తిమ్మరసు

Fri Jul 30 2021 GMT+0530 (IST)

తిమ్మరసు

చిత్రం : 'తిమ్మరసు'

నటీనటులు: సత్యదేవ్-ప్రియాంక జవాల్కర్-బ్రహ్మాజీ-ఝాన్సీ-అంకిత్-బాలకృష్ణన్ తదితరులు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: అప్పు ప్రభాకర్
కథ: ఎంజీ శ్రీనివాస్
మాటలు: కిట్టు విస్సాప్రగడ-వేదవ్యాస్-శరణ్ కొప్పిశెట్టి
నిర్మాతలు: మహేష్ కోనేరు-సృజన్ యరబోలు
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి

లాక్ డౌన్-2 విరామం తర్వాత ఎట్టకేలకు మళ్లీ థియేటర్లు తెరుచుకున్నాయి. వెండితెరల్లో తిరిగి వెలుగులు నింపుతున్న చిత్రాల్లో ‘తిమ్మరసు’ ఒకటి. సత్యదేవ్ ప్రధాన పాత్రలో శరణ్ కొప్పిశెట్టి రూపొందించిన థ్రిల్లర్ మూవీ ఆసక్తికర ప్రోమోలతో ఆకట్టుకుంది. ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. మరి ఆ అంచనాలనే ‘తిమ్మరసు’ ఏమేరకు అందుకుందో చూద్దాం పదండి.

కథ:

రామచంద్ర (సత్యదేవ్) ఒక ఔత్సాహిక లాయర్. మంచి కేసు పడితే తనేంటో రుజువు చేసుకోవాలని చూస్తుంటాడు. అప్పుడే అతడికి సామాన్యులకు ఉచితంగా న్యాయసేవ అందించడానికి ముందుకొచ్చిన ఓ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. అరవింద్ అనే క్యాబ్ డ్రైవర్ హత్య కేసులో చేయని నేరానికి ఎనిమిదేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ కుర్రాడి కేసును అతను టేకప్ చేస్తాడు. ఈ కేసును రామచంద్ర రీ ఓపెన్ చేసి పరిశోధన ఆరంభించాక కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తాయి. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతుంది. ఈ క్రమంలో రామచంద్రకు అనేక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. మరి వాటన్నింటినీ అధిగమించి అతను ఈ కేసులో అసలు సూత్రధారులను ఎలా బయటపెట్టాడన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

‘థ్రిల్లర్’ అని ట్యాగ్ వేసుకుని.. మధ్యలో ఒక ట్విస్టు.. చివర్లో ఒక ట్విస్టు ఇచ్చేసి థ్రిల్ అయిపోమనే సినిమాలు ఎక్కువైపోయాయి తెలుగులో. ఒకట్రెండు ట్విస్టులతో ప్రేక్షకుల మైండ్ బ్లాంక్ అయిపోయి సినిమాలకు పట్టం కట్టేసే రోజులు పోయాయి. ఓటీటీల పుణ్యమా అని ప్రపంచంలోనే అత్యుత్తమ థ్రిల్లర్ సినిమాలు వెబ్ సిరీసులు మన అరచేతుల్లోకి వచ్చేసిన ఈ రోజుల్లో కథనం మీద దృష్టిపెట్టకుండా.. కేవలం ట్విస్టుల్ని నమ్మకుంటే బండి నడవదు. ఇలాంటి సమయంలో ‘తిమ్మరసు’ రూపంలో ఒక ప్రాపర్ థ్రిల్లర్ మూవీ చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కింది. కన్నడలో విజయవంతమైన ఓ సినిమాను తీసుకుని.. మాతృకలోని ఆసక్తిని ఏమాత్రం తగ్గనివ్వకుండా.. ఆద్యంతం ఎంగేజింగ్ గా తీర్చిదిద్దింది శరణ్ కొప్పిశెట్టి అండ్ కో. ఆరంభంలో మామూలు సినిమాలా అనిపించినా.. ముందుకు సాగే కొద్దీ ఉత్కంఠభరిత మలుపులు తిరుగుతూ.. ప్రేక్షకులను థ్రిల్ చేస్తూ.. చివరికి మంచి సినిమా చూసిన అనుభూతిని మిగులుస్తుందీ చిత్రం.

నాంది.. వకీల్ సాబ్.. ఇలా గత కొన్ని నెలల్లోనే రెండు కోర్ట్ రూం డ్రామాలు చూశాం. చేయని నేరానికి కేసుల్లో ఇరుక్కున్న అమాయకులను కాపాడే పాయింట్ మీద నడిచే చిత్రాలవి. ఐతే అవి వేటికవే భిన్నంగా ఉంటాయి. ‘తిమ్మరసు’లో సైతం ప్లాట్ పాయింట్ ఇదే అయినప్పటికీ.. దీని నడత వేరు. ‘నాంది’కి కొంచెం దగ్గరగా అనిపించినప్పటికీ.. అందులో ఎమోషన్ ఎక్కువగా ఉంటే.. ఇది ప్రేక్షకులను ‘థ్రిల్’కు గురి చేయడమే లక్ష్యంగా సాగుతుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఆరంభంలో మొదలై.. అది అంతకంతకూ పెరిగి.. చివరికి పతాక స్థాయికి చేరుకుంటుంది. ప్రేక్షకులను ఇలా ఆద్యంతం గెస్సింగ్ లో ఉంచుతూ.. ఎక్కడా కూడా టెంపో మిస్ కాకుండా చూడటంలోనే ‘తిమ్మరసు’ విజయం దాగి ఉంది.

ఐతే ఆరంభంలో మాత్రం ఇది మామూలు సినిమాలాగే కనిపిస్తుంది. కథలో అత్యంత కీలకమైన క్రైమ్ ఎలిమెంట్ చూపించి హీరోను పరిచయం చేశాక రొటీన్ సన్నివేశాలే పడతాయి. సీనియర్ లాయర్ దగ్గర ప్రాక్టీస్.. అక్కడ కేసులు లేక గోళ్లు గిల్లుకోవడం.. అక్కడి నుంచి వేరే కంపెనీలో చేరడం.. అక్కడో కేసు టేకప్ చేయడం.. ఈ సీన్లన్నీ సాధారణంగా అనిపిస్తాయి. బ్రహ్మాజీ రాకతో అక్కడక్కడా కొంచెం నవ్వులు పండినా కూడా తొలి ముప్పావు గంటలో కథనంలో అంత వేగం కనిపించదు. ప్రేక్షకులను థ్రిల్ చేసే మూమెంట్స్ కూడా పెద్దగా లేవు.

ఐతే కేసులో హీరో సీరియస్ గా ఇన్వాల్వ్ అయి లోతుగా పరిశీలించడం మొదలుపెట్టాక.. ఒక్కో చిక్కుముడి వీడుతున్న కొద్దీ ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ దగ్గర మంచి ట్విస్టుతో ద్వితీయార్ధంపై క్యూరియాసిటీ పెరుగుతుంది. ‘తిమ్మరసు’కు పెద్ద బలం రెండో అర్ధమే. ఇంటర్వెల్ తర్వాత నుంచి కథనం ఎక్కడా ఆగకుండా పరుగులు పెడుతుంది. మర్డర్ మిస్టరీకి సంబంధించి ఒక్కొక్కరి వెర్షన్లో కథ చెప్పడం.. ప్రతి దాంట్లోనూ ఒక ట్విస్టో.. లేదంటే మిస్సింగ్ ఎలిమెంటో ఉండటంతో ప్రేక్షకుల్లో తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి పెరుగుతుంది. పూర్తిగా థ్రిల్లర్ రూపం సంతరించుకున్న ‘తిమ్మరసు’.. అసలు నేరస్థుడు ఎవరనే ఉత్కంఠను పెంచుతుంది. చివర్లో అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పడంతో పాటు ఈ కేసుతో తనకున్న సంబంధమేంటో హీరో రివీల్ చేయడంతో డబుల్ థ్రిల్లవుతారు ఆడియన్స్. హీరో పేరు రామచంద్ర అయితే..

ఈ సినిమాకు ‘తిమ్మరసు’ అనే టైటిల్ పెట్టడం వెనుక కారణమేంటో కూడా చివర్లోనే తెలుస్తుంది. అది కూడా ఇంట్రెస్టింగ్ పాయింటే. ప్రథమార్ధంలో ఓ అరగంట బోర్ కొట్టించినా.. అక్కడక్కడా కొన్ని లూప్ హోల్స్ ఉన్నా కూడా.. ఓవరాల్ గా ‘తిమ్మరసు’ ప్రేక్షకులకు సంతృప్తినిస్తుంది. కథలో ఉన్న మలుపులు.. కథనంలోని వేగం.. బ్రహ్మాజీ పాత్రతో పండించిన నవ్వులు.. సినిమాకు ప్లస్. థ్రిల్లర్లు.. సీరియస్ సినిమాలు చూసేవాళ్లకు ‘తిమ్మరసు’ నచ్చుతుంది. మళ్లీ థియేటర్ల వైపు నడవడానికి ఇది మంచి ఛాయిసే.

నటీనటులు:

సత్యదేవ్ ప్రతిభ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏ పాత్ర ఇచ్చినా దానికి పూర్తి న్యాయం చేయడానికి చూస్తాడు. లాయర్ రామచంద్ర పాత్రలోనూ అతను సిన్సియర్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. లుక్స్ పరంగా ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో ‘ది బెస్ట్’ అనిపించేలా కనిపించిన సత్యదేవ్.. తన నటనతో ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి చూశాడు. కొన్ని చోట్ల సన్నివేశాల బలం తగ్గినా సత్యదేవ్ తన నటనతో కవర్ చేశాడు. ఏదో చేయాలనే అతడి తపన ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ పాత్రకు మిస్ ఫిట్ అనిపిస్తుంది. మరీ మోడర్న్ గా అనిపించే ఆమె లుక్స్ ఈ పాత్రకు సరిపోలేదు.

‘ట్యాక్సీవాలా’ సమయంలో ఆమెలో ఉన్న క్యూట్నెస్ ఇప్పుడు కనిపించడం లేదు. లుక్స్ విషయంలో ఆమె కొంచెం జాగ్రత్త పడాల్సిందే. హీరో తర్వాత ఎక్కువ ఆకట్టుకునేది బ్రహ్మాజీనే. ‘తిమ్మరసు’ సీరియస్ మూవీ అయినప్పటికీ.. బ్రహ్మాజీ అక్కడక్కడా చక్కటి పంచులతో నవ్విస్తూ రిలీఫ్ ఇచ్చాడు. సినిమా నడతకు తగ్గట్లే సటిల్ గా సాగింది అతడి హ్యూమర్. చేయని నేరానికి హత్య కేసులో జైలు శిక్ష అనుభవించే కుర్రాడిగా అంకిత్ ఆకట్టుకున్నాడు. మెయిన్ విలన్ గా చేసిన కొత్త నటుడి గురించి పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు. ‘30 వెడ్స్ 21’ ఫేమ్ చైతన్యరావు.. ఝాన్సీ.. అజయ్.. ప్రవీణ్.. హర్ష.. బాలకృష్ణన్.. వీళ్లంతా బాగానే చేశారు.

సాంకేతిక వర్గం:

బడ్జెట్ పరిమితుల దృష్ట్యా ‘తిమ్మరసు’లో ప్రొడక్షన్ వాల్యూస్ అంత గొప్పగా అనిపించవు. కానీ కథా కథనాలు ఆసక్తికరంగా సాగడంతో ప్రేక్షకులు ఈ లోపాన్ని పట్టించుకోరు. పాటలు లేని ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల నేపథ్య సంగీతం ప్లస్ అయింది. థ్రిల్లర్ సినిమాలకు పేరు పడ్డ అతను ఉత్కంఠ రేకెత్తించే ఆర్ఆర్ తో సన్నివేశాల బలం పెంచాడు. కొన్ని చోట్ల నేపథ్య సంగీతం లౌడ్ అనిపించినా.. ఓవరాల్ గా ఓకే.

అప్పు ప్రభాకర్ ఛాయాగ్రహణం సినిమా శైలికి తగ్గట్లు సాగింది. ఆరంభం నుంచే ఒక మూడ్ క్రియేట్ చేయడంలో కెమెరామన్ కీలక పాత్ర పోషించాడు. స్క్రిప్టు విషయానికి వస్తే కన్నడలో వచ్చిన దీని ఒరిజినల్లోనే మంచి విషయం ఉంది. దాన్ని అడాప్ట్ చేసుకోవడంలో.. ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి విజయవంతం అయ్యాడు. ప్రథమార్ధంలో కొంచెం బోర్ కొట్టించినా.. ముందుకు సాగేకొద్దీ చిక్కు ముడులు ఒక్కోటి విప్పడంలో.. ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేయడంలో శరణ్ పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే.

చివరగా: తిమ్మరసు.. అసైన్మెంట్ సక్సెస్ ఫుల్

రేటింగ్-2.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS