మూవీ రివ్యూ : విరాటపర్వం
నటీనటులు: రానా దగ్గుబాటి-సాయిపల్లవి-ప్రియమణి-నందితా దాస్-నవీన్ చంద్ర-నివేథా పెతురాజ్-సాయిచంద్ తదితరులు
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఛాయాగ్రహణం: డాని సాంచెజ్-దివాకర్ మణి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
రచన-దర్శకత్వం: వేణు ఉడుగుల
ఎప్పుడో
చిత్రీకరణ పూర్తి చేసుకున్నప్పటికీ.. కొవిడ్ సహా రకరకాల కారణాల వల్ల
ఆలస్యంగా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘విరాటపర్వం’ చిత్రం. ‘నీదీ
నాదీ ఒకే కథ’తో అరంగేట్రంలోనే దర్శకుడిగా ఆకట్టుకున్న వేణు ఉడుగుల
రూపొందించిన ఈ చిత్రంలో రానా దగ్గుబాటి-సాయిపల్లవి ప్రధాన పాత్రలు
పోషించారు. ప్రోమోల్లో అన్ని రకాలుగా ఆకట్టుకున్న ఈ చిత్రం.. సినిమాగా ఏమేర
మెప్పించిందో చూద్దాం పదండి.
కథ:
వెన్నెల (సాయిపల్లవి) 70వ
దశకంలో వరంగల్ జిల్లాలో నక్సలైట్లు-పోలీసుల పోరుతో అట్టుడుకుతున్న సమయంలో
అక్కడి ఓ పల్లెటూరిలో పుడుతుంది. ఆమె పెరిగి పెద్దవుతున్న క్రమంలో.. జనం
కోసం నిలబడ్డ నక్సలైట్ నాయకుడు రవన్న (రానా దగ్గుబాటి) గురించి
తెలుసుకుని.. అతడి రచనలతో విపరీతంగా ప్రభావితం అయి తన పట్ల ప్రేమను
పెంచుకుంటుంది. తనను నేరుగా చూశాక మరింతగా ఆకర్షితురాలై తన కోసం ఊరు విడిచి
వచ్చేస్తుంది. తన జీవితంలో ప్రేమ-పెళ్లి లాంటి వాటికి అవకాశం లేదని బలంగా
నమ్మే రవన్న.. వెన్నెలను దూరం పెట్టాలని చూస్తాడు. కానీ వెన్నెల మాత్రం
వెనక్కి తగ్గదు. రవన్న కోసం ఆమె దళంలో సైతం చేరుతుంది. ఈ క్రమంలో ఎలాంటి
పరిణామాలు తలెత్తాయి. చివరికి వెన్నెల కథ ఏ కంచికి చేరింది అన్నది మిగతా
కథ.
కథనం-విశ్లేషణ:
ఫిలిం ఇండస్ట్రీలో మెజారిటీ
లెక్కలేసుకుని సినిమా తీసేవాళ్లే. ఇది కమర్షియల్ గా వర్కవుట్ అవుతుందా..?
అన్న ప్రశ్నతోనే ఒక సినిమాకు తొలి అడుగు పడుతుంది. సినిమా అనేది అంతిమంగా
ఒక వ్యాపారం కాబట్టి అలా ఆలోచించడంలో ఎంతమాత్రం తప్పు లేదు. కానీ కొంతమంది
మాత్రమే ఈ లెక్కలన్నీ పక్కన పెట్టి ఒక కథను కథగా చెప్పే ప్రయత్నం చేస్తారు.
కానీ అలాంటి వాళ్లకు మద్దతు దొరకడమే చాలా చాలా కష్టం. ఐతే కమర్షియల్
లెక్కల గురించి పట్టించుకోకుండా ‘నీదీ నాదీ ఒకే కథ’తో తాను అనుకున్న కథను
అనుకున్న విధంగా తెరకెక్కించి విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వేణు
ఈసారి ‘విరాటపర్వం’ రూపంలో ఇంకా పెద్ద సాహసమే చేశాడు. చాలామందికి పట్టని..
చరిత్ర లోతుల్లో కూరుకుపోయిన ఒక వాస్తవ గాథను రాజీ లేకుండా తెరపైకి తెచ్చే
ప్రయత్నం చేశాడు. ఈ కథకు కొంతమేర కమర్షియల్ హంగులు అద్దినప్పటికీ..
సాధ్యమైనంత మేర నిజాయితీగా చేసిన ప్రయత్నమిది. దీనికి నటీనటులు..
నిర్మాతలు.. టెక్నీషియన్ల నుంచి గొప్పగా సహకారం అంది.. ‘విరాటపర్వం’
తెలుగులో ఒక ప్రత్యేకమైన చిత్రంగా చెప్పుకునే స్థాయిలో నిలబడింది.
కమర్షియల్ కోణంలో చూస్తే.. ఇందులో వేగం లేదు.. వినోదం లేదు.. ప్రేక్షకులు
కోరుకునే ముగింపు లేదు.. ఇలాంటి మాటలు వినిపిస్తే వినిపించొచ్చు గాక.. కానీ
ఒక కథను నిజాయితీగా.. రాజీ లేకుండా చెప్పిన సినిమాగా ‘విరాటపర్వం’ తన
ప్రత్యేకతను చాటుకుంటుంది.
‘విరాటపర్వం’ ట్రైలర్ చూస్తేనే ఇది
ఎలాంటి సినిమానో అర్థమైపోయి ఉంటుంది. ఇందులో రెగ్యులర్ కమర్షియల్ సినిమాల
నుంచి కోరుకునే అంశాలేమీ లేవు. నక్సలిజం నేపథ్యంలో ఒక హార్డ్ హిట్టింగ్ లవ్
స్టోరీని చూడొచ్చిందులో. నక్సలిజం అన్నది నేపథ్యమే తప్ప అదే కథా వస్తువు
కాదు. ఎందుకంటే ఇది నక్సలైట్ నాయకుడైన హీరో కథ కాదు. అతణ్ని ప్రేమించే ఒక
మామూలు అమ్మాయి కథ. యుక్త వయసులో ఒక నక్సలైట్ నాయకుడి రచనలకు ప్రభావితం
అయితే.. చావైనా బతుకైనా అతడితోనే అనుకుని తన కోసం అన్నీ వదులుకుని ఎంత
దూరమైనా వెళ్లడానికి సిద్ధపడ్డ ఓ అమ్మాయి ప్రయాణాన్ని ‘విరాటపర్వం’లో
చూపించాడు దర్శకుడు వేణు ఉడుగుల. ‘విరాటపర్వం’ అని పేరు పెట్టి..
మహాభారతంలో పాండవుల కథకు నక్సలైట్ల కథకు ముడిపెట్టే ప్రయత్నం చేశాడు కానీ..
అదంతగా అతకలేదు. అసలు సినిమా టైటిల్ కు.. ఇందులోని కథకు పెద్దగా సంబంధం
లేదనే అనిపిస్తుంది. ఆరంభం నుంచి చివరి దాకా కథానాయిక కోణంలోనే ఈ కథ
నడుస్తుంది. ఆ పాత్రకు.. సాయిపల్లవి నటనకు కనెక్ట్ కావడం మీదే సినిమా
ఎంతమేర నచ్చుతుందన్నది ఆధారపడి ఉంది. వేణు ఉడుగుల ఆ పాత్రను ప్రేక్షకులకు
చేరువ చేయడంలో తన వంతుగా మంచి ప్రయత్నమే చేయగా.. సాయిపల్లవి కెరీర్లో ‘ది
బెస్ట్’ అనదగ్గ నటనతో ఆ పాత్రను నిలబెట్టే ప్రయత్నం చేసింది.
‘విరాటపర్వం’తో
ఉన్న సమస్యంతా.. కథ.. పాత్రలు చాలా వరకు ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా
ఉండడమే. నక్సలిజం మీద దశాబ్దాల నుంచి ఎన్నో సినిమాలు చూశాం. కాబట్టి
నక్సలైట్లకు.. పోలీసులకు జరిగే పోరు ఎలా ఉంటుందో మనకు తెలియంది కాదు.
కాబట్టి ఎంత కొత్తగా.. ఉత్కంఠభరితంగా తీద్దామని ప్రయత్నించినా.. ఆ
సన్నివేశాల్లో కొంత మొనాటనీ కనిపిస్తుంది. ఐతే వెన్నెల కోణంలో కథను చెప్పడం
వల్ల దీనికి కొంత వైవిధ్యం వచ్చింది. నక్సలైట్ నాయకుడిపై కథానాయికకు ప్రేమ
పెరిగే సన్నివేశాలను నామమాత్రంగా లాగించేయడం వల్ల మొదట్లో అతణ్ని
కలవడానికి ఆమె చేసే ప్రయత్నం అంత ఎమోషనల్ గా అనిపించదు. కానీ సాయిపల్లవి
మార్కు అద్భుత నటనకు తోడు.. తర్వాత తర్వాత కొన్ని బలమైన సన్నివేశాలు పడడంతో
ఆ పాత్రతో ట్రావెల్ అవుతాం. రవన్నను వెన్నెల కలిసే వరకు ఉత్కంఠభరితంగా..
వేగంగానే సన్నివేశాలను నడిపించాడు దర్శకుడు. రవన్న పాత్ర మనకు భౌతికంగా
పెద్దగా కనిపించకుండానే.. ఆ పాత్రకు మంచి ఎలివేషన్ ఇవ్వడం.. రవన్న-వెన్నెల
కలుసుకునే సమయంలో యాక్షన్ ఎపిసోడ్ ను బాగా తీర్చిదిద్దడంతో అక్కడి వరకు
కథనం రసవత్తరంగానే నడుస్తుంది. ప్రథమార్ధం వరకు ‘విరాటపర్వం’ ఆసక్తికరంగా..
వేగంగా సాగి ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది.
ద్వితీయార్ధంలో
‘విరాటపర్వం’ ప్రేక్షకులను కొంత ఇబ్బంది పడెుతుంది. హీరో హీరోయిన్లు ఎలా
కలుస్తారా అన్న ఉత్కంఠకు తెరపడిపోయాక.. కథను ముందుకు తీసుకెళ్లడం
దర్శకుడికి కష్టమైపోయింది. తన సిద్ధాంతం కోసం కన్నతల్లినే పక్కన పెట్టిన
నక్సలైట్ నాయకుడు.. ఒక అమ్మాయి ప్రేమను ఎలా అంగీకరిస్తాడన్న కోణంలో
కాన్ఫ్లిక్ట్ పాయింట్ బాగున్నప్పటికీ.. దాన్ని అనుకున్న స్థాయిలో ఎలివేట్
చేయలేదు. దళంలో అంతర్గత కలహాలు.. సంఘర్షణతో సన్నివేశాలు మరీ రొటీన్ గా
అనిపిస్తాయి. వెన్నెలకు.. ఆమె తండ్రికి మధ్య వచ్చే ఒక సన్నివేశం స్టాండౌట్
గా నిలిచి.. దర్శకుడి ప్రతిభను చాటినా.. మిగతా సీన్లు ఆ స్థాయిలో లేవు.
దర్శకుడు ఒక స్టాండ్ తీసుకుని నక్సలైట్ల కోణంలో ఏకపక్షంగా కథను నడిపించడం
వల్ల కూడా సినిమా ఫ్లాట్ గా తయారైంది. ఈ విషయంలో చాలామందికి అభ్యంతరాలు
కూడా తలెత్తవచ్చు. అంతకుముందు వరకు కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్న
దర్శకుడు.. ముగింపు విషయంలో మాత్రం వాస్తవికంగా వెళ్లిపోయాడు. ఆ ముగింపు
ప్రేక్షకులు జీర్ణించుకోలేనిది. అదంత కన్విన్సింగ్ గా కూడా లేదు.
‘రిపబ్లిక్’ తరహాలోనే.. అసలీ సినిమా ఏ ఉద్దేశంతో తీశారు అనే ప్రశ్నను
రేకెత్తిస్తుంది క్లైమాక్స్. వాస్తవ గాథ కాబట్టి అలా ముగించాల్సి వచ్చిందని
చెప్పొచ్చు కానీ.. కొంత డ్రామా జోడించి కన్విన్సింగ్ గా ఈ కథను ముగించి
ఉంటే బాగుండేదనిపిస్తుంది. అయినప్పటికీ ‘విరాటపర్వం’ కచ్చితంగా ఒక మంచి
ప్రయత్నం అనడంలో సందేహం లేదు. నక్సలిజం నేపథ్యంలో ఒక హార్డ్ హిట్టింగ్ లవ్
స్టోరీని చూడాలనుకునేవారికి ఇది మంచి ఛాయిసే.
నటీనటులు:
సినిమాలో
హీరో కంటే ముందు హీరోయిన్ పేరు వేయడం.. కథానాయిక కోణంలోనే కథను
మొదలుపెట్టడాన్ని బట్టి ఇందులో సాయిపల్లవికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని అర్థం
చేసుకోవచ్చు. ఆ ప్రాధాన్యానికి తగ్గట్లే సాయిపల్లవి తనకు మాత్రమే సాధ్యమైన
నట ప్రతిభతో కట్టి పడేసింది. సినిమాలో ఎన్నో క్లోజప్ షాట్లతో ఆమె పలికించిన
లోతైన హావభావాలకు ఫిదా అవ్వకుండా ఉండలేం. కథాకథనాలను మరిచిపోయి
సాయిపల్లవికి కనెక్ట్ అయిపోయి ఆమెతో పాటు ట్రావెల్ చేసేలా అద్భుతంగా
వెన్నెల పాత్రను పోషించిందామె. తన కెరీర్లో ఎప్పటికీ చెప్పుకునేలా పాత్ర
ఇదనడంలో సందేహం లేదు. రానా దగ్గుబాటి పాత్ర పరంగా తాను వెనక్కి సాయిపల్లవి
ఎక్కువ హైలైట్ అయ్యేలా చూడడం ప్రశంసనీయం. అతను పాత్రకు తగ్గట్లుగా పరిణతితో
నటించాడు. లుక్స్ పరంగా అతను కొన్ని చోట్ల డల్లుగా కనిపించినప్పటికీ.. నటన
పరంగా వేలెత్తి చూపడానికి వీల్లేని విధంగా చేశాడు. నందితా దాస్ కనిపించిన
కాసేపు తన స్థాయిని చాటుకునేలా నటించింది. ప్రియమణి.. నవీన్ చంద్ర కూడా
బాగా చేశారు. సాయిచంద్ ఆకట్టుకున్నాడు. రానా తల్లిగా చేసిన బాలీవుడ్ నటి
కూడా బాగా చేసింది.
సాంకేతిక వర్గం:
సాంకేతికంగా
‘విరాటపర్వం’ అత్యున్నత ప్రమాణాలతో సాగింది. అన్ని విభాగాల్లోనూ ఒక తపన
కనిపిస్తుంది. అందరు టెక్నీషియన్లూ దర్శకుడి అభిరుచికి తగ్గట్లు పని
చేశారు. సురేష్ బొబ్బిలి పాటలు.. నేపథ్య సంగీతం హృద్యంగా సాగాయి. అన్ని
పాటలూ భావయుక్తంగా ఉన్నాయి. పాటలతో పాటు కవిత్వంలోనూ లోతు కనిపిస్తుంది.
బ్యాగ్రౌండ్ స్కోర్లో మంచి ఫీల్ కనిపిస్తుంది. ‘మహానటి’ ఫేమ్ డాని
సాంచెజ్.. ‘రణరంగం’లో ఆకట్టుకున్న దివాకర్ మణిల ఛాయాగ్రహణం టాప్ క్లాస్
అనిపిస్తుంది. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. అవార్డ్ విన్నింగ్ రేంజిలో
సాగింది ఛాయాగ్రహణం. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ కనిపించలేదు.
ఇలాంటి కథను నమ్మి రాజీ లేకుండా అన్నీ సమకూర్చిన నిర్మాతలను ఎంత
అభినందించినా తక్కువే. రచయిత-దర్శకుడు వేణు ఉడుగుల కమర్షియల్ హంగుల గురించి
ఎక్కడా ఆలోచించకుండా.. తాను అనుకున్న కథను అనుకున్నట్లుగా తెరకెక్కించాడు.
అతడి భావజాలం విషయంలో అభ్యంతరాలు ఉండొచ్చు కానీ.. రాజీ లేకుండా ఈ కథను
తెరకెక్కించిన విధానం మాత్రం మెప్పిస్తుంది. కమర్షియల్ హంగుల గురించి..
ఎంటర్టైన్మెంట్ గురించి ఆలోచించకుండా.. ఒక కథను కథగా చూడాలనుకునే వారికి
వేణు ప్రయత్నం కచ్చితంగా నచ్చుతుంది.
చివరగా: విరాటపర్వం.. బరువైన ప్రేమకథ
రేటింగ్-2.75/5
Disclaimer
: This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The
Movie Based On This Review And Watch Movie in Theater