తెగింపు

Wed Jan 11 2023 GMT+0530 (India Standard Time)

తెగింపు

'తెగింపు' మూవీ రివ్యూ
నటీనటులు: అజిత్ కుమార్-మంజు వారియర్-సముద్రఖని-అజయ్-జాన్ కొక్కెన్-వీర-పావని రెడ్డి తదితరులు
సంగీతం: జిబ్రాన్
ఛాయాగ్రహణం: నిరవ్ షా
మాటలు: రాజేష్ మూర్తి
నిర్మాత: బోనీ కపూర్
రచన-దర్శకత్వం: హెచ్.వినోద్

తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్ నటించిన కొత్త చిత్రం తునివు. ఈ చిత్రం తెగింపు పేరుతో తెలుగులో విడుదలైంది. అజిత్ తో ఇప్పటికే రెండు సినిమాలు తీసిన హెచ్.వినోద్ రూపొందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

విశాఖపట్నంలోని యువర్ బ్యాంకులో పరిమితికి మించి అదనంగా నిల్వ ఉంచిన 500 కోట్ల రూపాయలను దోచుకోవడానికి ఒక పోలీసు ఉన్నతాధికారి సహకారంతో ఒక ముఠా రంగంలోకి దిగుతుంది. ఈ ముఠా తమ ప్రణాళికను అమలు చేస్తున్న సమయంలో అప్పటికే అక్కడ ఉన్న రెడ్ డెవిల్ (అజిత్).. వారిపై ఎదురు తిరుగుతాడు. తన టీంతో కలిసి ఎటాక్ చేసిన రెడ్ డెవిల్ తనే బ్యాంకును అధీనంలోకి తీసుకుంటాడు. ఇంతకీ ఈ రెడ్ డెవిల్ నేపథ్యం ఏంటి.. అతడి లక్ష్యం ఏంటి.. ఓవైపు బ్యాంకులోకి చొరబడ్డ ముఠా- మరోవైపు బయట మోహరించిన పోలీసులను దాటి అతను తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకున్నాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

'తునివు' సినిమాలో హీరో ఫ్లాష్ బ్యాక్ లో హీరో ఉన్న ఇంటి మీదికి పెద్ద పెద్ద మెషీన్ గన్స్ పట్టుకున్న పదుల మంది రౌడీలు ఎటాక్ చేస్తారు. హీరో ముందు కొంచెం కంగారు పడ్డా.. తేరుకుని అందరి పని పట్టేస్తాడు. కొన్ని బుల్లెట్ గాయాలు తగిలినా ప్రాణాలతో బయటపడతాడు. వర్తమానంలోకి వచ్చాక హీరో మీద బ్యాంకులో హైజాకర్లు గన్నులతో ఎటాక్ చేస్తారు. అతడికేమీ కాదు. ఆ తర్వాత బ్యాంకు మీదికి పోలీసులు రాకెట్ లాంచర్లతో ఎటాక్ చేస్తారు. అయినా హీరోకు ఏమీ కాదు. ఆ తర్వాత హీరో సముద్రంలో ఒక స్పీడ్ బోటేసుకుని వెళ్తుంటే.. వెనుక నుంచి పదుల సంఖ్యలో బోట్లు.. పైనుంచి కొన్ని హెలికాఫ్టర్లు వెంటపడతాయి. అందరూ మెషీన్ గన్నులతో హీరో మీద బుల్లెట్ల వర్షం కురిపిస్తారు. ఈసారి హీరో ఏకంగా హెలికాఫ్టర్లనే కూల్చి పడేస్తాడు. మళ్లీ కొన్ని బుల్లెట్ గాయాలు తగులుతాయే తప్ప.. హీరోకు ఏమీ కాదు. సినిమా అంతటా ఇదే వరస. యాక్షన్ సన్నివేశాలతో హీరోను ఎలివేట్ చేయడం మీదే దృష్టిపెట్టిన దర్శకుడు.. ఆ పాత్రను ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో విఫలమయ్యాడు. ప్రైవేటు బ్యాంకుల మోసాల చుట్టూ అల్లుకున్న మూల కథ కూడా ఏమంత ఎంగేజింగ్ గా అనిపించదు. కొన్ని ఎపిసోడ్ల వరకు ఓకే అనిపించినప్పటికీ.. హద్దులు దాటిన యాక్షన్ మోతతో సాగతీతగా అనిపించే 'తెగింపు' చివరికి భారంగా తయారవుతుంది.

ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆదరణ దక్కించుకున్న 'మనీ హైస్ట్' వెబ్ సిరీస్ స్ఫూర్తితో 'తెగింపు' కథను అల్లుకున్నట్లుగా అనిపిస్తుంది. అందులో ప్రొఫెసర్ బయట ఉండి 'హైస్ట్'ను రక్తి కట్టిస్తే.. ఇక్కడ హీరో నేరుగా రంగంలోకి దిగి దోపిడీని నడిపిస్తాడు. భారీ బిల్డప్ తో హీరో ఎంట్రీ.. ఒక ఫైట్.. ఒక పాట తరహాలో రొటీన్ గా సినిమాను మొదలుపెట్టకుండా.. నేరుగా కథలోకి వెళ్లిపోవడం.. అందులో ఒక పాత్రలాగే హీరోను పరిచయం చేయడం ఆకట్టుకుంటుంది. హీరోె పాత్రను నిగూఢంగా ఉంచి.. అతడి ఉద్దేశం ఏంటి అనే విషయంలో ఆసక్తి రేకెత్తించగలిగాడు దర్శకుడు. కొన్ని మలుపులు కూడా ఆకట్టుకునేలా సాగుతాయి. బ్యాంకు లోపల మొత్తం వ్యవస్థను హీరో తన కంట్రోల్లోకి తెచ్చుకునే తీరు.. మరోవైపు అతడికి అడ్డుకట్ట వేయడానికి పోలీసులు చేసే ప్రయత్నాలు.. మధ్యలో విలన్ ఎంట్రీతో ఒక దశ వరకు 'తెగింపు' ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేస్తుంది. కొంచెం లెంగ్తీగా అనిపించినప్పటికీ.. ప్రథమార్ధం బోర్ కొట్టించకుండా సాగిపోతుంది.

కానీ 'తెగింపు'లో సమస్యంతా ద్వితీయార్ధంతోనే. హీరో పాత్ర విషయంలో సస్పెన్సును రివీల్ చేస్తూ చూపించే అతడి ఫ్లాష్ బ్యాక్ తలా తోకా లేకుండా సాగుతుంది. అసలు కథతో హీరో పాత్రను కనెక్ట్ చేసిన విధానంలో లాజిక్ కనిపించదు. బేసిగ్గా హీరోను  ఒక దొంగగా చూపించి.. చివరికి అతను ఒక కాజ్ కోసం పని చేసినట్లు చూపించడంలో లాజిక్ ఏంటో అర్థం కాదు. బలమైన కారణమంటూ లేకుండానే హీరో చాలా రిస్కీ అయిన బ్యాంకు దోపిడీకి ఎందుకు సిద్ధపడతాడో అర్థం కాదు. క్రెడిట్ కార్డులు.. మ్యూచువల్ ఫండ్స్ అంటూ ప్రైవేటు బ్యాంకులు చేసే మోసాల గురించి చాలా లెంగ్తీగా నడిపించిన ఎపిసోడ్ సినిమాకు పెద్ద మైనస్. ఈ విషయాలను ఎగ్జాజరేట్ చూపించినట్లు అనిపిస్తుందే తప్ప.. నిజమే కదా అని ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఈ విషయాలను దర్శకుడు చెప్పలేకపోయాడు. కేవలం ఒక బ్యాంకు ఛైర్మన్ 25 వేల కోట్ల స్కామ్ చేసినట్లు చూపించిన తీరు కూడా అతిగా అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో సినిమా ఎంతకీ ముగింపు దశకు రాకుండా సా....గుతూ వెళ్లి ప్రేక్షకులను విసుగెత్తిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు కూడా మరీ అతిగా అనిపిస్తాయే తప్ప పెద్దగా కిక్కు ఇవ్వవు. ఫైట్లు తప్పితే సగటు మాస్ ప్రేక్షకులు కోరుకునే అంశాలు లేకపోవడం 'తెగింపు'కు ప్రతికూలత. ప్రథమార్ధంలో కొన్ని మెరుపులు తప్పితే 'తెగింపు'లో అలరించే అంశాలు తక్కువ. తమిళంలో అజిత్ అభిమానులు ఊగిపోతారేమో కానీ.. తెలుగు ప్రేక్షకులు 'తెగింపు'తో కనెక్ట్ కావడం కష్టమే.

నటీనటులు:

అజిత్ సినిమాలో వన్ మ్యాన్ షో చేశాడు. పూర్తిగా అతనే స్క్రీన్ ను ఆక్రమించేశాడు. అతడి నటన స్టైలిష్ గా సాగి ఆకట్టుకుంటుంది. తెల్లగడ్డం.. జుట్టుతో అజిత్ డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. కానీ ఫిజిక్ విషయంలో మాత్రం అజిత్ నిరాశ పరిచాడు. సినిమా అంతా యాక్షనే నిండిపోయిన సినిమాలో హీరో 'షార్ప్'గా.. 'ఫిట్'గా కనిపించాలని ఆశిస్తాం. కానీ అజిత్ అదేమీ పట్టించుకున్నట్లు లేడు. మంజు వారియర్ ప్రతిభకు తగ్గ పాత్ర కాదిది. తన పాత్రలో ఎవరు చేసినా పెద్దగా తేడా ఉండేది కాదు. ఆమె నటన ఓకే. కమిషనర్ పాత్రలో సముద్రఖని ఆకట్టుకున్నాడు. అజయ్ కూడా రాణించాడు. విలన్ పాత్రలో జాన్ కొక్కెన్ ఓకే అనిపించాడు. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతిక వర్గం:

సాంకేతికంగా 'తెగింపు' మంచి ప్రమాణాలతోనే సాగింది. జిబ్రాన్ నేపథ్య సంగీతంలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. యాక్షన్ సన్నివేశాల్లో తన ముద్ర చూపించాడు. సినిమాలో పాటలకు పెద్ద ప్రాధాన్యం లేదు. ఉన్న రెండు పాటలు డబ్బింగ్ సరిగా చేయకపోవడం వల్ల అంత ఎఫెక్టివ్ గా అనిపించవు. నిరవ్ షా ఛాయాగ్రహణం బాగుంది. యాక్షన్ సీన్లు.. ఏరియల్ షాట్లలో ఆయన కెమెరా పనితనం కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. బోనీ కపూర్ ఏమాత్రం రాజీ పడలేదు. సినిమా రిచ్ గా తీశాడు. రాత-తీతలో దర్శకుడు హెచ్.వినోద్ కష్టం తెర మీద కనిపిస్తుంది కానీ.. అతను ఎంచుకున్న కథ అంత ఆసక్తికరంగా లేదు. హీరో పాత్రను తీర్చిదిద్దిన విధానం అంతగా ఆకట్టుకోదు. ఆ పాత్రను ప్రేక్షకులతో ఎమోషనల్ గా కనెక్ట్ చేయలేకపోయాడు. కథ.. ప్రైవేటు బ్యాంకుల మోసాల గురించి చెప్పిన విషయాలు కూడా గందరగోళంగా అనిపిస్తాయి. కొన్ని ఎపిసోడ్ల వరకు ఆకట్టుకున్నప్పటికీ.. ఓవరాల్ గా అతను నిరాశ పరిచాడు.

చివరగా: తెగింపు.. ఓన్లీ యాక్షన్ నో ఎమోషన్

రేటింగ్-1.75/5

LATEST NEWS