వివాహ భోజనంబు

Fri Aug 27 2021 GMT+0530 (IST)

వివాహ భోజనంబు

మూవీ రివ్యూ :  ‘వివాహ భోజనంబు’

నటీనటులు: సత్య-ఆర్జవీ-శ్రీకాంత్ అయ్యంగార్-సుదర్శన్-సందీప్ కిషన్-వైవా హర్ష-సుబ్బరాయ శర్మ-శివన్నారాయణ తదితరులు
సంగీతం: అనివీ
నేపథ్య సంగీతం: అచ్చు రాజమణి
ఛాయాగ్రహణం: మణికందన్
మాటలు: నందు ఆర్కే
కథ: భాను భోగవరపు
స్క్రీన్ ప్లే: భాను భోగవరపు-రామ్ అబ్బరాజు
నిర్మాతలు: శినీష్-సందీప్ కిషన్
దర్శకత్వం: రామ్ అబ్బరాజు

కరోనా మహమ్మారి సినీ పరిశ్రమను గట్టి దెబ్బ తీయగా.. దాని చుట్టూనే ఒక కథను అల్లి సినిమాగా తీసింది ఒక బృందం. ఆ చిత్రమే.. వివాహ భోజనంబు. కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో కొత్త దర్శకుడు రామ్ అబ్బరాజు రూపొందించిన చిత్రమిది. యువ కథానాయకుడు సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. సోనీ లివ్ ఓటీటీ ద్వారా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

మహేష్ పరమ పిసినారైన కుర్రాడు. పార్కింగ్ ఫీజు పది రూపాయలు కట్టాలని తనకు పనున్న చోటి నుంచి దూరంగా తీసుకెళ్లి బండి పార్క్ చేసి వచ్చే రకం అతను. చూడ్డానికి చాలా సాధారణంగా కనిపించడమే కాక ఆర్థికంగా కూడా అంత మంచి స్థితిలో లేని అతణ్ని ఓ పెద్దింటి అందమైన ప్రేమిస్తుంది. ఆమె తండ్రికి మహేష్ అంటే అస్సలు ఇష్టం లేకపోయినా.. కొన్ని కారణాల వల్ల పెళ్లికి ఓకే చెప్పాల్సి వస్తుంది. మహేష్ పెళ్లి చేసుకున్న సమయానికే కరోనా కారణంగా లాక్ డౌన్ మొదలై అమ్మాయి తరఫు బంధువులంతా అతడి ఇంట్లోనే తిష్ట వేస్తారు. వారి వల్ల మహేష్ పడ్డ ఇబ్బందులేంటి.. అతనంత పిసినారిగా ఉండటానికి కారణమేంటి.. చివరికి తనంటే ఇష్టం లేని అమ్మాయి తండ్రి.. మిగతా వాళ్ల మనసును మహేష్ ఎలా గెలిచాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

‘వివాహ భోజనంబు’ ట్రైలర్ చూడగానే కరోనా నేపథ్యంలో భలే కాన్సెప్ట్ తీసుకున్నారే.. ఇదొక హిలేరియస్ ఎంటర్టైనర్ లాగా ఉందే అన్న అభిప్రాయాలు కలిగాయి ప్రేక్షకులకు. నిజ జీవితంలో మనల్ని కష్టపెట్టే విషయాల్ని తెరపై నవ్వులు పంచడానికి ఫిలిం మేకర్స్ ఉపయోగించుకున్న సందర్భాలు బోలెడు. ఈ కోవలోనే కరోనా సమయంలో జనాలు పడ్డ కష్టాలు.. ఎదుర్కొన్న భిన్న అనుభవాల చుట్టూ అల్లుకున్న ‘వివాహ భోజనంబు’లో బేసిక్ ప్లాట్ ఆసక్తి రేకెత్తిస్తుంది. పరమ పిసినారి అయిన వ్యక్తి ఇంట్లో లాక్ డౌన్ కారణంగా బంధుగణం అంతా ఇరుక్కుపోతే అన్న ఆలోచనే హిలేరియస్ గా అనిపిస్తుంది. ట్రైలర్లో చూపించిన కొన్ని సన్నివేశాలు.. సత్య కామెడీ టైమింగ్ చూస్తే సినిమాలో కడుపు చెక్కలయ్యే కామెడీ ఉంటుందని ఆశలు పెట్టుకుంటాం. కానీ సినిమాలో ‘ది బెస్ట్’ అనిపించిన సీన్లనే ఎంచుకుని ట్రైలర్లో చూపించారని.. అంతకుమించిన విశేషాలు ఇందులో పెద్దగా లేవని ముందుకు సాగే కొద్దీ అర్థమవుతుంది. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడానికి తగ్గ ప్లాట్ తయారు చేసుకున్నా.. సత్య లాంటి అదిరిపోయే కామెడీ టైమింగ్ ఉన్న నటుడు దొరికినా.. సద్వినియోగం చేసుకునే కథనం కొరవడటం.. ముందుకు సాగే కొద్దీ రైటింగ్ తేలిపోవడంతో ‘వివాహ భోజనంబు’ రుచించని వంటకంలా తయారైంది. అక్కడక్కడా కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉన్నప్పటికీ.. ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు చాలా దూరంలో ఆగిపోయిందీ చిత్రం.

‘వివాహ భోజనంబు’కు అతి పెద్ద ఆకర్షణ ఈ చిత్రంతో హీరోగా మారిన కమెడియన్ సత్యనే. ఈ సినిమా చూస్తే సత్య కోసమే చూడాలి అన్నట్లుగా అతను అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చాడు. అతడి పాత్ర ఆగమనంతోనే ప్రేక్షకులు ‘వివాహ భోజనంబు’లో ఇన్వాల్వ్ అయిపోతారు. వాటే మ్యాన్.. అంటూ సాగే థీమ్ మ్యూజిక్ కూడా ఫన్నీగా ఉండి ఈ పాత్ర పట్ల ఆసక్తిని రేకెత్తిస్తుంది. సత్య లాంటి పర్సనాలిటీని ఓ అందమైన అమ్మాయి ప్రేమించడం.. అలాంటి అమ్మాయి ముందు మొహమాటం లేకుండా తన పిసినారితనాన్ని ప్రదర్శించడం.. ఈ కోవలో వచ్చే ఆరంభ సన్నివేశాలు సరదాగా అనిపిస్తాయి. సత్యను ఆ అమ్మాయి ఎందుకు ప్రేమించిందనే విషయాన్ని సస్పెన్సులా దాచి ఉంచి.. అతడి పెళ్లి.. తదనంతర పరిణామాల మీద ప్రథమార్ధంలో కథను నడిపించారు. లాక్ డౌన్ కారణంగా హీరోయిన్ ఫ్యామిలీ అంతా హీరో ఇంట్లో చిక్కుకునే సందర్భంలో కథ రసకందాయంలో పడ్డట్లే కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఒక హిలేరియస్ రైడ్ ఆశిస్తాం. కానీ తర్వాత వచ్చే సన్నివేశాలు అనుకున్నంత ఫన్నీగా ఉండవు. ఇంటర్వెల్ ముంగిట కరోనా పరీక్షల నేపథ్యంలో సాగే ఎపిసోడ్ ఓ మోస్తరుగా పేలింది. ఇక అంతటితో ‘వివాహ భోజనంబు’లో బెస్ట్ పార్ట్ అయిపోతుంది.

ద్వితీయార్ధంలో ‘వివాహ భోజనంబు’ ఎంత బలహీనంగా తయారైందంటే.. ఈ కథను ఎలా ముందుకు నడిపించాలో.. ఎలాంటి సన్నివేశాలు రాయాలో తెలియక.. కరోనా టైంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని ఇన్సిడెంట్స్ యాజిటీజ్ తీసుకొచ్చి ఇందులో పెట్టేశారు. కర్ఫ్యూ టైంలో పోలీసులు పట్టుకుంటే ఆశీర్వాద్ గోధుమ పిండి కోసం వెళ్లాననడం.. వాళ్ల చేతుల్లో దెబ్బలు తినొచ్చాక బయట పోలీసులున్నారా అని అడిగితే వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారనడం.. ఇలాంటి సన్నివేశాలు ఇందుకు ఉదాహరణ. ఇవే కాక కరోనా టైంలో జరిగిన అనేక పరిణామాలను సినిమాలో చూపించారు. వాటితో ప్రేక్షకులు బాగా రిలేట్ అవుతారని రచయిత-దర్శకుడు ఆశించి ఉండొచ్చు కానీ.. కొత్తగా సినిమాలో చూసి నవ్వుకోవడానికి వీటిలో ఏముందన్నది ప్రశ్న. హీరోను హీరోయిన్ ఎందుకు ప్రేమించిందో చూపించే ఫ్లాష్ బ్యాక్ ద్వితీయార్ధంలో మరో పెద్ద మైనస్. ఆ ఎపిసోడ్ మరీ సిల్లీగా అనిపిస్తుంది. ఇక కరోనా నేపథ్యాన్ని పక్కన పెట్టి చూస్తే ఈ కథలో ఏ కొత్తదనం కనిపించదు. తన భార్య బంధుగణాన్ని ఇంటి నుంచి పంపించేయడానికి హీరో చేసిన ప్రయత్నాలు చివరి వరకు బెడిసికొడుతూనే ఉంటాయని.. చివర్లో ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చి అతడి మీద తన మావయ్య అభిప్రాయాన్ని మారుస్తారని ముందే ప్రేక్షకులకు ఒక అంచనా వచ్చేస్తుంది. సుదర్శన్.. శివన్నారాయణల సహకారంతో సత్య వీలైనంత వరకు తన కామెడీ టైమింగ్ తో కొన్ని సన్నివేశాలను పండించినా.. ప్రేక్షకులు ఆశించే స్థాయిలో మాత్రం వినోదం లేకపోయింది. కథ ముందుకే కదలకుండా స్ట్రక్ అయిపోవడం.. రిపిటీటివ్ అనిపించే సన్నివేశాలు ద్వితీయార్ధాన్ని భారంగా మార్చేశాయి. సందీప్  కిషన్ పాత్రకు ఓ రేంజిలో బిల్డప్ ఇచ్చారు కానీ.. ఆ పాత్ర సైతం నిరాశకు గురి చేస్తుంది. భ్రమరా.. భ్రమరా అంటూ అతను చేసిన కామెడీ విసిగిస్తుంది. ముగింపులో కూడా పెద్దగా మెరుపుల్లేని ‘వివాహ భోజనంబు’.. మరీ సినిమా ఆకలితో ఉండే వాళ్లకు ఓకే కానీ.. మంచి కామెడీ విందు ఆశించే వాళ్లకు మాత్రం రుచించడం కష్టమే.

నటీనటులు:

ముందే అన్నట్లు సత్య ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. చిన్న చిన్న కామెడీ పాత్రల్లోనే అదరగొట్టేసే అతను.. హీరోగా ఫుల్ లెంగ్త్ రోల్ దొరికేసరికి చెలరేగిపోయాడు. సన్నివేశాల్లో బలం లేని చోట కూడా తన కామెడీ టైమింగ్ తో అతను అదరగొట్టేశాడు. పదే పదే తన మావయ్యకు దొరికిపోయే సన్నివేశాల్లో కవర్ చేస్తూ అతను ఇచ్చే హావభావాలు భలేగా అనిపిస్తాయి. నూటికి నూరు శాతం తన పాత్రకు అతను న్యాయం చేశాడు. తన కోసం ఓసారి సినిమా చూడొచ్చు అనిపించాడు సత్య. కామెడీ సీన్లలోనే కాక.. చివర్లో రెండు మూడు ఎమోషనల్ సీన్లలోనూ సత్య మెప్పించడం విశేషం. హీరోయిన్ ఆర్జవీ గురించి పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు. లుక్స్ పరంగా సాధారణంగా కనిపించే ఈ అమ్మాయి.. నటనలోనూ మెప్పించలేకపోయింది. శ్రీకాంత్ అయ్యంగార్ హీరోతో సమానమైన పాత్రలో ఓకే అనిపించాడు. కొన్ని సన్నివేశాల్లో ఆయన ‘అతి’ నటన చికాకు పెడుతుంది. సందీప్ కిషన్ తన వంతుగా బాగానే చేసినా అతడి పాత్ర అంతగా పండలేదు. సుదర్శన్ నెల్లూరు యాసతో మరోసారి ఆకట్టుకున్నాడు. అతను.. ‘అమృతం’ ఫేమ్ శివన్నారాయణ.. హీరో తర్వాత ఈ చిత్రంలో ఓ మోస్తరుగా నవ్వులు పంచారు. సుబ్బరాయశర్మ.. దివంగత టీఎన్ఆర్ బాగా చేశారు. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతిక వర్గం:

 టెక్నికల్ గా ‘వివాహ భోజనంబు’ సోసోగా అనిపిస్తుంది. అనివీ పాటల్లో ‘ఏబీసీడీ’ సాంగ్ ఒకటి పర్వాలేదు. అచ్చు రాజమణి నేపథ్య సంగీతంలో కొత్తదనం కనిపించదు. భలే భలే మగాడివోయ్.. ఏక్ మిని కథ లాంటి చిత్రాల స్టయిల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ లాగించేశాడు. మణికందన్ ఛాయాగ్రహణం ఓకే. ఉన్న పరిమితుల్లోనే విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఎక్కువగా ఒక ఇంట్లో నడిచే కథ కావడంతో పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కనిపించలేదు. రైటర్ భానుతో కలిసి రామ్ అబ్బరాజు వండిన కథలో కొన్ని విశేషాలున్నాయి. ఐతే కథను ఒక దశ దాటాక ముందుకు నడిపించడంలో ఇద్దరూ విఫలమయ్యారు. చాలా సాధారణమైన సన్నివేశాలతో నింపేశారు. ఈ కథలో కామెడీకి ఇంకా మంచి స్కోప్ ఉన్నప్పటికీ ఉపయోగించుకోలేదు. దర్శకుడిగా రామ్ అబ్బరాజుకు ఓ మోస్తరు మార్కులు పడతాయి.

చివరగా: వివాహ భోజనంబు.. రుచి తగ్గిన వంటకంబు

రేటింగ్-2.25/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in OTT

LATEST NEWS