్ మార్కులు పడతాయి.

చివరగా: అనుకోని అతిథి.. సెటప్ బాగుంది కానీ!

రేటింగ్: 2.5/5

LATEST NEWS