'సీత'

Fri May 24 2019 GMT+0530 (IST)

'సీత'

చిత్రం : 'సీత'

నటీనటులు: కాజల్ అగర్వాల్ - బెల్లంకొండ శ్రీనివాస్ - సోనూ సూద్ - మన్నారా చోప్రా - భాగ్యరాజ్ - తనికెళ్ల భరణి - అభినవ్ గోమఠం - అభిమన్యు సింగ్ తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: శిర్షా రాయ్
మాటలు: లక్ష్మీ భూపాల
నిర్మాత: అనిల్ సుంకర
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: తేజ

ఒకప్పుడు వరుసగా బ్లాక్ బస్టర్లు అందించి.. మధ్యలో ఒక దశాబ్దంన్నర పాటు హిట్టు రుచే చూడకుండా ఉండిపోయిన దర్శకుడు తేజ.. రెండేళ్ల కిందట ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. దీని తర్వాత అనివార్య కారణాలతో కొంత విరామం తీసుకున్న తేజ.. కాజల్ అగర్వాల్ బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో ‘సీత’ అనే లేడీ ఓరియెంటెడ్ టచ్ ఉన్న సినిమా తీశాడు. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమాతో తేజ ఫామ్ కొనసాగిందో లేదో చూద్దాం పదండి.

కథ:

సీత (కాజల్ అగర్వాల్) 5 వేల కోట్ల ఆస్తిపరురాలైన పెద్దింటి అమ్మాయి. ఐతే డబ్బే ప్రధానం అనుకునే ఆమెలో చాలా అవలక్షణాలుంటాయి. తన దూకుడు కారణంగా ఆమె స్థానిక ఎమ్మెల్యే బసవరాజు (సోనూ సూద్) ఉచ్చులో చిక్కుకుంటుంది. మరోవైపు తన ఆస్తి మొత్తాన్ని తన బావ రఘురామ్ (బెల్లంకొండ శ్రీనివాస్) పేరు మీద రాసి తండ్రి చనిపోవడంతో అతడిని తప్పక పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది సీతకు. కానీ మనిషి ఎదిగినా మనసు ఎదగని రామ్ అంటే సీతకు అస్సలు నచ్చదు. ఐతే అతడిని మోసం చేసి తన డబ్బులు రాబట్టుకోవాలని చూస్తుంది సీత. కానీ పరిస్థితులు ఆమెకు కలిసి రావు. మరి ఈ చిక్కులన్నింటినీ సీత ఎలా ఛేదించింది.. సీతకు రామ్ ఎలా సాయపడ్డాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

కొన్నిసార్లు కథ సాధారణంగా అనిపించినా.. ప్రధాన పాత్రల క్యారెక్టరైజేషన్ బాగుండి.. వాటి ద్వారా వినోదం పండించగలిగితే ప్రేక్షకుల్ని అలరించవచ్చు. ‘సీత’ సినిమా విషయంలో దర్శకుడు తేజ ఆలోచన ఇదే కావచ్చు. ఇందులో కథ గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. ప్రధానమైన మూడు పాత్రల క్యారెక్టరైజేషన్ మీద సినిమా నడుస్తుంది. డబ్బే లోకం అనుకునే హీరోయిన్.. ఆమెను అనుభవించాలని తపించిపోయే విలన్.. కల్లాకపటం తెలియని స్వాతిముత్యం లాంటి హీరో.. ఈ ముగ్గురివీ ఆసక్తికరంగా అనిపించే పాత్రలే. ఇలాంటి క్యారెక్టర్లు చేయడానికి సరైన నటీనటుల్ని ఎంచుకోవడం అత్యంత కీలకమైన విషయం. సీతగా కాజల్ అగర్వాల్.. బసవగా సోనూ సూద్ పర్ఫెక్టుగా సూటయ్యారు. తమ పాత్రల్ని సాధ్యమైనంత మేర పండించారు. కానీ ‘స్వాతిముత్యం’ తరహా పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ ను ఎంచుకోవడంతోనే వచ్చింది సమస్య. ఇప్పటిదాకా అతను చేసినవన్నీ మాస్ మసాలా సినిమాలు. నటుడిగా నిరూపించుకున్నదేమీ లేదు. మరి అలాంటి నటుడిని టిపికల్ రఘురామ్ పాత్రకు ఎంచుకోవాలని తేజకు ఎలా అనిపించిందో ఏమో? ఈ పాత్ర పరిచయం అయిన ఐదు నిమిషాలకే అర్థమైపోతుంది అతను మిస్ ఫిట్ అని. ఇక రెండున్నర గంటల పాటు ఆ పాత్రతో ప్రయాణం ఎలా ఉంటుందో అంచనా వేసుకోండి.

సినిమాలో వినోదం మొత్తం హీరో పాత్రతో ముడిపడ్డదే. శరీరానికి పాతికేళ్ల వయసొచ్చినా మనసు మాత్రం పదేళ్ల దగ్గర ఆగిపోయి.. చిన్నతనం నుంచి ఒక ఆశ్రమానికే పరిమితం అయిన కుర్రాడు.. ఉన్నట్లుండి మామూలు సొసైటీలోకి వస్తే ఎలా ఉంటుందో వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాడు తేజ. ఆ పాత్ర ప్రవర్తన చిత్రంగా ఉండి నవ్వులు పండటానికి మంచి అవకాశమే అభించింది. కానీ ఆ పాత్ర ప్రవర్తనతో మనల్ని నవ్వించడానికంటే ముందు బెల్లంకొండ శ్రీనివాస్ హావభావాలు అతడి నటన చూసి మనకు నవ్వు ఆగదు. మొదట్లో అతడి నటన ‘ఆడ్’గా మాత్రమే అనిపిస్తుంది. కానీ తర్వాత తర్వాత దానికి అలవాటు పడిపోయిన నవ్వడం మొదలు పెడతాం. ఒకటా రెండా.. ఇలా కడుపు చెక్కలు చేసేసే సన్నివేశాలకు లెక్కే లేదు. మొత్తం కథాకథనాల్లోని ఇంటెన్సిటీనంతా తీసి పక్కన పెట్టేసి సిల్లీగా మార్చేసే స్థాయిలో బెల్లంకొండ శ్రీనివాస్ చెలరేగిపోయాడు. ఇలాంటి స్వాతిముత్యం పాత్రలో కమల్ హాసన్ లాంటి దిగ్గజాన్ని చూసి బెల్లంకొండ శ్రీనివాస్ ను చూడాలంటే ఎలా ఉంటుందో చెప్పేదేముంది? కమల్ కాకపోయినా ‘రన్ రాజా రన్’లో ఇలాంటి పాత్రతోనే అలరించిన శర్వానంద్ లాంటి వాడైనా చేయాల్సిన క్యారెక్టర్ ఇది. కానీ దానికి ఎంతమాత్రం సూట్ కాని నటుడిని పెట్టి ‘సీత’ను ఎంతగా చెడగొట్టాలో అంతగా చెడగొట్టాడు తేజ.

కాకపోతే శ్రీనివాస్ ఎలా నటించినా కూడా ఆ పాత్రే అంతో ఇంతో వినోదాన్ని పంచుతూ సాగుతుంది. ‘సీత’లో చెప్పుకోదగ్గ పెద్ద ఆకర్షణ అదే. కామెడీ టచ్ ఉన్న విలన్ పాత్రలో సోనూ సూద్.. తన చుట్టూనే తిరిగే లీడ్ రోల్ లో కాజల్ అగర్వాల్ తమ వంతుగా కాస్త ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశారు కానీ.. అతి సాధారణమైన కథాకథనాలతో ‘సీత’ రసం తీసి పెట్టేశాడు తేజ. సినిమాలోని కాన్ఫ్లిక్ట్ పాయింటే చాలా వీక్. ఇటు విలన్.. అటు హీరోయిన్ ఇద్దరూ కూడా నీచమైన మనస్తత్వం ఉన్నవాళ్లే. కానీ ఇద్దరి మధ్య జరిగిన ఒక అగ్రిమెంట్ (హీరోయిన్ డబ్బులు కట్టకుంటే నెల రోజులు అతడితో సహజీవనం చేయాలట)కు కట్టుబడి ప్రవర్తిస్తుంటారు. ఆ అగ్రిమెంట్ చుట్టూనే కథ మొత్తం నడుస్తుంది.విలన్ కావాలంటే హీరోయిన్ని బలవంతంగా తన సొంతం చేసుకోవచ్చు. హీరోయిన్ అనుకుంటే అగ్రిమెంట్ తూచ్ అనొచ్చు. వాళ్ల మనస్తత్వాలు అలా కనిపిస్తాయి మరి. కానీ హీరోయిన్ని తన పక్కలోకి రప్పించడానికి లీగల్ గా ఇరికించే ప్రయత్నం చేస్తుంటాడు విలన్. అతడి చేతికి చిక్కకుండా ఉండేందుకు హీరోయిన్ ప్రయత్నిస్తుంటుంది. ఈ వ్యవహారం మొత్తం చాలా కృత్రిమంగా అనిపించి ఏ దశలోనూ కథతో కనెక్ట్ కాని పరిస్థితి కనిపిస్తుంది.

ఇక హీరో పాత్ర ఎంత కృత్రిమంగా ఉందో చూద్దాం. అమ్మాయి స్నానం చేస్తుంటే లోపలికి వెళ్లకూడదన్న ఇంగితం కూడా లేని హీరో.. ఒక పది నిమిషాలు చదివిన లా పుస్తకంలోని పాయింట్లు పట్టుకుని కోర్టులో జడ్జి లాయర్లు విస్తుబోయేలా వాదిస్తాడు. ఇంత కాంట్రాడిక్షన్ ఏంటో అర్థం కాదు. కామెడీ కోసం రాసుకున్న సిల్లీ సన్నివేశాల వల్ల.. అసహజమైన పాత్రల వల్ల ఎక్కడా కూడా కథలో సీరియస్నెస్ అనేదే లేకుండా పోయింది. కాకపోతే ప్రధాన పాత్రలు వేటికవే కాస్త ఫన్ జనరేట్ చేయడంతో అక్కడక్కడా కొంచెం ఎంగేజ్ అవుతాం. ఉన్నంతలో ప్రథమార్ధం పర్వాలేదు. కానీ తలాతోకా లేకుండా సాగే.. చాలా లెంగ్తీగా అనిపించే ద్వితీయార్ధంతో ‘సీత’ మీద ఉన్న కాస్త ఇంప్రెషన్ కూడా పోతుంది. అవసరం లేకున్నా కథను సాగదీయడంతో చివరికి వచ్చేసరికి ప్రేక్షకుల సహనం చచ్చిపోతుంది. మొత్తంగా చెప్పాలంటే ‘నేనే రాజు నేనే మంత్రి’ లాంటి ఇంటెన్స్ మూవీ తర్వాత తేజ నుంచి ఆశించే స్థాయి సినిమా ఇది ఎంతమాత్రం కాదు.

నటీనటులు:

సీత పాత్రలో కాజల్ మెరిసింది. కెరీర్లో చాలా ఏళ్లు రెగ్యులర్ గ్లామర్ రోల్సే చేస్తూ వచ్చిన కాజల్.. చరమాంకంలో మాత్రం ప్రత్యేకమైన పాత్రలే చేస్తోంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న సీత పాత్రకు ఆమె బాగానే సూటైంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. కాజల్ గ్లామర్ కూడా సినిమాకు ప్లస్ అయింది. ఇక కెరీర్లో తొలిసారి నటనకు బాగా స్కోప్ ఉన్న పాత్రలో నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం తేలిపోయాడు. పోలీస్ స్టేషన్ ఫైట్ సీన్ ఒక్కటి చాలు ప్రేక్షకులు అతడి హావభావాలు చూసి బెంబేలెత్తిపోవడానికి. ఈ పాత్ర చేయాలనుకోవడం అభినందనీయమే కానీ.. దానికి సరితూగే నటన ప్రదర్శించలేకపోయాడు శ్రీనివాస్. కొత్తవాళ్లతో కూడా చక్కటి నటన రాబట్టుకుంటాడని పేరున్న తేజ సైతం ఒక దశ దాటాక చేతులెత్తేసినట్లే ఉన్నాడు. టిపికల్ విలన్ పాత్రలో సోనూ సూద్ ఉన్నంతలో బాగానే చేశాడు. కానీ ఆ పాత్రను ఇంకా బాగా తీర్చిదిద్దాల్సిందనిపిస్తుంది. ‘ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్ అభినవ్ గోమఠం మంచి ఈజ్ తో నటించాడు. తనికెళ్ల భరణి అలవాటైన పాత్రలో ఓకే అనిపించాడు. మన్నారా చోప్రా గురించి చెప్పడానికేమీ లేదు. భాగ్యరాజ్.. అభిమన్యు సింగ్ ఓకే.

సాంకేతికవర్గం:

అనూప్ రూబెన్స్ ఫాంలో లేని సంగతి మరోసారి రుజువైంది. పాటలేవీ కూడా రిజిస్టర్ అయ్యేలా లేవు. ఒక మెలోడీ పర్వాలేదనిపించింది కానీ.. మళ్లీ వినాలనిపించేలా మాత్రం ఏ పాటా లేదు. నేపథ్య సంగీతం కూడా ఏమంత ప్రత్యేకంగా లేదు. శిర్షా రాయ్ ఛాయాగ్రహణం ఓకే. విజువల్స్ బాగానే అనిపిస్తాయి. నిర్మాణ విలువలకేమీ ఢోకా లేదు. సినిమా స్థాయికి మించి ఖర్చు పెట్టినట్లున్నాడు అనిల్ సుంకర. కానీ దర్శకుడు తేజ మాత్రం పనితనం చూపించలేకపోయాడు. తన గత సినిమా  ‘నేనే రాజు నేనే మంత్రి’లో పవర్ ఫుల్ క్యారెక్టర్లతో బలమైన కథతో ఆద్యంతం ఒక బిగి చూపించిన తేజ.. ‘సీత’కు వచ్చేసరికి ఎక్కడా ఆ ఇంటెన్సిటీ చూపించలేకపోయాడు. అతను ఎంచుకున్న కథలో ఏ ప్రత్యేకతా లేదు. ప్రధాన పాత్రల చిత్రణ వరకు కొంచెం వైవిధ్యం చూపించే ప్రయత్నం చేశాడు. కానీ అందులోనూ నిలకడ లేదు. అసలే బలహీనమైన కథ.. ఎక్కడిక్కడ బ్రేకులు పడే డల్ స్క్రీన్ ప్లేతో మరింతగా దాన్ని నీరుగార్చేశాడు. తేజ సినిమాలు ఒకప్పుడు నచ్చినా నచ్చకపోయినా.. ఒక తీరుగా సాగేవి. కానీ ఇందులో మాత్రం సన్నివేశానికి సన్నివేశానికి సంబంధం లేని విధంగా కథనాన్ని నడిపించి ప్రేక్షకుల్ని అసహనానికి గురి చేశాడు.

చివరగా: సీత.. సతాయించేస్తుంది

రేటింగ్-2/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS