‘తేజ్ ఐ లవ్యూ’

Fri Jul 06 2018 GMT+0530 (IST)

‘తేజ్ ఐ లవ్యూ’

చిత్రం : ‘తేజ్ ఐ లవ్యూ’

నటీనటులు: సాయిధరమ్ తేజ్ - అనుపమ పరమేశ్వరన్ - జయప్రకాష్ - అనీష్ కురువిల్లా - పృథ్వీ-వైవా హర్ష - పవిత్ర లోకేష్ తదితరులు
సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం: ఐ.ఆండ్రూ
మాటలు: డార్లింగ్ స్వామి
నిర్మాత: కె.ఎస్.రామారావు
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ఎ.కరుణాకరన్

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన కొత్త సినిమా ‘తేజ్ ఐ లవ్యూ’. ఇన్నాళ్లూ మాస్ కథలే ట్రై చేసిన తేజు.. తొలిసారిగా పూర్తి స్థాయి ప్రేమకథలో నటించిన సినిమా ఇది. లవ్ స్టోరీల స్పెషలిస్టు ఎ.కరుణాకరన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రమైనా తేజుకు ఆశించిన ఫలితాన్నిచ్చిందో లేదో చూద్దాం పదండి.

కథ:

తేజ్ (సాయిధరమ్ తేజ్) చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన కుర్రాడు. అతను చేయని తప్పుకు ఏడేళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవిస్తాడు. తర్వాత అతడిని పెదనాన్న కుటుంబం ఆదరిస్తుంది. కానీ తేజ్ చేసిన ఓ పని వల్ల ఆ కుటుంబం కూడా అతడిని దూరం పెడుతుంది. కాలేజీలో చదువుకుంటూ మ్యూజిక్ బ్యాండ్ నడుపుతున్న తేజ్ కు ఆ సమయంలోనే లండన్ నుంచి ఓ పని మీద వైజాగ్ వచ్చిన నందిని (అనుపమ పరమేశ్వరన్) పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు తేజ్. నందిని కూడా అతడిని ఇష్టపడుతుంది. కానీ అనుకోని పరిణామంతో నందిని.. తన గతాన్ని మరిచిపోతుంది. తేజ్ ను కొత్త వ్యక్తిలా చూస్తుంది. ఆ స్థితిలో తేజ్ ఏం చేశాడు.. నందినికి మళ్లీ గతం గుర్తుకొచ్చిందా.. తేజ్ ను ప్రేమికుడిగా అంగీకరించిందా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

తొలిసారి చూస్తే కొత్తగా అనిపించే ఏ విషయమైనా.. మళ్లీ మళ్లీ చూస్తే మొహం మొత్తుతుంది. ఎ.కరుణాకరన్ తీసిన ‘తొలి ప్రేమ’.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’.. ‘డార్లింగ్’ లాంటి సినిమాల్లో అప్పటికి కొత్తగా.. మనసుకు హత్తుకునేలా కనిపించిన చాలా అంశాలు ఇప్పుడు.. ‘తేజ్ ఐ లవ్యూ’లో చూస్తుంటే చాలా అసహనాన్ని కలిగిస్తాయి. ఇందులోని లవ్ స్టోరీ కావచ్చు.. కామెడీ సీన్స్ కావచ్చు.. ఫ్యామిలీ ఎమోషన్లు కావచ్చు.. పదే పదే కరుణాకరన్ ఒకప్పటి సినిమాల్ని తలపిస్తూనే ఉంటాయి. కానీ ఆ సినిమాల్లో ప్రేమకథలు చూస్తున్నపుడు ఉన్న ఫీల్ ఇక్కడ కనిపించదు. వాటిలో మాదిరి కామెడీ కూడా పండలేదు. ఇక ఫ్యామిలీ ఎమోషన్ల సంగతి సరేసరి. సామాజిక పరిస్థితులతో పాటు ప్రేక్షకుల అభిరుచి కూడా వేగంగా మారిపోతున్న ఈ రోజుల్లో ఒకప్పటిలా సినిమాలు తీస్తే నడవట్లేదు. అవి డ్రామాల్లాగా తయారవుతున్నాయి. తేజ్ ఐ లవ్యూ.. కూడా అలాంటి సినిమానే.

‘తేజ్ ఐ లవ్యూ’లో హీరోకు ఐలవ్యూ చెప్పడానికి హీరోయిన్ వస్తుంది. కానీ అతను మిస్సవుతాడు. అంతలో యాక్సిడెంట్ అవుతుంది. ఆమెకు మెమొరీ లాస్ అవుతుంది. కానీ అది పూర్తిగా కాదట. సరిగ్గా హీరోను కలిసే దగ్గర్నుంచి ఆమెకు గతం గుర్తు లేకుండా పోతుందట. ఎంత డ్రామా అవసరం అనుకుంటే మాత్రం సరిగ్గా హీరోతో ట్రావెల్ అయిన ఎపిసోడ్ వరకు మరిచిపోవడం ఏమిటో అర్థం కాదు. ఇంతకుముందు ‘ఎందుకంటే ప్రేమంట’లో సైతం బతికుండగానే హీరోయిన్ ఆత్మగా మారడం అంటూ ఒక విడ్డూరమైన కథ చూపించాడు కరుణాకరన్. ఇలాంటి ప్రయత్నం హాలీవుడ్లోనూ జరిగి ఉండొచ్చు. కానీ మన ప్రేక్షకులకు దాన్ని కన్విన్సింగ్ గా చెప్పడం అన్నది కీలకం. ఎంచుకున్న కథ.. కథనాన్ని చెప్పే విధానం కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. ‘తేజ్ ఐ లవ్యూ’లో ఈ మెమొరీ లాస్ ఎపిసోడ్లో లాజిక్ కనిపించదు. డ్రామా పండించడం కోసం కృత్రిమంగా ఆ ఎత్తుగడను ఎంచుకున్నట్లు అనిపిస్తుందే తప్ప.. అది సహజంగా కనిపించదు.

ఈ ఒక్క పాయింట్ మాత్రమే కాదు.. ‘తేజ్ ఐ లవ్యూ’లో చాలా ఎపిసోడ్లు.. సన్నివేశాలు ఇలా కృత్రిమంగానే అనిపిస్తాయి. లవ్ స్టోరీలో అసలెక్కడా ఫీల్ అన్న మాటే లేదు. ఓవైపు హీరోను హీరోయిన్ వేధిస్తూ ఉంటుంది. ఆమెను అతను ప్రేమిస్తున్న సంగతి కూడా ఎవరితోనూ చెప్పడు. ఆమె తనను టార్చర్ పెడుతోందనే అంటుంటాడు. కానీ అక్కడ పాట మాత్రం ‘నచ్చుతున్నదే..’ అంటూ సాగిపోతుంటుంది. ఇక చివర్లో ఒక ఎమోషనల్ ఫ్యామిలీ ఎసిసోడ్ నడుస్తుంది. అందులో హీరోయిన్ పాత్ర ఏమీ ఉండదు. కానీ ఆ ఎపిసోడ్ అయ్యీ అవ్వగానే ఫారిన్లో డ్యూయెట్ వేసుకుంటాడు హీరో. కరుణాకరన్ గతంలో తీసిన సినిమాల్లో కొత్తదనం లేకపోయినా.. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా పండేది. వాళ్ల పాత్రలు బాగుండేవి. కానీ ‘తేజ్ ఐ లవ్యూ’లో అది పూర్తిగా మిస్సయింది. తేజ్-అనుపమ మధ్య ఎక్కడా కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదు. ఇక ప్రేమ కథ పండేదెక్కడ?

ప్రేమకథల మధ్యలో చక్కటి కామెడీ కూడా పండిస్తాడని పేరున్న కరుణాకరన్.. ఈ విషయంలోనూ విఫలమయ్యాడు. వైవా హర్ష లాంటి మంచి కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్టున్నప్పటికీ కామెడీ వర్కవుట్ కాలేదు. హీరో హీరోయిన్లతోనే కామెడీ ట్రై చేశాడు కానీ అది తేలిపోయింది. ‘డార్లింగ్’ సినిమాను తలపించేలా ఫ్యామిలీ ఎపిసోడ్ పెట్టుకున్నాడు.. అదే తరహాలో సన్నివేశాలు నడిపించాడు కానీ.. కొత్తదనం లేకపోవడం వల్ల అవి కూడా ఏమంత ప్రభావవంతంగా అనిపించవు. చివర్లో మాత్రం కొంచెం సెంటిమెంట్.. ఫీల్ వర్కవుట్ చేయగలిగాడు కానీ.. మిగతా సమయమంతా చాలా భారంగా గడుస్తుంది. తలా తోకా లేని విధంగా సాగే కథాకథనాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. ప్రేమకథలకు అవసరమైన సాంకేతిక ఆకర్షణలు కూడా పెద్దగా లేకపోవడంతో ‘తేజ్ ఐ లవ్యూ’ ప్రేక్షకుల్ని తీవ్ర నిరాశకే గురి చేస్తుంది. ఒకట్రెండు పాటలు.. యువతను ఆకట్టుకునే అనుపమ పరమేశ్వరన్ అందం-నటన.. కొన్ని సన్నివేశాలు మాత్రమే ‘తేజ్ ఐ లవ్యూ’లో చెప్పుకోదగ్గ అంశాలు.

నటీనటులు:

సాయిధరమ్ తేజ్ గత సినిమాలకు భిన్నంగా కనిపించే ప్రయత్నం చేశాడు. చాలా వరకు యాక్షన్ జోలికి వెళ్లకుండా సాధారణంగా కనిపించే ప్రయత్నం చేశాడు. ఐతే ఎప్పుడూ చేయని పూర్తి స్థాయి లవ్ స్టోరీ చేసినా అతను ఇందులో కొత్తగా ఏమీ కనిపించడు. జస్ట్ ఓకే అనిపిస్తాడు. లుక్ విషయంలో తేజు కచ్చితంగా జాగ్రత్త పడాలి. అనుపమ పరమేశ్వరన్ ఆకట్టుకుంటుంది. ఆమె యువతకు బాగా నచ్చేలా కనిపించింది. తేజు కంటే కూడా ఆమె పాత్రకే సినిమాలో ప్రాధాన్యం ఎక్కువ కావడం విశేషం. అలాగని ఆ క్యారెక్టర్ కూడా అంత ప్రత్యేకమైందేమీ కాదు. జయప్రకాష్.. అనీష్ కురువిల్లా.. పవిత్ర లోకేష్ లకు కూడా అంత మంచి పాత్రలేమీ లేవు. వాళ్లు పర్వాలేదనిపిస్తారు. వైవా హర్షకు నవ్వించేందుకు పెద్దగా స్కోప్ దక్కలేదు.

సాంకేతికవర్గం:

గోపీసుందర్ సంగీతం పర్వాలేదు. కానీ ఒక లవ్ స్టోరీకి అవసరమైన స్థాయిలో ఫీల్ లేకపోయింది. పాటల్లో ఒకట్రెండు బాగున్నాయి. ‘అందమైన చందమామ..’ పాట ఒక్కటి మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంది. నేపథ్య సంగీతం ఇంకా బాగుండాల్సిందనిపిస్తుంది. ఐ.ఆండ్రూ ఛాయాగ్రహణం పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లున్నాయి. డార్లింగ్ స్వామి మాటల్లో ఏ ప్రత్యేకతా లేదు. చాలా సాధారణంగా అనిపిస్తాయి డైలాగ్స్. ఇక దర్శకుడు కరుణాకరన్ కాలానికి తగ్గట్లుగా మారలేదనిపిస్తుంది. తన సినిమాల్నే అటు తిప్పి ఇటు తిప్పి ‘తేజ్ ఐ లవ్యూ’ తీసినట్లుగా ఉంది. దర్శకుడిగా కరుణాకరన్ పూర్తిగా ఔట్ డేట్ అయిపోయాడనిపించేలా తయారైంది ‘తేజ్ ఐ లవ్యూ’.

చివరగా: తేజ్ ఐ లవ్యూ.. ఫీల్ లేని ప్రేమకథ

రేటింగ్- 2/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS