చిత్రం : ‘స్కైలాబ్’
నటీనటులు: నిత్యా మీనన్-సత్యదేవ్-రాహుల్ రామకృష్ణ-తులసి-నారాయణరావు-సుబ్బరాయ శర్మ-విష్ణు-శరణ్య ప్రదీప్ తదితరులు
సంగీతం: ప్రశాంత్ విహారి
ఛాయాగ్రహణం: ఆదిత్య జవ్వాది
నిర్మాతలు: పృథ్వీ పిన్నమరాజు-నిత్యా మీనన్
రచన-దర్శకత్వం: విశ్వక్ ఖండేరావు
వినూత్నమైన
కాన్సెప్ట్ తో తెరకెక్కి.. చక్కటి ప్రోమోలతో ఆకట్టుకున్న చిన్న సినిమా..
స్కైలాబ్. నిత్యామీనన్.. సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో కొత్త దర్శకుడు విశ్వక్
ఖండేరావు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని
విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
1979లో కరీంనగర్ జిల్లాలోని
బండ్ల లింగం పల్లి అనే ప్రాంతంలో నడిచే కథ ఇది. ఆ సమయంలో నాసా ప్రయోగించిన
భారీ ఉపగ్రహం స్కైలాబ్ విఫలమై దాని శకలాలు పలు దేశాలపై పడబోతున్నట్లుగా
వార్తలొస్తాయి. దీంతో బండ్లలింగం పల్లి జనాలు సైతం ఈ స్కైలాబ్ భయంతో
వణికిపోతారు. దాన్నుంచి ఎలా బయటపడాలా అని మార్గాలు వెతుకుతారు. ఇక తమకు
రేపు అనేది ఉండదని అర్థమైన స్థితిలో వాళ్ల ఆలోచనల్లో ఎలాంటి మార్పు
వచ్చింది. ఈ ఉపద్రవం నుంచి బయటపడే క్రమంలో వాళ్లు నేర్చుకున్న పాఠాలేంటి
అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
ఈ తరం వాళ్లకు స్కైలాబ్
అనేది కొత్త పదం లాగా అనిపించొచ్చు కానీ.. 50 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న
వాళ్లను కదిపితే దీని గురించి కథలు కథలుగా చెబుతారు. యుగాంతం లాంటి
కాన్సెప్ట్ ల మాదిరి ఇదేమీ అపోహలతో కూడుకున్న విషయం కాదు. 70వ దశకంలో
నిజంగానే నాసా ప్రయోగించిన ‘స్కైలాబ్’ అనే భారీ ఉపగ్రహం విఫలమై.. భూమి మీద
వివిధ దేశాల్లో దాని శకలాలు పడి భారీ నష్టం వాటిల్లబోతోందని.. ప్రాంతాలకు ఆ
శకలం పడే చోట వందల కిలోమీటర్లు ఏమీ మిగలదని వార్తలొచ్చాయి.
ప్రభావిత దేశాల్లో ఇండియా కూడా ఉంది. రేడియోల్లో దీని గురించి అధికారికంగా
హెచ్చరికలు చేస్తే ఊర్లల్లో ఉండే అమాయక జనం పరిస్థితి ఎలా ఉంటుందో
ఊహించుకోవచ్చు. మరి ఆ పరిస్థితుల్లో తెలంగాణలోని బండ్లలింగం పల్లి అనే ఓ
పల్లెటూరిలో రకరకాల మనస్తత్వాలున్న మనుషులు.. స్కైలాబ్ అనే ఉపద్రవం
నేపథ్యంలో ఎలా స్పందించారనే నేపథ్యంలో సాగే సినిమా ‘స్కైలాబ్’.
ఐతే
ఇలాంటి వైవిధ్యమైన కాన్సెప్ట్ ఎంచుకుని.. సత్యదేవ్.. నిత్యా మీనన్..
రాహుల్ రామకృష్ణ లాంటి మంచి నటీనటుల్ని పెట్టుకుంటే సరిపోతుందా? ఆ
కాన్సెప్ట్ ను ఎంత బాగా తెరపైకి తీసుకొచ్చారు.. ఈ ఆర్టిస్టులను
ఉపయోగించుకుని ఎంత మేర ఎంటర్టైన్ చేశారు అన్నది ముఖ్యం. ఈ విషయంలో
‘స్కైలాబ్’ నిరాశకే గురి చేస్తుంది. వినోదం పండించడానికి మంచి అవకాశమున్న
కాన్సెప్టే అయినా.. ఆర్ట్ సినిమా తరహలో నత్తనడకన సాగే కథనం నీరసమే
తెప్పిస్తుంది.
ఒక సమూహాన్ని సంక్షోభంలోకి నెట్టేలా కనిపించే ఒక
పెద్ద సమస్య తలెత్తితే.. ముందు ఆ సమస్యను చూసి అంతా కంగారు పడిపోతారు.
విపరీతమైన భయం.. బాధను అనుభవించాక ఇక ఏమైతే అయ్యిందిలే అన్న మొండి ధైర్యం
వచ్చేస్తుంది. ఇక అప్పుడు మనుషుల్లో వచ్చే పరివర్తన ఎలా ఉంటుందో చూపించే
చిత్రమిది. స్కైలాబ్ అనే ఉపద్రవం చివరికి ఎలా ముగిసిందో అందరికీ తెలిసిందే
కాబట్టి దీని వల్ల ఏం జరిగిపోతుందో అన్న భయం కానీ.. ఉత్కంఠ కానీ
ప్రేక్షకుల్లో కలగదు.
దర్శకుడు కూడా ఆ తరహాలో సినిమాను
నడిపించలేదు. స్కైలాబ్ గురించి మనుషుల్లో తలెత్తిన భయాల నేపథ్యంలో కామెడీ
పండించడానికి ప్రయత్నం చేశాడు. కానీ మన పెద్దోళ్లను అడిగితే అప్పటి
పరిస్థితుల గురించి కథలు కథలుగా చెబుతారు. ఎన్నో ఉదంతాలను గుర్తు
చేసుకుంటారు. వాటన్నింటి గురించి తెలుసుకుని.. కథలో జొప్పించే ప్రయత్నం
చేస్తే మరింతగా కామెడీ పండించడానికి.. అలాగే ప్రేక్షకులను ఎమోషనల్ గా కూడా
కదిలించడానికి అవకాశం ఉండేది. కానీ దర్శకుడు అంతా పైపైనే లాగించేశాడు.
స్కైలాబ్
అంశం చర్చకు రావడానికి ముందు బండ్లలింగం పల్లిలో రకరకాల మనుషులను పరిచయం
చేసి.. వాళ్ల నేపథ్యాలు.. మనస్తత్వాల నేపథ్యంలో వినోదం పండించడానికి
దర్శకుడు విశ్వక్ ప్రయత్నించాడు. తనకు తాను పెద్ద రచయితను అని ఫీలవుతూ..
పెళ్లి చేసుకోమన్న తండ్రితో సవాలు చేసి ఏది పడితే అది రాసేసి తన రచనలు
ఏదైనా పత్రికలో పబ్లిష్ చేయించుకోవాలని చూసే అమ్మాయిగా నిత్యా మీనన్..
సిటీలో తన లైసెన్స్ క్యాన్సిల్ అయితే పల్లెటూరికి వచ్చి ఇక్కడ క్లినిక్
పెట్టి డబ్బులు సంపాదించాలని ఆశపడే వైద్యుడిగా సత్యదేవ్.. ఒకప్పుడు వైభవం
అనుభవించిన కుటుంబంలో పుట్టి ఇప్పుడు అప్పులోళ్ల బాధల నుంచి బయటపడే మార్గం
కోసం చూస్తున్న వ్యక్తిగా రాహుల్ రామకృష్ణ.. ఇలాంటి ఇంట్రెస్టింగ్
క్యారెక్టర్లు చాలానే కనిపిస్తాయి ‘స్కైలాబ్’లో.
కానీ పరిచయం వరకు
ఆసక్తి రేకెత్తించే ఆ పాత్రలు.. ఆ తర్వాత నామమాత్రంగా మారిపోతాయి. కొన్ని
సీన్లు కొంత ఫన్నీగా అనిపించినా.. గట్టిగా నవ్వుకునే సన్నివేశం అయితే
ఒక్కటీ కనిపించదు. ఇంటర్వెల్ ముంగిట స్కైలాబ్ అంశం వచ్చే వరకు సినిమా మరీ
సాధారణంగా నడుస్తుంది.
ఇక ద్వితీయార్ధం అంతా కథ పూర్తిగా స్కైలాబ్
భయాల చుట్టూనే తిరుగుతుంది. ఈ సన్నివేశాలు కూడా అంతగా వర్కవుట్ కాలేదు.
సత్యదేవ్ క్లినిక్ చుట్టూ నడిచే సీన్లు కొంత మేర ఎంగేజింగ్ గా అనిపించినా..
అంతకుమించిన విశేషాలేమీ కనిపించవు. స్కైలాబ్ విషయంలో జనాలు స్పందించే తీరు
మామూలుగానే ఉంటుంది. ఆసక్తి రేకెత్తించే సన్నివేశాలే లేక ప్రి క్లైమాక్స్
ముంగిట ‘స్కైలాబ్’ గ్రాఫ్ మరింత పడిపోతుంది. పతాక సన్నివేశంలో మాత్రం
ఉన్నట్లుండి ఎమోషన్ తీసుకురావడానికి ప్రయత్నించాడు దర్శకుడు.
ధనవంతులంతా
ప్రాణ భయంతో బావుల్లో వెళ్లి దాక్కుంటే.. ఈ ఒక్క రోజైనా స్వేచ్ఛగా
జీవిద్దామని అప్పటి వరకు వివక్షకు గురైన పనివాళ్లంతా అన్ని సౌకర్యాలనూ
అనుభవించడం.. ప్రాణం పోయే దశలో అంతరాలన్నీ తొలగిపోయి మనుషులంతా ఒక్కటి
కావడం.. ఈ నేపథ్యంలో పతాక సన్నివేశాలు పర్వాలేదనిపించినా.. ప్రేక్షకులు ఆ
ఎమోషన్ ను ఫీలవడం కష్టమే. కామెడీ ప్రధానంగా సాగే సినిమాల్లో ప్రేక్షకులు
కొంచెం హడావుడి కోరుకుంటారు. కామెడీ డోస్ ఇంకా ఎక్కువ ఆశిస్తారు.
ఈ
విషయంలో ‘స్కైలాబ్’ ఎంతమాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. స్కైలాబ్
గురించి తెలియని వాళ్లకు ఇందులో చూసి ఎగ్జైట్ అయ్యే విషయాలేమీ లేవు. అలాగే
దాని గురించి అవగాహన ఉన్న వాళ్లు కూడా అంతగా ఐడెంటిఫై అయ్యేలానూ సినిమాల
లేదు.
నటీనటులు:
నిత్యా మీనన్ గౌరి పాత్రలో ఆకట్టుకుంటుంది.
ఫిజిక్ మీద దృష్టిపెట్టి మళ్లీ అందంగా తయారైన నిత్యా.. గౌరీగా బాగానే
ఒదిగిపోయింది. ఈ మలయాళీ అమ్మాయి తెలంగాణ యాసలో ఏ తడబాటు లేకుండా డైలాగులు
చెప్పిన తీరు మెప్పిస్తుంది. నిత్యా నటనకు వంక పెట్టడానికే లేదు. కానీ తన
పాత్ర అనుకున్నంత స్థాయిలో లేదు. సత్యదేవ్ మంచి నటుడనే విషయం ఈ సినిమాతో
మరోసారి రుజువైంది. పాత్రకు తగ్గట్లు సహజమైన నటనతో అతను ఆకట్టుకున్నాడు.
రాహుల్ రామకృష్ణకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. తన పాత్రను అలవోకగా
చేసుకుపోయాడు. తులసితో పాటు.. విష్ణు.. శరణ్య.. నారాయణరావు.. సుబ్బరాయ
శర్మ.. ఇలా మిగతా నటీనటులందరూ కూడా తమ పాత్రల పరిధిలో బాగానే చేశారు.
సాంకేతిక వర్గం:
ప్రశాంత్
విహారి సంగీతం ‘స్కైలాబ్’కు బలం. అతడి నేపథ్య సంగీతం తొలి సన్నివేశం నుంచే
ఒక మూడ్ క్రియేట్ చేస్తుంది. పాటలు మామూలుగానే అనిపించినా.. ఆర్ఆర్ వరకు
ప్రశాంత్ ఆకట్టుకున్నాడు. ఆదిత్య జవ్వాది ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు
సినిమా స్థాయికి తగ్గట్లున్నాయి. ఇక డెబ్యూ డైరెక్టర్ విశ్వక్ ఖండేరావు
ఎంచుకున్న కాన్సెప్ట్ ఓకే కానీ.. దాని ఎగ్జిక్యూషనే సరిగా లేదు. స్కైలాబ్
సమయంలో మన జనాల అనుభవాల గురించి అతను అవసరమైన స్థాయిలో పరిశోధన
చేయలేదనిపిస్తుంది. మరింత లోతుగా విషయాలు తెలుసుకుని.. డ్రామాను రక్తి
కట్టించడానికి ప్రయత్నించాల్సింది. అతడి నరేషన్ స్టైల్ క్లాస్ గా
అనిపిస్తుంది కానీ.. మరీ నెమ్మదిగా ఉండటం ప్రతికూలత. ఈ తరహా కాన్సెప్ట్
ఓరియెంటెడ్ సినిమాలకు రీచ్ పెరగాలంటే ఇలా సటిల్ గా సినిమాలను నడిపిస్తే
కష్టం.
చివరగా: స్కైలాబ్.. దారి తప్పిన ప్రయోగం
రేటింగ్-2/5
Disclaimer
: This Review is An Opinion of One Person. Please Do Not Judge The
Movie Based On This Review And Watch Movie in Theatre