వెబ్ సిరీస్ (జీ5) రివ్యూ : రెక్కీ
నటీనటులు: శ్రీరామ్-శివ
బాలాజీ-ఆడుగళం నరేన్-సమ్మెట గాంధీ-తోటపల్లి మధు-జీవా-ఎస్తేర్-శరణ్య
ప్రదీప్-రాజేశ్రీ నాయర్-ధన్య బాలకృష్ణన్ తదితరులు
సంగీతం: శ్రీరామ్ మద్దూరి
ఛాయాగ్రహణం: రామ్ కె.మహేష్
నిర్మాత: కేవీ శ్రీరామ్
రచన-దర్శకత్వం: కృష్ణ పోలూరు
గత
రెండేళ్లలో ఓటీటీల జోరు బాగా పెరగడంతో తెలుగులో ఒరిజినల్స్ మేకింగ్ కూడా
బాగా ఊపందుకుంది. తాజాగా జీ5 ఓటీటీ.. ‘రెక్కీ’ పేరుతో ఓ వెబ్ సిరీస్
రూపొందించింది. శ్రీరామ్.. శివబాలాజీ.. జీవా.. ఆడుగళం నరేన్.. సమ్మెట
గాంధీ.. ఇలా పేరున్న తారాగణం చాలామందే నటించారిందులో. ఏడు ఎపిసోడ్ల ఈ
క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
అనంతపురం
జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ ఛైర్మన్ వరదరాజులు (ఆడుగళం నరేన్).. అతడి
తనయుడు చలపతి (శివబాలాజీ) కొన్ని నెలల వ్యవధిలో హత్యకు గురవుతారు. అందరూ
వీరిని చంపింది రాజకీయ ప్రత్యర్థులని అనుకుంటారు. కానీ ఆ హత్యల వెనుక
మిస్టరీ వేరు. కొత్తగా డ్యూటీలో చేరిన ఎస్ఐ లెనిన్ (శ్రీరామ్) ఆ మిస్టరీని
ఛేదించే పనిలో పడతాడు. ఈ క్రమంలో అతడికి కొన్ని సంచలన విషయాలు తెలుస్తాయి. ఆ
విషయాలు ఏంటి.. ఈ హత్యల వెనుక మిస్టరీ ఏంటి.. అసలు విషయలు బయటికి వచ్చాక
తలెత్తిన పరిణామాలేంటి అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
తెలుగులో
కొన్నేళ్ల ముందు కొత్తగా వెబ్ సిరీస్ లు రూపొందుతున్న తరుణంలో వాటి
క్వాలిటీ చూసి బెంబేలెత్తిపోయారు మన జనం. నెట్ ఫ్లిక్స్.. అమేజాన్ ప్రైమ్
లాంటి ఓటీటీల్లో ప్రపంచ స్థాయి వెబ్ సిరీస్ లు చూస్తున్న మన ప్రేక్షకులకు
లోకల్ ఒరిజినల్స్ ఏమాత్రం ఎక్కలేదు. ఆ సమయంలోనే విదేశీ వెబ్ సిరీస్ ల
స్ఫూర్తితో కొన్ని క్వాలిటీ ఒరిజినల్స్ తయారయ్యాయి మన దగ్గర. ఇప్పుడు మన
కథాంశాలనే పర భాషా సిరీస్ ల తరహాలోనే ఆసక్తికరంగా.. ఉత్కంఠభరితంగా
తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది. ఈ మధ్య లోకల్ ఓటీటీ కంటెంట్ విషయంలో
ఎవ్వరూ అందుకోలేని స్థాయిలో దూసుకెళ్తున్న జీ5.. ‘రెక్కీ’ పేరుతో
తీర్చిదిద్దిన కొత్త సిరీస్ కూడా ఆ కోవలోనిదే. రాయలసీమ ప్రాంత నేపథ్యం..
అక్కడి రాజకీయ పరిస్థితులు.. మనుషుల వ్యక్తిత్వాలు.. అక్కడి భాష యాస.
అన్నింటినీ పకడ్బందీగా చూపిస్తూ.. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ.. కొన్ని
చోట్ల ఉత్కంఠ రేపుతూ ఏడు ఎపిసోడ్ల పాటు ప్రేక్షకులను బాగానే ఎంగేజ్
చేయగలిగిందీ సిరీస్.
రెక్కీ.. ఈ టైటిల్ ను బట్టే ఇది ఓ క్రైమ్
సిరీస్ అని అర్థమైపోతుంది. ఓటీటీల్లో ఎన్నో క్రైమ్ సిరీస్ చూశాం. ఉత్కంఠతో
ఊగిపోయాం. ఐతే ‘రెక్కీ’ మరీ ప్రపంచ స్థాయి ఒరిజినల్స్ తరహాలో ఉత్కంఠతో
ఊపేస్తుంది అని చెప్పలేం కానీ.. అసలేం జరిగిందనే ఆసక్తిని మాత్రం
రేకెత్తిస్తుంది. హత్యల వెనుక ఎవరున్నారు అనే విషయంలో ప్రేక్షకులను
గెస్సింగ్ లో ఉంచుతూనే.. టైటిల్ ను జస్టిఫై చేసేలా హత్యకు జరిగే ప్లానింగ్
ఎలా ఉంటుందో డీటైలింగ్ గా చూపిస్తూ సాగుతుంది ‘రెక్కీ’. ఈ సిరీస్
ప్రత్యేకతే.. ఈ రెక్కీ కాన్సెప్టే. మంచి నటుడైనప్పటికీ.. సినిమాల్లో
ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోని సమ్మెట గాంధీ.. మర్డర్లకు స్కెచ్ వేసే
నిపుణుడిగా చేసిన పరదేశి పాత్ర ఈ సిరీస్ కు హైలైట్ గా నిలుస్తుంది. తన
టీంతో కలిసి అతను హత్య చేయాల్సిన వ్యక్తి గురించి రెక్కీ చేసే విధానం..
హత్యకు సన్నాహాలు చేసే తీరు.. తన ప్రణాళికను అమలు చేసే వైనం.. చాలా
ఆసక్తికరంగా అనిపిస్తాయి. ‘రెక్కీ’లో తొలి మూడు ఎపిసోడ్లలో ప్రధానంగా దీని
మీదే ఫోకస్ ఉంటుంది. మొత్తం ఏడు ఎపిసోడ్లలో ప్రేక్షకులను బాగా ఎంగేజ్
చేసేవి ఈ మూడే.
వరదరాజులు హత్య దగ్గర్నుంచి దర్శకుడు ప్రధానంగా
ట్విస్టుల మీద దృష్టిసారించాడు. జరిగింది ఒక హత్య అనుకుంటే.. ఆ హత్యకు
ప్రణాళిక రచించిన వ్యక్తి కూడా హత్యకు గురి కావడంతో.. దాని వెనుక మిస్టరీ
నేపథ్యంలో మిగతా కథ నడుస్తుంది. ఐతే ఈ దశలో ‘రెక్కీ’ కొంచెం దారి
తప్పినట్లుగా.. సాగతీతగానూ అనిపిస్తుంది. చివరి ఎపిసోడ్లో ట్విస్టులన్నీ
ఒక్కొక్కటిగా రివీల్ అవుతూ.. ప్రేక్షకులను కొంత ఆశ్చర్యానికి.. ఉత్కంఠకు
గురి చేస్తాయి కానీ.. అంతకుముందు ఎపిసోడ్లు మాత్రం ఏమంత ఎంగేజింగ్ గా
అనిపించవు. ఈ ఎపిసోడ్లను కూడా పకడ్బందీగా తీర్చిదిద్దుకుని ఉంటే.. ఒక
ఎపిసోడ్ కుదించి ఉంటే ‘రెక్కీ’ తెలుగులో వచ్చిన టాప్ క్లాస్ ఒరిజినల్స్ లో
ఒకటిగా నిలిచేది. కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. ఇది ఒకసారి చూడ్డానికి
ఢోకా లేని సిరీసే. రాయలసీమ ప్రాంత నేపథ్యాన్ని.. అక్కడి పరిస్థితులను..
మనుషుల వ్యక్తిత్వాలను అథెంటిగ్గా చూపించారు. భాష.. యాస విషయంలోనూ
జాగ్రత్తలు తీసుకున్నారు. అది ఈ సిరీస్ కు వైవిధ్యాన్ని తీసుకొచ్చింది.
నటీనటులు:
తమిళంలో
మంచి పేరు సంపాదించిన తెలుగు నటుడు శ్రీరామ్ చాన్నాళ్ల తర్వాత.. ఇక్కడ తన
ముద్రను వేయగలిగాడు. ఎస్ఐ లెనిన్ పాత్రలో అతను సులువుగా ఒదిగిపోయాడు. నటన
పరంగా అతడికి ఇది పరీక్ష పెట్టే పాత్రేమీ కాదు. కానీ పాత్ర పరిధిలో అతను
చక్కగా చేశాడు. ఐతే పేరుకు అతను హీరో కానీ.. సిరీస్ లో పాత్ర-నటన పరంగా
అందరి కంటే ఎక్కువ ఆకట్టుకునేది సమ్మెట గాంధీ. హత్యలకు ప్రణాళికలు రచించి
అమలు చేసే పరదేశి పాత్రలో గాంధీ అదరగొట్టాడు. సినిమాల్లో కూడా అతణ్ని
సరిగ్గా ఉపయోగించుకుంటే బాగా ఉపయోగపడతాడని ‘రెక్కీ’ రుజువు చేస్తుంది.
నెగెటివ్ షేడ్స్ ఉన్న చలపతి పాత్రలో శివబాలాజీ.. మున్సిపల్ ఛైర్మన్
క్యారెక్టర్లో తమిళ నటుడు ఆడుగళం నరేన్ కూడా బాగా చేశారు. తోటపల్లి మధుకు
కూడా మంచి పాత్ర పడింది. ఎస్తేర్.. రాజశ్రీ నాయర్.. శరణ్య ప్రదీప్ కూడా తమ
పాత్రల్లో ఒదిగిపోయారు. సీనియర్ నటుడు జీవా ఆకట్టుకున్నాడు. ధన్య
బాలకృష్ణన్ నామమాత్రమైన పాత్ర చేసిందిందులో.
సాంకేతిక వర్గం:
‘రెక్కీ’కి
సాంకేతిక హంగులు బాగానే కుదిరాయి. కెమెరామన్ రామ్ కె.మహేష్ రాయలసీమ బ్యాక్
డ్రాప్ అథెంటిగ్గా అనిపంచేలా అక్కడి వాతావరణాన్ని బాగా చూపించాడు.
శ్రీరామ్ మద్దూరి నేపథ్య సంగీతం కూడా ఉత్కంఠ రేకెత్తించేలా సాగింది. థీమ్
మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు ఈ సిరీస్ స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.
రైటర్ కమ్ డైరెక్టర్ పోలూరు కృష్ణ.. బలమైన ముద్రే వేశాడు. వెబ్ సిరీస్ లు
ఎలా ఉండాలనే విషయంలో అతను బాగానే కసరత్తు చేసినట్లున్నాడు. ఆరంభం.. ముగింపు
ఆసక్తికరంగా ఉండేలా ప్రతి ఎపిసోడ్ కూ చక్కటి స్క్రీన్ ప్లే సెట్
చేసుకున్నాడు. ఓవరాల్ గా కూడా కథనంలో కొత్తదనం కనిపిస్తుంది. ఒకట్రెండు
ఎపిసోడ్లలో మినహాయిస్తే అతను ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేయగలిగాడు.
చివరగా: రెక్కీ.. ఒక లుక్కేయొచ్చు
రేటింగ్-2.75/5