'తెల్లవారితే గురువారం'

Sat Mar 27 2021 GMT+0530 (IST)

'తెల్లవారితే గురువారం'

చిత్రం : 'తెల్లవారితే గురువారం'

నటీనటులు: సింహా-చిత్ర శుక్లా-నిమిషా సింగ్-సత్య-వైవా హర్ష-రాజీవ్ కనకాల తదితరులు
సంగీతం: కాలభైరవ
ఛాయాగ్రహణం: సురేష్ రగుతు
రచన: నాగేంద్ర పిల్ల
నిర్మాతలు: రజని కొర్రపాటి-రవీంద్ర బెనర్జీ
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: మణికాంత్ గెల్లి

‘మత్తువదలరా’ లాంటి సక్సెస్ ఫుల్ మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెట్టాడు కీరవాణి చిన్న కొడుకు సింహా. ఇప్పుడు అతడి నుంచి వచ్చిన కొత్త చిత్రం ‘తెల్లవారితే గురువారం’. మణికాంత్ గెల్లి అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం.

కథ:

సొంతంగా ఓ గృహ నిర్మాణ సంస్థను నడిపే ఇంజినీర్ అయిన వీరు (సింహా కోడూరి)కు మధు (నిమిషా సింగ్) అనే అమ్మాయితో పెళ్లి కుదురుతుంది. కానీ ఆ పెళ్లి అతడికి ఇష్టం ఉండదు. పెళ్లి నుంచి పారిపోదామని మండపం నుంచి బయటికి వచ్చిన అతను.. మధు సైతం పెళ్లి నుంచి పారిపోయే ప్రయత్నం చేయడం చూసి షాకవుతాడు. తర్వాత ఇద్దరూ కలిసి ఒకరి కథను ఒకరికి చెప్పుకుంటారు. మరి సింహా ఈ పెళ్లి వద్దనుకోవడానికి కారణాలేంటి.. మధు ఎందుకు పెళ్లి పట్ల విముఖతతో ఉంది.. ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాక వీళ్లేం చేశారు.. దాని వల్ల వీరి జీవితాలు ఏ మలుపులు తిరిగాయి అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

కొన్ని సినిమాల ట్రైలర్స్ చూస్తే పంచుల మీద పంచులతో.. ట్విస్టుల మీద ట్విస్టులతో సరదాగా అనిపిస్తాయి. కథాంశాలు కూడా ఆసక్తి రేకెత్తిస్తాయి. కానీ తర్వాత తెర మీద చూస్తే ట్రైలర్లో చూసిన మెరుపులు తప్ప చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ ఉండదు. ‘తెల్లవారితే గురువారం’ సరిగ్గా ఆ కోవకే చెందుతుంది. దీని ట్రైలర్ చూసి ఒక హిలేరియస్ ఎంటర్టైనర్ చూడబోతున్న భావన కలుగుతుంది. రేప్పొద్దున పెళ్లి పెట్టుకుని.. వరుడు కళ్యాణ మండపం నుంచి పారిపోవడం అనే పాయింట్ సైతం ట్రైలర్లో ఆసక్తి రేకెత్తించింది కూడా. ఇక సినిమాలో హీరో పెళ్లితో ఓపెన్ చేసి.. అతను మండపం నుంచి బయటికి వస్తున్న సమయంలోనే తను చేసుకోవాల్సిన అమ్మాయి కూడా పెళ్లి నుంచి పారిపోతుండటం.. ఇద్దరూ ఇలా ఎదురు పడటం చూస్తే మరింత థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతుంది. నిజానికి ఈ కథను ఇలా మొదలుపెట్టడం.. చివరికి ఇచ్చిన ముగింపు కూడా బాగుంది. కానీ మధ్యలో ఈ ఇద్దరి ఫ్లాష్ బ్యాక్ లు కానీ.. తర్వాత వీరి ప్రయాణాన్ని కానీ ఆసక్తికరంగా తెరపై ప్రెజెంట్ చేయడంలో కొత్త దర్శకుడు మణికాంత్ గెల్లి విఫలమయ్యాడు.

ఈ స్థాయి చిన్న సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలంటే లాజిక్కులతో సంబంధం లేకుండా ‘జాతిరత్నాలు’ తరహాలో పూర్తిగా వినోదం అయినా పంచాలి. లేదంటే కథలో మంచి మలుపులు.. థ్రిల్లింగ్ మూమెంట్స్ అయినా ఉండాలి. ఆ రెండూ లేకుండా.. ఏదో అలా లైట్ గా నడిపించేద్దాం అనుకుంటే చెల్లుబాటు కాదు. ‘తెల్లవారితే గురువారం’లో అదే జరిగింది. పెళ్లి వద్దనుకున్న జంట ఒకరి గతాన్ని ఒకరు చెప్పుకుంటారు ఇందులో. ఆ రెండు కథల్లో ఏదీ కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేది కాదు. ఒక యాక్సిడెంట్ మూలంగా ఆసుపత్రి పాలైన హీరో తనకు వైద్యం చేసే డాక్టరునే ప్రేమిస్తాడు. ప్రేమించిన అమ్మాయి పని చేస్తున్న చోటికి ఏదో ఒక సాకు చెప్పి హీరో మళ్లీ మళ్లీ వెళ్లడం అన్నది ఎప్పుడూ చూసే వ్యవహారమే. ఇందులో కూడా హీరో అదే పని చేయడంతో ఇదొక రొటీన్ లవ్ స్టోరీ అని అర్థమైపోతుంది. హీరో ఆమెను ప్రేమించాడు సరే.. ఆమె ఇతడి పట్ల ఆసక్తి చూపించడానికి ఒక్క కారణం కూడా కనిపించదు. అతను అడగ్గానే సింపుల్ గా డిన్నర్ కు ఓకే చేసేస్తుంది. అందులోనే నన్ను పెళ్లి చేసుకుంటావ్ కదా అంటుంది. ఇక ప్రేమకథలో ఏం విశేషం ఉన్నట్లు. వీళ్లిద్దరి మధ్య గొడవలు.. అలకలు కూడా చాలా సాధారణంగా అనిపిస్తాయి. హీరోయిన్ని కన్ఫ్యూజన్ క్యాండిడేట్ గా చూపించి నవ్వించడానికి చేసిన ప్రయత్నం కూడా పెద్దగా ఫలించలేదు. బ్రేకప్ సీన్ కూడా పూర్తిగా తేలిపోయింది. మరోవైపు హీరో పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ అయితే మరీ పేలవం. ఆమె పెళ్లి పట్ల విముఖత పెంచుకోవడానికి చూపించే కారణం మరీ సిల్లీగా ఉంటుంది. ఇలా ఇద్దరి ఫ్లాష్ బ్యాక్ లూ అనాసక్తికరంగా తయారయ్యాయి.

కాకపోతే ప్రథమార్ధంలో అక్కడక్కడా కొన్ని పంచులు అయినా పేలాయి. సత్య.. వైవా హర్ష కొంత మేర నవ్వులైనా పంచారు. ద్వితీయార్ధం అయితే పూర్తిగా తేలిపోయింది. తాను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయితో కలిసి.. తాను ప్రేమించిన అమ్మాయి కోసం హీరో వెళ్లి అక్కడ చేదు అనుభవం ఎదుర్కోవడం.. ఆ తర్వాత తిరుగు ప్రయాణం నేపథ్యంలో సాగే కథనం నీరసాన్ని కలిగిస్తుంది. మధ్యలో అజయ్ పాత్రను ప్రవేశ పెట్టి మేకతో పెళ్లి అంటూ హడావుడి చేయించారు. సినిమా మీద ఏమాత్రం ఇంప్రెషన్ ఉన్నా.. ఈ ఎపిసోడ్ దాన్ని పోగొట్టేస్తుంది. రెండో హీరోయిన్ని హీరోకు దగ్గర చేసేందుకు పెట్టిన సన్నివేశాల్లో ఎమోషన్లు పండలేదు. అవి చాలా కృత్రిమంగా తయారయ్యాయి. రెండో అర్ధంలో కూడా అక్కడక్కడా సత్య.. హర్షలే కొంచెం నవ్వులు పంచి ఎంగేజ్ చేస్తారు తప్ప.. ప్రధాన పాత్రధారులతో ముడిపడ్డ సన్నివేశాలేవీ కూడా ఆకట్టుకోవు. ముగింపు కూడా సాధారణంగా అనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ‘తెల్లవారితే గురువారం’ ప్రోమోల్లో కనిపించిన మెరుపులు సినిమాలో లేకపోయాయి. ఇదొక రొటీన్ సినిమాలాగే అనిపిస్తుంది. ఇంతటి సాదాసీదా కథాకథనాలతో చిన్న సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టం.

నటీనటులు:

సింహాలో మంచి ఈజ్ ఉంది. అది తొలి సినిమాలోనే కనిపించింది. ‘తెల్లవారితే గురువారం’లో అతను ఇంకా ఉత్సాహంగా నటించాడు. వీరు పాత్రను సులువుగా చేసుకుపోయాడు. సరదా పాత్రలను అతను బాగా చేయగలడనిపిస్తుంది. లుక్స్ పరంగా కూడా అతను ఆకట్టుకున్నాడు. వీరు పాత్ర అనుకున్నంత ఇంపాక్ట్ వేయలేకపోయిందంటే అది రచయిత.. దర్శకుడి వైఫల్యమే. చిత్రా శుక్లా చూడ్డానికి బాగుంది. నటన పర్వాలేదు. ఆమె పాత్ర కొంత వరకు బాగానే అనిపిస్తుంది కానీ.. తర్వాత ఆసక్తిని తగ్గించేస్తుంది. నిమిషా సింగ్ ఏ రకంగానూ ఆకట్టుకోలేదు. లుక్స్ పరంగా వీక్. నటన కూడా అంతంతమాత్రమే. తన పాత్ర మరీ సిల్లీగా అనిపిస్తుంది. సత్యకు మంచి పాత్ర పడింది. అతడి పాత్ర కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకుల్లో ఒక ఆశ కలుగుతుంది. ఈ పాత్ర ఇంకొంతసేపు ఉంటే బాగుండనిపిస్తుంది. వైవా హర్ష సైతం ఉన్నంతలో బాగానే నవ్వించాడు. మిగతా పాత్రలు.. నటీనటులంతా మామూలే.

సాంకేతిక వర్గం:

సంగీత దర్శకుడు కాలభైరవ మంచి పనితనమే చూపించాడు. ‘ఎవరే ఎవరే నువ్వు..’ పాట చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ప్రేక్షకులు చాలా సేపు హమ్ చేసేలా చేస్తుందీ పాట. దీని చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటుంది. మిగతా పాటలు కూడా పర్వాలేదు. నేపథ్య సంగీతం కూడా బాగానే సాగింది. సురేష్ రగుతు ఛాయాగ్రహణం పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లున్నాయి. నరేంద్ర పిల్లి అందించిన కథలో ప్లాట్ పాయింట్ బాగానే అనిపిస్తుంది. కానీ కథా విస్తరణ సరిగా జరగలేదు. కథనం అనాసక్తికరంగా తయారైంది. దర్శకుడు మణికాంత్ గెల్లి కొన్ని కామెడీ సీన్ల వరకు బాగానే డీల్ చేశాడు కానీ.. మిగతా చోట్ల నిరాశ పరిచాడు. ప్రేమకథను డీల్ చేయడంలో కానీ.. ఎమోషన్లు పండించడంలో కానీ పట్టు చూపించలేకపోయాడు.

చివరగా: తెల్లవారితేే గురువారం.. రొటీన్ వ్యవహారం

రేటింగ్-2/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS