సప్తగిరి ఎక్స్ ప్రెస్

Fri Dec 23 2016 GMT+0530 (IST)

సప్తగిరి ఎక్స్ ప్రెస్

 చిత్రం : ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’

నటీనటులుః సప్తగిరి - రోషిణి - శివప్రసాద్ - పోసాని కృష్ణమురళి - షకలక శంకర్ - ఆలీ - అజయ్ ఘోష్ - షాయాజి షిండే తదితరులు
సంగీతం: బుల్గానిన్
ఛాయాగ్రహణంః రామ్ ప్రసాద్
మాటలుః రాజశేఖర్ రెడ్డి
అడిషనల్ స్క్రీన్ ప్లేః సప్తగిరి
నిర్మాతః రవికిరణ్
స్క్రీన్ ప్లే - దర్శకత్వంః అరుణ్ పవార్

కామెడీ వేషాలతో స్టార్ స్టేటస్ సంపాదించిన చాలామంది కమెడియన్లు హీరోలుగానూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సప్తగిరి కూడా ఆ బాటలోనూ నడిచాడు.‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’తో కథానాయకుడిగా మారాడు. ట్రైలర్ చూస్తే సప్తగిరి తనలోని అన్ని టాలెంట్లనూ ప్రదర్శించినట్లే కనిపించింది. మంచి కామెడీ ఎంటర్టైనర్ లాగా కనిపించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి హీరోగా సప్తగిరి ఏమేరకు అలరించాడో చూద్దాం పదండి.

కథః

సప్తగిరి (సప్తగిరి)కి నటన అంటే ప్రాణం. పెద్ద నటుడు కావాలని కలలు కంటూ.. తన తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బుల్ని తన కోరిక తీర్చుకోవడానికే ఖర్చు చేస్తుంటాడు. ఐతే సప్తగిరి తండ్రి (శివప్రసాద్)కి మాత్రం కొడుకు ఐపీఎస్ కావాలని కోరిక. కానీ సప్తగిరి మాత్రం తండ్రి మాటను పట్టించుకోడు. ఐతే ఓ సందర్భంలో సప్తగిరి తండ్రి హఠాత్తుగా ఎన్ కౌంటర్లో చనిపోవడంతో ఆయన కానిస్టేబుల్ ఉద్యోగం కొడుక్కి వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఉద్యోగంలో చేరిన సప్తగిరికి తండ్రిది మామూలు మరణం కాదని.. దాని వెనుక కుట్ర ఉందని తెలుస్తుంది. దానికి కారణమెవరో తెలుసుకుని అతను ఎలా పగ తీర్చుకున్నాడన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణః

కమెడియన్ గా కెరీర్ ఊపుమీదుండగా హీరో అవతారం ఎందుకెత్తారు అని సప్తగిరిని అడిగితే.. ఒకే తరహా కమెడియన్ వేషాలు బోర్ కొట్టేస్తున్నాయని.. తనలో ఉన్న వేరే టాలెంట్లను కూడా చూపించడానికి హీరో అవతారం ఎత్తానని అన్నాడు. ఈ మాట అన్న సప్తగిరే హీరోగా తన తొలి సినిమాకు స్క్రీన్ ప్లే కూడా అందించాడు. ప్రధానంగా రివెండ్ డ్రామాగా సాగే తమిళ సినిమా ‘తిరుడన్ పోలీస్’కు మార్పులు చేర్పులు చేసి.. కావాల్సినన్ని కమర్షియల్ హంగులు అద్దడంలోనూ సప్తగిరి హ్యాండ్ ఉంది.

ఇదంతా చూస్తే సప్తగిరిలోని రకరకాల టాలెంట్లన్నీ చూపించడానికి సప్తగిరి ఎక్స్ ప్రెస్ను ఒక సాధనంగా ఉపయోగించుకున్నట్లుగా ఉంది. ఈ క్రమంలో ఈ సినిమా ఫలానా జానర్ అని చెప్పలేని పరిస్థితి. మామూలుగా కమెడియన్ టర్న్డ్ హీరో సినిమా అంటే ప్రధానంగా కామెడీనే ఆశిస్తాం. కానీ సప్తగిరి ఎక్స్ ప్రెస్లో కామెడీకి తోడు సెంటిమెంటు.. యాక్షన్.. ఇలా చాలా మసాలాల్నే దట్టించారు. ఐతే అవి సమపాళ్లలో కలవలేదు కానీ.. ఎవరికి కావాల్సింది వాళ్లు తీసుకోవచ్చు అన్నట్లుంది. సినిమా కొంచెం కలగాపులగం అయినా.. కొంత వరకు కామెడీ వర్కవుట్ కావడం.. సెంటిమెంటూ పండటం.. మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కమర్షియల్ హంగులూ ఉండటంతో పైసా వసూల్ అనిపిస్తుంది.

లాజిక్కుల గురించి వెతక్కుండా ఆలోచిస్తే ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’లో కొన్ని చోట్ల బాగానే నవ్వులు పండాయి. ముఖ్యంగా షకలక శంకర్ పాత్రతో పండించిన కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది. సప్తగిరి కూడా కొన్ని చోట్ల బాగానే నవ్వించాడు. ఇక సప్తగిరి తనలోని ఎమోషనల్ యాంగిల్ చూపిస్తూ ఒక సన్నివేశంలో సెంటిమెంటును బాగా పండించాడు. ఆ సీన్ కూడా ఆకట్టుకుంటుంది. సందర్భోచితంగా అనిపించకపోయినా ఏమంటివి ఏమంటివి.. అంటూ ఎన్టీఆర్ డైలాగ్ ను గుక్కతిప్పుకోకుండా చెప్పే సీన్ కూడా అలరిస్తుంది. ఇంకా అక్కడక్కడా సప్తగిరి పెర్ఫామెన్స్ కూడా ఆకట్టుకుంటుంది. ఐతే ఇలాంటి కొన్ని ఆకర్షణల సంగతి పక్కనబెట్టేసి.. ఒక సినిమాగా చూస్తే మాత్రం ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ నిరాశ పరుస్తుంది.

పాత కథ.. రొటీన్ స్క్రీన్ ప్లే.. లాజిక్కుల్లేకుండా సాగిపోయే సన్నివేశాల వల్ల సినిమా ఎక్కడా ఒక తీరుగా సాగదు. ప్రథమార్ధంలో తొలి 45 నిమిషాల్లో కథంటూ ఏమీ లేదు. సప్తగిరి నట విన్యాసాల ప్రదర్శన కొంత వరకు నవ్విస్తుంది కానీ.. హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ ఆసక్తి కలిగించదు. అందులో ఫీల్ లేదు. ఇక్కడ హీరోయిన్ కూడా మైనస్సే.  ఇంటర్వెల్ ముంగిటే కథ కొంచెం ట్రాక్ ఎక్కుతుంది. ద్వితీయార్ధంలో హీరోకు తన తండ్రి మరణం గురించి అసలు రహస్యం తెలిసే వరకు కథనం కొంచెం సజావుగానే సాగినా.. ఆ తర్వాత గాడి తప్పుతుంది.

సీరియస్ గా సాగాల్సిన రివెంజ్ డ్రామాను కామెడీ అయిపోగా.. కామెడీ ఇమేజ్ ఉన్న సప్తగిరి.మాస్ హీరోలా విన్యాసాలు చేస్తూ.. విలన్లను రఫ్ఫాడించేయడం చిత్రంగా అనిపిస్తుంది. కామెడీ కొన్ని చోట్ల శ్రుతి మించింది. ముఖ్యంగా గే కామెడీ ఇబ్బంది కలిగిస్తుంది. సినిమా నిడివి తక్కువే (2 గంటల 10 నిమిషాలు) అయినా అనవసర సన్నివేశాలు.. సాగతీత వల్ల లెంగ్త్ ఎక్కువన్న ఫీలింగ్ ఇస్తుంది. అక్కడక్కడా కొన్ని నవ్వుల కోసం.. సప్తగిరి కోసం అయితే ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ ఓకే. మాస్ ప్రేక్షకుల్ని ఈ సినిమా మెప్పించొచ్చు.

నటీనటులుః

సప్తగిరి విన్యాసాలు సినిమాకు ఎంత వరకు ఉపయోగపడ్డాయన్నది పక్కనబెడితే.. అతను ఒక మాస్ హీరో చూపించే అన్ని టాలెంట్లనూ ఇందులో ప్రదర్శించాడు. డ్యాన్సులు.. ఫైట్లలో ఫుల్ టైం హీరోలా రాణించాడు. ఇప్పటిదాకా నవ్వించడమే పనిగా పెట్టుకున్న సప్తగిరి సెంటిమెంటు సీన్లో చక్కగా పెర్ఫామ్ చేయడం విశేషం. తన వరకు సప్తగిరి చేయాల్సిందంతా చేశాడు. హీరోయిన్ రోషిణి గురించి చెప్పడానికేం లేదు. సప్తగిరి పక్కన ఆమె సూటవ్వలేదు. శివప్రసాద్ తండ్రి పాత్రలో మెప్పించాడు. పోసాని ఓకే. షకలక శంకర్ తన కామెడీతో సినిమాకు బలంగా నిలిచాడు. ఆలీ పర్వాలేదు. మిగతా వాళ్లంతా ఓకే.

సాంకేతిక వర్గంః

బుల్గానిన్ సంగీతం సినిమాకు తగ్గట్లుగా ఉంది. రెండు మూడు మాస్ పాటలు పర్వాలేదనిపిస్తాయి. నేపథ్య సంగీతం రొటీన్. రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం ఏమంత ప్రత్యేకంగా అనిపించదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి బాగానే ఉన్నట్లే. సప్తగిరి అని చూడకుండా బాగానే ఖర్చు పెట్టారు.మాటలు కొన్ని పర్వాలేదు. తమిళ ఒరిజినల్ ఎలా ఉందో.. తెలుగు వెర్షన్ కోసం ఎలాంటి మార్పులు చేశారో కానీ.. ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ కథాకథనాల్లో అయితే విశేషాలేమీ లేవు. దర్శకుడు అరుణ్ పవార్ నిరాశపరిచాడు. అతను సప్తగిరిని బాగానే వాడుకున్నాడు కానీ.. అనేకానేక కమర్షియల్ హంగుల్ని జోడించే క్రమంలో సినిమాను కలగాపులగం చేశాడు. కథను చెప్పడంలో గందరగోళం కనిపించింది.

చివరగాః సప్తగిరి ఎక్స్ ప్రెస్.. అప్ అండ్ డౌన్స్ జర్నీ

రేటింగ్ః 2.5/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS