రాజు గారి గది-3

Fri Oct 18 2019 GMT+0530 (IST)

రాజు గారి గది-3

చిత్రం : రాజు గారి గది-3
నటీనటులు: అశ్విన్ బాబు-అవికా గోర్-ఆలీ-ఊర్వశి-ధన్ రాజ్-బ్రహ్మాజీ-ప్రభాస్ శీను-హరితేజ-అజయ్ ఘోష్ తదితరులు
సంగీతం: షాబిర్
ఛాయాగ్రహణం: ఛోటా కే నాయుడు
మాటలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాణం: ఓక్ ఎంటర్టైన్మెంట్స్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఓంకార్

‘రాజు గారి గది’ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడు ఓంకార్. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అక్కినేని నాగార్జున సమంత లాంటి పెద్ద తారలు దీని సీక్వెల్లో నటించడానికి ముందుకొచ్చారు. కానీ ‘రాజు గారి గది-2’తో ఓంకార్ అంచనాల్ని అందుకోలేకపోయాడు. ఐతే ఇప్పుడు మళ్లీ చిన్న నటీనటులతో ఈ ఫ్రాంఛైజీలో మూడో సినిమా తెరకెక్కించాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘రాజు గారి గది-3’ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: మాయ (అవికా గోర్) హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో డాక్టర్. ఆమె మీద కాంక్షతో ఎవరు దగ్గరికి వెళ్లినా వాళ్లు చిక్కుల్లో పడుతుంటారు. ఓ దయ్యం వాళ్లను ఇబ్బంది పెడుతుంటుంది. మాయ కోసం ఆశపడి దయ్యం బారిన పడ్డ డాక్టర్ శశి (బ్రహ్మాజీ) తమ కాలనీలో అందరికీ తలనొప్పిగా మారిన అశ్విన్ (అశ్విన్ బాబు)ను మాయ వెంట పడేలా చేసి అతణ్ని ఇబ్బందుల్లోకి నెట్టాలనుకుంటాడు. మాయ పట్ల ఆకర్షితుడై ఆమెకు ఐ లవ్యూ చెప్పిన అశ్విన్ కు దయ్యం బాధ తప్పదు. దీనికంతటికీ కారణం మాయ తండ్రి అయిన క్షుద్ర మాంత్రికుడనుకుని అతడి కోసం కేరళకు వెళ్తాడు అశ్విన్. అక్కడ అతడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.. ఇంతకీ మాయకు దయ్యానికి సంబంధమేంటి.. ఈ దయ్యం బాధ వదిలించుకుని మాయను అశ్విన్ పెళ్లాడాడా లేదా అన్నది తెరమీదే చూడాలి.

కథనం-విశ్లేషణ: ‘రాజు గారి గది-3’లో ఒక సన్నివేశంలో హీరోను దయ్యం చుట్టుముట్టి అతడిని భయపెడుతుంది. ఆ క్రమంలో తన చేతి మీద ఉన్న రక్తాన్ని అది నాకుతుంది. అది చూసి హీరో.. ఒక చాక్లెట్ యాడ్ గుర్తుకొచ్చి ‘కిస్ మీ.. హోల్డ్ యుర్ ఐస్’ అంటూ పాట అందుకుంటాడు. దానికి దయ్యం ఒక పులకింతకు లోనవుతూ అతణ్ని వదిలిపెట్టేస్తుంది. ఆ తర్వాత ఇంకో దయ్యం హీరో స్నేహితుడిని పట్టుకుంటుంది. అతను ముందు భయపడి ఆ తర్వాత ‘ఖుషి’ సినిమాలో ఒక డైలాగ్.. బాలయ్య సినిమాలో ఒక డైలాగ్ పేలుస్తాడు. దయ్యం వణికిపోతూ అక్కడి నుంచి పలాయనం చిత్తగిస్తాడు. ఇంకో సీన్లో దయ్యం దెబ్బకు జడుసుకున్న ఇంకో పాత్రధారి భారీ శబ్దంతో అపానవాయువు వదులుతాడు. దయ్యం ముక్కు మూసుకుని వాంతులు చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ సన్నివేశాల్ని బట్టి ‘రాజు గారి గది-3’ ఎలాంటి సినిమానో.. తన నడత ఎలా ఉంటుందో ఒక అంచనాకు రావచ్చు.

కథ పరంగా ఏ కొత్తదనం లేకుండా.. రవ్వంతైనా ‘హార్రర్’ లేకుండా.. కేవలం పాత్రధారులంతా దయ్యాల్ని చూసి భయపడటం.. వాటిని డీల్ చేయడం ద్వారా పండే కామెడీతో కాలక్షేపం చేయించే ప్రయత్నం చేయించే అతి మామూలు సినిమా ‘రాజు గారి గది-3’. హార్రర్ కామెడీ జానర్ మీద చాలా త్వరగా జనాలకు మొహం మొత్తడానికి కారణం..  ఈ జానర్లో ఏ సినిమా తీసుకున్నా కథాకథనాలు ఒకే రకంగా సాగడం. ఒక పాడుబడ్డ భవనంలోకి హీరో అండ్ బ్యాచ్ దిగడం.. అందులో వాతావరణం భయానకంగా కనిపించడం.. దయ్యాలు వీళ్లను భయపెట్టడం.. వీళ్లు అరిచి గోల చేయడం.. ఈ నేపథ్యంలో పండే కామెడీ చూసి చూసి విసుగెత్తిపోయాం. ఈ జానర్ సినిమాలనగానే విజువల్స్.. సౌండ్స్.. ఎఫెక్ట్స్.. సెట్ ప్రాపర్టీస్ సహా  అన్నీ ఒకే రకంగా తయారై ఒకప్పుడు భయం గొలిపిన సన్నివేశాల్ని కూడా ఇప్పుడు మామూలుగా చూడటం.. పగలబడి నవ్వుకున్న సీన్లకు కూడా కామ్ గా కూర్చోవడం అలవాటైపోయింది. అయితే ఈ రొటీన్ వ్యవహారాల్ని కూడా మన్నించి ఎంజాయ్ చేయగలిగితే.. మరీ నాటుగా సాగే కామెడీని చూసి తట్టుకోగలిగితే ప్రేక్షకులు ‘రాజు గారి గది-3’పై ఓ లుక్కేయొచ్చు.

‘రాజు గారి గది’ సిరీస్ లో ఇంతకుముందు వచ్చిన రెండు సినిమాల్లో ఒక్కో దానికి ఒక్కో రకమైన ఫలితం వచ్చింది. ఐతే ఆ రెండింట్లో కామన్ గా కనిపించే ఓ మంచి లక్షణం. కథ కొంచెం బలంగా ఉండటం. రెండింట్లోనూ ప్లాట్ పాయింట్ జనాలు సీరియస్ గా తీసుకునేలా ఉంటుంది. దీనికి తోడు దయ్యంతో ముడిపడ్డ సన్నివేశాలు ఎంతో కొంత భయం గొలుపుతాయి. హార్రర్ కు కామెడీ తోడైనప్పటికీ.. కేవలం నవ్వించడమే కాకుండా కాస్తయినా ప్రేక్షకుల్ని భయపెట్టడం ఈ జానర్ లక్షణం. కానీ ‘రాజు గారి గది-3’లో భయం అనే మాటే లేదు. చాలా సిల్లీగా సన్నివేశాల్ని డీల్ చేయడం వల్ల హార్రర్ ఫ్యాక్టర్ కు స్కోపే లేకపోయింది.

కథ మరీ పలుచగా.. రొటీన్ గా ఉండటంతో ప్రేక్షకులు ఏ దశలోనూ సినిమాలో సీరియస్ గా ఇన్వాల్వ్ కాని పరిస్థితి తలెత్తింది. దీనికి తోడు ద్వితీయార్ధంలో కామెడీ కోసం కాస్తయినా లాజిక్ గురించి పట్టించుకోకుండా హద్దులు దాటిపోవడం.. మరీ నాటు కామెడీ ట్రై చేయడంతో సినిమాను సీరియస్ గా తీసుకోవడం మరీ కష్టం. రెండు గంటలే నిడివి ఉన్నప్పటికీ.. ప్రథమార్ధం తలా తోకా లేకుండా బోరింగ్ గా సాగడం వల్ల కాలక్షేపం కష్టమే అవుతుంది. ద్వితీయార్ధంలో కథలోని ట్విస్టు తెలిసే సన్నివేశాలు చాలా సాధారణంగా అనిపిస్తాయి. ఐతే దయ్యం సంగతేంటో తేల్చడానికి భవనంలోకి హీరో అండ్ బ్యాచ్ వెళ్లాక కథనం వేగం పుంజుకుంటుంది. ఇక్కడ అరగంట నాన్ స్టాప్ గా సాగే నాటు కామెడీ కోసం ఆ తరహా అభిరుచి ఉన్న ప్రేక్షకులు ‘రాజు గారి గది-3’ చూడొచ్చు. అంతకుమించి ఇందులో ఏ విశేషం లేదు.

నటీనటులు: అశ్విన్ దయ్యం పూనినపుడు అమ్మాయి తరహాలో నడుస్తూ హావభావాలు పలికించే సన్నివేశంలో బాగా చేశాడు. అంతకుమించి సినిమాలో అతను పెర్ఫామ్ చేయడానికి పెద్దగా స్కోప్ లేకపోయింది. అవికా గోర్ ఎందుకు ఈ సినిమా ఒప్పుకుందో అర్థం కాదు. కథలో ఆమెకు కనీస ప్రాధాన్యం లేదు. ఉత్సవ విగ్రహంలా మారిపోయింది. మంచి నటి అయిన ఆమెకు ఇలాంటి పాత్ర ఎలా ఇచ్చారో? ఊర్వశి.. అజయ్ ఘోష్.. ఆలీ.. ధనరాజ్ తమ పాత్రల పరిధిలో బాగా నవ్వించారు. సినిమాను కాస్తో కూస్తో నిలబెట్టింది వీళ్లే. ద్వితీయార్ధంలో అరగంటలో వీళ్ల కామెడీ మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతికవర్గం: ‘రాజు గారి గది-3’లో పాటలకు ఏ ప్రాధాన్యం లేదు. హీరో హీరోయిన్ల మీద తీసిన లవ్ సాంగ్ బోరింగ్. ఐటెం సాంగ్ లోనూ ఏ విశేషం లేదు. నేపథ్య సంగీతం విషయంలో మాత్రం షాబిర్ ప్రతిభ చాటుకున్నాడు. దయ్యంతో ముడిపడ్డ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం బలంగా నిలిచింది. ప్రేక్షకుల్లో భయం పుట్టించింది. ఛోటా కే నాయుడు కెమెరా పనితనం కూడా ఈ సన్నివేశాల్లోనే కనిపించింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి సరిపోయేట్లుగా ఉన్నాయి. ఆర్ట్ వర్క్ సినిమాకు తగ్గట్లుగా ఉంది. ఎఫెక్ట్స్ ఓకే. సాయిమాధవ్ బుర్రా సంభాషణల్లో ఆయన ముద్ర కనిపించలేదు. ‘‘నువ్విలా విజ్ఞాన ప్రదర్శన చేస్తుంటే నాకు విరేచనాలవుతున్నాయి’’.. ‘‘పై నుంచి పడాల్సిన వర్షం నా పంచె లోంచి పడుతోంది’’.. ‘‘మూత్రం వచ్చే సమయంలో మంత్రాలు ఎలా వస్తాయిరా’’.. ఇలా సినిమాకు తగ్గట్లుగా మాటు రాశారాయన. ఇక రచయిత-దర్శకుడు ఓంకార్.. కేవలం మాస్ కామెడీని నమ్ముకుని సినిమాను లాగించేశాడు. కథాకథనాల మీద ఏమాత్రం కసరత్తు చేయలేదు. మరీ నాటుగా సాగిపోయే అతడి కామెడీ ఓ వర్గం ప్రేక్షకుల్ని మ ాత్రం మెప్పిస్తుంది. ఎంత దయ్యం కథ అయినప్పటికీ కాస్తయినా లాజిక్ ఉండాలి.. సీరియస్నెస్ ఉండాలనే విషయాన్ని అతను పట్టించుకోలేదు. అతడి ‘రాజు గారి గది’ సిరీస్ లో వీకెస్ట్ ఇదే అనడంలో సందేహం లేదు.

చివరగా: రాజు గారి గది-3.. మూడో గదిలో మ్యాటర్ తక్కువ.

రేటింగ్-1.75/5

LATEST NEWS