రెడ్

Thu Jan 14 2021 GMT+0530 (IST)

రెడ్

చిత్రం  : రెడ్

నటీనటులు: రామ్-మాళవిక శర్మ-నివేథా పెతురాజ్-అమృత అయ్యర్-సంపత్ రాజ్-వెన్నెల కిషోర్-సత్య-పవిత్ర లోకేష్ తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
నిర్మాత: స్రవంతి రవికిషోర్
కథ: మగిల్ తిరుమణి
మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కిషోర్ తిరుమల

‘ఇస్మార్ట్ శంకర్’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ఊపులో ఉన్న రామ్ నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘రెడ్’. తమిళ హిట్ ‘తడమ్’కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఎప్పుడో పూర్తయినా.. కరోనా విరామం వల్ల ఆలస్యంగా ఇప్పుడు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: ఆదిత్య (రామ్).. సిద్దార్థ్ (రామ్) ఒకే తల్లి కడుపున పుట్టిన కవల సోదరులు. కానీ విభిన్న పరిస్థితుల్లో వేర్వేరుగా పెరిగిన ఈ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఏమాత్రం పడదు. ఒకరినొకరు బద్ధ శత్రువుల్లా చూస్తారు. ఇలాంటి సమయంలో వీరిలో ఒకరు ఒక హత్య చేస్తారు. కానీ ఇద్దరిలో ఎవరు ఆ హత్య చేశారన్నది తేల్చడం పోలీసులకు సవాలుగా మారుతుంది. ఇంతకీ ఆ హత్య చేసిందెవరు.. దానికి కారణాలేంటి.. పోలీసులు అసలు హంతకుడిని పట్టుకోగలిగారా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: ఒక భాషలో విజయవంతమైన సినిమాను మరో భాషలో ఉన్నదున్నట్లు తీసినా కూడా కొన్నిసార్లు అంత ప్రభావవంతంగా అనిపించదు. ముఖ్యంగా తమిళంలో భలేగా అనిపించిన సినిమాలు చాలా తెలుగులోకి రీమేక్ అయి తేడా కొట్టడం చాలా సందర్భాల్లో జరిగింది. ‘సూదు కవ్వుం’ అనే క్లాసిక్ ను తెలుగులో ‘గడ్డం గ్యాంగ్’ తీస్తే దాన్ని భరించడం చాలా చాలా కష్టమైంది మన ప్రేక్షకులకు. ఒరిజినల్ చూస్తున్నపుడు కలిగే మూడ్.. ఆ ఇంపాక్ట్ రీమేక్ చూస్తున్నపుడు మిస్ కావడానికి కారణాలేంటో కూడా కొన్నిసార్లు అంతుబట్టదు. తమిళంలో సూపర్ హిట్టయిన థ్రిల్లర్ మూవీ ‘తడమ్’కు రీమేక్ గా తెరకెక్కిన ‘రెడ్’ సినిమా కూడా ఈ కోవకే చెందుతుంది. ఒరిజినల్లోని సన్నివేశాలను దాదాపు 90 శాతం దాకా అలాగే దించేసినా.. మాతృకను చూస్తున్నపుడు ఉన్న ఫీల్ ఇక్కడ లేకపోవడానికి సరైన కారణాలేంటో చెప్పడం కష్టం. మాతృకతో పోలిస్తే ఇందులో ఒక మంచి ఐటెం సాంగ్.. హీరోయిన్ గ్లామర్.. కొంచెం కామెడీ.. రామ్ మార్కు మాస్ పెర్ఫామెన్స్ తోడైనా కూడా ‘రెడ్’ ప్రేక్షకులను మెప్పించేలా తయారు కాలేకపోయింది.

‘తడమ్’తో పోలికల సంగతి పక్కన పెట్టేసి.. ఒక సినిమాగా ‘రెడ్’ను చూస్తే.. ఇందులోని కథ యునీక్ గా అనిపిస్తుంది. మర్డర్ ఇన్వెస్టిగేషన్లో ఇంతకుముందు చాలా సినిమాలు చూసి ఉంటాం కానీ.. వాటితో పోలిస్తే ఇది భిన్నంగా కనిపిస్తుంది. ఇద్దరు కవల సోదరులు.. వారి మధ్య ఒకరినొకరు చంపుకోవాలన్నంత శత్రుత్వం. అలాంటి సమయంలో ఇద్దరిలో ఒకరు ఓ హత్య చేస్తే.. ఆ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించే క్రమంలో ‘రెడ్’ నడుస్తుంది. అసలు హత్యకు కారణమేంటి.. ఎవరు హత్య చేశారు అన్నది చివరి వరకు సస్పెన్సుగా పెట్టి మధ్యలో వివిధ కోణాల్లో పోలీసులు విచారించే క్రమాన్ని చూపించారు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు ఉత్కంఠ రేకెత్తించినా.. సస్పెన్సును కొనసాగించే క్రమంలో ఉండాల్సిన బిగి ఉత్కంఠ ‘రెడ్’లో మిస్ కావడం పెద్ద మైనస్. హత్య జరగడానికి ముందు వరకు కథ చాలా సాధారణంగా నడుస్తాయి. రెండు ప్రధాన పాత్రల పరిచయం ఏమంత ఆసక్తి రేకెత్తించదు. హెబ్బా పటేల్ చేసిన మాస్ ఐటెం సాంగ్ మినహాయిస్తే తొలి ముప్పావు గంటలో హై ఇచ్చే అంశాలే లేవు. హీరోలిద్దరి ప్రేమకథలూ బాగా బోర్ కొట్టించేస్తాయి. హత్యతో కథ మలుపు తిరిగే వరకు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే అంశాలేమీ లేవు ‘రెడ్’లో.

ఇక విచారణ నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలు ఆసక్తి రేకెత్తిస్తాయి. ఇంటర్వెల్ దగ్గర హీరోలిద్దరి మధ్య కన్ఫ్రంటేషన్ సీన్ తో ద్వితీయార్ధం మీద ఆసక్తి నెలకొంటుంది. కానీ సెకండాఫ్ లో మళ్లీ కథ పక్కదోవ పడుతుంది. సింపుల్ గా తేల్చేయాల్సిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను విపరీతంగా సాగతీసి ‘రెడ్’ను ఒక దశలో భరించలేని విధంగా తయారు చేశాడు దర్శకుడు కిషోర్ తిరుమల. సినిమా మీద ఇంప్రెషన్ ను బాగా తగ్గించేసే ఎపిసోడ్ ఇది. థ్రిల్లర్ సినిమాలు కిషోర్ కప్ ఆఫ్ టీ కాదన్న విషయం ద్వితీయార్ధంలో తెలిసిపోతుంది. ఈ జానర్ సినిమాలకు రేసీ స్క్రీన్ ప్లే.. ఎడిటింగ్ అవసరమన్న విషయాన్ని ఆయన గుర్తించ లేకపోయాడు. ఈ రెండూ మిస్ అయి ద్వితీయార్ధం ప్రేక్షకులకు పరీక్ష పెడుతుంది. చివర్లో అసలు ట్విస్టేంటో రివీలయ్యే దగ్గర సన్నిశాలు బాగా అనిపిస్తాయి. ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. ముగింపులో హీరోలిద్దరి మధ్య ఎవరికీ తెలియని కనెక్షన్ ను వెల్లడించే సన్నివేశం కూడా బాగుంది. కానీ ముందంతా విసిగించి.. చివర్లో మెరుపులు మెరిపించినంత మాత్రాన ప్రేక్షకుల ఇంప్రెషన్ మారిపోదు. ఓవరాల్ గా చెప్పాలంటే ‘రెడ్’లో కాన్సెప్ట్.. కొన్ని సన్నివేశాలు.. రామ్ పెర్ఫామెన్స్ ఆకట్టుకున్నప్పటికీ.. సినిమా మాత్రం అనుకున్నంత ఇంపాక్ట్ వేయలేకపోయింది.

నటీనటులు: ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ సక్సెస్ తర్వాత రామ్ లో పతాక స్థాయికి చేరిన ఆత్మవిశ్వాసం ‘రెడ్’లో కనిపిస్తుంది. ఆదిత్య.. సిద్దార్థ్ పాత్రలు రెంటినీ అతను సమర్థవంతంగా పోషించాడు. లుక్స్ పరంగా చిన్న మార్పులు చేసినప్పటికీ.. పెర్ఫామెన్స్ ద్వారా రెండు పాత్రల్లో తేడా చూపించగలిగాడు. ముఖ్యంగా ఆదిత్య పాత్రలో అతను చూపించిన యాటిట్యూడ్.. మాస్ పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటాయి. హీరోయిన్లలో ఎవరికీ చెప్పుకోదగ్గ పాత్ర లేదు. మాళవిక శర్మ కనిపించినంత సేపూ గ్లామర్ విందు చేసింది. అమృత అయ్యర్ బాగానే నటించింది కానీ.. ఆమె పాత్ర అతిగా అనిపిస్తుంది. తన సన్నివేశాల్లో మెలోడ్రామా ఎక్కువైంది. నివేథా పెతురాజ్ ఎస్ఐ పాత్రకు సెట్ కాలేదు. ఆమె అప్పీయరెన్స్ ఆ పాత్రకు సరిపోలేదు. నటన పరంగా కూడా ఆమె క్లూ లెస్ గా కనిపించింది. సంపత్ రాజ్ సీఐ పాత్రలో బాగానే చేశాడు. వెన్నెల కిషోర్ నుంచి ఆశించిన నవ్వులు లేవు. సత్య కొంతం ఎంటర్టైన్ చేశాడు. పవిత్ర లోకేష్ ఒక ఆశ్చర్యకర పాత్ర చేసింది కానీ.. అది ఆమెకు నప్పలేదు.

సాంకేతిక వర్గం: టెక్నికల్ గా ‘రెడ్’ యావరేజ్ గానే అనిపిస్తుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ను లేపినట్లు ‘రెడ్’ను తన మ్యాజిక్ తో లేపలేకపోయాడు మణిశర్మ. దించక్ దించక్ పాట మినహా ఎందులోనూ ఆయన ముద్ర కనిపించలేదు. నువ్వే నువ్వే పర్వాలేదనిపిస్తుంది కానీ.. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా మాత్రం లేదు. నేపథ్య సంగీతం కొన్ని చోట్ల బాగా హైలైట్ అయింది. సస్పెన్స్ సీన్లలో ఆయన ముద్ర కనిపిస్తుంది. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పుకునే స్థాయిలో లేవు. ఇక ‘నేను శైలజ’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ లాంటి సాఫ్ట్ లవ్ స్టోరీలు తీసిన కిషోర్ తిరుమల.. థ్రిల్లర్ సినిమాను డీల్ చేయడంలో విఫలమయ్యాడు. ఇది ఆయన శైలి సినిమా కాదు. రీమేక్ అనేసరికి కొంత మసాలా జోడించి మొక్కుబడిగా లాగించేసినట్లు అనిపిస్తుంది. సినిమాలో ప్లస్ అనిపించే సన్నివేశాలకు ఒరిజినల్ దర్శకుడికే క్రెడిట్ ఇవ్వాలి తప్పితే కిషోర్ తన ముద్రను చూపించిందేమీ లేదు.

చివరగా: రెడ్.. రాంగ్ సిగ్నల్

రేటింగ్- 2.25/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS