తరగతి గది దాటి (వెబ్ సిరీస్)

Sun Aug 22 2021 GMT+0530 (IST)

తరగతి గది దాటి (వెబ్ సిరీస్)

వెబ్ సిరీస్ : ‘తరగతి గది దాటి’
నటీనటులు: హర్షిత్ రెడ్డి-పాయల్ రాధాకృష్ణ-నిఖిల్ దేవాదుల-స్నేహల్-రమణ భార్గవ తదితరులు
సంగీతం: నరేన్ సిద్దార్థ
ఛాయాగ్రహణం: మోనిష్ భూపతిరాజు
నిర్మాత: అరుణాభ్ కుమార్
దర్శకత్వం: మల్లిక్ రామ్

తెలుగు వారి ఓటీటీ ఆహా.. మరో తెలుగు వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే.. తరగతి గది దాటి. ఇంతకుముందు సుమంత్ హీరోగా ‘నరుడా డోనరుడా’ అనే సినిమా తీసిన మల్లిక్ రామ్ రూపొందించిన సిరీస్ ఇది. ‘మెయిల్’తో ఆశ్చర్యపరిచిన కొత్త కుర్రాడు హర్షిత్ రెడ్డి.. కన్నడ నుంచి వచ్చిన కొత్తమ్మాయి పాయల్ రాధాకృష్ణ జంటగా నటించారిందులో. హిందీ వెబ్ సిరీస్ ‘ఫ్లేమ్స్’ ఆధారంగా తెరకెక్కిన ‘తరగతి గది దాటి’ చక్కటి ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఆ మెరుపులు ట్రైలర్ వరకే పరిమితమా..? సిరీస్ కూడా అంతే ఆకర్షణీయంగా ఉందా..? ‘తరగతి గది దాటి..’ లోపలికి వెళ్లి తెలుసుకుందాం పదండి.

ఓ చిన్న టౌన్లో కాలేజీలో చదువుకునే ఓ మధ్య తరగతి టీనేజీ అబ్బాయి.. ఓ షాపులో అనుకోకుండా ఓ అమ్మాయిని చూసి వెంటనే ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయి మెరుపులా మెరిసి మాయం అయ్యాక ఆ చిన్న టౌన్లో తన కోసం వెతుకులాట ప్రారంభిస్తాడు. తననెలా పట్టుకోవాలా అని చూస్తున్న సమయంలో తండ్రి నడిపే ట్యూషన్ సెంటర్లో చేరడానికి ఆ అమ్మాయే తమ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది. అప్పటిదాకా తండ్రి ఎంత పోరు పెడుతున్నా ట్యూషన్లో చేరడానికి ఇష్టపడిన ఆ అబ్బాయి.. ఆ అమ్మాయి కోసమని తనూ తండ్రి పాఠాలు వినడానికి సిద్ధపడతాడు. ఇక అక్కడ ఆ అమ్మాయితో ఆ అబ్బాయికి పరిచయం.. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం.. ఆపై అనుకోని అపార్థాలు.. ఎడబాటు.. చివరికి ఒక సుఖాంతం.. ఇదీ సింపుల్ గా ‘తరగతి గది దాటి’ కథ.

ఇంతకుముందు ‘విక్కీ డోనర్’ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు మల్లిక్ రామ్. హిందీలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన చిత్రాన్ని తెలుగులో అతను ప్రభావవంతంగా తీయలేకపోయాడు. రీమేక్ లతో వచ్చిన ఇబ్బంది ఇదే. బాగుంటే ఒరిజినల్ కు క్రెడిట్ వెళ్తుంది. తేడా కొడితే దర్శకుడు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఐతే హిందీలో యువతను విశేషంగా ఆకట్టుకున్న ‘ఫ్లేమ్స్’ వెబ్ సిరీస్ ను తెలుగులో తీయడంలో మాత్రం మల్లిక్ మంచి ప్రతిభే చూపించాడు. నిజానికి ‘ఫ్లేమ్స్’కు ఇది రీమేక్ లా ఎంతమాత్రం అనిపించదు. ఇదొక చక్కటి అడాప్షన్ అని చెప్పొచ్చు. రీమేక్ అన్న ఫీలింగ్ ఎంతమాత్రం రాకుండా.. మన నేటివిటీతో.. ఒక ఒరిజినల్ ఫీలింగ్ తో సాగుతుందీ సిరీస్. ఆరంభం నుంచి చివరి దాకా ఇందులో కనిపించే ‘ఫీల్ గుడ్’ ఫ్యాక్టర్ ‘తరగతి గది దాటి’కి అతి పెద్ద ఆకర్షణ. టీనేజీ లవ్ స్టోరీ.. పైగా వెబ్ సిరీస్ అనగానే బోలెడంత బూతు నింపేయడానికి స్కోపుంది. కానీ మల్లిక్ అండ్ టీమ్ అలాంటి వాటి జోలికే వెళ్లకుండా యూత్ మాత్రమే కాక.. ఫ్యామిలీ ఆడియన్స్ సైతం చూసి ఎంజాయ్ చేసేలా నీట్ గా ఈ సిరీస్ ను తీర్చిదిద్దింది. కథ పరంగా కొత్తగా ఏమీ అనిపించకపోయినా.. ఏ దశలోనూ బోర్ కొట్టించకుండా చకచకా.. ఏక బిగిన ఐదు ఎపిసోడ్లు లాగించేసేలా ఈ సిరీస్ ముస్తాబైంది.

ప్రేమకథల్లో కథ పరంగా అన్నిసార్లూ కొత్తదనం ఆశించలేం. ‘ఉప్పెన’లో మాదిరి ఏదైనా సంచలన విషయం ఉంటే తప్ప కొత్తగా ఉంది అనే మాట ప్రేక్షకుల నుంచి రాదు. 99 శాతం ప్రేమకథలు ఒక టెంప్లేట్ లోనే సాగిపోతుంటాయి. అమ్మాయిని అబ్బాయి అనుకోకుండా చూసి ప్రేమలో పడటం.. తర్వాత తన చుట్టూ తిరగడం.. ఆమెను ఇంప్రెస్ చేయడం.. అంతా బాగుందనుకున్న టైంలో ఇద్దరి మధ్య ఎడబాటు రావడం.. చివరికి కథ సుఖాంతం కావడం.. ఈ టెంప్లేట్లో తెలుగులోనే వందల సంఖ్యలో సినిమాలు వచ్చి ఉంటాయి. ‘తరగతి గది దాటి’ కూడా అచ్చంగా ఇదే ఫార్ములానే అనుసరించినప్పటికీ.. ప్రేక్షకులకు అదేమంత సమస్యగా అనిపించదు. అందుక్కారణం.. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్.. అలాగే ప్రేక్షకులు.. ముఖ్యంగా యువత రిలేట్ చేసుకునే వాస్తవికమైన పాత్రలు.. స్వీట్ మూమెంట్స్ ఇందులో ఉండటమే. ‘హ్యాపీ డేస్’ లాంటి కొన్ని సినిమాలను గుర్తు చేసినప్పటికీ.. ఆ విషయాన్ని ప్రేక్షకులను ఎక్కడా స్ట్రక్ అయి ఆలోచించేలా చేయకుండా మంచి ఫ్లోతో నడిచిపోతుంది ‘తరగతి గది దాటి’. ఆలోచిస్తే ఏ సన్నివేశం కూడా కొత్తగా అనిపించదు కానీ.. అలా ఆలోచించే అవకాశం ఇవ్వకుండా చకచకా ఎపిసోడ్లు అయిపోతుంటాయి.

ఈ లవ్ స్టోరీ కాలేజీలో జరిగితే మరీ రొటీన్ అయ్యేదేమో కానీ.. ట్యూషన్ నేపథ్యాన్ని ఎంచుకోవడం.. పైగా హీరో తండ్రి నడిపే ట్యూషన్ కి హీరోయిన్ రావడం నేపథ్యం కొంచెం భిన్నంగా అనిపిస్తుంది. ప్రతి ఎపిసోడ్ ఆరంభంలో ప్రేమకు గణితానికి ముడిపెడుతూ ఇచ్చే ఇంట్రోతో కథలోకి తీసుకెళ్లడం.. చివర్లో ఒక ముక్తాయింపునివ్వడం ఆకట్టుకుంటాయి. హీరో హీరోయిన్లద్దరూ ఆకర్షణీయంగా ఉండటం.. చక్కగా నటించడంతో.. చాలా సింపుల్ గా ఉంటూనే బ్యూటిఫుల్ గా అనిపించే సన్నివేశాలతో వారి లవ్ స్టోరీని నడిపించడంతో ఆ ట్రాక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దీనికి సమాంతరంగా హీరో.. అతడి ఇద్దరు స్నేహితుల వ్యవహారాన్ని నడిపించారు. ‘హ్యాపీడేస్’లో నిఖిల్-గాయత్రిల పాత్రలు.. వారి లవ్ స్టోరీని వీరి ట్రాక్ గుర్తు చేస్తుంది. లీడ్ పెయిర్ మాదిరే వీళ్లిద్దరూ కూడా చక్కగా నటించారు. రెండూ టీనేజీ ప్రేమకథలే అయినప్పటికీ సిల్లీగా అనిపించకుండా.. పరిణతితోనే డీల్ చేయడం.. చదువు ప్రాధాన్యాన్ని తెలియజేసేలా సన్నివేశాలుండటం.. తల్లిదండ్రుల పాత్రలను కూడా ప్రేక్షకులు రిలేట్ చేసుకునేలా తీర్చిదిద్దడంతో ఎమోషన్లు కూడా వర్కవుట్ అయ్యాయి. అన్ని ఎపిసోడ్లలోకి హీరో హీరోయిన్లు ఒకరికొకరు దగ్గరయ్యే మిడిల్ ఎపిసోడ్ ఎక్కువ ఆకట్టుకుంటుంది. వీళ్లిద్దరి మధ్య ఎడబాటు వచ్చే ఎపిసోడ్ దగ్గర్నుంచి కొంచెం సాగతీతగా అనిపించినా.. ముగింపులో ‘తరగతి గది దాటి’ మురిపిస్తుంది. ముఖ్యంగా అందులో తండ్రి పాత్రను హైలైట్ చేసిన తీరు చాలా బాగుంటుంది.

ఏ ఎపిసోడ్ కూడా ల్యాగ్ అనిపించకుండా అటు ఇటుగా 25 నిమిషాల్లో ముగించడం.. మొత్తంగా సిరీస్ నిడివి తక్కువ ఉండటంతో ‘తరగతి గది దాటి’కి పెద్ద ప్లస్. ‘మెయిల్’లో మాదిరే హర్షిత్ రెడ్డి ఇందులోనూ చక్కటి నటనతో ఆకట్టుకున్నాడు. అతడిలో బేసిగ్గానే ఒక అమాయకత్వం కనిపిస్తుంది. అది ఈ పాత్రకు బాగా సూటయ్యింది. ఇలాంటి పాత్రల్లో చాలామంది కుర్రాళ్లలా అవసరానికి మించి యాక్ట్ చేసేస్తుంటారు. కానీ హర్షిత్ మాత్రం కొలిచినట్లు నటించాడు. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ అందంగా ఉంది. తన స్క్రీన్ ప్రెజెన్స్.. నటన ఆకట్టుకుంటాయి. ఐతే హర్షిత్ పక్కన ఆ అమ్మాయి కాస్త పెద్దదిగా అనిపిస్తుంది. బాలనటుడిగా పరిచయం ఉన్న నిఖిల్ దేవాదుల హుషారుగా నటించాడు. స్నేహల్ కూడా బాగా చేసింది. నటన విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వాళ్లలో హీరో తండ్రి పాత్ర చేసిన రమణ భార్గవ ఒకడు. కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాని రమణలో ఇంత మంచి నటుడు ఉన్నాడా అనిపిస్తుంది ఈ సిరీస్ చూస్తే. అతడి వాయిస్ కూడా చాలా బాగుంది. ఈ సిరీస్ అతడికి మంచి అవకాశాలు రావచ్చు. హీరో తల్లి పాత్రలో చేసిన నటి.. బజ్జీ కొట్టు నడిపే వ్యక్తిగా చేసిన నటుడు కూడా ఆకట్టుకున్నారు. సంగీత దర్శకుడు నరేన్.. కెమెరామన్ మోనిష్ చక్కటి పనితనం చూపించారు. చిన్న చిన్న పాటలు.. నేపథ్య సంగీతం.. విజువల్స్ ప్లస్ అయ్యాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. కిట్టు విస్సాప్రగడ మాటలు బాగా కుదిరాయి. దర్శకుడు మల్లిక్ రామ్ తన ప్రతిభను చాటాడు. అతడి యూత్ ఫుల్ నరేషన్ ఆకట్టుకుంటుంది. సెకండ్ సీజన్ దిశగా సంకేతాలు రావడంతో దాని కోసం ఎదురు చూసేలా చేస్తుంది ‘తరగతి గది దాటి’.

చివరగా: తరగతి గది దాటి.. సింపుల్ అండ్ బ్యూటిఫుల్

రేటింగ్- 3/5

LATEST NEWS