సమ్మోహనం

Fri Jun 15 2018 GMT+0530 (IST)

సమ్మోహనం

‘సమ్మోహనం’ మూవీ రివ్యూ

నటీనటులు: సుధీర్ బాబు-అదితి రావు హైదరి-నరేష్-రాహుల్ రామకృష్ణ-పవిత్ర లోకేష్-తనికెళ్ల భరణి-నందు తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: పి.జి.విందా
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్
రచన-దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ

తెలుగులో మంచి అభిరుచితో.. తెలుగుదనం ఉన్న సినిమాలు తీసే దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. ‘అష్టాచెమ్మా’.. ‘అంతకుముందు ఆ తరువాత’.. ‘జెంటిల్ మన్’..‘అమీతుమీ’ లాంటి సినిమాలు ఆయన అభిరుచిని చాటాయి. ఇప్పుడాయన ‘సమ్మోహనం’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సుధీర్ బాబు.. అదితి రావు హైదరి జంటగా నటించిన ఈ చిత్రం ఈ రోజే విడుదలైంది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: విజయ్ (సుధీర్ బాబు) చిన్నపిల్లల పుస్తకాల మీద బొమ్మలేసే ఆర్టిస్ట్. అతడికి సినిమాలన్నా.. సినీ తారలన్నీ వ్యతిరేక భావం ఉంటుంది. అతడి తండ్రి (నరేష్)కి మాత్రం సినిమాలంటే పిచ్చి. ఆ పిచ్చితోనే తన ఇంట్లో ఒక సినిమా చిత్రీకరణకు అనుమతి ఇస్తాడు. తర్వాత ఆ చిత్ర కథానాయిక అయిన సమీరా రాథోడ్ (అదితి రావు)తో విజయ్ కి పరిచయం అవుతుంది. ఆమెకు తెలుగు శిక్షణ ఇచ్చే క్రమంలో విజయ్ ఆమెకు చేరువవుతాడు. ఆమెను ప్రేమిస్తాడు. ఆమె దూరమయ్యాక తట్టుకోలేకపోతాడు. తన ప్రేమను ఆమె దగ్గర వెల్లడిస్తాడు. కానీ సమీరా అతడి ప్రేమను అంగీకరించదు. అందుకు కారణాలేంటి.. ఆపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: ఒక్కో కాలంలో ఒక్కో రకమైన సినిమాలు బాగా ఆడేస్తుంటాయి. కొన్నాళ్లకు అవి ఔట్ డేట్ అయిపోతాయి. మళ్లీ  ఇంకో జానర్ హవా మొదలవుతుంది. కానీ కాలం మారుతున్నా.. ట్రెండ్ మారుతున్నా.. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనిపించేవి మాత్రం ప్రేమకథలు. ప్రధాన పాత్రలతో ప్రేక్షకులు రిలేట్ అయ్యేలా చేయగలిగితే.. చూస్తున్న వారిలోనూ ప్రేమ భావనల్ని.. భావోద్వేగాల్ని రేకెత్తించగలిగితే ప్రేమకథలు పండుతాయి. ప్రేక్షకాదరణ పొందుతాయి. ఇందుకు గత ఏడాది వచ్చిన ‘నిన్ను కోరి’.. ఈ ఏడాది మొదట్లో విడుదలైన ‘తొలి ప్రేమ’ నిదర్శనం. వాటిలో కథేమీ కొత్తగా అనిపించదు. కానీ ప్రధాన పాత్రల్ని ప్రేక్షకులతో అనుసంధానం చేయడంలో.. భావోద్వేగాల్ని పండించడంలో ఆయా దర్శకులు విజయవంతమయ్యారు. ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి అద్దం పట్టాయి ఆ కథలు. ఇప్పుడొచ్చిన ‘సమ్మోహనం’ కూడా ఆ కోవలోనిదే. ఇంద్రగంటి శైలిలో పరిణతితో.. ఆహ్లాదంగా సాగే ఈ ప్రేమకథకు ప్రేక్షకులు కనెక్టయ్యే అంశాలున్నాయి. కాకపోతే ఈ తరం ప్రేక్షకులు ఆశించే వేగం ఇందులో లేకపోయింది. అదే దీనికి పెద్ద బలహీనత.

ఒక సినీ తార.. ఒక సామాన్యుడు.. వీళ్ల మధ్య ప్రేమకథ. వినడానికి కొత్తగా అనిపించే పాయింట్ ఇది. దీని వల్ల సన్నివేశాలు కొత్తగా.. ఆసక్తికరంగా రాసుకోవడానికి అవకాశం దొరికింది. అలాగే కథానాయిక పాత్రను ప్రత్యేకంగా తీర్చిదిద్దడం ద్వారా పునాది బాగానే వేసుకున్నాడు ఇంద్రగంటి. ఆ పాత్రకు అదితి రావును ఎంచుకోవడం కూడా మంచి ఎంపిక. ఆమె కూడా సినిమాకు ఒక తాజాదనం తీసుకొచ్చింది. సినిమా వాళ్ల జీవితాల్లో మంచి చెడుల్ని చాలా వాస్తవికంగా చూపించాడాయన. ఈ క్రమంలో ఇండస్ట్రీపై సెటైర్లు వేయడానికి కూడా వెనుకాడలేదు. సోకాల్డ్ కమర్షియల్ సినిమాలపై ఆయన వేసిన సెటైర్లు పేలాయి. అలాగని ఇండస్ట్రీని తక్కువ చేయాలని చూడలేదు. ఈ విషయంలో ఆయన సమతూకం పాటించాడు. తెరముందు అందంగా కనిపించే జీవితాల్లో తెరవెనుక ఎన్ని ఇబ్బందులుంటాయో కూడా చక్కగా చూపించాడు.

ఆరంభంలో చాలా సాధారణంగా నడిచే ‘సమ్మోహనం’ కథానాయిక రాకతోనే ఊపందుకుంటుంది. ఆమె పాత్ర ఆరంభం నుంచి ఆసక్తి రేకెత్తిస్తుంది. సినిమా షూటింగ్ నేపథ్యంలో మంచి సీన్స్ రాసుకున్నాడు ఇంద్రగంటి. హీరో హీరోయిన్ల పరిచయం.. వాళ్ల మధ్య బంధం ఏర్పడే క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చాలా తక్కువ సన్నివేశాలతోనే లవ్ స్టోరీని రక్తి కట్టించగలిగాడు. ఈ క్రమంలో వచ్చే టెర్రస్ సీన్ ఇంద్రగంటి స్థాయిని తెలియజేస్తుంది. చాలా పరిణతితో.. ఆహ్లాదంగా సాగే ఈ సన్నివేశం సినిమాలో స్టాండ్ ఔట్ గా నిలుస్తుంది. ఇక్కడ రచయితగా కూడా ఇంద్రగంటి తన ప్రతిభను చాటుకున్నాడు. ఐతే విరామం తర్వాత ‘సమ్మోహనం’ కొంచెం ట్రాక్ తప్పుతుంది. సాధారణంగా.. నెమ్మదిగా సాగే సన్నివేశాలు కొంత వరకు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి.

ఒక దశ దాటాక కథాకథనాల్లోనూ ఏమంత కొత్తదనం కనిపించదు. విరామ సమయానికి హీరోయిన్.. హీరోకు నో చెప్పిందంటే.. దాని వెనుక ఏదో బలమైన కారణాలున్నాయని తర్వాత వెల్లడి కావడం.. అపార్థం చేసుకున్న హీరోకు చివర్లో నిజం తెలియడం.. తర్వాత ఇద్దరూ కలవడం అన్నది ఎప్పట్నుంచో చూస్తున్న వ్యవహారమే. ఐతే చివర్లో తెలిసిన వ్యవహారాన్నే అందంగా చూపించడంలో.. మంచి ఫీల్ తీసుకురావడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. ప్రి క్లైమాక్స్ లో నరేష్ తన విశ్వరూపాన్ని చూపించే సీన్ చక్కటి నవ్వులు పంచి ప్రేక్షకుల్లో మళ్లీ ఉత్సాహం తీసుకొస్తే పతాక సన్నివేశాన్ని హృద్యంగా.. మంచి ఫీల్ వచ్చేలా తీర్చిదిద్దడం ద్వారా సినిమాకు చక్కటి ముగింపు ఇచ్చాడు ఇంద్రగటి. అంతకుముందు ఉన్న అసంతృప్తిని కొంతమేర ఇది తొలగిస్తుంది. అంతిమంగా ప్రేక్షకుడు మంచి ఫీల్ తో బయటికి వస్తాడు. మొత్తంగా ‘సమ్మోహనం’ను ఒక పరిణతితో కూడిన ప్రేమకథగా చెప్పొచ్చు. నెమ్మదిగా సాగడం దీనికున్న పెద్ద బలహీనత. అలాగే మరీ క్లాస్ గా ఉండటం వల్ల ఓ వర్గం ప్రేక్షకులే దీనికి కనెక్టయ్యే అవకాశముంది. ప్రేమకథలో యువ ప్రేక్షకులు ఆశించే రొమాంటిక్ మూమెంట్స్.. ఎంటర్టైన్మెంట్ మిస్ కావడం కూడా ప్రతికూలతే.

నటీనటులు: దర్శకుడి అభిరుచిని బట్టే నటీనటుల పెర్ఫామెన్స్ కూడా ఉంటుందనడానికి ‘సమ్మోహనం’ మరో రుజువుగా నిలుస్తుంది. గత సినిమాల్లో నటుడిగా సుధీర్ బాబులో కనిపించిన బలహీనతలు ఇందులో కొంతమేర కవరయ్యాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డైలాగ్ డెలివరీ. గట్టిగా మాట్లాడాల్సిన.. అరవాల్సిన అవసరం లేని పాత్ర కావడంతో అతడి బలహీనత బయటపడలేదు. నటన ఓకే. ఐతే సుధీర్ కంటే కూడా హీరోయిన్ అదితి రావు హైదరి ఎక్కువ స్కోర్ చేస్తుంది. ఆమె కళ్లతో పలికించిన భావాలు కట్టిపడేస్తాయి. లోపల సంఘర్షణ అనుభవిస్తూ పైకి మామూలుగా కనిపించే ఈ పాత్రను ఆమె  అద్భుతంగా పండించింది. హీరో హీరోయిన్ల తర్వాత బలమైన ముద్ర వేసేది నరేష్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన ఎప్పటికీ మరిచిపోలేని పాత్ర ఇది. ఆద్యంతం ఆకట్టుకుంటునే క్యారెక్టర్ అది. సినిమాలో ఎంటర్టైన్మెంటా అంతా చాలా వరకు ఆయన క్రెడిటే. పవిత్ర లోకేష్ కూడా చక్కగా చేసింది. రాహుల్ రామకృష్ణ.. తనికెళ్ల భరణి.. కాదంబరి కిరణ్.. వీళ్లంతా కూడా తమ పరిధిలో బాగా నటించారు.

సాంకేతికవర్గం: ‘సమ్మోహనం’కు సాంకేతిక నిపుణులు కూడా బలంగా నిలిచారు. ‘పెళ్ళిచూపులు’ ఫేమ్ వివేక్ సాగర్ మరోసారి ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాను నడిపించడంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలు తక్కువే కానీ.. సినిమాకు అవి సరిపోయాయి. నేపథ్య సంగీతం ఓకే కానీ.. చాలా వరకు ఒకే మ్యూజిక్ రిపీటవుతూ ఉంటుంది. ఇంద్రగంటి ఆస్థాన ఛాయాగ్రాహకుడు పి.జి.విందా ఆయన అభిరుచికి తగ్గట్లు పని చేశాడు. సినిమా అంతా కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తన అభిరుచిని చాటుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ ఇంద్రగంటి మరోసారి తన అభిరుచిని చాటుకున్నాడు. రాతలో.. తీతలో ఆయన స్థాయి కనిపిస్తుంది. కథతో పాటు కథనంలోనూ కొత్తదనం.. ఒక ఫీల్ తీసుకురాగలిగారాయన. మాటల రచయితగా కూడా ఇంద్రగంటి మెప్పించాడు.

చివరగా: సమ్మోహనం.. మెల్లగా మనసు దోచే ప్రేమకథ

రేటింగ్- 2.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS