సమ్మతమే

Fri Jun 24 2022 GMT+0530 (India Standard Time)

సమ్మతమే

మూవీ రివ్యూ : సమ్మతమే

నటీనటులు: కిరణ్ అబ్బవరం-చాందిని చౌదరి-గోపరాజు రమణ-శివన్నారాయణ-అన్నపూర్ణ తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
ఛాయాగ్రహణం: సతీష్ రెడ్డి మాసం
నిర్మాత: కనకాల ప్రవీణ
రచన-దర్శకత్వం: గోపీనాథ్ రెడ్డి

రాజావారు రాణి వారు.. ఎస్.ఆర్ కళ్యాణమండపం చిత్రాలతో ఆకట్టుకున్న యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం ఇప్పుడు ‘సమ్మతమే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాందిని చౌదరి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు గోపీనాథ్ రెడ్డి రూపొందించాడు. ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం సినిమాగా ఎంత మేర మెప్పించిందో చూద్దాం పదండి.

కథ:

కృష్ణ (కిరణ్ అబ్బవరం) చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి.. తండ్రి కష్టంతో ఎదిగిన కుర్రాడు. తల్లి ప్రేమకు దూరమైన తాను తనకు కాబోయే భార్య నుంచి ఆ ప్రేమను పొందాలని యుక్త వయసు వచ్చినప్పటి నుంచి పెళ్లి కోసం తపిస్తుంటాడు. పెళ్లి చేసుకున్న అమ్మాయినే ప్రేమించాలని బలంగా నిర్ణయించుకున్న అతను.. ఏ అమ్మాయినీ కన్నెత్తి చూడడు. అలాగే తనకు కాబోయే భార్య కూడా తన లాగే స్వచ్ఛంగా ఉండాలని.. ఎవరినీ అంతకుముందు ప్రేమించి ఉండకూడదని భావిస్తాడు. కానీ కృష్ణ తొలిసారిగా పెళ్లిచూపులకు వెళ్లిన అమ్మాయి శాన్వి (చాందిని చౌదరి) తనకు నచ్చినా.. ఆమెకు అప్పటికే ఓ లవ్ స్టోరీ ఉండడంతో తనను వద్దనుకుని వెనక్కి వచ్చేస్తాడు. శాన్విని ముందు వద్దనుకున్నా.. తర్వాత ఆమెను తాను ప్రేమిస్తున్న విషయం అర్థమై తనకు చేరువయ్యే ప్రయత్నం చేస్తాడు. శాన్వికి కూడా అతనంటే ఇష్టం ఏర్పడుతుంది. కానీ పాతతరం ఆలోచనలున్న కృష్ణకు.. ఆధునిక అమ్మాయి అయిన శాన్విల మధ్య అభిప్రాయభేదాలు తప్పవు. మరి వీటిని దాటి ఇద్దరూ ఒక్కటయ్యారా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

అబ్బాయి.. అమ్మాయి మధ్య ఏదో రకంగా పరిచయం జరగడం.. తర్వాత అది ప్రేమగా మారడం.. ఇద్దరి ప్రయాణం సాఫీగా సాగుతున్న తరుణంలో ఏదో ఒక అడ్డంకి ఎదురవడం.. చివరికి ఆ అడ్డంకిని దాటి ఇద్దరూ ఒక్కటవడం.. ప్రేమకథలన్నీ కూడా దాదాపుగా ఇదే లైన్లో నడుస్తాయి. ఇక్కడ ఆ ‘అడ్డంకి’ ఏంటి అనేదే కాన్ఫ్లిక్ట్ పాయింట్ అవుతుంది. సమస్య పెద్దల వైపు నుంచి రావచ్చు.. లేదంటే ప్రేమజంట అభిప్రాయాల్లో తేడా వల్ల తలెత్తొచ్చు. ఐతే ఈ పాయింట్ కొత్తగా అయినా ఉండాలి. లేదంటే పాత పాయింట్ అయినా దాన్ని బలంగా అయినా చెప్పాలి. అప్పుడే సినిమా జనాలకు ఎక్కుతుంది. ‘సమ్మతమే’లో కాన్ఫ్లిక్ట్ పాయింట్ చాలా సింపుల్. అది కొత్తది కూడా కాదు. పల్లెటూరి నుంచి ట్రెడిషనల్ మైండ్ సెట్ తో వచ్చిన అబ్బాయి.. సిటీలో పెరిగి అతడికి పూర్తి భిన్నమైన మైండ్ సెట్ ఉన్న ఆధునిక అమ్మాయికి మధ్య ఆలోచనా ధోరణిలో వైరుధ్యమే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ పాయింట్. దాని మీద కొంత సేపు కథను బాగానే నడిపించినా.. ఆ తర్వాత దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియని గందరగోళంలో ‘సమ్మతమే’ ట్రాక్ తప్పేసింది. ఒక దశ దాటాక ఊరికే సన్నివేశాలు పేర్చుకుంటూ పోవడం.. ఎమోషన్ మిస్సవడంతో ‘సమ్మతమే’ చివరికి సాధారణంగా ముగుస్తుంది. కొన్ని కాలక్షేపపు సన్నివేశాలు మినహాయిస్తే ‘సమ్మతమే’లో కంటెంట్ లేకపోయింది.

‘సమ్మతమే’ సినిమాలో హీరో పాత్ర.. అతడి నేపథ్యం ఆసక్తికరంగానే అనిపిస్తాయి. తల్లిని కోల్పోయిన బాధలో స్కూల్లో చదువుతున్న వయసులోనే తనకు పెళ్లి చేయమని తండ్రిని అడగడం.. పెరిగి పెద్దవుతున్న క్రమంలో పెళ్లి చేసుకోవడమే తన జీవిత ధ్యేయం అన్నట్లుగా వ్యవహరించడం.. ఇలా హీరో పాత్ర ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తుంది. పెళ్లికి ముందు ప్రేమాగీమా జాన్తా నై.. పెళ్లి చేసుకున్న అమ్మాయినే ప్రేమిస్తా అనే అతడి మైండ్ సెట్ చిత్రంగా అనిపిస్తుంది. నచ్చిన అమ్మాయితో పెళ్లి చూపులు నడుస్తున్న టైంలో ఆమెకు గతంలో ఓ లవ్ స్టోరీ ఉందన్న కారణంతో అక్కడి నుంచే వచ్చేసే హీరో పాత్ర చాదస్తం చూసి చికాకు పడుతూనే.. హీరోకు ఇలాంటి క్యారెక్టరైజేషన్ పెట్టడం వెరైటీగా అనిపిస్తుంది. కానీ ఎంతసేపూ హీరో కోణం నుంచే కథను చెప్పిన దర్శకుడు.. హీరోయిన్ యాంగిల్ ను మాత్రం తేల్చిపడేశాడు. తన లవ్ స్టోరీ చెప్పగానే పెళ్లిచూపుల నుంచి వెళ్లిపోయిన హీరో పట్ల హీరోయిన్.. ఆమె కుటుంబం ఎలాంటి అభిప్రాయంతో ఉంటుందన్న దాని మీదే ఫోకస్ పెట్టలేదు. హీరో తిరిగి కనబడగానే హీరోయిన్ మామూలుగా రియాక్టవడం.. మళ్లీ అతడితో మూవ్ అయిపోవడం లాజికల్ గా అనిపించదు. హీరోయిన్ పట్ల ముందు వ్యతిరేకత పెంచుకున్న హీరో... మళ్లీ ఆమె పట్ల ఎందుకు ఇష్టం పెంచుకుంటాడో కన్విన్సింగ్ గా చెప్పలేకపోయాడు దర్శకుడు. అదే సమయంలో హీరోయిన్ ఎందుకు మళ్లీ ఇంప్రెస్ అవుతుందో కూడా సరిగా చూపించలేదు. ఈ లాజిక్స్ పక్కన పెడితే.. ప్రథమార్ధంలో చాలా వరకు సన్నివేశాలు సరదాగా అయితే సాగిపోతాయి. కాలక్షేపానికి ఢోకా లేదు. ప్రథమార్ధం వరకు సినిమా ‘సమ్మతమే’ అన్నట్లే అనిపిస్తుంది.

కానీ కాన్ఫ్లిక్ట్ పాయింట్ మీద కథను నడపాల్సిన చోట.. ద్వితీయార్ధంలో దర్శకుడు తడబడ్డాడు. ఓవైపు హీరో ఏమో తనకు కాబోయే భార్య తనకే సొంతం.. ఆమెను ఎవరూ చూడకూడదు.. ఆమె ఎవరితో మాట్లాడకూడదు.. అనే ట్రెడిషనల్ మైండ్ సెట్ తో హీరోయిన్ కు ఆంక్షలు పెడుతుంటాడు. ఇంకోవైపు ఆమె అతడి ఆలోచనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటుంది. దీని మీదే సన్నివేశాలు రిపీటవుతూ సాగుతాయి. హీరోయిన్ మందు కొట్టడం.. పార్టీలంటూ తిరగడం.. దానికి హీరో అడ్డు చెప్పడం.. ఇవే సన్నివేశాలు మళ్లీ మళ్లీ వస్తుంటాయి. హీరోయిన్ ఒక పార్టీకి వెళ్తుంటే.. హీరో అడ్డుకునే ప్రయత్నం చేయడం.. ఆమె తన మాట వినకుండా వెళ్లడం.. హీరో తన వెంటపడడం.. ఈ నేపథ్యంలో పావు గంటకు పైగా సన్నివేశాన్ని నడిపిస్తే ప్రేక్షకులకు విసుగు రాక ఏమవుతుంది? మధ్య మధ్యలో ఇద్దరి మధ్య అనుబంధాన్ని చూపించే ప్రేమ సన్నివేశాలు మొక్కుబడిగా వస్తూ పోతుంటాయి. కథ మాత్రం ముందుకే కదలదు. ఇంకెంతసేపు ఈ సోది అనిపించే స్థాయిలో సన్నివేశాలు సహనానికి పరీక్ష పెడతాయి. ప్రేమ సన్నివేశాలు సరిపోవని.. కామెడీ కోసం కూడా ప్రయత్నం జరిగింది కానీ.. అవి మరింతగా ప్రేక్షకులను అసహనానికి గురి చేస్తాయి తప్ప రిలీఫ్ ఇవ్వవు. బాగానే మొదలై మధ్య వరకు బాగానే నడిచిన ‘సమ్మతమే’ ద్వితీయార్ధంలో మాత్రం పూర్తిగా నిరాశ పరుస్తుంది. క్లైమాక్స్ సైతం చాలా సాధారణంగా ఉండడంలో చివరికొచ్చేసరికి ఇంప్రెషన్ బాగా తగ్గిపోతుంది. ‘సమ్మతమే’ ఒక మామూలు సినిమాలా ముగుస్తుంది.

నటీనటులు:

కిరణ్ అబ్బవరం టాలెంట్ ఏంటో ఇప్పటికే చూశాం. ‘సమ్మతమే’లో అతను మరింతగా ఆకట్టుకున్నాడు. సహజంగా.. చాలా క్యాజువల్ గా అనిపించేలా నటన.. డైలాగ్ డెలివరీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న కిరణ్.. ఈ సినిమాలో అదే శైలితో మెప్పించాడు. కిరణ్ నటనకు పరీక్ష పెట్టే భారీ సన్నివేశాలేమీ ఇందులో లేవు. చాలా సింపుల్ గా తన పని కానిచ్చేశాడు. చాందిని చౌదరి ‘కలర్ ఫొటో’ తర్వాత మరింత ఆత్మవిశ్వాసంతో నటించిందీ సినిమాలో. తన స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో మరింత గ్లామరస్ గా కనిపించింది. కిరణ్-చాందినిల కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయింది. సినిమా అంతా వీళ్లిద్దరి చుట్టూనే తిరగడంతో ఇంకెవరికీ పెద్దగా స్కోప్ దక్కలేదు. గోపరాజు రమణ హీరో తండ్రిగా ఓకే అనిపించాడు. హీరో ఫ్రెండుగా చేసిన నటుడు బాగా చేశాడు. శివణ్నారాయణ.. అన్నపూర్ణ మామూలే.

సాంకేతిక వర్గం:

శేఖర్ చంద్ర పాటలు పర్వాలేదు. సమ్మతమే పాట అన్నింట్లోకి వినసొంపుగా అనిపిస్తుంది. మిగతా పాటలు ఓకే. నేపథ్య సంగీతం సోసోగా సాగింది. కెమెరామన్ సతీష్ రెడ్డి మాసం కెమెరా పనితనం ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. బడ్జెట్ పరంగా కొన్ని పరిమితులు కనిపిస్తాయి. దర్శకుడు గోపీనాథ్ రెడ్డి చాలా మామూలుగా అనిపించే కాన్ఫ్లిక్ట్ మీద కథ నడిపించాలనుకోవడం ద్వారా ముందే తనకు తాను పరిమితులు విధించుకున్నాడు. కొన్ని సన్నివేశాల వరకు అతను ఆకట్టుకున్నా.. ఓవరాల్ గా నిరాశ పరిచాడు. దర్శకుడికి విషయం ఉన్నట్లే అనిపించినా.. తొలి చిత్రానికి ఇంత బలహీన కథను ఎంచుకొని పొరబాటు చేశాడు. స్క్రీన్ ప్లేతోనూ అతను మ్యాజిక్ చేయలేకపోయాడు.

చివరగా: సమ్మతమే.. కాదు సమ్మతం

రేటింగ్: 2.25/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater

LATEST NEWS