ఉన్నది ఒకటే జిందగీ

Fri Oct 27 2017 GMT+0530 (India Standard Time)

ఉన్నది ఒకటే జిందగీ

చిత్రం :‘ఉన్నది ఒకటే జిందగీ’

నటీనటులు: రామ్ - అనుపమ పరమేశ్వరన్ - లావణ్య త్రిపాఠి - శ్రీవిష్ణు - ప్రియదర్శి - కిరీటి - ఆనంద్ - రాజ్ మాదిరాజు తదితరులు
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత: కృష్ణచైతన్య పోతినేని
రచన - దర్శకత్వం: కిషోర్ తిరుమల

వరుస ఫ్లాపుల్లో ఉన్న యువ కథానాయకుడు రామ్ కు గత ఏడాది మంచి విజయాన్నందించిన సినిమా ‘నేను శైలజ’. ఆ చిత్రాన్ని రూపొందించిన కిషోర్ తిరుమల.. మరోసారి రామ్ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’. చక్కటి ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ‘నేను శైలజ’ మ్యాజిక్ ను రామ్-కిషోర్ మరోసారి రిపీట్ చేశారో లేదో చూద్దాం పదండి.

కథ:

అభి (రామ్).. వాసు (శ్రీవిష్ణు) చిన్నప్పట్నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. తల్లిని కోల్పోయిన అభికి వాసునే సాంత్వన ఇస్తుంటాడు. ఇద్దరూ కలిసి చదువుకుని పెద్దవాళ్లయ్యాక వాసు రెండు నెలల ప్రాజెక్టు పనిలో భాగంగా ఢిల్లీకి వెళ్తాడు. ఆ సమయంలోనే అభికి మహాలక్ష్మి (అనుపమ పరమేశ్వరన్) పరిచయమవుతుంది. ఇద్దరూ ఒకరికొకరు దగ్గరవుతారు. ఇక అభి తన ప్రేమను మహాకు చెబుదామనుకునే సమయానికి వాసు తిరిగొస్తాడు. అప్పుడే మహా అతడి మావయ్య కూతురని.. అతను ఆమెను ఇష్టపడుతున్నాడని తెలుస్తుంది. మరి ఈ పరిస్థతుల్లో అభి ఏం చేశాడు.. తన స్నేహితుడికి తన ప్రేమ సంగతి చెప్పాడా.. ఈ విషయంలో వీళ్లిద్దరి స్నేహంలో ఏమైనా మార్పులొచ్చాయా.. ఇంతకీ మహా సంగతేంటి.. ఆమె ఎవరిని ఎంచుకుంది.. ఈ ముగ్గురి జీవితాలు తర్వాత ఏ మలుపు తిరిగాయి అన్నది తెరమీదే చూడాలి.

కథనం - విశ్లేషణ:

హీరో ఒకమ్మాయిని ప్రేమిస్తాడు.. హీరోయిన్ కూడా అతడిని ఇష్టపడ్డట్లే కనిపిస్తుంది.. అంతలో తన ఫ్రెండు కూడా అదే అమ్మాయిని ఇష్టపడుతున్నట్లు హీరోకు తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితి చాలా సినిమాల్లో చూసి ఉంటాం. సాధారణంగా ఏ సినిమాలో అయినా ఇలాంటి పరిస్థితి ఎదురైనపుడు హీరో తన ఫ్రెండుకి విషయం చెప్పకుండా దాచేస్తాడు. కానీ ‘ఉన్నది ఒకటే జిందగీ’లో దీనికి భిన్నమైన దృశ్యం చూస్తాం. నాటకీయతకు అవకాశం లేకుండా హీరో తన ఫ్రెండుకు అసలు విషయం చెబుతాడు. ఇద్దరూ కలిసి పక్కపక్కన కూర్చుని ఆ అమ్మాయికి ఒకేసారి ప్రపోజ్ చేస్తారు. ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా ఎంత సహజంగా.. ప్రాక్టికల్ గా సాగుతుందో.. ప్రేక్షకులకు ఎలాంటి ఫీలింగ్ కలిగిస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

ఈ సినిమాలో నాటకీయత లేదని కాదు.. కానీ ప్రతి అంశాన్నీ చాలా సహజంగా నిజాయితీగా చూపించిన విధానం ప్రత్యేకంగా అనిపిస్తుంది. సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువగా తీసుకోకుండా.. కమర్షియల్ హంగులు అద్దకుండా.. డ్రామాకు అతి తక్కువ చోటిస్తూ.. స్నేహం గురించి లోతుగా చర్చిస్తూ.. మన చుట్టూ జరిగే ఓ కథలా అనిపిస్తూ.. ప్రేక్షకులు తమను తాము తెర మీద చూసుకునేలా చేసిన అతి కొద్ది సినిమాల్లో ‘ఉన్నది ఒకటే జిందగీ’ ఒకటని చెప్పొచ్చు. కానీ నరేషన్ మరీ స్లో కావడం ఇందులో చెప్పుకోవాల్సిన అతి పెద్ద కంప్లైంట్. దర్శకుడు కిషోర్ తిరుమల కొంచెం వేగం అవసరమైన సన్నివేశాల్ని కూడా నెమ్మదిగానే నడిపించాడు. దీంతో చాలా చోట్ల  ప్రేక్షకుల సహనానికి పరీక్ష ఎదురవుతుంది. ఇదే సినిమాకు అతి పెద్ద ప్రతిబంధకం

తెలిసిన విషయాల్నే.. మన చుట్టూ జరిగే సంగతుల్నే.. తెరమీద అందంగా.. ఆహ్లాదంగా.. ఎమోషనల్ గా చెప్పడం అందరికీ సాధ్యమయ్యే  పని కాదు. ‘నేను శైలజ’లో ఆ నైపుణ్యాన్ని చూపించాడు కిషోర్ తిరుమల. ‘ఉన్నది ఒకటే జిందగీ’తో అతను మరోసారి స్క్రీన్ మీద తన మ్యాజిక్ చూపించాడు. ప్రేక్షకుల్లో ఎమోషన్.. ఫీల్ రావాలంటే నాటకీయతతో కూడిన.. అసహజమైన సన్నివేశాల మీదే ఆధారపడాల్సిన పని లేదని కిషోర్ మరోసారి రుజువు చేశాడు. పాత్రలు.. సన్నివేశాలు.. సంభాషణలు.. అన్నింటినీ సింపుల్ గా.. సహజంగా నడిపిస్తూనే మనసుకు బలంగా తాకేలా చేయడంలో కిషోర్ తన నైపుణ్యం చూపించాడు. ‘ఉన్నది ఒకటే జిందగీ’లో ప్రధాన పాత్రల చిత్రణ.. వాటి మధ్య బంధాన్ని ఎస్టాబ్లిష్ చేసిన తీరు బాగా మెప్పించే విషయం.

అనుపమ పరమేశ్వరన్ చేసిన మహా పాత్ర.. దాని చుట్టూ కథను నడిపించిన విధానం.. ఆమె పాత్రతో ముడిపడ్డ సన్నివేశాలు ‘ఉన్నది ఒకటే జిందగీ’కి ఆయువు పట్టు. చాలా వరకు సహజంగా సాగే ఈ సినిమాలో.. తన బెస్ట్ ఫ్రెండుకు మరదలయ్యే అమ్మాయిని హీరో ప్రేమించడం.. ఆ తర్వాత అసలు విషయం బయటపడటం.. ఈ కోయిన్సిడెన్స్ అసహజంగా అనిపిస్తాయి. ఐతే ఆ విషయం మీద ప్రేక్షకుడు అంతగా దృష్టిపెట్టనివ్వకుండా సాగిపోతుంది కథనం. అభి-మహా మధ్య పరిచయం.. ఇద్దరి మధ్య ప్రేమను ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాలు చాలా సరదాగా.. ఆహ్లాదంగా సాగిపోతాయి. ఈ ఎపిసోడ్ అంతా కూడా మంచి ఫీల్ ఉంటుంది. ‘రయ్యి రయ్యి మంటూ..’ అంటూ సాగే పాట సినిమాలో ఒకానొక హై పాయింట్. ఇది ‘నేను శైలజ’లో హ్యాపీ ఫీలింగ్ సాంగ్ స్థాయిలో ప్రేక్షకులకు కనెక్టవుతుంది.

ఇద్దరు స్నేహితులు కలిసి ఒకేసారి తమ ప్రేమను ఓ అమ్మాయికి చెప్పడం చాలా కొత్తగా అనిపించే విషయం. మూడు ప్రధాన పాత్రల చుట్టూ వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా సాగుతాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు ఎమోషనల్ గా కదిలిస్తాయి. విరామ సమయానికి ‘ఉన్నది ఒకటే జిందగీ’ ప్రేక్షకుల మనసుల్లోకి వెళ్తుంది. ఐతే ద్వితీయార్ధంలో ఊటీ నేపథ్యంలో సాగే ఎపిసోడ్ సాగతీతగా అనిపిస్తుంది. ఇక్కడ కథను నడిపించే బలమైన పాయింట్ ఏమీ లేదు. విడిపోయిన స్నేహితులు ఎలా కలుస్తారా అని ఎదురు చూడటం తప్ప పెద్దగా ఆసక్తేమీ ఉండదు. దీంతో సన్నివేశాలు కొత్తగా ఏమీ అనిపించవు. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ లాంటి సినిమాల్ని తలపిస్తాయి. అనుపమ పాత్ర స్థాయిలో లావణ్య క్యారెక్టర్ మీద దృష్టిపెట్టకపోవడంతో దాని చుట్టూ సాగే సన్నివేశాలు మామూలుగా అనిపిస్తాయి.

రామ్-శ్రీవిష్ణు మధ్య వచ్చే సీన్స్.. అక్కడక్కడా ప్రియదర్శి అండ్ గ్యాంగ్ పంచే వినోదం కొంచెం టైంపాస్ చేయించినప్పటికీ ద్వితీయార్ధం సాగతీతగానే అనిపిస్తుంది. ఐతే ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్ మళ్లీ సినిమాను పైకి లేపుతుంది. పతాక సన్నివేశం కొంచెం రొటీనే అయినా.. ఇక్కడ మరోసారి భావోద్వేగాల్ని బాగా పండించాడు కిషోర్. మంచి డైలాగులు కూడా పడ్డాయి క్లైమాక్సులో. ఓవరాల్ గా ‘ఉన్నది ఒకటే జిందగీ’ స్నేహం-ప్రేమ నేపథ్యంలో సాగే మంచి ఫీల్ ఉన్న సినిమా. మరీ నెమ్మదిగా సాగడమే ఇందులో చెప్పుకోవాల్సిన పెద్ద కంప్లైంట్.

నటీనటులు:

రామ్ ఒద్దికగా నటిస్తే ఎంత బాగుంటుందో చెప్పడానికి ‘ఉన్నది ఒకటే జిందగీ’ మరో రుజువు. మాస్ సినిమాల్లో అవసరానికి మించి చురుకుదనం.. ఉత్సాహం చూపించే రామ్.. ‘నేను శైలజ’ తరహాలోనే మరోసారి కుదురైన నటనతో.. హావభావాలతో ఆకట్టుకున్నాడు. నటుడిగా అతడి పరిణతి ఈ సినిమాలో చూడొచ్చు. తన ప్రేమ విఫలమై.. ఫ్రెండు లవ్ సక్సెస్ అయినపుడు సంఘర్షణకు లోనయ్యే సన్నివేశంలో.. తన స్నేహితుడికి దూరమై తప్పు చేశానన్న అపరాధ భావంతో బాధపడే సీన్లో రామ్ నటన ప్రత్యేకంగా అనిపిస్తుంది. సినిమా మొత్తంలో రామ్ ఎక్కడా ఒకప్పటి ‘అతి’ చూపించలేదు.

హీరోతో సమానంగా కీలక పాత్ర చేసిన శ్రీవిష్ణు కూడా చక్కగా నటించాడు. ఎమోషనల్ సీన్లలో అతను కూడా మెప్పించాడు. ఇక సినిమాలో అందరికంటే ఎక్కువ ఆశ్చర్యపరిచేది అనుపమ పరమేశ్వరన్. చాలా ముఖ్యమైన పాత్రలో అనుపమ మెచ్యూర్డ్ పెర్ఫామెన్స్ తో మెప్పించింది. గత సినిమాలతో పోలిస్తే ఆమె పాత్ర.. లుక్.. నటన అన్నీ కొత్తగా అనిపిస్తాయి. లావణ్య త్రిపాఠి పర్వాలేదు. ఆమె పాత్రకు ప్రాధాన్యం తక్కువే. అక్కడక్కడా కొంచెం గ్లామర్ షో చేసింది లావణ్య. ప్రియదర్శి తనదైన శైలిలో వినోదం పంచాడు. అతను కనిపించినపుడల్లా నవ్వులు పండాయి. కిరీటి కూడా బాగానే చేశాడు. మిగతా వాళ్లు మామూలే.

సాంకేతికవర్గం:

‘ఉన్నది ఒకటే జిందగీ’కి సాంకేతిక హంగులు బాగానే కుదిరాయి. దేవిశ్రీ ప్రసాద్ పాటలు.. నేపథ్య సంగీతం రెండూ సినిమాకు ఆకర్షణగా మారాయి. ప్రథమార్ధానికి ‘ట్రెండు మారినా’.. ‘రయ్యి రయ్యిమంటూ’ పాటలు ఆకర్షణ అయ్యాయి. ఐతే ద్వితీయార్ధంలో రయ్యి రయ్యి లాంటి పాట లేని లోటు కనిపిస్తుంది. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ‘స్రవంతి మూవీస్’ స్థాయికి తగ్గట్లే బాగున్నాయి. కిషోర్ తిరుమల రచయితగా ఎక్కువ మెప్పించాడు. రామ్.. శ్రీవిష్ణు.. అనుపమల పాత్రల్ని తీర్చిదిద్దడంలో.. వాటి చుట్టూ కథను నడిపించడంలో కిషోర్ ప్రత్యేకత కనిపిస్తుంది. అతడి మాటలు కూడా బాగున్నాయి. ‘‘ఒక వ్యక్తి నచ్చితే ఎంతిష్టమో చెప్పొచ్చు. ఎంతిష్టమో చెప్పలేనపుడు అది ప్రేమ అవుతుంది’’ లాంటి కొన్ని మాటలు గుర్తుండిపోతాయి. కానీ దర్శకుడిగా కిషోర్ కొంత నిరాశ పరిచాడు. కిషోర్ నరేషన్ స్టైల్ స్వతహాగానే కానీ.. కొన్ని చోట్ల సినిమా మరీ నెమ్మదించేసింది. అది అందరు ప్రేక్షకులకూ రుచించకపోవచ్చు. కిషోర్ కొంచెం వేగం చూపించి ఉంటే.. సినిమా మరో స్థాయిలో ఉండేదే.

చివరగా: ఉన్నది ఒకటే జిందగీ.. మనసును తాకుతుంది.. కానీ ‘నెమ్మదిగా’!

రేటింగ్-  2.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS