'వకీల్ సాబ్'

Fri Apr 09 2021 GMT+0530 (IST)

'వకీల్ సాబ్'

చిత్రం : ‘వకీల్ సాబ్’

నటీనటులు: పవన్ కళ్యాణ్-నివేథా థామస్-అంజలి-అనన్య నాగళ్ల-ప్రకాష్ రాజ్-శ్రుతి హాసన్-వంశీ కృష్ణ-ముకేష్ రుషి తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్
కథ: సూర్జిత్ సిర్కార్-రితేష్ షా-అనిరుద్ధ రాయ్ చౌదరి
మాటలు: వేణు శ్రీరామ్-తిరుపతి
నిర్మాతలు: రాజు-శిరీష్
మార్పులు-దర్శకత్వం: వేణు శ్రీరామ్

‘అజ్ఞాతవాసి’తో చేదు అనుభవాలు మిగిల్చి సినిమాల నుంచి నిష్క్రమించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మూడేళ్లకు పైగా విరామం తర్వాత పునరాగమనం చేస్తూ నటించిన చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీ మూవీ ‘పింక్’కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ‘వకీల్ సాబ్’ ఈ రోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ అంచనాల్ని సినిమా ఏ మేరకు అందుకుందో చూద్దాం పదండి.

కథ:

పల్లవి (నివేథా థామస్).. జరీనా (అంజలి).. దివ్య (అనన్య నాగళ్ల) వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ నగరంలో ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్న అమ్మాయిలు. వీరు ఒక పార్టీ నుంచి తిరిగొస్తుండగా.. కారు బ్రేక్ డౌన్ అయి తెలిసిన కుర్రాళ్ల సాయం తీసుకోగా.. వారు వీరిపై లైంగిక దాడికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో పల్లవి.. ఎంపీ కొడుకైన వంశీ (వంశీ కృష్ణ)ని తీవ్రంగా గాయపరుస్తుంది. దీంతో అతను పల్లవిపై పగ పెంచుకుని తన పలుకుబడితో ఆమెను అడుగడుగునా ఇబ్బందులకు గురి చేస్తాడు. ఆమెపై హత్యాయత్నం కేసు కూడా పెడతాడు. దీంతో ఈ ముగ్గురమ్మాయిలూ చిక్కుల్లో పడతారు. కేసు తీసుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో ఒకప్పుడు లాయర్ గా గొప్ప పేరుండి మధ్యలో ప్రాక్టీస్ పక్కన పెట్టేసిన సత్యదేవ్ (పవన్ కళ్యాణ్) వీరి కోసం మళ్లీ నల్ల కోటు తొడుగుతాడు. మరి పూర్తి ప్రతికూలంగా ఉన్న కేసు నుంచి పల్లవితో పాటు ముగ్గురమ్మాయిల్ని సత్యదేవ్ ఎలా బయటపడేశాడన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘పింక్’ బాలీవుడ్లో ఒక క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న సినిమా. పురుషాధిక్య సమాజంలో మహిళల సాధక బాధకాలు.. వారి మనోభావాల గురించి ఎంతో గొప్పగా చర్చించిన సినిమా ఇది. ఇలాంటి సినిమాను పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్నారనగానే పెదవి విరిచిన వాళ్లే ఎక్కువమంది. ఇక టైటిల్ సహా ఈ సినిమా ప్రోమోలన్నీ పవన్ కళ్యాణ్ చుట్టూ తిరగడంతో మంచి కథాంశాన్ని చెడగొడుతున్నట్లే కనిపించింది. అంత సున్నితమైన కథను కమర్షియల్ స్టయిల్లో ఎలా చెబుతారనే సందేహాలు తలెత్తాయి. ఐతే మన ‘వకీల్ సాబ్’.. ‘పింక్’కు పెద్దగా చేటేమీ చేయలేదు. పవన్ కళ్యాణ్ అభిమానులను దృష్టిలో ఉంచుకుని వేసిన మసాలాలు-ఎలివేషన్ల సంగతి పక్కన పెట్టేస్తే.. ‘పింక్’లోని హార్డ్ హిట్టింగ్ మెసేజ్ ను ఇక్కడ కూడా అంతే బలంగా చెప్పే ప్రయత్నం జరిగింది. కాకపోతే ‘పింక్’లో అంతా ‘సైలెంట్’గా సాగిపోతే.. ఇక్కడ మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ‘సౌండ్’ బాగా పెంచారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని కోర్టు రూం డ్రామాలోనూ ఎలివేషన్లకు లోటు లేకుండా చూసుకున్నారు. కొన్ని చోట్ల ‘వకీల్ సాబ్’ శ్రుతి మించినట్లు అనిపించినా.. ఇవ్వాల్సిన ఇంపాక్ట్ అయితే ఇచ్చేశాడు. ఒరిజినల్ తరహాలోనే ‘వకీల్ సాబ్’ సైతం పవర్ ఫుల్ గా అనిపిస్తుంది.

మహిళల సమస్యల నేపథ్యంలో సినిమా అనగానే.. ఒక రకమైన నెగెటివ్ ఫీలింగ్ కనిపిస్తుంటుంది ప్రేక్షకుల్లో. సెంటిమెంటు కోణంలోనే చూస్తారు ఈ టైపు సినిమాలను. ఐతే ‘వకీల్ సాబ్’ అలాంటి సినిమాల నుంచి వేరుగా నిలుస్తుంది. మన సమాజం మహిళల్ని ఎలాంటి దృష్టితో చూస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరిలోనూ ఒక అంతర్మథనం జరిగేలా చాలా ప్రభావవంతంగా చూపించే సినిమా ఇది. ఈ కథ విషయంలో పూర్తి క్రెడిట్ ‘పింక్’ రచయితలదే అయినా.. ఒరిజినల్లోని ఎసెన్స్ చెడకుండా మన వాళ్లు కూడా ఈ కథతో రిలేట్ అయ్యేలా చేయడంలో దర్శకుడు వేణు శ్రీరామ్ విజయవంతం అయ్యాడు. ‘పింక్’లో మాదిరే ‘వకీల్ సాబ్’కు కోర్ట్ రూంలో జరిగే డ్రామానే ప్రధాన ఆకర్షణ. గంటకు పైగా కథ కోర్ట్ రూంలోనే గడిచినప్పటికీ.. వాదోపవాదాలతో నడిచే సన్నివేశాలు ఆద్యంతం రసవత్తరంగా సాగి ప్రేక్షకులను ఎంగేజ్ చేయడమే కాదు.. వారిలో ఆలోచన రేకెత్తిస్తాయి. కొన్ని సన్నివేశాలు అభిమానులతోనే కాదు మామూలు ప్రేక్షకులతోనూ చప్పట్లు కొట్టిస్తాయి. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని తీర్చిదిద్దిన కొన్ని సన్నివేశాలు అతిగా అనిపించినప్పటికీ.. అవి పెద్ద అడ్డంకి కాదు. ప్రకాష్ రాజ్-పవన్ కళ్యాణ్ మధ్య హోరాహోరీ వాదనలతో సాగే సన్నివేశాలు ద్వితీయార్ధానికి ఆయువుపట్టుగా నిలిచాయి.

‘వకీల్ సాబ్’లో ఒక చోట పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి శరత్ బాబు పాత్ర ఓ మాట అంటుంది. ‘‘నీ ఆవేశం బలహీనత కాదు. ఆయుధం. దాన్ని సరిగ్గా ఉపయోగించుకో’’ అని. నిజానికి పవన్ కళ్యాణ్ ఉత్తమంగా పెర్ఫామ్ చేయగలిగేది ఆవేశపూరితమైన సన్నివేశాల్లోనే. దాన్ని వేణు శ్రీరామ్ వాడుకున్న వైనం ‘వకీల్ సాబ్’కు పెద్ద ప్లస్ అయింది. ‘పింక్’లో అమితాబ్ బచ్చన్ చాలా సటిల్ గా చేసిన సన్నివేశాలు ఎంతగా ఆకట్టుకుంటాయో.. ‘వకీల్ సాబ్’లో పవన్ ఎంతో ఆవేశంతో చేసిన అవే సీన్లు ఇక్కడ అంతే ప్రభావవంతంగా కనిపిస్తాయి. ఇంపాక్ట్ ఏమాత్రం తగ్గలేదు. పవన్ వ్యక్తిగత.. సినీ ఇమేజిని సరిగ్గా వాడుకుంటూ పవర్ ఫుల్ డైలాగులు.. సన్నివేశాలతో అభిమానులకు కావాల్సినంత కిక్కు ఇచ్చాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ఐతే అభిమానుల కోసం వేణు జోడించిన ‘ఎక్స్ ట్రా ఎపిసోడ్’ వల్ల మాత్రం సినిమాలకు పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. నిజానికి సినిమాలో బలహీనంగా అనిపించేదే ఆ ఎపిసోడ్. ఈ కథలో పవన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెద్దగా సింక్ కాలేదు. సహజంగా అనిపించలేదు. అది బలవంతంగా అతికించినట్లుగా అనిపిస్తుంది. శ్రుతి హాసన్ అప్పీయరెన్స్ కూడా పేలవంగా ఉండటం వల్ల కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఎమోషన్ పండలేదు. సినిమాకు మంచి ఆరంభం లభించాక.. పవన్ ఎంట్రీతో ఉత్సాహం వస్తుంది కానీ.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం ఫ్లోను దెబ్బ తీసి సినిమా మీద అనేకానేక సందేహాలు రేకెత్తిస్తుంది. ఐతే వర్తమానంలోకి వచ్చి కథ కోర్టు రూంలోకి చేరుకున్నాక ‘వకీల్ సాబ్’ ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెడుతుంది. అక్కడి నుంచి ‘వకీల్ సాబ్’ మంచి టెంపోతో సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర మొదలయ్యే ఊపు చివరి వరకు కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ హీరో ఇమేజ్ ఓ మంచి కథకు బాగానే ఉపయోగపడింది. అదే సమయంలో ఈ కథను తన ఇమేజ్ పెంచుకోవడానికి కూడా పవన్ బాగానే ఉపయోగించుకున్నాడు. సమయోచితంగా తన రాజకీయ భావజాలాన్ని జనసేనాని బలంగా చెప్పే ప్రయత్నం చేయడం ఇందులో కొసమెరుపు.

నటీనటులు:

మూడేళ్లకు పైగా విరామం తర్వాత వెండితెరపై కనిపించిన పవన్ కళ్యాణ్.. తన అభిమానులను కాదు సామాన్య ప్రేక్షకులనూ మెప్పిస్తాడు. పవన్ ను ప్రథమార్ధం వరకు చూస్తే ఏమంత ప్రత్యేకంగా కనిపించడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లలో సాధారణంగా కనిపించిన అతను.. ద్వితీయార్ధంలో కోర్ట్ రూం డ్రామాలో ఎక్కడ తేలిపోతాడో అన్న సందేహాలు కలుగుతాయి. కానీ ఆ సన్నివేశాల్లో తనదైన ఆవేశంతో.. సిన్సియారిటీతో నటించి శభాష్ అనిపిస్తాడు. ద్వితీయార్ధం మొత్తం పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ వావ్ అనిపిస్తుంది. సత్యదేవ్ పాత్రను అతను ఓన్ చేసుకుని నిజమైన ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా అనిపిస్తుంది కోర్టు సన్నివేశాల్లో. ఇప్పటిదాకా పవన్ కెరీర్లో చూడని ఒక సిన్సియర్.. ఎఫెక్టివ్ పెర్ఫామెన్స్ ఇందులో కనిపిస్తుంది. శ్రుతి హాసన్ సినిమాకు మైనస్ అయింది. ఆమె లుక్స్ ఏమాత్రం బాగా లేవు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఎమోషన్ మిస్ కావడానికి ఆమే కారణం. ప్రకాష్ రాజ్.. నందా పాత్రలో తన అనుభవాన్నంతా చూపించాడు. కోర్ట్ రూం డ్రామా పండటంలో ఆయన పాత్ర కీలకం. నివేథా థామస్.. అంజలి చాలా బాగా చేశారు. తమ పాత్రలను చక్కగా పండించారు. ఇద్దరూ ఎమోషనల్ సీన్లలో ఎంతో సహజంగా నటించి మెప్పించారు. అనన్య నాగళ్ల కూడా తన పాత్రకు న్యాయం చేసింది. వంశీకృష్ణ.. నెగెటివ్ రోల్ కు బాగా సూటయ్యాడు. మిగతా నటీనటులంతా ఓకే.

సాంకేతిక వర్గం:

‘వకీల్ సాబ్’ సాంకేతికంగా అతి పెద్ద బలం తమన్ సంగీతమే. అతడి కెరీర్లోనే అత్యుత్తమ పనితనం కనబరిచిన చిత్రాల్లో ‘వకీల్ సాబ్’ ముందు వరుసలో ఉంటుంది. ‘అరవింద సమేత’ తర్వాత తమన్ సంగీతం ద్వారా కథకు తగ్గట్లుగా ఒక మూడ్ క్రియేట్ చేయగలిగాడు. పాటలు అన్నీ బాగున్నాయి. సత్యమేవ జయతే.. కదులు కదులు చాలా ప్రభావవంతంగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం ద్వారా తమన్ చూపించిన ఇంటెన్సిటీ సినిమాలో ప్రత్యేకంగా నిలుస్తుంది. పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ కూడా అత్యుత్తమంగా సాగింది. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. దిల్ రాజు స్థాయికి తగ్గట్లే నిర్మాణ విలువలు ఉన్నాయి. ఇక దర్శకుడు వేణు శ్రీరామ్ విషయానికి వస్తే.. అతను ‘పింక్’ను చెడగొట్టకుండానే పవన్ ఇమేజికి తగ్గట్లు మార్పులు చేర్పులు చేశాడు. సటిల్ గా సాగే ‘పింక్’ కోర్ట్ రూం డ్రామాను మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ‘లౌడ్’గా తీర్చిదిద్దడం.. పవర్ ఫుల్ డైలాగులు రాయడంలో వేణు కృషి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత.. సినీ ఇమేజిని అతను బాగా వాడుకున్నాడు. ఐతే అభిమానుల కోసం అతను జోడించిన ఎపిసోడ్ల వల్ల సినిమా కొన్ని చోట్ల దారి తప్పింది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను బాగా తీర్చిదిద్దుకోవాల్సింది. సినిమాలో అదొక అనవసరమైన ఎపిసోడ్ లాగా తయారైంది. ఓవరాల్ గా వేణు పనితీరుకు మంచి మార్కులే పడతాయి.

చివరగా: వకీల్ సాబ్..  ఈ మాత్రం ‘పవర్’ చాలు

రేటింగ్- 3/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS