రాజ రాజ చోర

Thu Aug 19 2021 GMT+0530 (IST)

రాజ రాజ చోర

‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ
నటీనటులు: శ్రీవిష్ణు-మేఘా ఆకాష్-సునైనా-రవి బాబు-తనికెళ్ల భరణి-వాసు ఇంటూరి-అజయ్ ఘోష్-శ్రీకాంత్ అయ్యంగార్-గంగవ్వ-కాదంబరి కిరణ్ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: వేదరామన్ శంకరన్
నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్-టీజీ విశ్వప్రసాద్
రచన-దర్శకత్వం: హాసిత్ గోలి

టాలీవుడ్ యువ కథానాయకుల్లో వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. శ్రీ విష్ణు. అప్పట్లో ఒకడుండేవాడు.. మెంటల్ మదిలో.. నీదీ నాదీ ఒకే కథ.. బ్రోచేవారెవరురా లాంటి డిఫరెంట్ మూవీస్ తో ఆకట్టుకున్న అతను.. ఇప్పుడు ‘రాజ రాజ చోర’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. టీజర్.. ట్రైలర్లతో అంచనాలు పెంచిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ: భాస్కర్ (శ్రీ విష్ణు) పెద్ద ఆశలున్న మధ్య తరగతి వ్యక్తి. ఓ జిరాక్స్ షాపులో పని చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్న అతడికి భార్య విద్య.. పిల్లాడు ఉంటారు. కానీ ఆ విషయం దాచిపెట్టి సంజన (మేఘా ఆకాష్)తో ప్రేమాయణం నడుపుతుంటాడు భాస్కర్. తానో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అని సంజనకు అబద్ధం చెప్పిన భాస్కర్.. తన ఆదాయం ఎక్కువ అని చూపించడం కోసం దొంగతనాలు చేస్తుంటాడు. ఓ సందర్భంలో అనుకోకుండా భాస్కర్ కు పెళ్లయి పిల్లాడున్న సంగతి సంజనకు తెలిసిపోతుంది. మరో అబద్ధంతో మేనేజ్ చేసిన భాస్కర్.. సంజనతో సెటిలైపోవడానికి.. తన భార్యను వదిలించుకోవడానికి చివరగా ఓ పెద్ద దొంగతనం చేయాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగా కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. అవేంటి.. వాటి వల్ల భాస్కర్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: ఫలానా దర్శకుడి సినిమా అంటే కొత్తగా ఉంటుందని భరోసా కలగడం వేరు. ఒక హీరో సినిమా డిఫరెంట్ గా ఉంటుందనే నమ్మకం కలగడం వేరు. రెండోది అంత తేలికైన విషయం కాదు. అందులోనూ పెద్దగా బ్యాగ్రౌండ్ లేకుండా హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న నటుడు విభిన్నమైన కథలతో ప్రయాణం చేయడం చాలా కష్టం. యువ కథానాయకుడు శ్రీ విష్ణు ఇలాంటి కష్టమైన ప్రయాణమే చేస్తున్నాడు. అతడి సినిమా అంటే రొటీన్ గా ఉండదని.. ఏదో ఒక కొత్తదనం ఉంటుందనే భరోసా ప్రేక్షకుల్లో ఉంది. ‘రాజ రాజ చోర’ కూడా ప్రోమోలు చూస్తే ఇది కూడా ఓ వైవిధ్యమైన సినిమానే అనిపించింది. ఐతే ప్రి రిలీజ్ ఈవెంట్లో నవ్వి నవ్వి మాస్కులు ఎగిరిపోతాయని.. ఏడ్చి ఏడ్చి మాస్కులు తడిచిపోతాయని సినిమా గురించి ఓ రేంజిలో ఎలివేషన్ ఇచ్చేశాడు విష్ణు. బేసిగ్గా విష్ణు మీద ఉన్న నమ్మకానికి తోడు.. అతను చెప్పిన మాటలతో ‘రాజ రాజ చోర’ మీద అంచనాలు పెరిగిపోయాయి. ఐతే విష్ణు మీద మామూలుగా ఉండే అంచనాలకు తగ్గ సినిమానే.. రాజ రాజ చోర. రొటీన్ సినిమాలకు కాస్త భిన్నంగానే సాగుతుంది. ఇందులో నవ్వులున్నాయి. ఎమోషన్లూ పండాయి. కానీ విష్ణు చెప్పిన స్థాయిలో మాత్రం కాదు. ఒకసారి చూసేందుకు ఢోకా లేని డీసెంట్ ఎంటర్టైనర్.. రాజ రాజ చోర.
‘రాజ రాజ చోర’లో కథ పరంగా మరీ కొత్తదనం కనిపించదు కానీ.. నరేషన్ మాత్రం మామూలుగా చూసే కమర్షియల్ సినిమాల తరహాలో మాత్రం ఉండదు. వాటిలో కనిపించే సన్నివేశాలూ ఇందులో ఉండవు. పెద్దగా హడావుడి లేకుండా సింపుల్ గా సాగిపోయే కథనమే ‘రాజ రాజ చోర’కు ప్లస్. జిరాక్స్ షాపులో పని చేస్తూ.. బయట సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అని చెప్పుకుంటూ తిరుగుతూ.. ఆల్రెడీ పెళ్లయి పిల్లాడు కూడా ఉన్నప్పటికీ ఓ అమ్మాయితో ఎఫైర్ నడిపే హీరో క్యారెక్టరైజేషనే ‘రాజ రాజ చోర’కు ప్లస్ గా నిలుస్తుంది. చిన్న పిల్లల నుంచి ఇంగ్లిష్ నేర్చుకుని తన ప్రేయసి దగ్గర పద ప్రయోగాలు చేసే అతడి నైజం నవ్వులు పంచుతుంది. హీరో ఎన్నాళ్లిలా మేనేజ్ చేస్తాడు.. అసలు విషయం బయటపడిపోతే అనే ఉత్కంఠను కొనసాగిస్తూనే సరదా సన్నివేశాలతో ప్రథమార్ధాన్ని నడిపించాడు కొత్త దర్శకుడు హాసిత్ గోలి. మధ్య మధ్యలో వచ్చే చిన్న చిన్న ట్విస్టులకు తోడు.. చాలా వరకు సరదాగా సాగిపోయే సన్నివేశఆలు ప్రథమార్ధాన్ని సునాయాసంగా నడిపించేస్తాయి. ఇక ప్రి ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్. విష్ణు చెప్పిన గట్టిగా నవ్వుకునే మూమెంట్ ఇంటర్వెల్ దగ్గరే వస్తుంది. ద్వితీయార్ధం మీద ఎంతో ఆసక్తిని రేకెత్తించేలా ఉంటుంది ఇంటర్వెల్ మలుపు.
సెకండాఫ్ లో కథ సీరియస్ టర్న్ తీసుకుంటుందనే సంకేతాలు ఇంటర్వెల్ దగ్గరే కనిపిస్తాయి. ఆ అంచనాలకు తగ్గట్లే నడుస్తుంది తర్వాతి సినిమా. ప్రథమార్ధంలో హీరో తప్పుల మీద తప్పులు చేస్తున్నపుడు.. తర్వాత అతడిలో పరివర్తన రావడం.. ఈ క్రమంలో కథ ఎమోషనల్ గా నడవడం మీద ప్రేక్షకులకు ముందే ఒక అంచనా వచ్చేస్తుంది. కాబట్టి పెద్దగా సర్ప్రైజులేమీ ఆశించడానికి వీల్లేదు ద్వితీయార్ధంలో. కొన్ని చోట్ల ఎమోషన్లు బాగానే పండినపప్పటికీ కథనంలో వేగం తగ్గిపోవడంతో ద్వితీయార్ధంలో ‘రాజ రాజ చోర’ కొంత భారంగానే నడుస్తుంది. శ్రీ విష్ణు-రవిబాబు-మేఘ కాంబినేషన్లో వచ్చే ఒక చిన్న ఎపిసోడ్ మాత్రమే ద్వితీయార్ధంలో నవ్వులు పంచుతుంది. మిగతా వ్యవహారమంతా సీరియస్సే. ఎమోషన్లు ఓకే అనిపిస్తాయి కానీ.. మరీ ప్రేక్షకులను కదిలించే స్థాయిలో అయితే లేవు. ముగింపు కూడా కాస్త మామూలుగానే అనిపిస్తుంది. క్లైమాక్స్ లో ఇంకా మెరుపులుండాల్సింది అనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా రెండున్నర గంటల నిడివిలో చాలా వరకు ‘రాజ రాజ చోర’ ఎంగేజ్ చేస్తుంది. ఆర్టిస్టుల పెర్ఫామెన్స్.. సాంకేతిక హంగులు కూడా బాగా కుదిరాయీ చిత్రానికి. మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా ఈ వీకెండ్లో థియేటర్లో కాలక్షేపం చేయడానికి ఢోకా లేని సినిమానే ఇది.

నటీనటులు: శ్రీ విష్ణును ముందు తన సినిమాల ఎంపిక  విషయంలో అభినందించాలి. ఫలితాలతో సంబంధం లేకుండా ప్రతిసారీ రొటీన్ కు భిన్నమైన సినిమాలే చేస్తున్నాడతను. ‘రాజ రాజ చోర’లో అతను కెరీర్ బెస్ట్ అనదగ్గ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. డిఫరెంట్ కామెడీ టైమింగ్ తో అతను ప్రథమార్ధంలో బాగా ఎంటర్టైన్ చేశాడు. ద్వితీయార్ధంలో ఎమోషన్లు కూడా బాగా పండించాడు. ఓవరాల్ గా విష్ణుకు మంచి మార్కులు పడతాయి. సినిమాలో హీరో తర్వాత అంతగా మెప్పించేది సునైనానే. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో నటించిన ఆమెలో అప్పటికి ఇప్పటికీ చాలా పరిణతి వచ్చిందని అర్థమవుతుంది. పెద్దగా హడావుడి లేని ఈ పాత్రలో సునైనా చాన్నాళ్లు గుర్తుండేలా నటించింది. మేఘా ఆకాష్ ఇప్పటిదాకా చేసిన చిత్రాల్లోకెల్లా క్యూట్ గా కనిపించింది. ఆమె నటన కూడా ఓకే. రవిబాబు చాన్నాళ్ల తర్వాత తనదైన శైలిలో ఎంటర్టైన్ చేశాడు. సహాయ పాత్రల్లో తనికెళ్ల భరణి.. కాదంబరి కిరణ్.. అజయ్ ఘోష్.. శ్రీకాంత్ అయ్యంగార్ ఆకట్టుకున్నారు. గంగవ్వ పాత్ర సినిమాలో ఒక హైలైట్. ఆ పాత్ర కనిపించినపుడల్లా ఆకట్టుకుంటుంది. ఆ పాత్ర నిడివి ఇంకా ఉండే బాగుండేదనిపిస్తుంది.

సాంకేతిక వర్గం: ‘రాజ రాజ చోర’ టైపు సినిమాలకు తనే పర్ఫెక్ట్ ఛాయిస్ అని వివేక్ సాగర్ రుజువు చేశాడు. ‘బ్రోచే వారెవరురా’ తరహాలోనే ఎంటర్టైన్మెంట్ ఎలివేట్ చేసేలా సాగిన మంచి జోష్ తో సాగే నేపథ్య సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్. అలాగే పాటలతోనూ అతను ఆకట్టుకున్నాడు. కథలో కలిసిపోయేలా ఉన్న పాటలు చాలా వరకు ఆకట్టుకున్నాయి. దర్శకుడు పాటలతోనూ కథను చెప్పే ప్రయత్నం చేయడం అభినందనీయం. వేదరామన్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ హాసిత్ గోలి విషయానికి వస్తే.. అతను ఈ తరం దర్శకుడు అనిపించాడు. విష్ణు అభిరుచికి తగ్గట్లు భిన్నమైన సినిమాతో అతను అరంగేట్రం చేశాడు. కొత్త దర్శకుడు అయినప్పటికీ ఎక్కడా తడబాటు.. గందరగోళం కనిపించలేదు. సినిమా నీట్ గా తీశాడనే ఫీలింగ్ కలుగుతుంది. రచయితగా.. దర్శకుడిగా అతను ప్రతిభ చాటుకున్నాడు. కాకపోతే కథాకథనాలకు ఇంకొంచెం మెరుగులు దిద్దుకుని ఉంటే ఇంపాక్ట్ మరింతగా ఉండేది. కేవలం టైంపాస్ ఎంటర్టైనర్ లాగా కాకుండా ఒక బలమైన సినిమాలా నిలిచేది.

చివరగా: చోరుడు.. మెప్పిస్తాడు

రేటింగ్-3/5

LATEST NEWS