ఎస్ఆర్ కళ్యాణమండపం

Fri Aug 06 2021 GMT+0530 (IST)

ఎస్ఆర్ కళ్యాణమండపం

చిత్రం : ఎస్ఆర్ కళ్యాణమండపం

నటీనటులు: కిరణ్ అబ్బవరం-ప్రియాంక జవల్కర్-సాయికుమార్-తులసి-శ్రీకాంత్ అయ్యంగార్-తనికెళష్ల భరణి తదితరులు
సంగీతం: చేతన్ భరద్వాజ్
ఛాయాగ్రహణం: విశ్వాస్ డేనియల్
నిర్మాతలు: ప్రమోద్-రాజు
కథ-స్క్రీన్ ప్లే-మాటలు: కిరణ్ అబ్బవరం
కూర్పు-దర్శకత్వం: శ్రీధర్ గాదె

‘రాజావారు రాణివారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కొత్త సినిమా ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’. చాన్నాళ్ల కిందటే సినిమా పూర్తయినా కరోనా నేపథ్యంలో విడుదల ఆలస్యమైంది. టీజర్.. ట్రైలర్లతో యువతను బాగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రోమోల మాదిరే సినిమా కూడా ఆకట్టుకునేలా ఉందో లేదో చూద్దాం పదండి.

కథ:

కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) కాలేజీలో చదువుకుంటూ స్నేహితులతో కలిసి సరదాగా జీవితాన్ని గడిపే కుర్రాడు. అతడికి సింధు (ప్రియాంక జవల్కర్) అంటే చాలా ఇష్టం. మూడేళ్లుగా ఆమె వెంట తిరుగుతున్నా తను పట్టించుకోనట్లే ఉంటుంది. ఆమెను మెప్పించే పనిలో ఉంటూనే.. తన కుటుంబ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఒకప్పుడు తన తాత ఆధ్వర్యంలో గొప్పగా నడిచిన ఎస్ఆర్ కళ్యాణ మండపం బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకుంటాడు కళ్యాణ్. తన తండ్రి కారణంగా ప్రాభవం కోల్పోయిన ఆ మండపాన్ని మళ్లీ ఒక స్థాయికి తీసుకురావడానికి కళ్యాణ్ స్నేహితులతో కలిసి కష్టపడతాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన ఇబ్బందులేంటి.. సింధును తన దాన్ని చేసుకోవడంలో అతను ఎదుర్కొన్న సమస్యలేంటి.. తండ్రిని దారికి తేవడానికి అతనేం చేశాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

‘ఎస్ఆర్ కళ్యాణమండపం’లో దాదాపుగా పాత్రధారులందరూ స్మార్ట్ ఫోన్సే వాడుతుంటారు. సాయికుమార్ అయితే తాను వాడుతున్నది జియో సిమ్ అని కూడా ఓ సీన్లో అంటాడు. ‘బాహుబలి’ సినిమాలో పాపులరైన శివగామి.. కట్టప్ప పాత్రల ప్రస్తావన కూడా ఉంటుంది సినిమాలో. అంటే ఈ కథ ఇప్పటి కాలంలోనే నడుస్తోందన్నది స్పష్టం. కానీ ఓ సన్నివేశంలో ‘ఖుషి’ సినిమా రిలీజైందని ఎగ్జైట్ అవుతూ హీరో హీరోయిన్లతో సహా అందరూ థియేటర్ కు వెళ్తారు. పాత సినిమాను మళ్లీ రిలీజ్ చేశారేమో అని మనం సర్ది చెప్పుకోవడానికి కూడా వీల్లేకుండా అక్కడ పవన్ కళ్యాణ్ కటౌట్లకు పాలాభిషేకాలు.. లోపల థియేటర్లో ఫస్డ్ డే ఫస్ట్ షో హంగామా అంతా నడుస్తుంటుంది. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సినిమాను ఎంత ఆషామాషీగా లాగించేశారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. టీజర్.. ట్రైలర్ చూసి ఇదేదో విషయం ఉన్న సినిమాలాగే ఉందే అన్న ఆశతో థియేటర్లలో అడుగు పెట్టిన కాసేపటికే మబ్బులు విడిపోయేలా చేసే ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’.. ఆద్యంతం ఒక దశా దిశా లేకుండా నడుస్తూ రెండున్నర గంటలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.

‘ఎస్ఆర్ కళ్యాణమండపం’లో ప్రధానంగా చెప్పాలనుకున్న పాయింట్.. హీరో తాత ఎంతో గొప్పగా నడిపించిన కళ్యాణమండపాన్ని అతడి తండ్రి భ్రష్టు పట్టిస్తే.. దాన్ని హీరో తన చేతుల్లోకి తీసుకుని మంచి స్థితికి తీసుకురావడం.. తండ్రి గౌరవాన్ని నిలబెట్టడం. ఐతే సాయికుమార్ చేసిన తండ్రి పాత్రతో ఏం చెప్పాలనుకున్నారన్న విషయం థియేటర్ల నుంచి బయటికి వచ్చాక కూడా అర్థం కాదు. సినిమా ఆద్యంతం ఆ పాత్ర బాధ్యతా రాహిత్యంతోనే కనిపిస్తుంది. ఎఫ్పుడూ తాగి తందనాలాడటం.. ఇంట్లో వాళ్లతో గొడవ పెట్టుకోవడం తప్ప చేేసేదేమీ ఉండదు. ఇదంతా చూసి తండ్రితో మాట్లాడ్డమే మానేస్తాడు హీరో. తండ్రీ కొడుకుల మధ్య ఎప్పుడూ సఖ్యత కనిపించదు. కానీ చివర్లోకొచ్చేసరికి హీరో పాత్ర తండ్రికి ఓ రేంజిలో ఎలివేషన్ ఇస్తుంది. తాత సరిగా పెంచలేదు కాబట్టి.. తండ్రి అలా తయారయ్యాడు.. ఆయన చాలా గొప్పోడు అంటాడు హీరో. సినిమా మొత్తం తండ్రి పాత్రను అంత బాధ్యతా రాహిత్యంగా చూపించి ఒక నాలుగు డైలాగుల్లో ఆయన గొప్పోడు అంటూ ఎమోషనల్ అయిపోతే.. ఆ గొప్పదనాన్ని.. ఆ ఎమోషన్ని ప్రేక్షకుడు ఎలా ఫీలవ్వాలి? కథలో ఎంతో కీలకమైన పాత్రలు.. సన్నివేశాలను ఇంత ఆషామాషీగా చూపిస్తే ఇక సినిమాపై ఎలాంటి అభిప్రాయం కలుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

హీరో కిరణ్ అబ్బవరం తనే స్వయంగా తీర్చిదిద్దుకున్న స్క్రిప్టే ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’కు అతి పెద్ద బలహీనత.ఇటు ప్రేమకథలో కానీ.. అటు కళ్యాణమండపం చుట్టూ తిరిగే కథలో కానీ ఏ ఎమోషన్ కానీ.. ఇంటెన్సిటీ కానీ లేకపోవడంతో కథతో ప్రేక్షకుడు ఎక్కడా కనెక్ట్ అయ్యే అవకాశం లేకపోయింది. అన్నీ పైపైన అలా నడిచిపోతుంటాయి తప్ప.. పాత్రలు కానీ.. సన్నివేశాలు కానీ అనుకున్నంత ఇంపాక్ట్ వేయవు. హీరో క్యారెక్టరైజేషన్ కొంచెం సరదాగా ఉండటం.. కడప యాసలో చెప్పే కొన్ని డైలాగులు పేలడంతో కొన్ని సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి కానీ.. అంతకుమించి ఇందులో చెప్పుకోవడానికేమీ లేదు. భాష-యాస విషయంలో కూడా ఒక నిలకడ లేకపోయింది. కొన్ని పాత్రలు కొన్ని చోట్ల మాత్రమే భాష-యాసను పట్టించుకున్నట్లు కనిపిస్తాయి. మిగతా పాత్రల మీద శ్రద్ధ లేదు. దీంతో నేటివిటీ పరంగా ప్రేక్షకులు భిన్నంగా ఫీలవడానికి అవకాశం లేకపోయింది. హీరో పాత్రకు ఏదో ఇంట్రడక్షన్ సీన్లో బిల్డప్ ఇచ్చి స్లో మోషన్ షాట్లు వేస్తే ఓకే కానీ.. ఒక సూపర్ స్టార్ లెవెల్లో ప్రతిసారీ విపరీతమైన బిల్డప్.. షో మోషన్ షాట్లు వేయడంతో ఒక దశ దాటాక చికాకు పుడుతుంది. అసలు స్టార్లే ఇలాంటివి ఇలాంటి మరీ మొనాటనీ అయిపోతున్నాయని పక్కన పెట్టేస్తే ఒక కొత్త హీరో ఇలా చేస్తే ఏం కనెక్ట్ అవుతాం?

కొత్తగా అనిపించే ఒక్క సన్నివేశమూ లేని ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’లో కొన్ని మూమెంట్స్ మాత్రమే పర్వాలేదనిపిస్తాయి. కాలేజీ నేపథ్యంలో నడిచే సీన్లు మరీ మూసగా అనిపిస్తాయి. హీరో హీరోయిన్ వెంటపడి ప్రేమ పేరుతో ఏడిపించే ఈ టైపు సీన్లు ఎఫ్పుడో ‘ఇడియట్’ కాలం నుంచి చూస్తున్నవే. ఇక తండ్రీ కొడుకుల అనుబంధం.. కళ్యాణమండపం సీన్లయినా పండాయా అంటే అదీ లేదు. ఆరంభం నుంచి కథ ముందుకే కదలదు. ప్రథమార్ధంలో అయినా కొంచెం కామెడీ వర్కవుట్ అయి ఓకే అనిపిస్తుంది కానీ.. ద్వితీయార్ధం మాత్రం పూర్తిగా తేలిపోయింది. ఏ సీన్ ఎందుకొస్తుందో అర్థం కాని అయోమయం కనిపిస్తుంది. చాలా సీన్లు మరీ సాగతీతగా అనిపిస్తాయి. రిపీటెడ్ డైలాగ్స్ విసుగెత్తిస్తాయి. అక్కడక్కడా మంచి పాటలు పడటం కాస్త ఉపశమనం. అంతకుమించి ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’లో విశేషాలేమీ లేవు. టీజర్.. ట్రైలర్ చూసి ఏదో అనుకుంటే తెరపై బొమ్మ ఇంకేదో కనిపిస్తుంది.

నటీనటులు:

కిరణ్ అబ్బవరం చేసింది ఒక్క సినిమానే అయినా అతడికది బాగానేే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చినట్లుంది. మంచి ఈజ్ తో నటించిన అతను బాగా అలవాటైన కుర్రాడిలా కనిపించాడు ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’లో. కిరణ్ బాడీ లాంగ్వేజ్.. యాక్టింగ్.. డైలాగ్ డెలివరీ బాగున్నాయి. అతడి లుక్ కూడా ఓకే. కాకపోతే స్క్రిప్టు కూడా తనే డీల్ చేసిన ఈ సినిమాలో తనకు తాను అంత బిల్డప్ ఎందుకు ఇచ్చుకున్నాడో అర్థం కాని విషయం. ప్రియాంక జవల్కర్ మరోసారి నిరాశ పరిచింది. ‘తిమ్మరసు’లో మాదిరే ఇందులోనూ జేడెడ్ లుక్ తో కనిపించిందామె. నటన గురించి కూడా చెప్పుకునేందుకు పెద్దగా ఏమీ లేకపోయింది. సాయికుమార్ తన వంతుగా ధర్మ పాత్రను పండించడానికి గట్టి ప్రయత్నమే చేశారు. ఆ పాత్రను ఆరంభంలో చూసి ఎంతో ఆశిస్తాం. తన స్క్రీన్ ప్రెజెన్స్.. నటనతో సాయికుమార్ ఆకట్టుకున్నప్పటికీ పాత్రను తేల్చిపడేయడంతో అదంత ఆకట్టుకోదు. శ్రీకాంత్ అయ్యంగార్ క్యారెక్టర్ రొటీన్ అనిపిస్తుంది. తులసి హీరో తల్లి పాత్రలో బాగా చేసింది. హీరో స్నేహితుల పాత్రలు పోషించిన వాళ్లు పర్వాలేదు. తనికెళ్ల భరణి కనిపించిన కాసేపు ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం:

‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సినిమాలో చెప్పుకోదగ్గ ఆకర్షణ అంటే చేతన్ భరద్వాజ్ అందించిన సంగీతమే. చుక్కల చున్నీ పాటతో పాటు సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట కూడా ఆకట్టుకుంటుంది. మిగతా పాటలూ పర్వాలేదనిపిస్తాయి. నేపథ్య సంగీతం ఓకే. విశ్వాస్ డేనియల్ కెమెరా పనితనం సాధారణంగా అనిపిస్తుంది. బడ్జెట్ పరిమితుల ప్రభావం కూడా కెమెరామన్ మీద బాగానే పడ్డట్లుంది. ప్రొడక్షన్ పరంగా అంత క్వాలిటీ కనిపించదు సినిమాలో. కథా కథనాలు బాగుంటే ఇవన్నీ పక్కకు వెళ్లిపోయేవి కానీ.. వాటితోనే అతి పెద్ద సమస్య. కిరణ్ అబ్బవరపు ఏమనుకుని ఈ కథను మొదలుపెట్టాడో కానీ.. ప్రేక్షకులను అరెస్ట్ చేసే పాయింటంటూ ఇందులో ఏమీ లేదు. ఏం తోస్తే అది రాసి సినిమా తీసేసినట్లు అనిపిస్తుంది. ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వర్తించిన దర్శకుడు శ్రీధర్ గాదె మెప్పించలేకపోయాడు. ఎడిటింగ్ ఈ సినిమాకు పెద్ద మైనస్. చాలా సన్నివేశాలు సాగతీతగా అనిపిస్తాయి. డైలాగ్స్ కూడా రిపీటెడ్ అనిపిస్తాయి. దర్శకత్వ పరంగా శ్రీధర్ నిరాశపరిచాడు. ఒక కొత్త దర్శకుడి నుంచి ఆశించే కొత్తదనం ఇందులో ఏమీ కనిపించదు.

చివరగా: మండపంలో మెరుపుల్లేవ్

రేటింగ్-2/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS