'సూర్యకాంతం'

Sat Mar 30 2019 GMT+0530 (IST)

'సూర్యకాంతం'

చిత్రం: 'సూర్యకాంతం'

నటీనటులు: నిహారిక-రాహుల్ విజయ్-పెర్లీన్ బెహరా-సుహాసిని-శివాజీ రాజా-సత్య తదితరులు
సంగీతం: మార్క్ కె.రాబిన్
ఛాయాగ్రహణం: హరి జాస్తి
నిర్మాతలు: సందప్ ఎర్రంరెడ్డి-సృజన్ యరబోలు-రామ్ నరేష్
రచన-దర్శకత్వం ప్రణీత్ బ్రమండపల్లి

మెగా ఫ్యామిలీ నుంచి కెమెరా ముందుకొచ్చిన తొలి అమ్మాయిగా కొణిదెల నిహారికకు మొదట్లో మంచి హైపే కనిపించింది. కానీ ఆమె నటించిన తొలి సినిమా ‘ఒక మనసు’ కానీ.. మలి సినిమా ‘హ్యాపీ వెడ్డింగ్’ కానీ ఆకట్టుకోలేకపోయాయి. కొంచెం గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘సూర్యకాంతం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది నిహారిక. ఈసారైనా హిట్టు కొట్టాలన్న ఆమె ఆశలన్ని ‘సూర్యకాంతం’ ఏమేరకు నిలబెట్టిందో చూద్దాం పదండి.

కథ:

సూర్యకాంతం (నిహారిక) ఒక టిపికల్ మనస్తత్వం ఉన్న అమ్మాయి. చిన్నతనంలో తగిలిన ఎదురు దెబ్బల కారణంగా ఆమె నిలకడ లేని మనస్తత్వంతో ఉంటుంది. కమిట్మెంట్ ఫోబియాతో ఇబ్బంది పడుతూ.. ఎదుటి వాళ్లను కూడా ఇబ్బంది పెడుతుంటుంది. అలాంటి అమ్మాయితో అనుకోకుండా అభి (రాహుల్ విజయ్)కి పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ కూడా పుడుతుంది. ఇది ముదిరి పాకాన పడే సమయంలో తనకున్న బలహీనత వల్ల అభిని విడిచి ఎక్కడికో వెళ్లిపోతుంది సూర్యకాంతం. ఆమె కోసం ఎదురు చూసి విసిగిపోయి తల్లిదండ్రులు చూసిన పూజ (పెర్లీన్ బెహరా) అనే మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడతాడు అభి. ఇంతలో సూర్యకాంతం మళ్లీ అభి జీవితంలోకి తిరిగొస్తుంది. అప్పుడు ఈ ముగ్గురి జీవితాలు ఏ మలుపు తిరిగాయి అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

ప్రణీత్ బ్రమండపల్లి షార్ట్ ఫిలిమ్స్ నేపథ్యం నుంచి వచ్చిన దర్శకుడు. ఇంతకుముందు నిహారికతోనే ‘ముద్దపప్పు ఆవకాయ్’ అనే వెబ్ సిరీస్ చేశాడు. అందులో అతను బాగానే టాలెంట్ చూపించాడు. ట్రెండీగా ఉండే సింపుల్ కథల్ని ఎంచుకుని వినోదం పండించగల నైపుణ్యం ఉన్నవాడిలా కనిపించాడతను. ఐతే ఎంటర్టైన్మెట్ ప్రధానంగా నడిచే షార్ట్ ఫిలిమ్స్.. వెబ్ సిరీస్ ల్లో బలమైన కథేమీ కనిపించదు. అవి ప్రధానంగా క్యారెక్టరైజేషన్స్ మీద నడుస్తుంటాయి. వాటిలో ఎక్కువ ఇంటెన్సిటీని కూడా ప్రేక్షకులు ఆశించరు. ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం ఫన్నీగా అనిపించిందా.. ఆ సమయానికి ఎంజాయ్ చేశామా వదిలేశామా అన్నట్లుంటుంది వ్యవహారం.

కానీ సినిమాకు వచ్చేసరికి పరిస్థితి వేరు. కామెడీ అయినా సరే.. అది కొంచెం సీరియస్ గా చేయాలని కోరుకుంటారు. ఏదో ఒక కాన్సెప్ట్.. బలమైన కొన్ని పాత్రలు.. వాటికో వ్యక్తిత్వం.. వాటిని ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాలు.. కథలో ఒక ఇంటెన్సిటీ ఆశిస్తారు. లౌడ్ గా.. మరీ లాజిక్ లెస్ గా సాగే మాస్ కామెడీలైతే ఎలా లాగించేసినా ఓకే కానీ.. సునిశితమైన హాస్యం పండించాలనుకున్నపుడు మాత్రం పై లక్షణాలన్నీ అవసరం. కానీ ప్రణీత్ అలాంటి కసరత్తు పెద్దగా చేయకుండా షార్ట్ ఫిలిమ్స్.. వెబ్ సిరీస్ తరహాలో సీరియస్నెస్ లేని కామెడీ ట్రై చేశాడు. అది కూడా ఓకే అనుకుందాం. అతను ఎమోషన్లతో గుండె పిండాలని కూడా చేశాడు. కానీ ‘సూర్యకాంతం’ రెంటికీ చెడింది. అతను అనుకున్న కథలో వినోదం పండించడానికి స్కోప్ ఉండి కూడా సినిమా స్థాయికి అవసరమైన కసరత్తు లేకుండా మరీ ‘లైట్’గా నడిపించేయడంతో తేడా కొట్టేసింది.

‘బొమ్మరిల్లు’.. ‘ఫిదా’ సినిమాల్లోని కథానాయిక పాత్రను స్ఫురించేలా ఒక తలతిక్క అమ్మాయి పాత్ర ప్రధానంగా అల్లిన కథ ఇది. కమిట్మెంట్ ఫోబియా అనేది కొత్తగా అనిపించే విషయం. ఐతే హీరోయిన్ తాలూకు ఈ తలతిక్క వ్యవహారంతో కొన్ని సన్నివేశాల్లో కామెడీ పండించగలిగాడు దర్శకుడు. కానీ పైన చెప్పుకున్న సినిమాల్లో ‘హాసిని’ లాగానో.. ‘భానుమతి’ లాగానో ‘సూర్యకాంతం’ విషయంలో ‘ఏం అమ్మాయిరా బాబూ’ అనిపించే ఫీలింగ్ తీసుకురాలేకపోయాడు. ఆ పాత్రతో ఎమోషనల్ కనెక్ట్ ఏర్పరచలేకపోయాడు. దీంతో ఆ క్యారెక్టర్ తో ప్రేక్షకులు ట్రావెల్ కాలేకపోయారు. ఈ పాత్రలో ఇంకొంచెం డెప్త్ ఉంటే దాన్ని ప్రేక్షకులు సీరియస్ గా తీసుకునేవాళ్లేమో.

‘సూర్యకాంతం’ కథను మొదలుపెట్టిన తీరు.. ఆపై ప్రథమార్ధంలో వచ్చే కొన్ని కామెడీ సీన్ల వరకు ఓకే అనిపిస్తుంది. కానీ అభి-సూర్యకాంతం మధ్య లవ్ స్టోరీలో కాస్తయినా ఫీల్ లేకపోవడం.. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి సరైన కారణాలే చూపించపోవడంతో వాళ్ల ప్రేమకథను సీరియస్ గా తీసుకోం. దీంతో వాళ్లిద్దరి మధ్య దూరం వచ్చినా ఏ ఫీలింగ్ కలగదు. మళ్లీ సూర్యకాంతం వెనక్కి వచ్చినా వాళ్లిద్దరూ మళ్లీ కలవాలన్న భావనా ఉండదు. సూర్యకాంతం పాత్ర మీద సింపతీ తేవడానికి ద్వితీయార్ధంలో ప్రయత్నం జరిగింది కానీ.. అదంతా బలంగా లేకపోయింది. ఆ పాత్రే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉండి.. దాని విషయంలో ఎలా స్పందించాలో తెలియని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది.

ప్రథమార్ధంలో మాదిరి రెండో అర్ధంలో వినోదం పండకపోవడం కూడా మైనస్ అయింది. కొన్నిచోట్ల బ్యాగ్రౌండ్ స్కోర్ ద్వారా ఎమోషన్ కోసం ప్రయత్నించారు తప్పితే.. ఒరిజినల్ గా సన్నివేశాలు పాత్రలు మాత్రం ఎలాంటి భావోద్వేగాలు రగిలించలేకపోయాయి. క్లైమాక్స్ లో ప్రేక్షకుడి ఊహకు భిన్నమైన ముగింపునివ్వడానికి ప్రయత్నం జరిగింది కానీ.. ఏ పాత్రతో ఎమోషనల్ కనెక్షన్ లేనపుడు ప్రేక్షకుడి ఏ ఫీలింగైనా ఎందుకుంటుంది? తక్కువ నిడివితో ఒక షార్ట్ ఫిలింలా తీయాల్సిన కథను ఒక సినిమాగా లాగితే ఎలా ఉంటుందో ‘సూర్యకాంతం’ అలా అనిపిస్తుంది. ఇందులో విషయం లేదని కాదు.. కానీ రెండు గంటల నిడివికి తగ్గ స్టఫ్ ఉన్న కథైతే కాదిది.

నటీనటులు:

నిహారిక నటిగా స్కోర్ చేయడానికి మంచి అవకాశం ఇచ్చిన పాత్ర సూర్యకాంతం. ఐతే కథ మొత్తం తన చుట్టూ తిరిగే పాత్రను ఆమె మోయలేకపోయింది. పాత్రను సరిగా తీర్చిదిద్దకపోగా.. నిహారిక దానికి ఎలాంటి అదనపు బలం తీసుకురాలేకపోయింది. ‘ముద్దపప్పు ఆవకాయ్’లో చూసి ఆమె కామెడీ బాగా చేయగలదని..  ఎమోషన్లు పండించడంలో వీక్ అని అనుకుంటాం కానీ.. ఈ సినిమాలో ఆశ్చర్యకరంగా ఎమోషనల్ సీన్లలోనే పర్వాలేదనిపించింది. కామెడీ సీన్లలోనే వీక్ గా కనిపించింది. రాహుల్ విజయ్ లుక్స్ పరంగా ఆకట్టుకున్నాడు. అతడి నటనలోనూ నిలకడ కనిపించలేదు. కొన్ని సీన్లలో ఓకే అనిపించినా.. కొన్ని చోట్ల తేలిపోయాడు. కొత్తమ్మాయి పెర్లీన్ బెహరా చూడ్డానికి అందంగా ఉంది. నటన పర్వాలేదు. పెర్లీన్ కంటే కూడా ఆమె వాయిస్ ఎక్కువ గుర్తుంటుంది. ఆమె కనిపించినా ప్రతిసారీ తనకు చెప్పిన డబ్బింగే హైలైట్ అయింది. సుహాసిని తక్కువ సీన్లలో కనిపించినా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ పాత్ర ఇంకాసేపు ఉంటే బావుండేదనిపిిస్తుంది. సత్య ఉన్నంతలో బాగానే నవ్వించాడు. శివాజీ రాజా గురించి చెప్పడానికేమీ లేదు.

సాంకేతికవర్గం:

ఇలాంటి రొమాంటిక్ కామెడీలకు సంగీతం బలంగా నిలవాల్సిన అవసరముంది. కానీ మార్క్ కె.రాబిన్ అలాంటి ఔట్ పుట్ ఇవ్వలేకపోయాడు. పాటలేవీ కూడా గుర్తుంచుకునేలా లేవు. వచ్చాయి వెళ్లాయి అన్నట్లున్నాయి. నేపథ్య సంగీతంలోనూ ప్రత్యేకత కనిపించలేదు. హరి జాస్తి ఛాయాగ్రహణం పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ ప్రణీత్ బ్రమండపల్లి ట్రెండీగా డైలాగులు రాయడంలో.. కామెడీని డీల్ చేయడంలో అక్కడక్కడా ప్రతిభ చాటుకున్నాడు. కానీ ఫీచర్ ఫిలిం స్థాయికి తగ్గ కథాకథనాలు.. పాత్రలు తీర్చిదిద్దుకోవడంలో అతను ఫెయిలయ్యాడు. ఇంకాస్త కసరత్తు చేస్తే ‘సూర్యకాంతం’తో తనదైన ముద్ర వేయగలిగేవాడు.

చివరగా: సూర్యకాంతం.. కాంతి సరిపోలేదమ్మా!

రేటింగ్-2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS