'శైలజారెడ్డి అల్లుడు'

Thu Sep 13 2018 GMT+0530 (IST)

'శైలజారెడ్డి అల్లుడు'

చిత్రం : ‘శైలజారెడ్డి అల్లుడు’

నటీనటులు: అక్కినేని నాగచైతన్య - అను ఇమ్మాన్యుయెల్ - రమ్యకృష్ణ - మురళీశర్మ - వెన్నెల కిషోర్ - పృథ్వీ - నరేష్ - శత్రు తదితరులు
సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం: నిజార్ షఫి
నిర్మాతలు: నాగవంశీ-పీడీవీ ప్రసాద్
రచన - దర్శకత్వం: మారుతి

కామెడీ ఎంటర్టైనర్లు తీయడంలో దిట్ట అయిన దర్శకుడు మారుతి యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్యతో తీసిన సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా కనిపించిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

చైతూ (నాగచైతన్య) ఒక పెద్దింటి కుర్రాడు. అతడి తండ్రికి భయంకరమైన ఇగో ఉంటుంది. దాని వల్లే ఆయన కూతురి పెళ్లి సైతం చెడిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తన తండ్రికి జిరాక్స్ కాపీ లాంటి అను (అను ఇమ్మాన్యుయెల్)ను ఇష్టపడతాడు చైతూ. ఆమె కూడా తనను ప్రేమించేలా చేస్తాడు. కానీ చైతూ తండ్రి తొందరపాటు వల్ల అనుకోని పరిస్థితుల్లో వీళ్లిద్దరి నిశ్చితార్థం జరిగిపోతుంది. అప్పుడే వరంగల్ జిల్లాలో పెద్ద నాయకురాలైన శైలజారెడ్డి (రమ్యకృష్ణ) గురించి.. ఆమె ఇగో గురించి చైతూ కుటుంబానికి తెలుస్తుంది. మహా కోపిష్టి అయిన శైలజారెడ్డి తనకు తెలియకుండా జరిగిన కూతురి నిశ్చితార్థం గురించి తెలుసుకుని ఏం చేసింది.. ఆమెను చైతూ ఎలా డీల్ చేశాడు.. చివరికి చైతూ-అను కలిశారా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

మారుతి తీసిన ‘భలే భలే మగాడివోయ్’.. ‘మహానుభావుడు’ సినిమాలకు టిపికల్ గా అనిపించే లీడ్ క్యారెక్టర్లే ప్రధాన ఆకర్షణ. ఆ పాత్రల్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దడం.. వాటి నుంచే ప్రధానంగా వినోదం పండించడం ద్వారా ప్రేక్షకుల మనసులు గెలిచాడు మారుతి. ‘శైలజారెడ్డి అల్లుడు’లో మారుతి హీరో మీద కాకుండా హీరోయిన్.. ఆమె తల్లి పాత్రల మీద దృష్టిపెట్టాడు. విపరీతమైన అహం ఉన్న తల్లీ కూతుళ్ల మధ్య నలిగిపోయే కుర్రాడి కథను చెప్పే ప్రయత్నం చేశాడు. ఐతే ఈ తల్లీ కూతుళ్ల పాత్రల్ని ఆరంభంలో పైకి ఎత్తి.. ఆ తర్వాత దబేల్ మని కింద పడేసేశాడు మారుతి. ఇంట్రోల వరకు బాగా రాసుకుని.. ఆ తర్వాత ఆ పాత్రల్ని చాలా సాధారణంగా మార్చేయడంతో త్వరగా వాటిపై ఆసక్తి పోతుంది. రెక్టర్లు అనుకున్న స్థాయిలో పేలకపోవడం.. అక్కడక్కడా కొన్ని సీన్లలో మినహాయిస్తే మారుతి మార్కు వినోదం కూడా పండకపోవడంతో ‘శైలజారెడ్డి అల్లుడు’ అంచనాలకు దూరంగా ఆగిపోయింది.

‘శైలజారెడ్డి అల్లుడు’ అనే ఆకర్షణీయమైన టైటిల్ పెట్టి శైలజారెడ్డిగా రమ్యకృష్ణను ఎంచుకోవడం అంటే.. సినిమాకు అంతకంటే ఆకర్షణ ఏముంటుంది? ఇక ఈ చిత్రంలో కూడా ఈ పాత్ర గురించి చెప్పేటపుడు బిల్డప్ మామూలుగా ఉండదు. హీరో తండ్రి కోపం వచ్చి కమిషనర్ కు ఫోన్ కలపబోతుంటే.. పక్కనున్న పాత్ర ‘‘మీకు కమిషనర్ తెలిస్తే.. వాళ్లకు సీఎం క్లోజ్’’ అంటూ శైలజారెడ్డి గురించి ఎత్తేస్తుంది. ఇంత చెప్పారు కాబట్టి శైలజారెడ్డి రంగ ప్రవేశంతో వ్యవహారం కొంచెం పెద్ద స్థాయిలో నడుస్తుందని అనుకుంటాం. కానీ తీరా చూస్తే శైలజారెడ్డి తన ఊరిలో భార్యాభర్తల మధ్య వచ్చే గొడవల మీద పంచాయితీలు చేస్తుంటుంది. ఇక ద్వితీయార్దంలో కథంతా కూడా ఇగోతో మాట్లాడ్డం మానేసిన తల్లీకూతుళ్ల మధ్య మళ్లీ మాటలు కలపడం మీద నడుస్తుంది. ఇంత చిన్న ఇష్యూను పెట్టుకుని ఊరికే సాగదీస్తూ ద్వితీయార్ధం మొత్తాన్ని నడిపించాడు మారుతి. కామెడీ వర్కవుటైతే ఇదేమంత పెద్ద విషయంలా అనిపించేది కాదు కానీ.. అది కూడా ఆశించిన స్థాయిలో పండకపోవడంతో వ్యవహారం తేడా కొట్టేసింది.

హీరోయిన్ని తనదాన్ని చేసుకోవడం కోసం హీరో ఆమె ఇంట్లోకి వేరే ఐడెంటిటీతో అడుగుపెట్టి.. తన తెలివితేటలతో సమస్యలన్నీ చక్కబెట్టేసి కథను సుఖాంతం చేసే వ్యవహారాలు ఔట్ డేట్ అయిపోయి చాలా కాలమే అయింది. మళ్లీ మారుతి అదే పాత ఫార్ములాను ఫాలో అయిపోయాడు. ప్రథమార్ధంలో హీరో హీరోయిన్ల ప్రేమకథ కూడా సాధారణంగా అనిపిస్తుంది. అక్కడక్కడా వెన్నెల కిషోర్ కామెడీ పంచులు మినహాయిస్తే ప్రథమార్ధంలో చెప్పుకోదగ్గ మెరుపులేమీ లేవు. అను ఇమ్మాన్యుయెల్ పాత్ర మొదట్లో బాగా అనిపించినా.. ఆ తర్వాత నిలకడ తప్పడంతో ఆసక్తి సన్నగిల్లిపోతుంది. ప్రతి సన్నివేశంలో ఇగో ఇగో అంటూ ఒకటే ఊదరగొట్టేస్తూ ఉంటారే తప్ప.. ఆ పాత్ర తన ఇగోను చూపించే సరైన సన్నివేశాలే లేవు. మారుతి కేవలం డైలాగుల ద్వారా పాత్ర లక్షణాలు చెప్పడానికి ప్రయత్నించాడు తప్ప.. దాన్ని ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాలు లేకపోవడంతో ఆ పాత్ర తేలిపోయింది.

సాధారణంగా మారుతి పాత్రలు చాలా సహజంగా.. జనాలు రిలేట్ చేసుకునేలా ఉంటుంటాయి. కానీ ఇందులో మురళీ శర్మ పాత్ర చూస్తే మారుతి తన టచ్ కోల్పోయాడేమో అనిపిస్తుంది. ఇంటర్వెల్ ముంగిట వచ్చే సన్నివేశాల్లో ఆ పాత్ర విపరీత ప్రవర్తన మామూలు ఇరిటేషన్ తెప్పించదు. శైలజారెడ్డి పాత్రను పండించడానికి రమ్యకృష్ణ తన వంతు ప్రయత్నం చేసినా.. దాన్ని సరిగా తీర్చిదిద్దకపోవడంతో అది కూడా ఆకర్షణ కాలేకపోయింది. వెన్నెల కిషోర్ ద్వితీయార్ధంలోనూ కొంతమేర నవ్వులు పండించే ప్రయత్నం చేశాడు. పృథ్వీ కూడా అక్కడక్కడా నవ్వించాడు. కానీ వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చే క్రానిక్ హీలింగ్ కామెడీ అందరికీ రుచించే అవకాశాల్లేవు. ఈ సీన్లలో ‘ఈ రోజుల్లో’.. ‘బస్ స్టాప్’ రోజుల నాటి మారుతి గుర్తుకొస్తాడు. సినిమాలో అక్కినేని అభిమానుల్ని ఆకట్టుకునే మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. అను గ్లామర్ కుర్రాళ్లను.. వెన్నెల కిషోర్-పృథ్వీల కామెడీ మాస్ ను కొంతమేర ఆకట్టుకోవచ్చు. ఐతే కథలో కొత్తదనం లేకపోవడం.. ప్రధాన పాత్రలు పేలకపోవడం.. మారుతి మార్కు ఎంటర్టైన్మెంట్ కూడా తగినంత స్థాయిలో లేకపోవడంతో ‘శైలజారెడ్డి అల్లుడు’ ఒక సగటు సినిమాలాగే అనిపిస్తుంది.

నటీనటులు:

నాగచైతన్యకు ఇదేమంత గుర్తుంచుకోదగ్గ సినిమా కాదు. ఇది అసలు హీరో కథ కాదు. రమ్యకృష్ణ.. అనుల చుట్టూనే కథంతా నడుస్తుంది. ఇలాంటి పాత్రను చైతూ ఒప్పుకోవడం విశేషమే. ఐతే చైతూ గత సినిమాలన్నింటికంటే ఇందులో అందంగా.. స్టైలిష్ గా కనిపించాడు. అతడిలోని కామెడీ యాంగిల్ ఈ సినిమాలో చూడొచ్చు. సినిమా అంతటా చైతూ ఈజ్ తో నటించాడు. రమ్యకృష్ణ బాగానే చేసింది. రమ్య పాత్ర ఆశించిన స్థాయిలో లేకపోయినా.. సినిమాకు అతి పెద్ద బలం ఆమే. ఐతే రమ్యకృష్ణపై శివగామి ప్రభావం ఇంకా పోయినట్లు లేదు. కొన్నిచోట్ల ఆ పాత్రను చూస్తున్నట్లే అనిపిస్తుంది. అను ఇమ్మాన్యుయెల్ పర్వాలేదు. ఆమె ఫిజిక్ కొంచెం తేడా కొట్టినట్లు అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ సినిమా అంతటా కనిపించే రోల్ చేశాడు కానీ.. కామెడీ అతడి స్థాయికి తగ్గ స్థాయిలో లేదు. పృథ్వీ కొన్ని చోట్ల నవ్వించాడు. నరేష్ ఓకే. మురళీ శర్మ గురించి చెప్పడానికేమీ లేదు. ఆయన పాత్ర విసుగెత్తిస్తుంది.

సాంకేతికవర్గం:

గోపీసుందర్ సంగీతం పర్వాలేదు. ఎగిరెగిరే పాట ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇంకో రెండు పాటలు ఓకే. పాటల చిత్రీకరణ బాగుంది. నేపథ్య సంగీతం బాగానే ఉంది. నిజార్ షఫి ఛాయాగ్రహణం సినిమాలో చెప్పుకోదగ్గ ఆకర్షణల్లో ఒకటి. ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్ గా కనిపిస్తుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ప్రతి సన్నివేశంలోనూ రిచ్ నెస్ కనిపిస్తుంది. ఇక రచయిత.. దర్శకుడు మారుతి తన ప్రధాన బలమైన వినోదం పండించడంలో అంచనాల్ని అందుకోలేకపోయాడు. కథ.. కథనం రెండింట్లోనూ కొత్తదనం చూపించలేకపోయాడు. రచయితగా.. దర్శకుడిగా అతడి ముద్ర కనిపించలేదు ఇందులో.

చివరగా: శైలజారెడ్డి అల్లుడు.. బోర్ కొట్టించేశాడు

రేటింగ్-2.5/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS